4
సాయం సమయం. పెద్ద వానకురిసి వెలిసింది. ఆఫీసునుంచి నేరుగా శ్రీహరి ఇంటికి వచ్చేశాడు, రాజా. శ్రీహరి యింకా ఆఫీసు నుంచి రాలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. 'ఏమా' అనుకుంటూ లోపలికి వెళ్ళిన రాజాకు చాలా చిత్రమైన దృశ్యం కంటబడింది. తాను క్రొత్తగా చిత్రించిన విధ్యాదరి దగ్గర విచారంగా నిల్చునుంది శాంతి. టేబుల్ క్లాత్, ప్రక్క దుప్పట్లూ అవీ సర్దుతూ ఏమిటో మెల్లగా గొణుక్కుంటూంది, పద్మ. ముఖంలో స్పష్టంగా విసుగుదల కనిపిస్తూంది. ఇద్దరూకూడా రాజా రాకను గమనించలేదు. అయిదు నిమిషాలు పోయాక వెంటిలేటర్ల షట్టర్లు వేస్తూ రాజాను హఠాత్తుగా చూచిన పద్మ, "మీరొచ్చారా? నేను గమనించనేలేదే!" అంది ఆశ్చర్యంగా. ఆ మాటలకు పరాకుగా ఉన్న శాంతి, అప్పుడే ఆఫీసునుంచి వచ్చిన శ్రీహరి కూడా ఆశ్చర్యంగా చూచారు.
"ఏం చేస్తున్నారు, మరి అంతగా గమనించక పోవటానికీ?" అన్నాడు శ్రీహరి, భార్యను.
"ఏముందీ? నేను ప్రక్కింటి కెళ్ళాను. అక్కడ కూర్చుని మాట్లాడుతూండగానే వానకురియడం ప్రారంభించింది. ఇంట్లో శాంతి వుంది కదా అని నేను రాలేదు. వచ్చేసరికి ఏముంది? అన్ని గదులలోనికీ కిటికీలు, గుమ్మాల్లో నుంచి వానజల్లు కొట్టేసి అన్నీ తడిసిపోయి వున్నాయి. నిద్రపోతోందేమో, పోనీ అనుకొంటే అదీ లేదు. హోరున ఆకాశం చిల్లులు పడ్డట్టు వాన కురుస్తూంది. ఫెళఫెళలాడుతూ -వురుములూ, పిడుగులూను. గాలికి కిటికీ రెక్కలు తటతటాకొట్టుకుంటున్నాయి. ఏమీ వినపడలేదట! నిశ్చింతగా నిల్చుని బొమ్మ వేసుకుంటోంది. పైగా ఇవన్నీ తడిసి పాడైపోయినందు కేబాధా లేడు. నేను తన 'మూడ్' చెడగొట్టేశానట. చిత్రం పాడైపోయిందట!"
విస్మయంగా వింటూన్న శ్రోత లిద్దరూ శాంతిదేవ చూసేసరికి అక్కడ లేదు. ప్రక్కనే ఉన్న వరండాలో క్రోటన్ కుండీ దగ్గర స్తంభాన్ననుకు నిల్చుని కళ్ళు తుడుచుకుంటూంది.
రాజా మాట్లాడకుండా చిరునవ్వుతో ఒక సోఫాలో కూర్చున్నాడు. శ్రీహరి చెల్లెలి దగ్గరకు వెళ్ళి - మెల్లగా భుజంపై చెయ్యి వేస్తూ, "శాంతీ" అన్నాడు. శాంతి మాట్లాడ లేదు. గబగబ కళ్ళు తుడుచుకుంది. వెనుకనే వెళ్ళిన పద్మ చిన్నబోయిన ముఖంతో, "అయినా, నే నేనున్నాననీ? అంత పరాకేమిటనడం కూడ అపరాధమేనా?" అంది, శాంతి చెయ్యి పట్టుకుంటూ.
"చూడు, పద్మా. ఆ చిరాకు పరాకుల సంగతి ఆ 'ఆర్ట్' తెలిసినవాళ్ళకే తెలియాలి కాని మనకి వింతగా వుంటుంది. అయినా, శాంతికి చిన్నప్పట్నుంచీ అలాగే సాగింది. నువ్వు దాన్నింకెప్పుడూ ఏమీ అనకు" అని శ్రీహరి, "అయినా, శాంతీ, నువ్వంత బాధపడడం దేనికి? చనువుగా అమ్మయినా ఆమాత్రం మందలించదా, చెప్పు? అలాగేనా ప్రవర్తించడం? రా, లోపలికి రాజా నవ్వు'తున్నాడు చూడు" అన్నాడు.
కళ్ళు తుడుచుకుని నవ్వింది శాంతి. "అబ్బే! కోపం రాలేదన్నయ్యా."
"మరైతే రా, లోపలికి."
"వస్తాన్లే. వెళ్ళు."
అయిదు నిమిషాలలో ముఖం కడుక్కొచ్చి కూర్చుంది శాంతి.
"అయితే, సరస్వతీ చిత్రణ ప్రారంభించి ఎన్నాళ్లైంది?" అన్నాడు రాజా నవ్వుతూ.
శాంతి ఒక్కసారి బొమ్మనూ, మరొక్క సారి రాజానూ చూచి ముఖం త్రిప్పేసుకుంది. అసంపూర్తిగా ఉన్న ఆ చిత్రం గురించి శాంతి బాధపడుతూందనీ, దాన్ని గురించి మాట్లాడకూడదనీ గ్రహించిన రాజా విషయం మార్చాడు.
"ఇక్కడ మనం చూడవలసినవన్నీ చూసేశాం కదూ? ఇంకా ఏమైనా వున్నాయా?" శ్రీహరికి కన్నుగీటి శాంతి ముఖంలోకి చూచాడు.
"ఇంకేమన్నా వున్నాయా, శాంతీ? ఎటైనా వెళ్దామా?" అడిగాడు శ్రీహరి.
"ఏమో, నాకేం తెలుసు? అయినా ఇవ్వాళ ఎక్కడికీ వద్దు" అంది శాంతి ఎటో చూస్తూ.
కొంచెంసేపు కూర్చుని రాజా వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు, "మళ్ళీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ చిత్రం పూర్తి చెయ్యచ్చు శాంతీ. అట్లా దిగులుపడిపోతావేమిటి?" అన్నాడు శాంతితో. శాంతి మాట్లాడలేదు.
"మరీ సుకుమారం!" అంది పద్మ నవ్వుతూ.
"క్షమించండి, అక్కయ్యగారూ. చిత్రకారులకూ, చిత్రాలకూ మధ్య వుండేది తల్లీ పిల్లల బాంధవ్యం వంటిది. బాధ సహజమే మరి!" అంటూ వెళ్ళిపోయాడు.
ఆ క్రొత్త సంబోధనకు పద్మా, శ్రీహరీ ముఖముఖాలు చూచుకున్నారు.
ఆరాత్రి శ్రీహరి. "రాజాగురించి నీ అభిప్రాయ మేమిటి?" అనడిగాడు భార్యను.
"మీకున్న అభిప్రాయమే!" నవ్వింది పద్మ.
"అంటే?"
"స్పష్టంగా నాచేతే చెప్పించాలనా? కానీండి. స్నేహం బంధుత్వంగా మార్చుకొంటే బాగానే వుంటుంది. తగినవాడే" అంది పద్మ, తిరిగి నవ్వుతూ.
కొంచెం ఆలోచిస్తూ అన్నాడు శ్రీహరి: "అతడికీ ఇష్టమేననుకుంటాను. శాంతి విషయమొచ్చేసరికి చాలా కుతూహలం చూపెడతాడు. అయినా కదిపితే ఎలాగుంటుందో? ముందు శాంతి నడగాలి. అన్నిటికంటే ముందు నాన్న గారికి వ్రాసి అనుమతి తీసుకోవాలి."
"అన్నిటికంటే ముందు శాంతి అభిప్రాయమే ముఖ్యం. ఆవిడ అసలు పెళ్ళిచేసుకోనని నాతో నాలుగైదు సార్లు అంది" అన్నది పద్మ.
"ఇదివరకొక సంబంధం విషయంలో అలాగే మాట్లాడింది. అయినా చిన్నతనం చెప్తే ఒప్పుకుంటుందిలే."
మర్నాడు ఉదయం పద్మా, శ్రీహరీ హాల్లో కూర్చుని కాఫీతీసుకుంటూఉండగా "ఇప్పుడడగనా, శాంతిని?" అన్నాడు శ్రీహరి.
"ఊఁ. నేనూ అదే మీకు జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాను."
అంతలో శాంతి తానే అటు వచ్చింది, తల దువ్వుకుంటూ. తనకు తనే అన్నయ్య దగ్గర కూర్చుంటూ, "ఒకసారి శాంతినికేతన్ చూడాలన్నయ్యా. చాలా బాగుంటుందట కదూ?" అంది.
"అనే నేనూ విన్నాను. చూద్దాంలే."
"లే కాదు. తప్పకుండా వెళ్ళాలి. శాంతినికేతన్ చూశాక నేను వెళ్ళిపోతాను."
అన్నా వదిన లిద్దరూ ఆశ్చర్యపోయారు, శాంతి ధోరణికి.
"వెళ్ళిపోయే ప్రసక్తి దేనికి, శాంతీ, ఇప్పుడు?"
"వచ్చి రెండు నెలలుపైన అయింది కదా, అన్నయ్యా? కలకత్తా చూద్దామనీ, అదీగాక క్రొత్తలో వదినకు సాయమనీ వచ్చాను. ఇంకెందుకు?"
"అదీ నిజమే అనుకో కాని ఎక్కడైనా నువ్వు ఇంట్లో వుండేదానివేగా? చదువనీ, కాలేజ్ లనీ ఏమీ లేవుకదా! తొందరేం?"
"నామీదగాని కోపం లేదుకద?" అంది పద్మ.
"ఛ అవేంమాట లొదినా! నీకూ క్రొత్త పోయింది కదా? అదీగాక ఏమిటో నాకీ సిటీస్ లోని హడావుడీ, రణగొణధ్వనులూ చిరాకు. ఎక్కడా ప్రశాంతతనేది వుండదు. మన ఊళ్ళో, మన శాంతి నిలయంలో ఎంత హాయిగా వుంటుంది!"
శ్రీహరి నవ్వాడు. "రేపు పెళ్లై మీ ఆయన కేదైనా పెద్ద సిటీలో వుద్యోగమైతే అప్పుడేం చేస్తావే?"
శాంతి స్వర్ణచ్చాయవదనం ఒక్కసారి అరుణిమ దాల్చింది. "అది అసంభవం" అంటూ చటుక్కున లేచి వెళ్ళిపోయింది.
"ఆడవారి మాటలకు అర్ధాలే వేరట!" అన్నాడు శ్రీహరి నవ్వుతూ. అడుగదలుచుకున్న విషయం అడుగునే ఉండిపోయింది.
ఆ సాయంత్రం రాజాతో అన్నాడు శ్రీహరి "శాంతినికేతన్ చూడాలంటోంది శాంతి" అని.
"అవును, చూడవలసిందే. ఇక్కడికి సుమారు అరవై డెబ్బైమైళ్ళ దూరముంటుంది. ఒక ఆదివారం ఉదయమే బయల్దేరి వెళ్తే చూచి, రాత్రికి వచ్చెయ్యచ్చు" అన్నాడు రాజా.
"అయితే ఈ ఆదివారమే వెళ్దాం. ఆలస్యం దేనికి?" అంది, రాజా తెచ్చిన గులాబీలు మాలకడుతూన్న శాంతి.
"సరే అలాగే వెళ్దాం. మేం కాస్త అటువెళ్ళివస్తాం. రావోయ్, రాజా" అని లేచి రాజాతో కలిసి షికారు కెళ్ళిపోయాడు, శ్రీహరి.
మాల కడుతూన్న శాంతి కొద్ది క్షణాలపాటు వాళ్ళు వెళ్ళిన దిక్కే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కలకత్తా వచ్చిన ఈ రెండు నెలల కాలంలోనూ ఇలా ఎప్పుడూ జరగలేదు. సాయంకాలం ఎటు వెళ్ళినా నలుగురూ కలిసే వెళ్ళడం అలవాటుగా ఉండేది. "మీరు వస్తారా అని మాటమాత్రంగానైనా అవకుండా ఆ ఇద్దరూ అలా వెళ్ళిపోయారేమిటి?' అని తల పోస్తూ వదినవైపు చూచింది. ఆమె కాపలా సంగతేమీ పట్టినట్టే లేదు. శాంతి అడిగితే నవ్వి ఊరుకుంది. మళ్ళీ కాస్సేపటికి, "ప్రత్యేకంగా చూడవలసినవేమీ లేవవేమో!" అంది పద్మ. అయినా శాంతి కా సమాధాన మేమీ తృప్తి కలిగించలేదు.
పార్కులో ఒకమూల చెట్టుక్రింద కూర్చున్నారు శ్రీహరీ, రాజా. కొద్దిసేపు మామూలు విషయాలయ్యాక శ్రీహరి మెల్లగా మొదలెట్టాడు.
"చూడు, రాజా. మనం చెప్పుకోదగ్గ దగ్గర స్నేహితులం గనుక వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడాని కభ్యంతరం ఉండదనుకుంటాను" అన్నాడు శ్రీహరి.
రాజా, శ్రీహరి కండ్లలోకి చూస్తూ నిండుగా నవ్వాడు. "ఇన్నాళ్ళకి నీకీ ధర్మసందేహ మొచ్చిందట్రా? నీ చిత్తమొచ్చినవడుగు" అంటూ హాయిగా పచ్చికలో పడుకున్నాడు.
కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. కడకు రాజా, "ఏమిట్రా అంత సందేహం? అడగమన్నానుగా?" అన్నాడు.
"అడుగుతాను. కానీ ఒక్క షరతు. దీని ఫలితా లెలావున్నా మనమధ్య స్నేహం ఇలా స్నేహం గానే ఉండాలి. ఏమాత్రం మొహమాటాలకూ, సందేహాలకూ తావుండకూడదు" అని శ్రీహరి, రాజా ముఖంలోకి చూచాడు.
ఈసారి రాజా నవ్వలేదు; మాట్లాడలేదు. లోతుగా శ్రీహరి నేత్రాలలోకి చూచి గంభీరంగా తల పంకించాడు, అంగీకార సూచకంగా.
"నువ్వు తగిన వ్యక్తికోసం నిరీక్షిస్తున్నా నన్నావు. శాంతి నీకు నచ్చుతుందేమోనని ఆశ పడుతున్నాను" అన్నాడు శ్రీహరి, రాజాను పరీక్షగా చూస్తూ.
విన్నదే తడవుగా రాజా ఒక్కసారి లేచి కూర్చుని శ్రీహరి చెయ్యి గట్టిగా నొక్కాడు. కొంతసేపటివరకూ అసలు మాట్లాడలేకపోయాడు. తర్వాత తమాయించుకొని, "ఈ వివాహం తప్పకుండా జరుగుతుంది, శ్రీహరీ. ఇవ్వాళ నేను ఆ విషయం మాట్లాడటానికే నిన్ను ఒంటరిగా బయటికి తీసుకురావాలనుకున్నాను. కాని నువ్వే ఆ పని చేశావు. నీ అంత నువ్వే అడిగావు" అన్నాడు.
"నిజంగా?" ఆశ్చర్యపోయాడు, శ్రీహరి.
"నిజం, శ్రీహరీ. ఎందుకో నాకు చూచిన మరుక్షణంలోనే నేనింతవరకు నిరీక్షిస్తున్న కన్య శాంతి అన్పించింది. దక్షిణేశ్వరంలో ఆనాడు ప్రథమంగా చూచిన శాంతి రూపం నా హృదయంలో హత్తుకుపోయింది. అయినా నిర్ణయమైన వరుడెవరైనా వున్నారేమోననే అనుమానంతోనూ - దగ్గరవాళ్ళెవరూ లేరు నాకు- ఎవరిచేత అడిగించాలో, ఎలా అడగాలో తెలియకనూ నాలో నేనే మధనపడుతున్నాను. కానీ, దైవమే తీర్చాడు నా సమస్య. లేకుంటే మన రెండు హృదయాలలోనూ ఒకే భావం కలగడం, అది ఇంత మనోహర వాతావరణంలో ఒకేసారి వెలికి రావడం జరుగుతుందా?" రాజా చెయ్యి శ్రీహరి చేతిలోనే ఉండిపోయింది.
"వివాహం దైవనిర్ణయమే అయినా మానవ యత్నం చాలా వుండాలి. అయినా నువ్వా విషయం యింత సౌమ్యంగా తేల్చెయ్యడం, అంగీకరించడం నీ గొప్పతనాన్ని చాటుతోంది, రాజా. అయితే ఈ రాత్రే నాన్నగారికి వ్రాస్తాను, అమ్మని కూడా తీసుకురమ్మని. నిన్ను చూచి నట్లూ వుంటుంది. అన్నీ ఇక్కడే నిర్ణయించుకోవచ్చు. ఇదివరలో ఒకటి రెండుసార్లు నిన్ను చూచినా, చాలా కాలమైందిగా? అదీగాక నా స్నేహితులలో ఒకరుగా తప్ప, అప్పుడు ప్రత్యేక దృష్టితో చూసివుండకపోవచ్చు."
"నిజమే చూచుకోవడం అవసరం కూడ. కాని పెద్ధవారిని ఇంత దూరపుప్రయాణం చేయించడం దేనికి? పోనీ వారం రోజులు సెలవు పెట్టి మనమే వెళ్దాం."
ప్రేమతో మన పూర్వకంగా నవ్వాడు, శ్రీహరి. "నాకు తెలుసు, రాజా, నీ హృదయం నవనీతమని. అందుకే ఈ కార్యం సఫలీకృతం చెయ్యమని ఆ ఏడుకొండలవాడిని అనేకవిధాల ప్రార్ధిస్తున్నాను. అయితే ఒక మాట. నువ్వు నా స్నేహితుడవైనంతమాత్రాన, నీ తరఫున అడిగే పెద్దలు లేనంతమాత్రాన నీకు ఏ విధమైన మర్యాదలోపంకాని, కట్నకానుకల కొరతగాని జరుగనివ్వను. పెండ్లికుమారుని కన్య తరపువారే వచ్చి చూచుకోవడం ఉన్నత కుటుంబాలలో ఆచారం. అలాగే జరుగనీ, నీ హోదా తగ్గించుకో వద్దు. అది నా కిష్టంలేదు."
నవ్వాడు రాజా. "నీకు నాపైగల సదభిప్రాయానికి చాలా కృతజ్ఞున్ని. మరి లేద్దామా?"
"ఇంతకూ నీ ఉద్దేశ్యమేమిటో చెబితే నేను నాన్నగారికి రాత్రే వ్రాస్తాను."
"అరే! చెప్పానుకదా?" ఆశ్చర్య విస్పారిత నేత్రాలతో అడిగాడు రాజా.
"సరే, అది అంగీకారం. మరి కట్నం....." అసంపూర్తిగా వదిలేశాడు శ్రీహరి.
రాజా ముఖం గంభీరమైపోయింది. "అయితే నే నటువంటివాడి ననుకున్నావా? కట్నవ్యాపార మంటే నాకు పరమ అసహ్యం, శ్రీహరీ. ఈ పాడుపద్ధతులవల్లే సరియైన జంటలు కుదరడం లేదనుకుంటాను."
"నాకు తెలుసయ్యా. కోపం తెచ్చుకోకు, మరి, కాని నాన్నగారు కూతుర్ని వట్టినే పంపరు."
"నన్ను బలవంతం చెయ్యకు. నాకేం లోటులేదు, ఒకరివ్వడానికి. నేను అమ్ముడవను."
"సరే. ఇందులో నా పెత్తనం లేనట్టే, నీ పెత్తనమూ లేదు. కన్యాదాత తన కన్య కేమిచ్చు కొంటారో నీ కనవసరం. మరి మాట్లాడకు." 'అంత యిచ్చుకోలేం' అని దేవిరించవలసిన పరిస్థితి పోయి, 'పుచ్చుకో'మని బ్రతిమాలవలసి వచ్చింది.
5
రాత్రి విషయాలన్నీ విన్న పద్మ పరమానంద భరితురాలైపోయింది. "శాంతికి చెప్పనా?" అన్నాడు, శ్రీహరి.
