7
రాజూ, రవీ తొమ్మిదో ఏట ఒకటో ఫారం లో స్కూల్లో చేరారు. ఆ రోజుల్లో ఒకటో ఫారానికి స్కూలు జీతం నెలకు రెండు రూపాయలా ముప్పావలా. అయినా భూమి మీద ఏటా వచ్చే కొద్ది ఆదాయం తప్ప వేరే ఆధారం లేదని దుర్గాప్రసాద రావు గారికి రాజును చదివించటం కొంచెం కష్టమే అనిపించింది. వెంకట రత్నం గారి సలహా మీద స్కాలరు షిప్పు కోసం అర్జీ పెడితే స్కూలు వారు దయదలచి అర్ధ జీతం స్కాలరు షిప్పు మంజూరు చేశారు. అత్యావశ్యకమయిన పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు కొనకుండా రవి పుస్తకాలే చదువు కుంటుండేవాడు రాజు. అయినా స్వతహాగా తెలివి కలవాడవటం వల్ల ప్రతి పరీక్ష లోనూ మంచి మార్కులతో క్లాసులో మొదటి మూడు స్థానాలలో ఏదో ఒకటి సంపాదిస్తూ వచ్చాడు. మూడో ఫారం వరకూ ఆ విధంగానే జరిగింది. నాలుగో ఫారం నించి జీతం అయిదు రూపాయల పావలా, పేదరికం కారణం వల్ల అంత జీతం ఇచ్చుకోలేమని, ప్రార్ధిస్తూ మళ్ళీ అర్జీ పెట్టాడు.... మూడవ ఫారం పరీక్ష లో ప్రప్రధమంగా క్రుతార్దుడైన కారణం వల్ల ఆ సంవత్సరం నించి పూర్తీ స్కాలరు షిప్పు మంజూరు అయింది.
చదువంటే స్కూలు జీతమే కాదు కదా! పాఠ్యపుస్తకాలు రవిని వీలైనంత వరకు వాడుకున్నా , వ్రాత పుస్తకాలూ , పెన్సిళ్ళు, కలాలు, ఇతర పరికరాలూ అన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే. కాని దుర్గాప్రసాద రావు అవసరయిన ఏ ఖర్చుకీ వెనుదియ్య లేదు. ఉన్నదానిలోనే ఖర్చు పెట్టుకుంటూ క్లుప్తంగా గడుపుకుంటూ వచ్చారు. కుర్రవాడు పెద్ద వాడవుతున్న కొద్దీ బట్టల ఖర్చూ ఎక్కువవుతుంటుంది. ప్రసాదరావు గారు దేనికీ లోటు చెయ్యలేదు. ఉగాది కి దీపావళి కి రవితో పాటు రాజుకు కూడా కొత్త బట్టలు కుట్టిస్తుండేవారు వెంకట రత్నం గారు.
ఏ ఇద్దరు కుర్రవాళ్ళ యినా ఒకచోట చేరితే, అప్పుడప్పుడు కీచు లాడుకోకుండా ఆడుకోవటం అరుదు. కాని రాజూ, రవీ మాత్రం 'మెలగితి మొక్క ప్రాణమున మేనులు రెండు గాని' అన్నట్లు ఎంతో స్నేహంగా మెలిగేవారు. ఇద్దరూ కలిసి స్కూలుకు వెళ్ళేవారు. ఇద్దరూ కలిసి చదువుకునేవారు పోటీల మీద మంచి మార్కులు తెచ్చు కుంటుండేవారు. ఒకరి కొకరు ఎందులోనూ తీసిపోయే వారు కాదు. ఉపాధ్యాయులకు ఆ ఇద్దరూ కూడా ప్రీతి పాత్రులు. రవి కొంచెం నల్లని వాడు. రాజు యెర్రని వాడు. వారిద్దరినీ రుక్మిణమ్మ గారు కృష్ణార్జును లంటుండేవారు.
విశాలమైన ఆ ఇంటి ఆవరణ లో వారాడుకునే ఆటలు అనేకాలు. ఇద్దరూ విల్లమ్ములు పట్టి గయోపాఖ్యానం లో కృష్ణా ర్జునుల లాగ కుహనా యుద్దాలు చేసేవారు. వెంకట రత్నం గారు ఉపయోగించి వదిలిన రాకెట్టు లు చేరోకటి పుచ్చుకుని టెన్నీసు ఆడేవారు. దొడ్డి లో తోట పని అంతా వారిదే. మొక్కలు పాతటం, గొప్పులు తవ్వటం, నీళ్ళు పొయ్యటం , తీగెలకు పందిళ్ళు పాతటం, వాటి మీద సున్నం వెయ్యటం -- ఒకటేమిటి> పోటీలు పడి చిన్న చిన్న తోటలు ఎవరివి వారు వేరువేరుగా వేసుకునేవారు. ఇది రాజుది, ఇది రవిది. ఒక్కొక్కదానికి వేరువేరుగా ఒక గేటు లోపల 'రాజు' అని ఒకరు 'రవి' అని ఒకరు తమ పేర్లను మట్టిలో వ్రాసి , ఆ అక్షర రేఖల కనుగుణంగా చిన్న చిన్న క్రోటను మొక్కలో, మెంతులు చల్లి మెంతి కూర మొక్కలో , లేక ధనియాలు చల్లి కొత్తి మీర మొక్కలో పెంచేవారు.
భారతి రవి కన్న అయిదారేళ్ళు పెద్దది. వీరి ఆటలలో ఆమె పాల్గొనేది కాదు. వీరు స్కూలు లో చేరిన సంవత్సరమే ఆమె స్కూలు ఫైనల్ పాసయి కాలేజీ లో చేరింది. ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజులలోనే ఆమె వివాహం తలపెట్టారు వెంకట రత్నం గారు. వరుడు మేనత్త కుమారుడు రామ మోహన్ . వెంకట రత్నం గారి బావగారైన బాపిరాజు గారు కూడా బ్రాహ్మ సమాజ వాదే. వారిది కాకినాడ. ఇరువైపులా వారి ఇష్ట ప్రకారం భారతీ రామ మోహన్ ల వివాహం బ్రహ్మసమాజ పద్దతి లో గుంటూరులోనే జరిగింది. బ్రాహ్మణ వివాహాలలో వలే పురోహితులు మంత్రాలు చదవటం , హోమాలు చేయించటం మొదలయిన కార్యక్రమమేమీ జరగలేదు. ఆచార్యుల సమక్షం లో వధూవరులు ఒండోరులకు పూల మాలలు వేసుకుని, ఉంగరాలు మార్చుకున్నారు. ఆచార్యులు వధువు కూ, వరుడికీ వారి కర్ధమయ్యే స్వచ్చమయిన తెలుగు బాషలో వారి వారి బాధ్యతలను బోధించి వారి చేత ప్రమాణాలు చేయించారు. వధూవరులు కలిసి ఏడడుగులు వెయ్యటంతో వివాహ వంధం సంపూర్ణ మయింది. రాత్రి బాండు మేళం ముందు నడవగా పూల మాలలతో అలంకరించ బడ్డ పెద్ద కారులో ఊరేగింపు.
రాజశేఖర మూర్తి చూసిన వివాహ మహోత్సవాలలో ఇది మొదటిది. తెలిసీ తెలియని ఆ వయస్సులో పవిత్రమయిన వివాహ బంధాన్ని గురించి ఆచార్యులు చెప్పిన ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క మత ప్రవచనం లాగ అతని లేత మనస్సులో నాటుకు పోయింది. భారతీ రామమోహను లు నిత్య వదూవరులై అతని మనస్సు లో నిలిచి పోయారు.
వెంకట రత్నం గారి కుటుంబం తో పాటు రాజు కూడా బ్రహ్మ సమాజం వారి ప్రార్ధనా సమావేశాలు హాజరవుతుండేవాడు ప్రతి అడివారమూ. వారి ప్రార్ధనా గీతాలు, ఆచార్యుల ప్రసంగాలు అతని కెంతో ఆనందం కలిగించేవి.
"జయము జ్ఞాన ప్రభాకరా,
జయము శాంతి సుధాకరా,
జయము మోహ తమోహరా, '
జయ , జయ! కరుణాకరా!
మానవ భాగ్య విధాతా,
దీన సంఘ పరిత్రాతా,
ప్రాణి హృదయ భాగ్య నేతా,
బ్రహ్మ సుధర్మ ప్రదాతా!"
ప్రార్ధనా నంతరం ఆచార్యులు ఉపనిషత్తుల నుండి కొన్ని సూక్తులు పఠించేవారు.
'"ఆసతో మా సద్గమయ,
తమసో మా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతం గమయ"
అని కానరాని దేవుణ్ణి ప్రార్ధించి నపుడు మందిరం లో ఒక్క విగ్రహమయినా లేకపోయినా దైవ సాన్నిధ్యం లో ఉన్నట్టే ఉండేది.
బ్రహ్మసమాజం వారి పద్దతులలో రాజశేఖర మూర్తి కెంత ప్రీతో, సనాతన బ్రాహ్మణ సంప్రదాయాలన్నా అతనికి అంతే గౌరవం. దుర్గా ప్రసాద రావు గారు దేవీ పూజా దురంధరులు. శ్రీకాకుళం లో ఒక గురువు గారి వద్ద ఉపదేశం పొంది తదాదిగా ప్రతి దినమూ త్రిపుర సుందరీ దేవికి ధ్యానావాహనాది షోడ శోపచార పూజలు నిర్విర్తిస్తూండేవారు. ప్రతి సంవత్సరము దసరా పండుగులలో నవరాత్రాలలో బ్రహ్మనొత్తములను పిలిపించి యధావిధిగా దేవీ పూజలు జరిపించేవారు. దుర్గాప్రసాదరావు గారి దైవిక పూజా విధానం లో చాలా భాగం వినివిని ఉన్న రాజశేఖర మూర్తి కి కంఠస్థమైంది. దసరా పండుగులలో పట్టు పంచె కట్టుకుని రాజు కూడా తాతగారి వద్ద కూర్చుని అయన చేతి నామాల పుస్తకం అందుకుని ఆయనకు బదులు తానె ఉచ్చేస్వరం తో పఠించేవాడు.
"ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమః
ఓం హిమాచల మహావంశ సవనాయై నమో నమః
ఓం శశాంక శేఖర ప్రాణ వల్లభాయై నమో నమః
` ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహయై నమో నమః
ఆ అష్టోత్తర శత నామావళి లోని ఒక్కొక్క నామ మంత్రము అతణ్ణి సంమోహితుడ్ని చేసేది. దానిలో ఒక్కొక్క పదము తాతగారి చేత అర్ధం చెప్పించుకుని, మననం చేసుకుని ఆనందించేవాడు. ఆ మంత్రాలు పఠిస్తున్నంత సేపు తన మనః ఫలకం లో త్రిపుర సుందరీ దేవి రూప కల్పనం చేసుకుని తన్మయు డవు తుండేవాడు.
దుర్గాప్రసాద రావు గారు పురాణ కధలు , భాగవత కధలు, రామాయణము, భారతము మనమడ్ని ఒళ్లో కూర్చో బెట్టుకుని విశదంగా తెలియ జెప్పేవారు. ఆ కధలు విన్నంత సేపు ఆయా పాత్రలలో లీనుడై ఒకమారు రాముడు గా, ఒకమారు కృష్ణుడు గా , ఒకమారు అర్జునుడుగా , ఒకమారు అభిమన్యుడు గా ఒకమారు దుష్యంతుడు గా , ఒకమారు ప్రహ్లాదుడు గా ఆ కధా సారాలు గ్రహించడమే కాక, సంపూర్ణంగా అనుభవించే వాడు రాజు. ఆ విధంగా ప్రాచీన భారత సంస్కృతీ , సాహిత్యము అతనికి కరతలా మలకా లయ్యాయి.
