Previous Page Next Page 
నన్ను నన్నుగా ప్రేమించు పేజి 8


    కాని....కాని....ఆమెని మునపట్లా చేరదియ్యా లని, తనలో ఇముడ్చుకోవాలని తన కెందుకో అనిపించడం లేదు.
    "చెప్పండి, నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? నాకు పిల్లలు పుట్టకపోవడం నా శరీరంలో లోటే కావచ్చు గాని, అది కేవలం నా తప్పంటారా?" ఎంతో ఆవేశంతో అడుగుతూంది లీల. అడగడమేమిటి గుంజుతూంది సమాధానం కోసం.
    దానికి కారణాలు ఉన్నాయి. కాని చెప్పడం అమానుష మేమో అనిపిస్తూంది.
    "నీకు పిల్లలు పుట్టరు. పైగా ఎబార్షన్లవుతున్నాయి. ప్రతి ఎబార్షన్'లోనూ నీకు బోలెడంత రక్తం పోతూంది. నీరసం వచ్చేస్తూంది. ఆమాత్రం దానికి కేవలం సంసార సుఖం కోసం నిన్ను బాధపెట్టడం నా వల్ల కాదు. ఇద్దరికీ అవసరమే అయినా, ఇద్దరికీ కొంత కులాసా ఉన్నా, తరవాత వచ్చే దుష్ఫలితాల దృష్ట్యా అది నాకు నిషిద్ధమైపోయింది.
    "ప్రపంచంలో రోజూ ఇన్ని కోట్ల మంది భార్యా భర్తలు ప్రతి రోజూ ఏకశయ్యాగతులు అవుతున్నారంటే, కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకపోయినాకూడా దానికి సిద్ధమౌతున్నారంటే, కొంతమంది అందులో సుఖం ఉన్నదన్న విషయం కూడా తెలియక సిద్ధమౌతూ అంగీకరిస్తున్నారంటే అందులో డ్యూటీ (ధర్మం) కాక మరేదో ఉన్నట్లేకదా?
    "కోరిక తీర్చుకొందుకు భార్యాభర్తలే ఎందుకు ఏకం కావాలి? అందులో ఒక అనిర్వచనీయమైన మరో కోరిక ఇమిడి ఉంది. అదే సంతానం. ఈమె నా భార్య. ఈమే, నేనూ సంసారం చెయ్యడంవల్ల, మా ప్రేమను పంచుకొని పుట్టినవాళ్ళు వీళ్ళు-మా పిల్లలు. మమ్మల్ని మేం అనంతకాలం ప్రేమించుకోలేకపోవచ్చు. మా ప్రేమలో మేం అలిసిపోతే మమ్మల్నిద్దర్నీ ప్రేమించడానికి వీళ్ళున్నారు అని చెప్పుకోవడానికి- ఇద్దరూ పరస్పరమేకాక ఇద్దరూ కలిసి ప్రేమించడానికి ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెటేవాళ్ళు వస్తారు కనక, భార్యా భర్తల సంయోగం. అది లేనినాడు ఎవరు ఎవరితో కలిసినా ఒకటే. సంతానం అనే బహుమానం లేనప్పుడు, కామం అనే బలమైన భావంకూడా కేవలం నిర్వీర్యం అయిపోతుంది. దానికి ప్రయోజనం లేదు.
    "అలాంటి అప్రయోజకరమైన భావం నీ మీద నేనెల్ల ప్రసరించేది? నువ్వు నా భార్యవి. నేను ఏరి కోరి తెచ్చుకున్న అర్ధాంగివి. ప్రపంచంలో నాకు అతి దగ్గర అయిన ఒకే ఒక్క వ్యక్తిని చెప్పమంటే నువ్వేనని చెప్పాలి. ఇంత ఉత్కృష్టమయిన లక్షణాలు గలవీ పైవి అంత నిష్ప్రయోజకమైన భావాన్ని ఎలా ప్రసరింప జేయమంటావు? అది నీకు అవమానమని, హానికరమని నా నమ్మకం.
    "అందుకని నీతో ఏకశయ్యాగతున్ని కాలేక పోతున్నాను" అని చెప్పాలని ఉంది ప్రభాకరానికి.
    చెప్పడం కష్టం. చెబితే అర్ధం చేసుకోవడం ఇంకా కష్టం. స్థూలంగా అనేక బాంధవ్యాల వంటిదే భార్యా భర్తల బాంధవ్యంకూడాను. కొన్ని సెంటిమెంట్స్ ఇక్కడా అడ్డొస్తాయి. తర్కం, వాదం పనికిరాకుండా ఉన్నదున్నట్లు తీసుకోవలసిన భావాలు కొన్ని భార్యా భర్తల మధ్య కూడా వస్తాయి. మరి అప్పుడు ఇవన్నీ ఏ భర్త ఏ భార్యకు చెప్పగలడు? చెప్పిననాడు ఏ భార్య వీటిని ధైర్యంగా స్వీకరించి ఇందులో తర్కానికి ఆనందించగలదు?
    అంతా మృగతృష్ణ...
    
                                   8

    దక్షిణపు పొలంలో కలుపుతీత అయింది. మధ్యాహ్నం మూడింటికే పని పూర్తయింది. కాని పొలం వాసన అంటే ప్రభాకరానికి ఎంతో ఇష్టం. ఆ గట్టూ ఆ గట్టూ తిరిగి, సర్కారు వాళ్ళు వేసిన డాళ్ళు కొన్ని మట్టితో కప్పుపడిపోతే తీయించుకుంటూ, పాలేరుతో అయిదు గంటలదాకా అలా నడుస్తూనే ఉన్నాడు.
    బస్సు దిగి రోడ్డుమీద నిలబడ్డాడు. ఊళ్ళో దిగక ఇక్కడ దిగేరేమి " అని ఆలోచిస్తూ వాళ్ళని పరిశీలనగా గమనించేసరికి చిన్నక్కా, బావగారూ అని తెలిసింది. పిల్లలూ సామాన్లూ లేకుండా దిగారా, లేక పిల్లల్నీ సామాన్నీ బస్సులో ఊరి దగ్గర దిగమని వీళ్ళిక్కడ తనని చూసి దిగారా అని ఆలోచిస్తూ ప్రభాకరం రోడ్డువరకూ తొందరగా అడుగు వేసుకొంటూ వచ్చాడు.
    "ఇదేమిటీ.... ఒక్క ఉత్తరం ముక్కయినా పడేయకుండా ఇలా వస్తున్నారు? పిల్లల్ని తీసుకు రాకుండా?" అంటూ చాలా చాలా ఆశ్చర్యపోయాడు.
    "సరి! ఉత్తరం రాయడానికి మీ బావకి తీరికేది? అది సరే. అంత కులాసాగా ఉన్నారా. అక్కల్ని మరిచి పోయావు."    
    "అదేం కాదక్కా. ఎప్పటికప్పుడు రావాలనుకోవడం...ఏవో పనులు..." నవ్వాడు ప్రభాకరం.
    కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చారు.
    "పిల్లల్ని తీసుకు రాకుండా వచ్చేరేం, బావగారూ? ఛార్జీ లయిపోతాయనా?" అని వేళాకోళం చేశాడు ప్రభాకరం.
     సుందరంగారు రుక్మిణమ్మ కేసి తిరిగి నవ్వేశాడు.
    "వాళ్ళంతా వస్తే మళ్ళీ బట్టలూ అవీ పెడతానంటావు, నాకే దండుగ కదా అని వదిలేశాను. థాంక్ చేయక వేళాకోళం చేస్తావేమిటోయ్!" అన్నాడు.
    "లీల ఏమిటి? మనిషి మరీ అలా తోటకూరకాడలా తయారయింది? ఏమన్నా అనారోగ్యమా?" అంటూ పక్కకి పిలిచి అడుగుతున్న సంభాషణ వింతగా తోచింది ప్రభాకరానికి.
    "అదేం లేదే. మామూలు అనారోగ్యమే కానీ, పెద్ద చెప్పుకోవలసిందేమీ లేదు. పైగా ఈమధ్యే పరీక్షకూడా చేసింది డాక్టరు."
    "అనారోగ్యం లేదంటూనే పరీక్ష లెందుకు?"
    "అసలు మనిషే మంత ఆరోగ్యమైంది కాదుగా!"
    "ఏమన్నారేం?"
    "ఆరోగ్యంబాగానే ఉందిట కానీ....అది సరిలే కానీ కబుర్లు చెప్పు. పిల్లలెలా చదువుతున్నారు?"
    "చెప్పడానికి ఏమున్నాయి? ఉంటే మీలా దాచుకోంలే!"
    "అవున్రా.... నువ్వు రాయకపోయినంత మాత్రాన్న మీ విషయాలు తెలియకపోతాయనుకున్నావా?"
    ప్రభాకరం నవ్వాడు. "ఏదో తిడదామని వచ్చావు. అనాలనుకొన్న దేదో సూటిగా అనరాదూ?"
    "ఎవర్నో పెంచుకోవాలనుకుంటున్నారటగా?"
    "ఎవర్ని?"
    "ఏమో-ఎవర్నో మా కేం తెలుసు? ఏం, ఆ మాత్రం ముక్క మా చెవిని వేయడానికి మేం తగమా? నువ్వెలా అనుకున్నా చెప్పవలసిన బాధ్యత ఉంది కనక అలా వదులుకోలేక వచ్చాం."
    "లేదే, బాబూ. అడ్డమైనవాళ్ళూ వచ్చి మా కుర్రాణ్ణి పెంచుకోండంటే, మా పిల్లని పెంచుకోమని ప్రాణాలు తీస్తున్నారు. పెద్ధనాన్నగారి రామం వచ్చా డీ మధ్య. ఏదో మామూలుగా డబ్బు కావాలని అడగటానికి వచ్చేడనుకున్నాను. కాదుట. వాళ్ళబ్బాయిని దత్తు తీసుకోమనడానికి వచ్చాడు. అర్ధంలేదు వాడి మాటలకి- నా కోరికా తీరుతుందిట, తన బాధా వదులుతుందిట. ఇంచుమించు కాస్త చుట్టరికమున్న ప్రతివాడూ వాలుతున్నాడు పిల్లల్ని పంచడానికి!"
    "తెచ్చుకోక తెచ్చుకోకవాడి కొడుకునే తెచ్చుకోవాలీ? వాడితో పడుతున్న బాధలు చాలు. పైగా ఏదో సామెత చెప్పినట్టు.....పెంచుకున్నది బిడ్డ అవుతుందా?  ఉంచుకొన్నది పెళ్ళాం అవుతుందా? నాతో చెప్పకుండా అలాంటి పని మాత్రం ఎప్పుడూ చేయకు."
    "ఇంకా ఏం నిర్ణయించుకోలేదు."
    "బాగానే ఉంది. ఇంతమందిమి మేం ఉండగా ఎవరి పిల్లనో తెచ్చుకు పెంచుకుంటావా? కావాలంటే నువ్వు అడగకపోయినా, మన కుటుంబ శ్రేయస్సు కోరినదాన్ని కాబట్టే, నీ కన్నా పెద్దదాన్ని కాబట్టే నాకు తోచిన సలహా ఇస్తున్నాను."    
    "అయ్యో! దానికేముంది-చెప్పు. వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు."
    "ఎవరో చెప్పడమేమిటి? నీ బాగోగులు కోరేదాన్ని కనక నువ్వు వాళ్ళ మాటలూ వీళ్ళ మాటలూ విని గోతులు దిగకుండాను..."
    "మా పరిస్థితి అలాగే ఉందిలే. భగవంతుడు చేసినదానికి మనస్సులు విరిగి మేం ఎవరేది చెపితే అదే మా మంచనుకొని గోతిలో పడేటట్టే ఉన్నాం."
    "ఎందుకురా అలా మనసు పాడు చేసుకుందువు? కష్టమొచ్చినప్పుడే దైర్యంగా ఉండాలి. అలా వైరాగ్యం మాటలు మాటాడటానికి నీ కే మంత వయసు మీరి పోయిందని?"
    "వయసు మీరిపోలేదు కాబట్టే, ఢక్కా మొక్కీలు తినలేదు కాబట్టే కాలికి రాయి తగిలినప్పుడూ, మనస్సుకి గాయం అయినప్పుడూ దుఃఖపడుతూ కూర్చోవడం."
    "ఛా...అదేమిటి, తమ్ముడూ నీ కేం ఖర్మ - దుఃఖపడుతూ కూచోడానికి! హాయిగా కాలుమీద కాలేసుకు కూర్చుంటే నీ మనసులో ఉన్న కోరిక మర్నాటి సాయంత్రానికి తీరుతుంది."
    "నా కోరిక తీరేది కాదక్కా..."
    "ఎందుకు తీరదు? నే చెప్పినట్టు చెయ్యి."
    "ఎందుకక్కా నన్ను బాధ పెడతావు?"
    "నేను నిన్నేం బాధ పెడుతున్నాన్రా? అసలు బాధపడ్డానికి నీ కేం ఖర్మ! అన్నీ ఉండికూడా ఇంట్లో పిల్లల్లేరని బాధ నీకు పట్టుకుంది. నే చెప్పినట్టు చెయ్యి-ఏడాది తిరిగేలోగా మీ ఇంట్లో పాప కేర్ కేర్ మనకపోతే నన్నడుగు."
    "లాభం లేదక్కా. అన్ని రకాల డాక్టర్లూ లీలని చూసి పెదవి విరిచారు. స్పెషలిస్టుకి చూపించాలని ఉంది. కానీ చెయ్యి చూపించుకోవడం, జెష్ఠ అనిపించుకోవడం ఎందుకని నేనే ఆ ఆశ వదులుకున్నాను."
    రుక్మిణి నవ్వింది. "నువ్వింత అమాయకుడివి అనుకోలేదురా." ప్రభాకరం ఖాళీగా చూశాడు.
    "ఎండిపోయిన చెట్టుని పట్టుకొని పువ్వు పుయ్యమంటే ఏం లాభంరా...నే చెప్పే దది కాదు....ఇంకా నయం నాతో అన్నావు. ఎవరితో నన్నా అంటే నవ్వుతారు కూడాను. పరువు పోతుంది."
    ఎండిపోయినచెట్టు అన్నమాట విన్నాక ప్రభాకరానికి నోటివెంట మాట రాలేదు.
    "అందుకే సంధ్యని నీ కిస్తే బాగుంటుందని నేను అనుకొంటున్నాను. చిన్నప్పటినుంచీ అది-పిచ్చిపిల్ల-ఎప్పుడూ మామయ్యా, మామయ్యా అంటూ నీ కోసమే ఇదయ్యేది. మొదట్లో మీ బావ ఏమంటారో అనుకొన్నాను. కానీ మన కుటుంబమంటే నిజంగా ఆపేక్ష ఉండబట్టే మీ బావ నే చెప్పిన వెంటనే ఒప్పుకొన్నారు. అదేం నువ్వెరగని పిల్లకాదు. కావలిసిన వాడివనీ, తమ్ముడివనీ పిల్ల నివ్వాలనుకుంటున్నాననే కానీ మరేమీ కాదు."
    నోటినుంచి మాటరాక నిలబడి పోయాడు ప్రభాకరం. సంధ్య అక్కకూతురు! తనకి మాత్రం కూతురుతో సమానం కాదా? సంధ్య మూడేళ్ళ పాప అయి ఉన్నప్పుడు అక్క బాబుని కడుపుతో ఉండి పుట్టింటి కొచ్చింది. తను జోకొట్టందే నిద్రపోయేది కాదు సంద్య. దానికి లాల పోసినా, జోల పాడినా, పాలు పట్టినా తన ద్వారా జరగవలసిందే. మరీ అక్క పురిటి రోజుల్లో అయితే తన చేరిక మరింత అలవాటయిపోయింది. చివరికి బావగారు బాబుకి బారసాల చేసి అక్కని తీసుకెళ్ళిననాడు "నేను మామయ్య దగ్గరే ఉండిపోతా" నని మారాం చేసింది.
    ఆ నాటినుంచీ అక్క పిల్లలతో ఇక్కడి కెన్ని సార్లొచ్చినా మామయ్య దగ్గర ఉండిపోతానని మారాం చెయ్యకుండా సంధ్య ఎప్పుడూ ఇంటికి వెళ్ళలేదు. "మామయ్యా, ఫ్రాక్ తొడగనా? మామయ్యా, నన్నూ లైబ్రరీకి తీసుకెళ్ళవా? మామయ్యా, కాలవగట్టుకి వెళదాం, రావా? మామయ్యా, నా కీ ఓణీ బాగుంటుందా" అని రకరకాలుగా సంధ్య తనని ఒక ఆత్మీయుడుగా, స్నేహితుడుగా, తండ్రి తరవాత తండ్రంతటివాడుగా చూసుకుంటూనే వస్తూంది. దానికి ఇంత విపరీతార్ధం రాగలదని, మామయ్య దగ్గరే ఉండిపోతానని సంధ్య చేస్తూ వచ్చిన మారాంకీ వాళ్ళ పెద్దలు ఇలాంటి వ్యాఖ్యానం చెయ్యగలరని ప్రభాకరం ఎన్నడూ అనుకోలేదు. అతను షాక్ అయ్యాడు. తను సంధ్యని రెండో పెళ్ళి చేసుకోవడంతప్ప ఆమెకి ఇంకో ఉపకారం చేయకూడదా? ఛీ..స్వార్ధానికి ఇంత మంచీ చెడూ తెలియవా? అయినా....అక్క అసలీ మాటను ఎలా అనగలిగింది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS