శేఖర్ కు సంతృప్తి గా లేదు. అయితే, తండ్రి చేసే పని నిజంగా సమంజసమని గ్రహించాడు. పాప లేకుండా ఒక్కడే అమెరికా వెడితే, పాప గతి ఏమవుతుంది? అసలు అమెరికా వెళ్ళిన బావమరిది తిరిగి వస్తాడని నమ్మకం ఏమిటి?
కనక, ఇప్పుడు ఆరోగ్యశాస్త్రం కంటే పాప భవిష్యత్తే ముఖ్యం. పెద్ద వాళ్ళ మాటా పెరుగూ అన్నం లాంటిది. ఈ ఇనప గుగ్గిళ్ళ బావగారు ఏదో ఒక విధంగా పాపకు దగ్గరయితే చాలు! దాని సుఖం కంటే కోరతగింది ఏమీ లేదు!
ఏదో ఒక విధంగా మనసును సరిపెట్టుకొన్న శేఖర్ బావమరిది రాకకు ఎదురు చూస్తున్నాడు.
క్రితం రోజే రావలసిన శాస్త్రి ఇంకా రాలేదు. పీటల మీద కూర్చోవడానికి ఇంకా మూడు గంటల వ్యవధి మాత్రమే ఉంది.
ఒకవేళ బావమరిది రాకపోతే!
శేఖర్ ఆ మాట అనుకోవడానికే భయపడ్డాడు.
వెంకట రామశాస్త్రి గారు కాలు గాలిన పిల్లిలా వాకిట్లో కి, ఇంట్లో కి తిరుగుతున్నారు.
"వీసా" తీసుకునే పని ఉంది, నాన్నా! నీవు పోయి అన్నీ సిద్దం చెయ్యమను. నేను ఒక రోజు ముందుగానే వస్తాగా. నువ్వు పోయి నాకు మెడ్రాస్ అడ్రెస్ కు అయిదు వేలు పంపమను. అర్జెంట్ . నీ కోడలి ని కూడా తీసుకు వెళ్ళ మంటున్నారాయే . ఆవిడకు కూడా "వీసా" అవీ చూడాలి మరి! డబ్బు వెంటనే పంపమను. లేకపోతె చాలా ఇబ్బంది" అని మరీ మరీ చెప్పి మెడ్రాస్ వెళ్ళిన శాస్త్రి ఇంతవరకు అయిపు లేడాయే!
"డబ్బు కావాలన్నాడు, బావగారూ!" అని శేష ఫణి శాస్త్రి గారిని అడిగితె, అయన ఎంతో శాంతంగా -- "అట్లాగే ఇస్తాలెండి . మన పిల్లలకు మనం ఇచ్చుకోవటం ఒక లెక్కా? గొప్పా? అబ్బాయిని రానీయండి. పీటల మీద కూర్చున్న తరవాత కొత్త బట్టలతో పాటు డబ్బూ ఇస్తాను" అన్నాడు లౌక్యంగా.
ఎన్నో ఎత్తులు వేశాడు గాని, కొడుకు వస్తే తప్ప దమ్మిడి రాల్చాడని తేలిపోయింది వెంకటరామ శాస్త్రి గారికి.
ముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది కంగారు పుట్టుకొచ్చిందాయనకు.
ఇక ఆ ఇంట్లో ఉండలేక, ఉత్తరీయం భుజం మీద వేసుకొని బస్సు స్టాండ్ వైపు వెళ్ళారు వెంకట రామ శాస్త్రి గారు. కోడు కింకా వస్తాడన్న ఆశ ఆయనలో అణగారిపోలేదు.
వియ్యంకుడు బస్సుస్టాండ్ వైపు పోగానే ఇంట్లో పెద్ద దుమారం రేగింది. అసలే శేష ఫణి శాస్త్రి గారు కోపిష్టి. అందులోనూ అల్లుడి మీద మరీ కోపంగా ఉంది. ఈవేళ, ఇట్లా నలుగురి ముందూ అవమాన పరిచేటప్పటికి , అయన కోపంతో మండి పడుతున్నారు. అల్లుడు కనపడితే , మీదపడి తన్నుతారేమో అని భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళంతా.
బస్ స్టాండు దగ్గర పన్నెండు గంటల దాకా పడి గాపులు పడి, కాళ్ళీడ్చుకుంటూ వెంకట్రామ శాస్త్రి గారు తిరిగి వచ్చారు. వస్తానని నమ్మించి అయిదు వేల రూపాయలు నట్టేట్లో ముంచిన కొడుకంటే ఆయనకూ కోపంగానే ఉంది.
గుమ్మం దగ్గిరే అగ్ని హోత్రావదానుల లాగే మండిపడుతున్న శేషఫణి శాస్త్రి గారు కనిపించగానే, ఆయనకు పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది. నోరెండుకు పోయి, మాట పైకి పెకిలి రాకుండా పోయింది.
"ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ నా గుమ్మం తోక్కావయ్యా? అంత అదుపు లేని కొడుక్కి పెళ్ళి చెయ్యమని ఎవడేడ్చాడట? మనిషి జన్మాత్తాక సిగ్గుండవద్దటయ్యా! వెధవ పెళ్ళి చేసి ఒక్కగా నొక్క పిల్ల నూరేళ్ళ బతుకుకూ నొప్పు పెట్టాను. ఆడపిల్ల ఉసురు గోడితే సర్వనాశం కావలసిందే! ఇరవై అయిదు వేలు వీడి ముఖాన తగలేశాను! వీడి ముఖమీడ్చా! పంది వెధవ! దౌర్భాగ్యపు వెధవ! పుట్టినప్పుడే చచ్చి ఉంటె ఓ ఆడపిల్ల గొంతు కోయడం తప్పేది! అంత ఏలుకోవడానికి ఇష్టం లేని వెధవ పెళ్ళెందుకు చేసుకొన్నాడట్టా? డబ్బు కక్కుర్తి వెధవ! ఇంకా ఎందుకు గుమ్మంలో బడితే లాగా నిలబడడం? నా ఇంట్లోంచి అవతలికి నడు! ఒరేయ్ శాస్త్రీ, వీడి సంచీ వీడి ముఖాన తగలేయ్యరా!" అని తిట్టిన తిట్టు తిట్టకుండా రంకెలు వేశారు శేషఫణి శాస్త్రి గారు.
"ఒరే నాయనా! కాస్త వెనకా ముందూ చూసి మాట్లాడరా! ఆడపిల్ల నిచ్చుకొన్నవాళ్ళం. మంత్రసాని పని ఒప్పుకున్నాక, ఏదొచ్చినా పట్టాలిసిందేరా! తొందర పడకు. అవతల అభం శుభం తెలియని పసిపిల్ల నీ గావుకేకలకు భయపడి ఏడుస్తున్నది. ఇహ నీ భర్య సరేసరి! దిగాలు పడి కూర్చుంది. నలుగురూ వింటే నవ్వుతారు. ఇక ఊరుకో" అని పాపమ్మ గారు ఏడుపు అపుకొంటున్న గొంతుకతో కొడుకును మందలించారు.
అగ్ని లో ఆజ్యం పోసినట్లయింది!
"అసలీ బోడి సలహా నీది కాదుటే! పరువూ, మర్యాదా , డబ్బూ ఉన్న కుర్రాడిని చూసి, మరో పది వేలేక్కువయినా ఖర్చు పెట్టి పెళ్ళి చేస్తానంటే, ఏం కూశావే! 'కాస్త లేని వాడి కిచ్చి చేస్తే , పిల్లా, పిల్లాడూ మన కళ్ళ ముందే చిలకా గోరింకల్లాగా ఉంటారు. డబ్బుకు లొంగని దేవడ్రా ఈ లోకంలో!' అని కూస్తివే! ఏమయిందిప్పుడు? డబ్బు కాస్తా దొబ్బుకొని చక్కా పోయాడు పెంట వెధవ! అసలు అడముండల మాటలు వినటం నాదే బుద్ది తక్కువ! చేసిన నిర్వాకం చాలు గాని, అవతలకు నడు!" అని హుంకరించాడు శేష ఫణి శాస్త్రి గారు.
బుద్ది తెలిసిన తరువాత ఎన్నడూ పల్లెత్తు మాట అనిపించుకోలేదు పాపమ్మ గారు. ఈవేళ కొడుకు రంకెలకు బిక్కచచ్చిపోయి , నిస్తేజమైన ముఖంతో లోపలికి వెళ్ళిపోయారు.
ఎండిపోయిన గొంతుకలో కాస్త తడి తెచ్చుకొని, పారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకొని వెంకట్రామ శాస్త్రి గారు-- "ఏమిటి బావగారూ! ఎంత చెడ్డా మా వాడు మీకు అల్లుడు! ఆడపిల్ల నిచ్చుకొన్న వాళ్ళకు అంత దూకుడు పనికి రాదు. అవతల పిల్లాడెందుకు రాలేదో అని నేను దిగాలు పడి చస్తుంటే , మధ్యన మీ శాపనార్ధాలా? ఎవరైనా వింటే నవ్విపోతారు! ఊరుకోండి!" అని మందలించబోయారు.
అదే సమయానికి పోస్ట్ మాన్ గుమ్మం దగ్గర కనపడ్డాడు - "అయ్యా! ఎవరో వెంకట్రామ శాస్త్రి ట .ఆయనకు టెలిగ్రాం ఉందయ్యా!" అంటూ.
"టెలిగ్రాం ' అన్న మాట వినబడగానే అగ్నిహోత్రం లాగా మండిపడుతున్న శేషఫణి శాస్త్రి గారు ఒక్కసారిగా చల్లబడ్డారు. 'నిష్కారణంగా తొందర పడ్డానేమో! పాపం, ఆ కుర్రాడికి ప్రమాద మేమన్నా జరిగిందేమో!' అని నోచ్చుకున్నారాయన.
ఏమీ పలకకుండా లోపల కూర్చుని జరిగే రభస నంతా చూస్తున్న శేఖర్ ఒక్క అంగలో బయటికి వచ్చి, టెలిగ్రామ్ తీసుకుని సంతకం చేసి పోస్టు మాన్ ను పంపాడు.
టెలిగ్రామ్ తమకు కాదన్న సంగతి ని కూడా మరిచి శేఖర్ హడావిడిగా టెలిగ్రామ్ ను చించి చదివాడు. ముఖంలో రంగులు మారాయి. కోపంతో కండ్లు జేవురించినాయి.
శేఖర్ ముఖంలోని మార్పులను గమనించకుండా శేష ఫణి శాస్త్రి గారూ, వెంకట్రామ శాస్త్రి గారూ ఒకే మారు ---"ఏమిటటా సంగతి? అబ్బాయి కులసాగానే ఉన్నాడుగా!" అని ఆత్రంగా అడిగారు.
అతి కోపంతో శేఖర్ కు యుక్తా యుక్తాలు విచక్షణ కూడా నశించింది.
"సంగతేమిటా? వెధవకు అనుకోకుండా విమానం లో సీట్ చిక్కిందట. నిన్ననే అమెరికాకు బయలుదేరి వెళ్ళాడట. ఎవరో స్నేహితుడు మెడ్రాస్ నుండి వైరిచ్చాడు. వివరాలు మళ్ళీ వ్రాస్తాడుట. ఇక పాప గతేమిటి నాన్నా?' శేఖర్ గొంతులో అధైర్యం తొంగి చూసింది.
వెంకట్రామ శాస్త్రి నిలబడలేక ఒట్టి నేలనే చతికిల పడ్డారు. నమ్మించి, ఎంత పని చేశాడు వెధవ! పరువూ, డబ్బూ -- రెండూ గంగలో కలిపాడు!వియ్యాల వారు ముఖాన ఉమ్మేస్తూన్నారంటే ఉమ్మేయ్యరూ! ఎంత అప్రతిష్ట పాలు జేశాడు!
ఇంట్లో నుండి సన్నగా ఏడుపు వినివస్తున్నది. బహుశా పాపమ్మ గారై ఉంటారు. సన్నమ్మ కు, కానీ, కృష్ణ వేణమ్మ గారికి గానీ గట్టిగా ఏడ్చే అలవాటు లేదు. ఎంత దుఃఖమైనా కండ్ల లో బయట పడవలసిందే కాని, నోటి వెంట బయటపడరు!
బెడురుతూనే వెంకట్రామ శాస్త్రి గారు -- "అమెరికా వెడతానని మొదటి నుంచీ అనుకొన్నదేగా! అర్జెంట్ గా వెళ్ళవలసి వచ్చిందేమో మరి! అయినా, అమెరికా వెళ్లిన వాడు తిరిగి రాక అక్కడే ఉంటాడా? వెంటనే రమ్మని జాబు వ్రాస్తాలెండి!" అన్నారు.
ఇక నిగ్రహించుకోలేక పోయారు శేషఫణి శాస్త్రి గారు. "నీది ఒక బతుకే! కొడుకేమో నీ చెప్పు చేతల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నావే! జాబు వ్రాసి పిలిపిస్తాడట! ఓ యబ్బో ! రెక్కలు కట్టుకొని వచ్చి వాలతాడు! మీ బతుకులు చెడ! వాడో మనిషా! ఆనాడు నా కొడుకు మీద లేనిపోని వన్నీ చెప్పి కాలేజీ నుండి తరిమి వెయ్యడానికి చూడలేదూ?అయన కడుపు చల్లగా, ఆ ప్రిన్సిపల్ అసలు సంగతి నాతొ చెప్పబట్టి సరిపోయింది. అంత కళ్ళలో విషం పోసుకోవటానికి మేమేం అపకారం చేశామూ? సిగ్గు లేకపోతె సరి! ఈ ముండమోపి పెళ్ళి నా కూతురును కాలేదనుకుంటాను!" అంటూ గబగబా లోపలికి పోయి , ఒక నిమిషంలో తిరిగి వచ్చి చేతిలోని వస్తువును వియ్యంకుడి ముఖాన గిరవాటు పెట్టి, "ఇహ నా గడప తోక్కకు! ఇహ వెళ్ళిపో! లేకపోతె ఇక్కడ ఖూనీ జరుగుతుంది! నీకూ, మాకూ సంబంధం తెగింది. ఫో! నీ కొడుకు చచ్చాడని అనుకోని నా కూతురికి మళ్ళీ పెళ్ళి చేస్తాను! ఇరవై అయిదు వేలూ దొంగలు పడి దోచుకున్నారని అనుకొంటాను! మానల్లే నిలుచుని కదలవెం? నడుస్తావా? లేక మెడ పెట్టి గెంటనా?" అని బారలు చాచుతూ మీదికి వచ్చారు.
అయన వెంకట్రామ శాస్త్రి గారి ముఖాన గిరవాటు వేసింది మంగళ సూత్రాలు! కన్నీరు కారుస్తున్న సన్నమ్మ మేడలో నుండి బలవంతంగా తెంపి తీసుకొని వచ్చినవి!
పాపమ్మ గారూ, కృష్ణ వేణమ్మ గారూ, శేఖర్ చూస్తూ నిలుచున్నారే గాని, అడ్డు పడటానికి సాహసించ లేదు. ఎంతో వేడుకగా జరగవలసిన రోజున ఇట్లా జరిగిందేమా అని అంతా దుఃఖపడుతున్నారు.
మంగళసూత్రాలు చూసేసరికి పాపం, వెంకట్రామ శాస్త్రి గారికి కన్నీళ్లు పొంగు కొచ్చాయి. ఉత్తరీయం తో కండ్లు తుడుచుకుని , మంగళ సూత్రాలు భద్రంగా అక్కడే ఉన్న బల్ల మీద పెట్టి , నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొంటూ వెళ్ళిపోయారు.
ఆ వెళ్ళడం చూస్తె శేఖర్ కి కూడా అయన మీద జాలి కలిగింది.
మరు నిమిషాన ప్రాణంతో సమానంగా ప్రేమించే చెల్లెలి నూరేళ్ళ బ్రతుకునూ ఒక అపరిష్కృతమైన సమస్యగా మార్చిన బావమరిది పై పట్టరాని కోపం పెల్లు బికింది!
పాప భవిష్యత్తు ఏమిటి?
అవసరమైతే పెద్దల నెదిరించియినా సరే, పాప భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకోవాలన్న నిశ్చయానికి ఆరోజే వచ్చాడు శేఖర్.
పెండ్లి కొచ్చినట్లుగా చుట్టాలెవరూ పెద్దగా దీనికి రాలేదు. ఆ వచ్చిన ఒకరో, ఇద్దరో పెట్టెలు సర్దుకొని వెళ్ళిపోయారు.
చిన్న పిల్లయినా సన్నమ్మ కూ మనస్సనేది ఉందనీ, అది బాగా దెబ్బ తిన్నదని గ్రహించిన వాడు సర్వాంతర్యామి ఒక్కడే!
* * * *
ఎవరి కోసమూ ఆగని కాలచక్రం పన్నెండు సంవత్సరాలు ముందుకు పరుగెత్తింది.
