కింద హల్లో ఎవరూ లేరు. పక్క వరండా లోంచి మాటలు వినిపిస్తున్నాయి. నించున్నదినించున్నట్టే ఉండిపోయింది.
'సుబ్బమ్మ చుట్టం వచ్చిందన్న మాట ....పాపం , మనం లేకుండా బలరాం ఎంత అవస్థ పడ్డాడో. చెప్పా పెట్టకుండా అలా దిగబడిందేమిటి?'
"పూర్ బలరాం!' కొంచెం చిన్నపిల్ల కంఠం లాగా ఉంది.
మాటలతో పాటే గలగలనవ్వింది . "ఇది రావడం అంటే పీడకలగా ! బాధపడి పోతున్నాడు' అంది.
'నిజం అంతే కదే. సాఫీగా సాగిపోతున్న జీవితానికిదో బెడద వచ్చి పడింది కదా!.... పోనీలే త్వరలోనే వదుల్చుకుంటా నన్నాడుగా.
'రత్తి నడిగి చూశావా ఎలా ఉందొ!'
"ఎలా అడుగుతానే -- అమ్మాయి గారొచ్చారు-- ఎవరూ స్టేషను కెనా వెళ్లలేదని అయ్య కోపం చేసుకున్నారంటుంటేనూ- చూస్తాంగా. తినపోతూ రుచులేందుకు?'
"అలాంటి అత్త పెంచితే ఎలా ఉంటుందో ఊహించకలవే అమ్మా.... పాతకాలపు పతివ్రతలాగా....'
కోపంతో ఒణికి పోయింది మెట్ల ముందు నిలబడి పోయిన లలిత . విన్నది చాలు నే ఉన్నానని తెలియక యింకా ఏం మాట్లాడు కుంటారో ...నే ఉన్నట్టు గుర్తించేలా చేస్తే నయం ...అంటూ ముందుకి వేసింది పాదం.
అదే క్షణం లో 'హాల్లో రండి" అంటూ హాలు అటు వైపున్న ఓ తలుపు తెరిచి బలరామ శాస్త్రి హాల్లోకి ప్రవేశించాడు. ఆ సందడికి వరండాలోంచి ఇద్దరు లోపలికి వచ్చారు-- అక్కడ ఒకళ్ళ నొకళ్ళు చూస్తూ నిలబడ్డ లలితనీ, బలరాం నీ చూసిన 'ఎవరు బలరాం!' అంటూ పలకరించింది పెద్దావిడ.
'రా అత్తయ్యా, లలిత . మన లాయరు గారు రాశారే ఆ అమ్మాయి . సుబ్బమ్మ గారి మేనకోడలు . ఈవిడ నాకు మేనత్త వరస -- వాళ్ళ అమ్మాయి సరళ. మీ పట్నం లోనే కాలేజీ లో చదివింది!' వేళాకోళం గా అన్నాడు బలరాం.
"వెల్ కం, వెల్ కం' అంటూ చేయి జాచి మందుకి వచ్చింది సరళ.
లలిత మటుకు అలాగే నిలబడి పోయింది.
'రండి టిఫిన్ ముగిస్తే నాకింకా పనులున్నాయి. అందర్నీ పరిచయం చేయడం అవుతుంది కదా అని ఒకసారే తిందాం అన్నాను' అంటూ డైనింగ్ రూము కేసి దారి తీశాడు బలరాం....
'ఎప్పుడూ లేంది ఇదేమిటి? బలరాం కి ఆకలేయడం వింతగా లేదు అమ్మా? ' కిలకిల నవ్వుతూ బలరాం ని తోసుకుంటూ టేబిలు ముందు కుర్చీలో చతికిల పడింది సరళ.
మూగబోయినట్టు బొమ్మలాగా నడిచి వెళ్లి కూర్చుంది లలిత.
ఇద్దరి వైపూ ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి కూర్చున్నాడు బలరాం.
వంటావిడ తో అన్ని తెమ్మంటూ చెప్పడానికి లోపలికి వెళ్ళింది సరస్వతమ్మ.
ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది. ఎంతో ఉత్సాహం తలెత్తి ఇలా అయిన్దేమిటి? అనుకుని గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది లలిత.
వంట ఇంటిలోంచి తిరిగి వచ్చి లలిత పక్కన ఖాళీ ఉన్న కుర్చీలో కూర్చున్నారావిడ.
'అయితే నువ్వన్నమాట సుబ్బమ్మ మేనకోడలివి.... నే నూహించినట్టే ఉన్నావు పాపం. సగం పిచ్చీ సగం మూర్ఖం , ఎలా పెంచిందో నిన్ను!' అంటూ విషాదంగా నిట్టూర్చింది.
లలిత ఏం మాట్లాడుతుంది! తలెత్తి వోసారి అందరి ముఖాలూ చూసింది. బలరామశాస్త్రి చాలా కుతూహలంగా తనకేసి చూస్తున్నాడు.
'గట్టిదానివే తిన్నగా రాగలిగావు! ఎక్కడి దాకానూ చదివిందన్నావు బలరాం?' కిలకిల నవ్వేసింది సరళ.
వంటావిడ అందరి ప్లేట్లలోనూ వడ్డిస్తూ ముఖం చిటచిట లాడించుకుంటూ ఈ మాటలు వింటుంది.
"నాకేం పెట్టకండి. కాఫీ చాలు' అంది లలిత. అందరూ వినేలా మాట్లాడాలంటేనే దడగా ఉంది.
'ఇలా అయితే ఎలాగమ్మా? ఈరోజు నీకు కొత్త గానీ' అంటూ వాక్యం పూర్తీ చేయకుండానే వడ్డించి వెళ్ళిందావిడ.
'తినమ్మా, దూర ప్రయాణం కూడా చేసి అలసి వచ్చావు!' అన్నాడు బలరాం.
"హు! ఆమ్మాట! నేనేం చిన్న పిల్లనా!' అనుకుంది లలిత.
"నా కిప్పటికీ అర్ధం కావడం లేదు. లక్ష్మీవారం నాడు వస్తానన్నదీ రోజేలా రాగలిగావని!' అన్నారు సరస్వతమ్మ గారు.
"లాయరు గారి గుమస్తా పొరపాటు రాసి ఉంటాడని నా ఊహ."
"పోనీలే జాగ్రత్తగా వచ్చి చేరావు. అంతే కావలసింది. అమ్మాయి, అయితే నీకెన్ని ఏళ్ళు ఉంటాయి?' కుతూహలంగా అడిగింది. 'వచ్చే ,మే మాసానికి ఇరవై నిండిపోతాయి.
"పాపం బలరాం కి ఏం శాకు తినిపించావు! ఎలా వచ్చిందో అర్ధం కాదు గాని మా అందరి బుర్రల్లోకి ఒకే ఊహ వచ్చింది; నీకు పది పదమూడేళ్ళు ఉంటాయని' గట్టిగా నవ్వింది సరళ, ' ఏ స్కూల్లోనో ఉండి ఉంటావని ఊహించుకున్నాను నేను.'
'అలా అయితే అక్కడే ఉండి ఉందును కదా?'
సరళ కి జూన్ లో పుట్టిన రోజు వస్తుంది -- ఇద్దరూ సరదాగా పార్టీ చేసుకోవచ్చు ఈ ఏడు? ఏం సరళా?' అంది కూతురి ముఖంలోకి వాడిగా చూస్తూ.
సరస్వతమ్మ గారి ఆదరణంతా పైపైదే అని గ్రహించడాని కెంతో పట్టలేదు లలితకి. ప్రయాణం గురించి అత్తయ్య విషాదకరమైన మరణం గురించి..ఎన్నెన్నో ప్రశ్నలు వేసి చూసింది.
4
హాలులోకి వస్తూ వారి మాటలు వినకపోయినా తనకెంత ఇక్కడ ఉండడం యిష్టం లేదో సరస్వతమ్మ కి అంతగానూ అయిష్టంగానే ఉందని గ్రహించే ఉండును లలిత.
బలరామశాస్త్రి ఒక్క మాటలో కూడా కలుగచేసికోలేదు. సరికదా కుతుహలం కూడా కనపర్చడం లేదు. ఎలాగో కాఫీ ముగించి లేచి నిలబడ్డాడు.
'నాకు కొంచెం పనుంది మళ్ళీ సాయింత్రం దాకా రాను. ప్లీజ్, ఇది మీ ఇల్లే అనుకుని స్వేచ్చగా ఉండడండి.' అని లలితకి చెప్పి- తన గదిలోకి వెళ్ళబోయాడు. లలిత ఆత్రంగా 'బలరామ శాస్త్రి గారూ' అంటూ పిల్చింది. ఆ పిలుపుకి అటు బలరామ శాస్త్రి అదిరిపడి నిలిచాడు. అటు సరళా గబగబ నవ్వేసింది.
సిగ్గుతో ముఖం కందగడ్డలాగా అయింది లలితకి.
"ఏమిటి లలితగారూ?' అన్నాడు అతి వినయంగా.
'నా పుస్తకాల పెట్టెలు, అవీ వస్తాయి . వాటిని స్టేషను నుంచి తెచ్చుకోవాలని.' నసిగింది.
'నేనా సంగతి చూస్తాను. మరేం ఫరవాలేదు. అంతేనా?'
"అంతేనండి.' అంది తేలికగా.
'నువ్వేం పని మీద వేడుతున్నావో నాకు తెలుసులే బలరాం. నీ ప్రియంబాంధవి దగ్గరకేగా.' కొంటెగా అడిగింది సరళ.
'అవును సరళా ఏం? వెళ్ళకూడదా?'
"నీదంతా మరీ విచిత్రం, ఇంతమంది కుర్రాళ్ళం ఉంటె ఆ ముసలావిడ చుట్టూ తిరుగుతావు.'
'నాకావిడ ఎంత ఇష్టమో తెలుసుగా? పది నిముషాలు నీలాంటి దానితో గడిపితే- ఏం మాట్లాడ్డానికుండదు. అదే డెబ్బయి ఏళ్ళు వచ్చిన అవ్వగారు హాయిగా కబుర్లు చెప్తారు. తెలుసా?' నవ్వుతూ లలిత కేసి తిరిగాడు.
'చూడండి , మనం ఈ ఇంట్లో మసలక తప్పదు. అలాంటప్పుడు అందరి లాగా మీరు నన్ను బలరాం అని పిలవాలి. సరేనా? మీ కంటే పెద్దవాడ్నే కనుక లలితా అని పిలుస్తాను.' అని సమాధానం వినకుండానే తన గదిలోకి గబగబ వెళ్ళిపోయాడు బలరాం. ఆ క్షణం లో లలిత మనస్సు అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడికి రాకుండానే ఉండిపోతే ఏం జరిగేది? ఆక్కడ ఎలాగో గడిచిపోయేది కదా?...తిరిగి మోహన్ తారస పడేవాడేమో . నిజంగా ఇలా జరుగుతుందని తెలిస్తే మోహన్ ని పెళ్ళాడేసి ఉండొచ్చు కదా? నిజంగా సంరక్షకుడైతే ఈయన ఆ పెళ్ళికి ఒప్పుకుని ఉంటాడో లేదో?...ఇప్పుడీ సరస్వతమ్మ నాకో పెళ్ళి కొడుకుని చూసి వదుల్చు కుంటుంది కాబోలు....
'అలసిపొయావు కాబోలు రెస్టు తీసుకుంటావా? లేకుంటే అలా తోటలో తిరిగి వద్దామా?' సరళ అడిగింది --
'నాకు ఆలోచించు కోవలసిన పనుంది. ఏమీ అనుకోకు' అంటూ మేడమెట్లు వైపు దారి తీసింది లలిత.
గదిలో ఓ మూలగా కూర్చుని తమల పాకులు వేసుకుంటున్న రత్తి అలికిడి విని బొడ్డు సంచిలో తమల పాకులు దాచేసి కూర్చుంది. లలితని చూస్తూనే, 'రండి అమ్మాయి గారూ ఆళ్ళని చూశారా?' అంది కుతూహలం అణచుకోలేక . వస్తూనే మంచం మీద వాలిపోయింది లలిత. మనస్సు చాలా బాధగా ఉంది. ఎందుకొచ్చినిక్కడికి అని పదే పదే అనిపిస్తుంది. దానికేదైనా ఉపాయం చూడాలని ఆలోచనలు చేస్తుంది.
"ఆళ్ళు ఎప్పుడూ అంతేనమ్మా. బాబుగారికి తెలిసినవాళ్ళు వస్తే చాలు ఊ ఇదై పోతారు.
"ఆవిడ నిజంగా మేనత్తే నా ఆయనకి?' సద్దుకు పడుకుంటూ అడిగింది లలిత లేచివచ్చి మంచం దగ్గర కూర్చుంది రత్తి.
'కదమ్మాయి గారూ, దూరపు చుట్టం. మొగుడు పోయాడట. ఎవరూ లేరు -- ఈ పిల్లది తప్పించి, ఇక్కడ చేరింది. ఎలాగేనా బాబుగారికా పిల్లని కట్టి పెట్టాలని.... ఆ పిల్లది గడుగ్గాయి అమ్మాయి గారూ, ఏంటా వేషాలని , షోకులనీ, ఏం పోకళ్ళు పోతాదనీ....ఈ చుట్టూ పక్కల గొప్పింటి పిల్లకాయిలంతా స్నేహం. ఎక్కడో అక్కడికి కారేసుకు పోతుంటుంది. ఒక్కోరోజైతే అంతా ఇంట్లో జేరి అదరకొడతారానుకో-- బాబు పట్టించుకోడు........"
"నేనలా సరదాగా ఉండలేనని వాళ్ళ ఉద్దేశ్యం . పోనీలే రత్తి మీ బాబుగారేక్కడికెనా వెడితే చీకటి పడేదాకా రారా?'
"వస్తారమ్మా. అయ్యగారి కావలసినావిడోకటతె ఉందీ చుట్టూ పక్కలే-- అక్కడికే వెడతారు. రోజూ -- అయిదయ్యేసరికి తోటలో వుంటారు-- గులాబులు ప్రత్యేకంగా పెంచుతారాయన. ఓ మూలగా చిన్న తోట వేశారు. అక్కడే ఉంటారు. సాయంత్రం ఏం?" అడిగింది రత్తి.

"ఏం లేదు. కొంచెం మాట్లాడాలి అందుకనీ.'
"సాయంత్రం నేనుండి తోట చూపిస్తానుగా , నేకిందకి పోనా యిక్కడే ఉండనా?"
"పో నాకేం పని లేదిప్పుడు ఏదేనా పుస్తకం తీసి చూసుకుంటాను.' అంది లలిత.
రత్తి లేచి కిందికి వెళ్ళిపోయింది.
అర్ధం లేని అర్ధం కాని ఊహలతో సతమవుతూ పడుకుంది లలిత సాయంత్రం బలరామ శాస్త్రి ని కలుసుకుని.... తనే మనుకుంటున్నది చెప్పాలి అనుకుంది...బలరాం....రూపానికి తగ్గ పేరే. మంకుతనం కూడా బాగా ఉన్నట్టే ఉంది-- అనుకుంది.
భోజనాల సమయంలో బలరాం లేడు ఎవరికి వారే తినడం కానిచ్చారు. సాయంత్రం దాకా తన గది వదిలి బయటికి రాలేదు లలిత నీరెండ నీడలు వాలుగా గదిలో పడుతున్నాయి. లేచి ముఖం కడిగి తల దువ్వుకుంది. చీర సరి చేసుకుంది. కిందికి దిగగానే , కాఫీతో వంటావిడ ఎదురైంది-- "నీకే తెస్తున్నానమ్మాయి, ఇంద' అంటూ అందించింది. అటూ ఇటూ తిరుగుతూ కాఫీ ముగించి కాఫీ కప్పు బల్ల మీద పెట్టి తోటలోకి దిగాలని వరండా వెనక వైపుకి నడిచింది. తీరా చూస్తె అటు మెట్లు లేవు. వరండా పిట్టగోడ ఎత్తూ లేదు.... అటు ఇటు చూసింది లలిత. ఎవరూ చుట్టుపక్కల లేరు. నిశ్చింతగా గోడ మీద కాలు వేసి నెమ్మదిగా అటు వైపుకి దూకింది. అప్పుడే అటు తిరగబోతున్న బలరాం తలెత్తి చూశాడు. తను చేసిన పనికి సిగ్గుపడింది లలిత 'అయితే మిమ్మల్ని ఓ కంట జాగ్రత్తగా కనిపెట్టాలన్నమాట.' అన్నాడు నవ్వుతూ.
