Previous Page Next Page 
రంగులవల పేజి 7


    తులసికి నవ్వొచ్చింది అతని అమాయకత్వం చూసి. ఎంత కటువుగా ఉండే మగాడైనా, పెళ్ళానికి నెల తప్పిందనగానే ఎంత సంబరపడిపోతాడు తనేదో సాధించినట్టుగా!
    'డమ్మీ' గా బ్రతుకుతున్న మామగారు ఊరికి వెళ్ళిపోతానన్నాడు. తులసికి అతన్ని చూస్తే ఎక్కడలేని గౌరవం. అతను ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోడు. ఎవరినించీ ఏమీ ఆశించడు. ఎవరికీ ఏమీ ఇవ్వడు. తనకున్న పాత బంధువులాంటి ఉబ్బసం పెరగకుండా చూసుకుంటూ కాలం గడుపుతాడు. అతనికి జరగవలసిన ఉపచారాల్లో ఏం లోపం వచ్చిందో మరి, వెళ్ళిపోతానంటున్నాడు.
    "ఎందుకు, మామగారూ, అప్పుడే వెళ్ళిపోతారు. మరికొన్ని రోజులు ఉండగూడదూ" అంది తులసి.
    "వద్దమ్మా వెళ్ళిపోతాను. ఏదో ఇన్నాళ్ళూ చేశావు. ఐనా నేను ఎవరి దగ్గిరా ఎక్కువ రోజులు బతకలేను. నా ఇల్లు నాక్కావలిసిందే. మొదటినించీ అలా అలవాటైంది. మీ అత్త ఇక్కడే ఉంటుందిలే" అన్నాడు.
    తులసి అతణ్ణి బ్రతిమాలలేదు.
    ఆ సాయంత్రం తులసి ఇన్స్టిట్యూట్ కు వెళ్ళింది. చాలా రోజులకు జయశీల కనిపించింది. ఈసారి తులసే హోటలుకు లాక్కెళ్ళింది.
    "ఏమిటోయ్ వ్యవహారం?" అంది జయశీల.
    "ఏమీ లేదుగాని రా, రా. క్లాసెస్ కు రావటం లేదేం?" అంది తులసి.
    "నా పెళ్ళి నిశ్చయమైందిగా" అంది జయశీల.
    "ఊహూఁ! నాకు చెప్పకుండానే పెళ్ళి చేసేసు కుంటున్నా నన్నమాట" అంది తులసి.
    "కేవలం నిశ్చయమేగద. పెళ్ళి నీకు చెప్పకుండా జరుగుతుందా" అంది జయశీల.
    "ఎవరా రాజకుమారుడు?" అంది తులసి నవ్వుతూ.
    "రాజకుమారుడేం కాదు. రాజే పూర్తి పేరు వెంకటరాజు. స్టేట్ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్" అంది జయశీల.
    తులసి క్షణం ఆశ్చర్యపడింది.
    జయశీల ఓ మాదిరి అందంగానే ఉంటుంది. ఇంచుమించు తనంత వయసుంటుంది, తన లాగానే ఉద్యోగం చేస్తూంది. కాని ఆమె ఓ ఆఫీసర్ను పెళ్ళి చేసుకోబోతూంది.
    తులసి ఉద్రేకంగా, "నా ఉద్దేశం ఏమిటంటే, జయా, బీదవాళ్ళు బీదవాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు. బీదవాళ్ళు ధనికులను, ధనికులు బీదలను పెళ్ళాడాలి. ఇప్పుడు ఇద్దరు గుమాస్తాలు పెళ్ళి చేసుకున్నారనుకో..." అంటూంటే, "ఎందుకంత జెలసీ!" అంది జయశీల నవ్వుతూ.
    తులసి నాలిక కొరుక్కుంది. తనను తాను తిట్టుకుంది.
    "పైగా, ఇంకా పెళ్ళి కాలేదు" అంది జయశీల.
    "ఛీ. అవేం మాటలు, జయా. పెళ్ళికాక మానుతుందా ఏమిటి. నేను చాల మూర్ఖంగా మాట్లాడాను. క్షమించు, జయా....ఆఁ. ఇంతకూ అసలు సంగతేమిటంటే నాకు రెండో నెల" అంది తులసి.
    "వండర్ ఫుల్! అలా చెప్పు మరీ. ఇంతసేపూ దాచావేం" అంది జయశీల.
    తులసి నవ్వి ఊరుకుంది.
    "మన క్లాస్ లో జీన్ కు ఎయిర్ హోస్టెస్ సెలక్షన్ ఎలా వచ్చిందో తెలుసా?" అంది జయశీల మళ్ళీ.
    "ఏమోలే. అవన్నీ నా వంటివాళ్ళకు కావు" అంది తులసి.
    "ఇలాంటివి వింటుంటే నీకు బాధగా ఉంటుంది కదూ, తులసీ" అంది జయశీల.
    "లేదు, లేదు. ఛ. నా కెందుకు బాధ. నా తోటి వాళ్లైనా తమ తమ ఆర్ధిక, సాంఘిక స్థితులను అభివృద్ది చేసుకుంటున్నారని సంతోషంగా ఉంటుంది" అంది తులసి తత్తరపాటుతో.
    "అంతేకాదు, ఇవన్నీ నువ్వు చెయ్యలేకపోతున్నానే అని బాధపడతావు. అన్నీ ఉండికూడా నీవూ, నీ భర్తా అలాగే ఎందుకు మగ్గిపోతున్నారో అర్ధం కాదు కదూ" అంది జయశీల.
    తులసి మాట్లాడలేకపోయింది. ఆమె గొంతు రుద్ధమైంది. కాసేపుండి, "నే నో విషయం చెప్పనా. మళ్ళీ నేను వీళ్ళందరి మీదా ఏడుస్తున్నానంటావా" అంది.    
    "లేదు. చెప్పు" అంది జయశీల.
    "మేం ఇక్కడ రెండేళ్ళబట్టీ ఉంటున్నామా. నేను ఈ కాలంలో గమనించిందేమిటంటే-బళ్లమీద తినుబండారాలమ్ముకుంటూ తిరిగేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, పాలమ్ముకునేవాళ్ళు ఇక్కడ స్వంత ఇళ్ళల్లో ఉంటున్నారు. వీళ్ళ ఇళ్ళలో పోజుగా ఉద్యోగాలు చేసే మావంటివాళ్ళు అద్దెకుంటున్నారు. వ్యాపారానికున్న విలువ విద్యకు లేదు కదూ" అంది తులసి.
    "టూ సిల్లీ మొదటి సంగతేమిటంటే, ఉద్యోగాలెవరూ పోజుకోసం చెయ్యటం లేదు. ముఖ్యంగా నువ్వు. రెండోది, వ్యాపారం అంత సులభం కాదు. నీ ఉద్యోగానికన్నా చాలా కష్టమేననుకుంటాను. పోనీ, ఈ విషయం చెప్పు. వ్యాపారం నువ్వు చెయ్యగలవా? మీ ఆయన చెయ్యగలడా?" అంది జయశీల.
    తులసి తల దించుకుంది.    
    ఈ రోజు తనకేమైంది? ఎందుకలా మాట్లాడుతూంది?
    ఇంటికి వచ్చేటప్పటికి పాపా, అత్తా పడుకుని ఉన్నారు. భర్త ఏదో పుస్తకం చదువుతున్నాడు.
    "ఏమండీ, ఇన్స్టిట్యూట్ వదిలిందా!" అన్నాడు నవ్వుతూ.
    "ఆఁ. ఇన్స్టిట్యూట్ వదిలింది. ఇల్లు పట్టుకుంది" అంది తులసి సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తూ.
    "లే. తిందాం" అన్నాడు సీతాపతి.
    తులసి కాళ్ళుకడుక్కుని వచ్చేటప్పటికి అతడు కంచాలు తీస్తున్నాడు స్టాండులోంచి.
    "అదేం పనండీ, మరీ నన్నలా అవమానించకండి" అంది తులసి గబగబా అతడి చేతిలోంచి కంచాలందుకుంటూ.
    "ఇందులో అవమానమేముంది, తులసీ" అన్నాడు సీతాపతి.
    "చాలు, చాలు. వద్దు బాబూ. సాయంత్రాలు నేను వంట చెయ్యటం లేదు. ఇక్కడికే నా తల కొట్టేసినట్టున్నది. పైగా, మీరు ఈ పనికూడా చేస్తారా. నేను ఇన్స్టిట్యూట్ మానేస్తాను లెండి" అంది తులసి.
    "అదేం?" అన్నాడు సీతాపతి.
    "మరేం లేదు. అక్కడికి వెళ్ళి నేర్చుకునేదీ ఏం లేదు. ఇంట్లో ప్రాక్టీసు చేసుకోవచ్చు."
    "అలా అశ్రద్ధ చెయ్యకు, తులసీ. వంట ఎలా జరుగుతున్నదన్నది ముఖ్యం కాదు. కాని నువ్వు పరీక్షలు తప్పావంటే ఇన్నాళ్ళ కష్టమూ వృథా అవుతుంది" అన్నాడు సీతాపతి.
    తులసి అన్నం వడ్డించింది.
    సీతాపతి మౌనంగా భోజనం చేస్తున్నాడు.
    తులసి, "ఏమండీ, ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటే, మీకు ఉద్యోగంలో ప్రొమోషన్ వచ్చే వీలుంటుందా?" అంది.
    "ఏమో? కాని అలా అనుకోవటం మాత్రం బావుంటుంది కదూ" అన్నాడు సీతాపతి నవ్వుతూ.
    "అనుకోవటమేమిటి, అదంత అందని పండా?" అంది తులసి.
    "తిను, తిను. ఊరికే ఆశలు పెంచుకోవటం మంచిది కాదు" అన్నాడు సీతాపతి.
    గాయపడీ, గాయాన్ని దాచుకుంటూ, "మరి కొంచెం అన్నం పెడతాను" అంది తులసి.
    "వద్దు, తులసీ, వద్దన్నానా..." అంటున్నా వినక అన్నం వడ్డించింది.

                         

                                                           7

    ఉగాది వచ్చింది. జయశీల తన పెళ్ళికి తులసీ, సీతాపతుల నిద్దర్నీ ఆహ్వానించింది. సీతాపతి రానన్నాడు. తులసికీ వెళ్ళాలని లేదు. ముఖ్యంగా తన మీద తనకు అనుమానం పెరుగుతూంది. ఎందుకో గాని తనలో అసూయ ఎక్కువవుతున్నది. ఎవరిమీదా ప్రత్యేకంగా కాదు మళ్ళీ-ప్రపంచంమీద, తన తోడి వాళ్ళమీద, తనకన్నా మంచిస్థితిలో ఉన్న ప్రతి మనిషి మీదా. అది మూర్ఖమే కావచ్చు. ఐనా తను దాన్ని ఆపలేకపోతూంది. పెళ్ళికి వెళ్ళితే తనకే తెలియకుండా తను మరేం నోరు జారుతుందోనని భయమేసింది. అందుకే "ఒంట్లో నలతగా ఉంది. జ్వరంకూడా వస్తున్నట్లుంది" అని తప్పించుకుంది. కాని 'వారం రోజుల తరవాత తను ఆఫీసు కెళ్ళినప్పుడు - తన ఖర్మకాలి - అదే నిజమయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS