7
పగలూ, రాత్రీ భేదం లేకుండా గడిచిపోతున్నాయి. ప్రభాకరం ఏం చేస్తున్నాడో లీలకు అర్ధం కావడం లేదు. కనపడ్డమే అబ్బురమై పోయింది. ఎప్పుడు స్నానం చేస్తున్నాడో, ఎప్పుడు భోజనం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. తనకి ఈ నీరసంవల్ల మధ్యాహ్నం నిద్ర తప్పనిసరి అయింది. విశాలమ్మగారు తనను భోజనం అయీ అనకుండానే జోకొట్టేసి నంత పని చేస్తూంది.
ఆ తరవాత ఎప్పుడో వస్తాడు కాబో లతను. నీ మూడింటికో, నాలుగింటికో తను లేస్తుంది. ఆయన వివరం తను అడిగినట్టు విశాలమ్మగారు "ఇప్పుడే వెళ్ళాడమ్మా" అని కాఫీ ఇస్తూ చెపుతుంది. ఎప్పుడడిగినా, ఎప్పుడూ అడక్కపోయినా "పొలం పని" తప్పనిసరి సమాధానంగా వస్తూంది.
రాత్రి ఆలస్యంగా రావడానికి మాత్రం కారణం అర్ధం కావడం లేదు. ఎంత కాసుకొందామన్నా నిద్ర పదిన్నర దాటేక ఆగడం లేదు. విశాలమ్మగారు కూడా కుట్రలో కలిసినట్లు "పడుకో తల్లీ. అంతలా నిద్ర ఆపుకోవడం మంచిది కాదు" అంటూంది.
"పెద్దవయసువారు మీరు రోజూ ఇంత రాత్రి వరకూ మేలుకొని ఆయన కన్నీ చూస్తున్నారు. మిమ్మల్ని శ్రమ పెట్టడం నాకు కష్టంగానే ఉంది. ఈ వేళకి మీరు నిద్రపోండి. నేను కూర్చుంటాను" అని ఓ రోజు తను అన్నది.
కాని నిద్ర కాయలేకపోయింది. ప్రభాకరం వచ్చి తలుపు కొట్టేవేళకి ఆవిడే తలుపు తీసింది. అన్నం తిని వచ్చి ప్రభాకరం తనని హాలులో ఈజీ చైర్లోంచి లేఫై గదిలో మంచంమీదికి చెయ్యి పట్టి తీసుకు వెళ్ళాడు.
"లీల నిద్ర పోయిందా?" అని అడగడం ఒకటి రెండు రాత్రులు తనకి వినబడింది. తలుపు చప్పుడు వల్ల అయిన ధ్వనికి నిద్ర కొంత తేలి కొంత తూలిన స్థితి అది. ఆ ప్రశ్నకి "లీల సుఖంగా నిద్ర పోతోందా? లేక పాపం, కళ్ళలో వత్తులు పెట్టుకొని మేలుకొని నా కోసం ఎదురుచూస్తూ కూచుందా?" అని సహజ మైన అర్ధం తీసుకొని అతని అభిమాన ఝరిలో తేలిపోయింది.
రోజులు గడిచినకొద్దీ "లీల నిద్ర పోయిందా" అన్న ప్రశ్నకి "లీల నన్ను పలకరించి ఇప్పుడు హింస పెట్టదు కదా" అన్న అర్ధం రావలసినంత అలవాటైంది, ఆయన ఆలస్యానికి ఆ అర్ధం వచ్చి ఒకనాటి రాత్రి లీలకి అతను భోజనం చేస్తున్నప్పుడు దుఃఖం ముంచుకొచ్చింది. మరి నిద్ర రాలేదు. మగత ఎగిరిపోయింది. ఆయన వచ్చి ఏం చేస్తారో చూడాలి అనిపించింది.
ఆ గదిలోనే రెండు మంచాలు. రెండూ ఒకదాని పక్కనే మరోటి ఉండేవి. లేడీ డాక్టర్ సుభద్రమ్మగారు ఆ మధ్య తనకి ఒంట్లో బాగా లేనప్పుడు ఈ మంచాలు విడదీసింది. "నాలుగో నెలలో పోయినా, చాలా సుస్తీ చేసింది. జాగ్రత్తగా ఉండడం మరిచిపోకండి" అంటూ ఆంక్ష పెట్టింది. అప్పటినుంచి ఈ మంచాలు దగ్గర. ఎంత కాలం జాగ్రత్తగా ఉండాలో చెప్పలేదు. నేటికి రెండు నెలలు కావస్తూంది.
ప్రభాకరం నిశ్శబ్దంగా వచ్చి తన మంచంమీద వాలిపోయాడు. సన్నని వెలుతుర్లో అతన్ని గమనించింది లీల. అతను తను నిద్రపోతూందో లేదోనని ఒకసారి పరిశీలించి చూసి మళ్ళీ అటు తిరిగి పోయాడు. పది నిమిషాలు అలా చూస్తూ గడిపింది లీల. అతను నిద్ర పోవడం లేదని ఏవో కదలికల వల్ల తెలుస్తూంది.
లీలకి చాలా ఆగ్రహం వచ్చింది. తనని అతను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఉక్రోషం కలిగింది. అలా తన ఉనికిని మరిచి నిద్ర తెచ్చుకోగలవాడేనా? తన శరీరంలో కీలుకీలుకీ, మడతమడతకీ భాష్యం చెప్పే ప్రభాకరం ఇన్నాళ్ళు తన అవయవాన్ని స్ప్రుశించకుండా ఎలా ఉండగలుగుతున్నాడు?
లీల లేచింది. సన్నని వెలుతుర్లో మసగ్గా పడిన నీడ ద్వారా ఆమె లేచినదన్న సంగతి గుర్తు పట్టినట్లు ప్రభాకరం ఇటు తిరిగాడు. ఆమె పెద్దలైటు స్విచ్ వేసింది. అతను సర్రున లేచి ఆమెని పట్టుకున్నాడు. పడిపోకుండా రోగిని పట్టుకున్నట్టు. లీల ఆశ్చర్యపడింది. తన ఉద్దేశ్యం ఇంచుమించు అదే. కానీ అది కాదు...
"అవతలికి వెళ్ళాలా?" అని ప్రేమగా అడిగాడు.
ఆ ప్రేమ ఎటువంటిది? మెయిన్ రోడ్డు దగ్గర గుడ్డివాడు కర్ర ఆనించుకొని నిలబడి ఉంటాడు. అందరూ ఎవరి పనులమీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నిస్వార్ధమైన ఉద్దేశంతో తానుకూడా రోడ్డును దాటవలసిన ఒక వ్యక్తి ఆ అంధుడి చెయ్యి పట్టుకొని, "రోడ్డు దాటించనా" అని అడిగిన లాంటి ప్రేమా అది?
పసిపిల్ల ఆడుకొనే లక్కపిడతని అరుగుమీంచి కింద పారేసుకుంది. కిందకి దిగలేదు. దూకేస్తే దెబ్బ తగులుతుందని తెలుసు. బొమ్మ కావాలి. అందదు. అప్పుడు ప్రభాకరం లాంటి వ్యక్తి "ఓంటమ్మా, బొమ్మ కింద వప్పోయిందా?....మా తల్లే....అందిచనా?" అని అడిగినలాంటి ప్రేమా అది?
తనకి అతని నుంచి కావలసిన ప్రేమ అలాంటిదా? లీలకి కోపం ఎక్కువైంది. కాని కోపంతో అతన్ని తాను గెలవగలదా? అతన్ని దగ్గరగా తీసుకోగలదా?
"వదలండి, నేను నడవగలను" అంది ప్రసన్నంగా.
అతనేమీ అనలేదు. "నిజం! నువ్వు పడిపోకుండా నడవగలవా?" అని అడిగేస్తాడేమోనని భయపడింది లీల,
మళ్ళీ వ్యర్ధంగా నవ్వి, "ప్రస్తుతం మంచం పట్టినంత జబ్బేమీ లేదండీ నాకు" అన్నది లీల. "నేను అన్ని పన్లూ చేసుకుంటున్నాను. నెల్లాళ్ళైంది. శుభ్రంగా తిని తిరుగుతున్నాను."
"అదికాదు నే ననేది-నిద్ర కదా-"
"నిద్రట్లోకూడా తూలి పడిపోకుండా నడవడం ఈ నెల్లాళ్ళనించీ చేతనవుతూంది" అని నవ్వి, అవసరమేమీ లేకపోయినా బయటికి వెళ్ళింది లీల.
తిరిగివచ్చేసరికి అతనింకా ఎలెక్ట్రిక్ స్విచ్ బోర్డ్ దగ్గరే ఇందాక నిలబడిన ప్రకారమే నిలబడి ఉన్నాడు.
లీల తిన్నగా వచ్చి, ఇందాకటి చిరునవ్వే నవ్వు కొంటూ, అతని మంచంమీద వాలిపోయింది. దీపం ఆర్పేసి ఆమె దగ్గరికి వెళ్ళాలా లేదా అని ప్రభాకరం ఆలోచించసాగాడు. నిమిషం, రెండు నిముషాలు అలా నిలబడినా అతనికి కర్తవ్యం సుగమం కాలేదు.
ప్రభాకరం లైటార్పేశాడు. బెడ్ రూమ్ లైటు వెలుతుర్లో లీల నవ్వులో అందం ఏమీ కనబడక పోయినా ఆమె పలువరస మాత్రం కొంచెం వికారంగా కనబడుతూంది. అతను నెమ్మదిగా నడుచుకొంటూ ఆమె ఉన్న తన మంచం సమీపించాడు. లీల సరిగ్గా మధ్యన పడుకుని ఉన్నది. అతను మంచానికి దగ్గరగా రాగానే అతనికి సరిపోయినంత చోటు చేసి జరిగింది. తను కూర్చుంటే ఆమె చేతులు జాపుతుందేమో, తనని అందుకొంటుందేమో, అదేమైనా ప్రమాదానికి దారి తీస్తుందేమో అన్నట్టు అతనింకా మంచం అంచున మొహమాటంగా కూచున్నట్టు వేరేవైపు దృష్టి నిలిపి కూర్చున్నాడు.
పంతానికి అలా ఎంతసేపు కూర్చుంటాడో చూద్దాం అనుకుంది లీల. కాని తనే వేగిరం ఓడిపోయింది. ఎంతకీ అతను వంగకపోయేసరికి తనే లేచి కూర్చుని, జరిగి అతని పక్కకొచ్చింది.
"సుభద్రమ్మగారు ఊళ్ళో ఉన్నారా?" అని అడిగాడతను.
"ఏ సుభద్రమ్మ?"
"డాక్టరు."
"ఆవిడెందుకు, ఇప్పుడు?"
"ఇప్పుడు కాదు. రేపు మాట్లాడుదామని."
"ఏం అక్కర్లేదు."
"నీకు తెలియదు, లీలా. డాక్టర్ నడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాలి."
"డాక్టర్లంటే మీకు కోపం-"
"ఎవరు చెప్పేరు?"
"జయప్రద అని మా ఫ్రెండు.....డాక్టరేగా-ఆవిడ చెప్పింది."
"ఆవిడా? ఆవిడకి వైద్యజ్ఞానంకన్నా నీ మీద వెర్రి ప్రేమ ఎక్కువ."
"మీకూ నా మీద ప్రేమే, ఒకప్పుడు."
"ఇప్పుడు లేదంటావా?"

"వేరే అనాలా?"
"నువ్వు మంచీ చెడ్డా ఆలోచించుకోకుండా మాట్లాడుతున్నావు."
"మీరు మంచీ చెడ్డా తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు."
"నేనా?"
"అవును, మీరే."
"ఏం తప్పు కనిపెట్టావు, నా ప్రవర్తనలో?"
"అసలు మొట్టమొదట చెప్పండి-మీరు ఇల్లు పట్టకుండా తిరగడం ఎందుకు?"
"పనులున్నాయి."
"కుంటి సమాధానాలు చెప్పకండి, పనులు ఎన్నున్నాయో, అని ఎంతసేపు మిమ్మల్ని కట్టిపడేస్తాయో నాకు తెలియదూ?"
".................."
"ఇది వరకు పొలాలే, ఇదివరకు ఆస్తే, ఇదివరకటి బస్సేనా, కొత్త వేమైనా వచ్చి కలిశాయా? వాటితో మీరు ఎంతసేపు కాలక్షేపం చెయ్యగలరో, అవన్నీ అంటే మీ కేపాటి ఇష్టమో నే నెరగ వనుకున్నారా?"
"అది కాదు, లీలా ను వ్వావేశపడుతున్నావు."
"నేను నిదానంగానే ఆలోచిస్తున్నాను. ఆలోచించి ఆలోచించి నా మనస్సంతా పయాస పడుతూంది. నాతో మీరు మాట్లాడి ఎన్నాళ్ళయింది? మీరిలా దూరదూరంగా నన్ను ముట్టు కోకు నా మాల కాకీ అని ఎందుకు తిరుగుతున్నారు? ఒక్కసారిగా మీకు నా మీదున్న అభిమానం తగ్గిపోయిందా?"
"నువ్వలా అడిగితే నాకు నవ్వొస్తుంది. నీకు ఒంట్లో కులాసాగా లేదు. రెస్ట్ తీసుకో."
"నా కేం జబ్బు లేదు! మీరు పూర్తిగా మారిపోయి, నేను ఎందుకు మారిపోయారని అడిగేసరికి ఇదో ఎత్తు ఎత్తుతున్నారు.....నువ్వు జబ్బుమనిషిని, దూరంగా ఉండు అంటూ నన్ను దూరంగా తోసేసి నా ఒంటిమీద చెయ్యైనా వెయ్యకుండా..." అంతే. ఆమె గొంతుకలో ఏదో అడ్డం పడినట్లై మాట రాలేదు. ప్రభాకరం కొంచెం కోపగించుకొని ఆమెని వారించబోయాడు. కాని, అతను ఏమీ అనకముందే లీల పెద్దగా ఏడ్చేస్తూ, "నాకు పిల్లలు పుట్టరని....నన్ను వదిలేస్తున్నారు" అంది. ఆ మాట ఏడుపులోంచి వచ్చి నోరు మరి మూతపడలేదు. స్వరం హెచ్చైపోయి భోరున ఏడుస్తూ ఉంది లీల.
ప్రభాకరం కంగారు పడిపోయాడు. విశాలమ్మగారు, ఇరుగుపొరుగువారు ఎవరైనా వచ్చేస్తారేమోనని అటూ ఇటూ చూశాడు. ఆమె రోదన వినిపించకుండా గది తలుపు బిగువుగా దగ్గరికి నెట్టాడు. "లీలా... ప్లీజ్..... ఆవేశపడకు.... ప్లీజ్!" అంటున్నాడు.
నిజానికి లీల కేదో వేదన ఉంటుందన్న సంగతికూడా తాను గుర్తించలేదు. పిల్లలు కావాలని తను అనుకున్నదీ, కోరిందీ బలవత్తరమైన భావం. ఆమె కసలు అలాంటి భావమే లేదని తమ పొరబడ్డట్టుంది. తనకి పిల్లలు కావాలన్న కోర్కెకంటే ఆమెకే తల్లి కావాలన్న కోర్కె ఎక్కువగా ఉన్నట్టు కొంచెం కొంచెంగా తెలుస్తూంది. కాని అది ఇంత వేడిగా ఉంటుందని, అగ్నిపర్వతం బ్రద్దలైనట్లు ఒక్కసారిగా పైన పడుతుందని అతను ఊహించలేదు...
తలుపు వేసి మళ్ళీ మంచం దగ్గరి కొచ్చేడు ప్రభాకరం. ఆమె కాళ్ళు క్రిందగా వేలాడేసి మంచం మీద అస్తవ్యస్తంగా పడుకొని తల పరుపులో దూర్చి వెక్కివెక్కి ఏడుస్తూంది. ప్రభాకరం ఆమెని రెండు చేతులా పొదివి పట్టుకొని ఆమె పక్కని కూర్చున్నాడు. తన స్పర్శ తగలగానే దుఃఖం ఎక్కువై నట్లు గుర్తించా డతను. ఆమె తన మీద వాలిపోయి తననే పట్టుకొని, తన చొక్కామీద కన్నీళ్లు నిడుస్తూ ఉంటే 'నా కిదంతా కావలసిందే, తల్లీ తండ్రీ, తోడూ నీడా లేని లీలని ఇంతంత కష్టాలొస్తే ఓదార్చి ధైర్యం చెప్పవలసిన బాద్యత నా మీద ఉండికూడా ఆమెని ఆమె దురదృష్టానికీ, దుఃఖానికీ వదిలి నేను ఊరు బలాదూరు తిరగడం భావ్యం కాదేమో?' అనిపించింది.
