5
"అత్తయ్యా ! సరోజ ఊళ్ళోనే ఉందా? వాళ్ళ బాబాయి గారి ఊరికి వెళ్తానందిలే నాతొ."
"వెళ్ళ లేదమ్మా! మొన్ననే శుక్రవారం నాడు వచ్చి కొంతసేపు కూర్చుని వెళ్ళింది. ఉన్నంత సేపూ నిన్ను గురించే ఆ పిల్ల మాటలు."
"నాకు తెలుసు, నువ్వు నామీద లేనిపోని వెన్ని కల్పించి చెప్పి ఉంటావో-- "ఆ పెంకి పార్వతి నన్నూ, నా కొడుకునూ సుఖంగా బతక నివ్వటం లేదమ్మా" అంటూ!" పార్వతి నటించి చెప్పబోయింది.
జానకమ్మ నవ్వుతూ , "ఆ ఆ ఈ బాధ పడలేకుండా ఉన్నాను; వేగిరం వాళ్ళిద్దరి కీ పెళ్లి చేసెయ్యా లను కుంటున్నా ను -- అని కూడా చెప్పాను " అంది.
"ఆ, పోదూ!" అని పార్వతి ముఖం తిప్పుకుంది. జానకమ్మ అదే మంచి తరుణంగా భావించింది, అభిప్రాయం తెలుసునే టందుకు. చేతిలో పని వదిలి పెట్టి వచ్చి, పార్వతి పక్కన కూర్చుంది. పార్వతి ముంగురులు సరిచేస్తూ, "పారూ! బావని పెళ్లి చేసుకోవడం నీ కిష్టమేనా? మనసులో మాట చెప్పు" అంది. పార్వతి సిగ్గు పడింది. మరుక్షణం లో తమాయించుకుని జానకమ్మ గారి కళ్ళలోకి చూసి నవ్వుతూ , "అది కాదత్తా! బావకి ఇష్టమో కాదో అని నా అనుమానం." అంది.
"అదంతా నేను అడిగి చూసుకుంటాను లే. ముందు నీ ఇష్టా యిష్టాలే కావాలి. మీ మామయ్య కూడా పార్వతి కిష్టమైతే చాలు, తక్కినదంతా జరిగి తీరుతుంది -- అంటున్నారు " అన్నది జానకమ్మ.
పార్వతి మరి మాట్లాడకుండా లేచి నిలుచుంది. ముఖం కడుక్కుని, టీ తాగి సరోజ ఇంటికి బయలుదేరింది. సరోజ ను చూచి పది రోజులే అయినా కలుసుకొని ఎన్నో విశేషాలు తనివితీరా మాట్లాడుకోవాలని ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కువ చెట్లు, పచ్చిక ఉన్న స్థలంలో ఒక పార్కు ఉంది. దాన్ని దాటి వెళ్ళాలి సరోజ ఇంటికి. ఎందుచేత నో పార్కు మధ్యగా పోవాలని పించింది. మెల్లగా ఎర్రటి స్లిప్పర్స్ తో ఉన్న కాళ్ళ ను ఆకుపచ్చని పచ్చిక మీద ఒత్తుతూ నడుస్తున్నది. ఎడమ చేతి వైపు పాడు పదినట్లున్న చప్టా మీద చిన్న చిన్న పాపలు ఆడుకుంటున్నారు.
పార్వతి అటు వైపు చూస్తూ నడుస్తున్నది. వెనక నుంచి చప్పట్లు వినిపించి, తల తిప్పి చూసింది. వెనక మూడు గజాల దూరం లో రాజుతో సహా కూర్చుని ఉన్న సరోజ రమ్మని పిలుస్తుంది. స్నేహితురాలిని చూసిన క్షణం పార్వతి ముఖం నీలి కలువలా వికసించింది. ఆత్రుతగా అటు వైపు నడిచింది.
వాళ్ళను సమీపిస్తూనే , "ఏం సంగతి? ఇక్కడ విహరిస్తున్నావా? నీకోసం అష్టకష్టాలు పడి వస్తున్నాను." అంది సరోజ ను ఉద్దేశించి. అలా అంటూ వారికి కొంత దూరంలో సిమెంటు బెంచీ ని అనుకోని కూర్చుంది. "గొప్ప పనే!" అన్నాడు రాజు పార్వతిని చూసి నవ్వి.
అస్తంగత సూర్యుడి విచిత్ర వర్ణికలు ఆకాశం లో విన్యసిస్తున్నాయి. ఒకటి రెండు కిరణాలు ఆ ముగ్గురు యువతి యువకులు కూర్చున్న పచ్చని గడ్డి మీద పడి మెరుస్తూ ఉత్తేజితమై ఉన్న వారి హృదయాల్లో మధురతర భావనలను మరింతగా కల్పిస్తున్నాయి. యౌవనం లో ఉన్న స్త్రీ పురుషుల భిన్నవిభిన్న మానసిక పరిణామం లాగ విహాయసం క్షణక్షణానికి వింత రంగులు పూసుకుంటున్నది.
రాజు సరోజ కు అంత సమీపం లో కూర్చోవడం పార్వతి కి కష్ట మనిపించడమే కాకుండా సూటిగా చూడటానికి జంకు పుట్టించింది. ఆ సమయంలో , అతనికి అంత చనువిచ్చిన సరోజ పైన కోపం కూడా వచ్చింది ఆ అమ్మాయికి. తన మనో భావాన్ని సరోజ కు కళ్ళతో వ్యక్తం చేయాలని ప్రయత్నించింది కాని సరోజ నోట్లో ఓ గడ్డి మొక్క పెట్టుకొని, పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నది. రాజు మోచేయి ఆధారంతో గడ్డి మీద అనుకోని పిచ్చి మొక్కలు లాగుతూ, దూరంగా వస్తూ పోతున్న జంటలను చూస్తూ కూర్చున్నాడు. ముగ్గురి మధ్యా నిశ్శబ్ధత తాండవిస్తున్నది.
సరోజ కు ఆలోచన నుంచి చప్పున స్పృహ వచ్చింది. రాజు ముఖంలోకి చూస్తూ, "అయితే నువ్వు చదువు పూర్తీ చేసి ఏ ఉద్యోగం చేద్దామను కుంటున్నావు , రాజు!" అంది.
సుతి మెత్తగా నవ్వాడు రాజు. "ఎమ్. ఎ. చదివిన వాడెం చేస్తాడు? అందుబాటు లో ఉన్న మంచి ఉద్యోగం లెక్చరర్. దానిలో ఆసక్తి లేనివాళ్ళు అదృష్టం మీద ఆధారపడి వెదుక్కోవాలి. తమరి కేం? ఇంకొన్నాళ్ళ లో డాక్టర్ మహాశయులవుతారు."
సరోజ సిగ్గు పడినట్లు అయింది. "నాకు మొదటి నుంచీ ఉన్న కోరికే!" అన్నది తూర్పు వైపు వినిర్గతమవుతున్న చందమామ ను చూస్తూ.
"మా పార్వతి పెళ్లి చేసుకుని మూల కూర్చుంటుంది" అన్నాడు రాజు పెంకితనము గా సరోజ నవ్వింది. పార్వతి కి నవ్వు రాలేదు.
"నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. జీవితంత మూ ఉద్యోగం విడిచి పెట్టను." అంది పైకి, నిశ్చయించు కున్నట్లు. లోపల రాజు అంతర్గత భావాన్ని గురించి పార్వతికి సమస్య రేగింది. తన పెళ్లి గురించి అంత తేలికగా పైకి అంటున్నాడు కదా? అతని మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందొ, ఏమని నిశ్చయించు కున్నాడో అని అన్యమనస్కురాలయింది అంతలో.
"సరూ! ఇంత సౌందర్య వతివి. ఎప్పుడూ రకరకాల రోగుల మధ్య తిరుగుతూ , నీ అందాన్ని నిరర్ధకం చేసుకుంటావా? రోగులకి సుందరంగా ఏదైనా కనిపిస్తే చిరాకు కలుగుతుంది. అసలు వారికి దేన్నీ చూసినా విరక్తి, వేదన విసుగు కలుగుతుంటాయి. అది వారి దోషం కాదు, కర్మ అనుకో! అయినా అటువంటి స్థలాల్లో ప్రపుల్ల మై, నిరంతరం ఆనంద జగత్తు ల్లో వివాహించ వలసిన నీ భవిష్యత్తు వ్యర్ధం అవుతుందేమో?' అన్నాడు రాజు ఆమెకు తన ఉద్దేశం సూచిస్తూ.
సరోజ వెంటనే అన్నది : "అంత సంకుచితంగా ఆలోచించలేదు, రాజు నేను. పోనీ , నేను ఒక్కదాన్నే కావాలని ఇరుకున పడుతున్నట్లయితే నువ్వు చెప్పినా అలోచించి ఉందును. కానీ వేల కొలది ఉన్నారు డాక్టర్లు. వాళ్ళ నిష్కల్మషమైన సేవను తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి మానవ సేవలో జీవితాన్ని గడపటం ధన్యం. నేనలా నిష్కపటం గానూ, నిష్కానుంగానూ సేవ చెయ్యగలనో లేదో కాని, డాక్టరు గా కొన్నాళ్ళ యినా ఉండి, ఆ సేవలోని మాధుర్యాన్ని రుచి చూడాలని పిస్తుంది నాకు."
"నాకూ డాక్టర్ల పైన గౌరవమే , సరూ! నీలాంటి సుకుమార హృదయినులు అటువంటి పనులకు తట్టుకోవడం కష్టమని అన్నాను. ఓర్పు అవసరం, డాక్టరు అనగానే. సహనం అనే భూషణం ఉన్నవారు డాక్టర్ల యితే వాళ్ళంతా పూజ్యులు , ప్రేమ మయులు మరెవరూ ఉండరు ప్రపంచంలో. నాకు తెలిసి ఒక డాక్టరు ఉండే వాడు అతను వస్తున్నాడంటే చాలు ఒక రోగికీ, రోగి పరిచరులకీ ప్రాణాలు లేచి రావటం అటుంచి -- పైపైకి పోయేవి యమదూత ను చూసినట్టు. అంతకంటే కఠినులు మరోకరుండరు, బాబూ అనుకుంటా రందరూ. కొందరు డాక్టర్లు మొదట్లో మంచిగా ఉన్నా, తర్వాత తర్వాత రోగుల విసిగింపులకు , పిచ్చి జాడ్యాలకు అలవాటు పడిపోయి కోప గుణానికి కూడా లొంగి పోతారు." అన్నాడు రాజు.
"పోనీ, ముందుగా నాకు నువ్వు బోధించడమే మంచిదయింది. సహనాన్ని నిలబెట్టుకోవడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఎంత మంచి సలహా ఇచ్చావు, స్నేహితుడా!" నవ్వింది సరోజ.
పార్వతి పరధ్యానంగా ఉండటం చూసి, "ఏమిటో ! పార్వతీ దేవి ఊహల్లోకాల్లో తిరుగుతుంది." అన్నది మళ్ళీ.
"మరేం కాదు. నాకేప్పుడైనా ప్రాణాల మీదికి వచ్చినా ఫర్వాలేదనుకుంటున్నాను." అంది పార్వతి నవ్వకుండానే. సరోజ పకపకా నవ్వింది.
"ఏమీ తెలియనట్టుండి చమత్కారంగా మాట్లాడటం లో మా పార్వతి మహా నిపుణురాలు" అంది. అంతలో ఆ అమ్మాయి చేతి కేదో ముళ్ళు గుచ్చుకుంది. "అమ్మయ్యో!" అంటూ పైకి తీసిన చేతిని ఆత్రంగా పట్టుకున్నాడు రాజు. సరోజ తెల్లని అరచేతి మీద ఎర్రని రక్తపు చుక్క నిలిచింది.
రాజు దాన్ని తన చేత్తో తుడిచేస్తూ "డాక్టరు ఇల్లాంటి దెబ్బలను లెక్క చెయ్యకూడదు" అన్నాడు, సరోజ చేతిని వదల కుండానే.
సరోజ అతని చెయ్యి తొలగించి, "అందుకే ఒర్చుకున్నాను" అన్నది పట్టింపు లేకుండా.
పార్వతి అంతా చూస్తూనే ఉంది. "నొప్పి పెడుతున్నదా?' అంది సరోజ ను చూసి. "లేదు" అంటూ తల అడ్డంగా ఊపి , రాజు వైపు చూసింది సరోజ.
రాజు సరోజ వైపే ఏకాగ్రత తో చూస్తూ, "అబ్బ!" అన్నాడు.
"ఏం?" అంది సరోజ.
"ఏం లేదులే?' అన్నాడతను పార్వతికి కనిపించకుండా నాలిక కొరుక్కొని.
"కారణం లేకుండా ఉంటుందా? అలా ఎందుకన్నావో చెప్పు" సరోజ నిలదీసి అడిగింది.
"ఇది చెప్పవలసిన చోటు కాదు" అన్నాడు కళ్ళు చిన్నవి చేసి నవ్వుతూ.
పార్వతికి రాజు వ్యవహారం చిరాకు తెప్పించింది. 'అర్ధం లేకుండా ఏమిటా సంభాషణ?" అని మనసులో విసుక్కుంది.
"పద, సరూ! ఆరు దాటుతుంది . ఇంటి కెళ్ళి పోదాము." లేచి ఆవలిస్తూ సరోజ దగ్గరకు వెళ్లి నిలబడింది పార్వతి.
"పార్వతీ ! నువ్వు వెళ్ళు. మేమిద్దరం కొంచెం మాట్లాడుకోవాలి." అన్నాడు రాజు. "ఊహు. నేనూ పోతాను" అంటూ సగం లేచిన సరోజను చెయ్యి పట్టి కుదేశాడు.
"ఏమిటిది?" అంటూనే అస్తవ్యస్తంగా కూర్చుంది సరోజ, ముఖం చిరాకు గా పెట్టి.
పార్వతికి పౌరుషమూ, ఉక్రోషమూ ముంచు కొచ్చాయి. సరోజ నిలవ మంటున్నా వినిపించుకోకుండా ఎలక్ట్రిక్ లైట్ల వెలుగులో వేగంగా నడుస్తూ పార్కు దాటిపోయింది.
"చూశావా, రాజూ! పార్వతి కి కోపం వచ్చింది. చూడు, ఎంత జోరుగా వెళ్ళిపోయిందో!"
"ఆడవాళ్ళ కు కోపం రావడం లో ఆశ్చర్య మేముంది? ఎంత అమాయకురాలైనా పెదాల్లోను, కళ్ళల్లో నే దాస్తుంది కోపాన్ని."
"నువ్వేమిటి? ఆడవాళ్ళ గురించి ఏవో ప్రత్యెక గ్రంధాలు చదువు తున్నట్టున్నావు చూస్తె! లేకపోతె ఇన్ని విషయాలు ఇదివరకు మాట్లాడేవాడివి కావే! మెచ్చుకోవలసిందే ! ఇంతకీ నాతొ మాట్లాడతానన్న రాచకార్యా మేమిటి?' అంది సరోజ.
"అదే! ఇందాక కారణ మడిగావుగా? చెబుదామని."
"ఏమిటో?' పెదాలు బిగబెడుతూ అడిగింది.
"ఇందాక నువ్వు నా వైపు తీక్షణంగా చూసినప్పుడు రాధికా క్రోధం కనిపించింది నీ కళ్ళల్లో." స్నిగ్ధంగా నవ్వుతూ అన్నాడు రాజు, సరోజ ముఖం పరిశీలిస్తూ.
సరోజ పెద్ద కళ్ళు చేసి, "ఆ, అందుకా! ఈ మాట చెప్పడానికెనా పార్వతికి కోపం తెప్పించి, నన్ను నిలేశావు? ఘటికుడివయ్యా! ఇంకా ఉంటానా, , ఇక్కడ! మా అమ్మ ఎదురు చూస్తుంది." అని లేచి రెండడుగులు వేసింది సరోజ.
"సరూ, ఉండు." రాజు వెంబడించి ఆమె చేయి పట్టుకున్నాడు.
"ఏమిటిది?" అంది సరోజ విసుక్కుంటూ.
"పద, సినిమాకు వెళ్దాము." సరోజను మరొక వైపు లాగాడు.
"ఆ మాట ముందే చెప్పలేకపోయావా? పార్వతి ని ఉండమని ఉందును. నేను రానిప్పుడు."
'పార్వతెందుకూ మనమధ్య -- అని చెప్పలేదు. మాట్లాడకుండా పద" అన్నాడు రాజు.
"అయితే అంతకన్నా రాను. అదే నీకు శిక్ష." మరింత బిగదీసుకు పోయింది సరోజ.
"సరూ! నా మీద కొంచెం అయినా అభిమానమంటూ నీకుంటే నా మాట తోసేయ్యవు." అదొక మాదిరిగా ముఖం మార్చి అన్నాడు రాజు.
సరోజ లోంగిపోక తప్పలేదు. అసలే సున్నిత మైన మనసు ఆ అమ్మాయిది. అందుచేత స్నేహితుడైన ఒక మగవాణ్ణి నిరాశ పరచడం సాధ్యం కాలేదు.
"ఉహూ! చురుకైన అస్త్రం ప్రయోగించావే! వెళ్దాము , నడువు. నీ మీద అభిమానం ఉండడం నిజమే గానీ, అంతకంటే ఎక్కువ అభిమానం మరి కొందరి మీద నాకు ఉంది సుమా!" అంది కొంటెగా చూస్తూ.
