"పద్మావతి ఉత్తరం రాసిందా?" ఆమె అడిగిన తొలి ప్రశ్న అది.
"మీ కేమని రాసింది?" అదీ జవాబు.
అంటే పద్మ గురించి తప్ప, పద్మ ద్వారా ఏర్పడిన మైత్రి గురించి తప్ప సంభాషించుకునేందుకు హక్కు లేదన్నట్లు సాగింది వారి సంభాషణ.
పద్మావతి గురించి మాట్లాడుతూనే "అయితే మీరీ వూళ్ళో ఉండి సరాసరి యిట్నుంచే వాల్తేరు బయలుదేరుతారా?" అనడిగాడు భాస్కరం.
"లేదండీ, పద్మా- వాళ్ళ వూరు వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒక్క పూటేనా వచ్చితీరాలీ అంటున్న దది .... కాని, శనివారందాకా యిక్కన్నించి కదలకూడదని మా "ఆంటీ ఆర్డర్." నవ్వింది సురేఖ- అంతలోనే తల దించుకుని ఒక గడ్డిపరకను త్రుంచి వ్రేలికి చుట్టుకుంది.
"ఎందుకో.....?" అప్రయత్నంగా ఆ ప్రశ్న అతని నోటినుంచి జారిపోయింది- "పరాయి ఆడపిల్లకదా"-ఆ అమ్మాయి నా ప్రశ్న వేయడానికి ఏ సభ్యత అడ్డుపడ్డదో గాని, అతను నాలిక్కరుచుకొన్నాడు.
సురేఖ పచ్చని పసిడి ఛాయా కందిపోయింది. ఐతేనేం, అభిమానమూ, ధైర్యమూ పుంజుకుని బరువైన కనురెప్పలెత్తకుండానే "మా దొడ్డమ్మ యిష్టం" అందామె.
"సరే" నన్నాడు భాస్కరం.
ఈసారి తా నొక గడ్డిపరక త్రుంపి నోట బెట్టుకుని. ఆ పిల్ల వేలితో పచ్చిక మీద గీతలు గీసింది. ఆ యిద్దరు మాటలాడుకోడం - తీరు గమనిస్తే, తాము అనబోయే మాటల్లో ఎటువంటి చనువూ ధ్వనించడం మంచిదికాదూ అనే నిర్ణయం కని పిస్తుంది - చనువు పరస్పరం తీసుకోగల ధైర్యం ఎవ్వరిలోనూ లేదు.
అతని ఉద్దేశంలో సురేఖ పరాయి పిల్ల-ఆమె ఉద్దేశంలో అతను తన స్నేహితురాలి స్నేహితుడు-రేపు 'పద్మావతి', వాడు, కావల్సినవాడు. తానే మాట అంటే ఆమె అపార్ధం చేసుకుంటుందో, సభ్యతా-విరుద్ధమైన, నీతిబాహ్యమైన యే మాట తన నోటివెంట జారుతుందో నన్న అనుమానం తరువాత వచ్చే నలుగు వాక్యాలే వారి సంభాషణలు. అదీగాక ఆ పార్కులాంటి జాగా చిన్నదీ; రద్దీ జాస్తీ. అందరి కళ్ళు వీళ్ళ మీదే . దానికి తోడూ అటూ యిటూ పరుగెడుతూ పిల్లలు దొంగాటలూ అవీ ఆడుకుంటున్నారు.
భాస్కరం లేద్దామా అనుకున్నాడు-కాని సురేఖ యామనుగుంటుందో నని-మౌనంగా గడ్డితుంపుతూ కూచున్నాడు. సురేఖ కూడా ఇంచుమించు అనే అవస్థలో ఉంది.
అంతలో మాసిన మనిషి ఒకడు వచ్చి "రాండి అమ్మాయిగారు! అమ్మగారు మండిపోతది' అన్నాడు సురేఖ నుద్దేశించి.
భాస్కరం విస్తుపోయాడు!
"అదుగో ఆ చంద్రాన్ని పిలువు పోదాం!"
అన్నది సురేఖ లేన నుంకిస్తూ.
భాస్కరం కేసి చూసి "ఎక్స్ క్యూజ్ మీ" అన్నది. భాస్కరం కూడా లేస్తూనే ఆ మాసిన మనిషికేసి చూసి "ఎవరితగాడు?" తనలోనే తను అనుకున్న ట్లడిగాడు.
"మా రిక్షావాడు.....అంటే మా దొడ్డమ్మగారికి సొంత రిక్షా ఉందిలెండి....." అన్నది సురేఖ జారిన పయిటను భుజంమీదికి లాక్కుంటూ.
ఆమె, రిక్షావాడు చంద్రాన్ని తీసుకుని వస్తూ ఉండటం గమనించింది. అంతలోనే ఏదో జ్ఞాపకం తెచ్చుకున్నట్లు భాస్కరాన్ని ఉద్దేశించి "మీరు కూడా అటు గవర్నర్ పేటకేసి రావాలిగదూ!" అన్నది మొహమాటపడుతూ.
భాస్కరం నవ్వేడు ..... ఆమె ప్రశ్నలోని ఆంతర్యం గ్రహించాడు. అందులో మొహమాట పడవలసినదేమీ లేదని ధ్వనించేటట్లు "రావాలి కాదు పోవాలి అనండి" అన్నాడు. "కాని యిదో ....... ఓ ఫ్రెండు వస్తానన్నాడు ..... వాడి కోసరం చూస్తున్నా" నన్నాడు నలుదిక్కులా, కలియ జూస్తూ. "ఫ్రెండు" అన్నాడే గాని అతని ఆకారం ఎటువంటిదో, ఏమి నామధేయమో అతగాడే వూహించుకోలేదు.
"సరే, ఐతే నే పోనా మరి ..... పద్మావతితో చెపుతా లెండి మీ రగుపించారని" అంటూ, సురేఖ రెండు చేతులూ జోడించింది.
భాస్కరం కూడా నమస్కారం చేసి, ఏదో అన బోయి అంతలోనే మాటలు మింగేశాడు. సురేఖ మందగమనయై 'చంద్రం' అనే కుర్రవాడి చెయ్యి పుచ్చుకుని రిక్షా దాకా వెళ్ళిపోయింది. ఆమె రిక్షా ఎక్కేక. అది వెళ్ళిపోయేదాకా అటే చూస్తున్నాడు భాస్కరం.
ధనమ్మగారికి రిక్షా ఏం ఖర్మ ..... కారు ఉండవల్సిందే......కాని "రిక్షా చాలు తనకి" అనుకున్న దామె.
సురేఖ-రిక్షా మలుపు తిరిగిపోయిన తరువాత భాస్కరం అక్కడే చతికిల బడ్డాడు. "ప్రైవేటు రిక్షా న్నదే వీళ్ళకి, వీళ్ళ దొడ్డమ్మగారికి ఏం ఉద్యోగం చెపుమా" అనుకున్నాడు. "ఒకవేళ రిక్షాల గారేజీ ఉందేమోలే" ననుకున్నాడు. "మొత్తానికి సురేఖ చాలా చక్కని అమ్మాయి, చురుకింది" అని అనుకోకుండానే తలపోశాడు.
"ఇంతకీ తనకు 'ఫ్రెండు' ఎవరూ?" సురేఖ మొహమాటాన్ని పురస్కరించుకుని తాను అబద్ద మాడేడు. "కొన్ని అబద్దాలు ఎందుకు ఆడతామో తెలియదు..... సరే..... పోనీ" అనుకుంటూ గబగబ నగరంకేసి నడక సాగించాడు-
త్రోవలో అతనికి ఆ సాయంకాలపు సంఘటనలే మనసులో మెదలసాగాయి. సురేఖ తనతో ఎందుకంత బిడియంగా మాట్లాడిందీ? అనిపించింది అతనూ అంతేగా?
అతనికి తెల్సు: తన సంస్కార సాంద్రతా, తను ఉంటున్న సమాజమూ అందుకూ కారణాలు. కాని, ఆ మాట ఒప్పుకునేందుకై అతని ఆంతర్యం సిగ్గుపడ్డది.
"విరివిగా విచ్చలవిడిగా మాట్లాడుకోడం ఇంకా కథలలోనే ఉంది గానీ, వాస్తవిక ప్రపంచంలో దీనికీ, యీ స్నేహానికీ ఏవో కనుపించని గోడ లున్నాయ్! బహుశా అందుకు తగిన సంస్కార పటిమ అబ్బలేదు కూడానేమో మనుషులకు?"
భాస్కరానికి ఇల్లు చేరేసరికి తాను తప్పించుకు పోయి, పారిపోదా మనుకున్న సమస్య తిరిగి మొదటికి వచ్చి గాఢాలింగనం చేసుకుంది.
జానకమ్మగారు కేక వేసింది "తారీఖు ఎంతరా? రేపూ? శుక్రవారమెప్పుడూ?" అని. కొడుకు ఇంట్లోకి వచ్చి కళ్ళు కడుక్కొంటున్నాడని గమనించగానే, ఆమె పై ప్రశ్న ఆదుర్దాగా వేసింది. భాస్కరం-వొళ్ళు మండిపోయింది. మరిన్ని నీళ్ళు కాళ్ళమీద గుమ్మరించుకున్నాడు. పిన్నిమీద కోపం పదేపదే వస్తున్నందుకు తనను తానే నిందించుకున్నాడు కూడా.
భోజనం దగ్గర కూడా భాస్కరం అస్సలు మాట్లాడలేదు.
"అన్నాయ్! ఎక్కడికి పోయావు? నీ కోసరం సాయంత్రం ఎవరో వొచ్చార"న్నది వసంత మెల్లిగా వచ్చి.
"కృష్ణానదిని చూసి వచ్చాను" అని నవ్వి "అక్కడ నీలాంటి నేస్తం నొకరు అగుపిస్తే కాస్త కబుర్లు చెప్పా" నన్నాడు.
"ఛా! ఏం మాటలన్నాయ్!" అన్నది వసంత సిగ్గు నభినయిస్తూ "నాలాంటి ఫ్రెండ్సు అక్కడెందుకుంటారేమ్?"-
"నిజమేనట్రా! ఈ వూళ్ళో ఆడపిల్ల లెవర్రా నీకు నేస్తాలూ?" అన్నది జానకమ్మగారు ఆందోళన దాచ ప్రయత్నిస్తూ.
ఆమె-ప్రశ్నతో భాస్కరం నోటి ముద్ద వూడినంత పనైంది. పిన్ని గ్రహింపుశక్తి కతగాడు భయం కంటే విస్మయమే ఎక్కువ పొందాడు.
"ఉత్తదేనే" అన్నడు వెంటనే పొలక మారినట్లు నటించి.
"అంతేలే" నన్నది నిట్టూర్చి.
భాస్కరం, ఒక ఆడపిల్లతో తాను మాట్లాడితే, పిన్నికి అంత ఆందోళన ఎందుకోనని లోపల-లోపల తర్కించుకుంటూ మెతుకులు ఒకటొకటే కతక సాగేడు.
తాను అబద్ధం చెప్పాల్సినంత దోషం ఏం చేశారు గనుక? కాని అతని కా ప్రశ్న నచ్చలేదు.
పిన్నితో యిప్పుడు సురేఖ గురించి చెపితే పద్మావతి గురించి కూడా చెప్పాల్సివస్తుందని భయం-"తీగె తీస్తే డొంక అంతా కదుల్తుంది."
జానకమ్మగారికి కొడుకుమీద నమ్మకం అపార మైనదే గాని, వయస్సు చెడ్డదనే భయం కూడా ఎక్కువే. అదీగాక "యిటీవల భాసడి ధోరణి ఏమీ బాగులేదని" ఆమె పదే పదే అనుకున్నది. అందుకు కారణం ఆమెకూ తెలియదు.
ఇంతకూ తనతో మాట్లాడిన సురేఖ, ధనమ్మకు సాక్షాత్తూ పెంపుడు కూతురనీ, ఆ అమ్మాయినే చూడటానికి రేపు తాను వెళ్ళాలి అని అప్పుడే భాస్కరానికి తెలిస్తే అతని పరిస్థితి ఎలా ఉండేదో గాని, జానకమ్మగారు ఆ సంగతి భాస్కరంతో అనలేదు.
తాను కోరీ ఏరీ కోడలుగా తెచ్చుకుందామని తల పోస్తున్న పిల్లతో భాస్కరం పెళ్ళీ అంటేనూ, పెళ్ళిచూపు లంటేనూ "తనకు అయిష్టమని" వ్యక్తంచేసి వచ్చాడూ అంటే ఆమె మనసు ఎలా ఉండేదో?......
ఆమెకు భాస్కరం తనను తప్ప యీ ప్రపంచంలో యింకెవ్వరినీ అంత అభిమానం గా చూడడని నమ్మకం- అది ఆమెలో చాలా రోజుల్నుంచీ ఉన్నదే.
"తనకు కోడలు అవసరమైతేనే భాసడికి పెళ్ళాం అవసరమవుతుందనీ, అదో సంప్రదాయమనీ" ఆమె వూహ. "భాస్కరం యింకా ముక్కుపచ్చలారనివాడు"-అంటుందామె. వాడు "ప్రేమించగలడూ అంటే ఎలా నమ్మడం?"
