Previous Page Next Page 
నన్ను నన్నుగా ప్రేమించు పేజి 9


    సమాధానం చెప్పకుండా గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ప్రభాకరం.
    తన కెవ్వరూ మంచి మాట చెప్పే వాళ్ళే లేరు. తనకీ, లీలకీ చెడిందని అనుకుంటున్నారు. ఆమె అంటే తనకి అసహ్యమా? ఆమె ఇంట్లో ఉండగానే తాను మరో భార్యని తెచ్చుకోవడానికి సిద్ధపడిపోతాడని జనం అనుకుంటున్నారా? అదే అనుమానం అని తను భయపడుతూ ఉంటే, అందులో సంధ్యని-నిండా పదహారేళ్ళు లేని పిల్లను, తన కూతురితో సమానమైన దాన్ని-తమ రెండో పెళ్ళాంగా తెచ్చుకోవడమా? అయినా లీల తన పిల్లలకి తల్లి కానంత మాత్రాన తనకు భార్యకాదా? ఆమె తన భార్య! ఆమెకి తప్ప మరెవరికీ హక్కులేదా ఇంట్లో! కానీ.....అంటున్నారు తనా గౌరవం ఆమె కివ్వనట్లు ఊహించి ఇలాంటివన్నీ. తనూ, లీలా దూరదూరంగా తిరగబట్టే కదా ఈ వాడు అక్క ఇలా అనగలిగింది? తామే సక్రమంగా ఉండి ఉంటే ఈ మాటలు వచ్చేవా? అసలు ఏ గొడవా ఉండేది కాదు. అయినా... పిల్లల్ని పెంచుకోవడమో, మానడమో తనూ, లీలా నిర్ణయించుకోవలసిన విషయం. మధ్య వీరి జోక్య మెందుకు?
    ఆలోచిస్తూ పార్కులో ఒంటరిగా కూర్చుండి పోయాడు ప్రభాకరం. చీకటిపడి చెరువులో నీళ్ళు తళతళా మెరుస్తున్నాయి. పొడుగ్గా పోకచెట్లు, పొట్టిగా గుబురుగా కత్తిరింపబడ్డ బోగస్ విల్లా పొదలూ, ఖాళీగా ఉన్న సిమెంటు బెంచీలూ, బోసిగా ఉన్న జారుడు బల్లా ప్రభాకరానికి తోడుగా ఉన్నాయి.
    మెదడు మొద్దుబారినట్లయి, ఏమీ ఆలోచించలేక పోతున్నాడు. పదేపదే అతనికి సంధ్య జ్ఞాపకం వస్తూంది. అమ్మ కొడితే ఏడుస్తూ, ఓదార్పు కోసం తన ఒడిలో చేరే సంధ్య.... ఆమె జ్ఞాపకాలకి భయంకరమైన అర్ధం తీస్తూ వికటాట్టహాసం చేస్తున్న అక్క....చాలా బాధ కలిగింది అతనికి. 'సాధ్యమైనంత తొందరగా తనూ, లీలా ఒక నిర్ణయానికి రావాలి.'
    ఆవేశంతో ఇంటికి వచ్చాడు. రాగానే లీలని తన గదిలోకి పిలుచుకువెళ్ళాడు.
    "ఇటు రా!"
    ఇలాంటి మాట విని చాలా రోజులయినందున చాలా ఆశ్చర్యమనిపించింది లీలకు.  
    "ఇలా కూర్చో" అంటూ తనకి చేరువగా కూర్చో బెట్టుకొని, "లోకంలో ఎంతంత లేసి దుర్మార్గులైనా ఉండదు" అన్నాడు.
    ఖాళీగా చూసింది లీల.
    "మా అక్క ఎందుకొచ్చిందో తెలుసా?"
    "..........."
    "నీ కెలా తెలుస్తుంది? మెత్తమెత్తగా నాలుగు మాటలు చెప్పేసరికి అందరూ మంచివాళ్ళయి పోతారు నీకు."
    అతని ధోరణి అర్ధంకాకపోయినా చాలా కాలం తరవాత అతనికి చేరువగా కూర్చొన్న తృప్తివల్ల, అతను తనతో మనసు విప్పి మాట్లాడుతున్న సంతోషం వల్ల నిశ్చేష్టురాలై వింటూంది లీల.
    "మా అక్క నీతో ఏమన్నా అందా?"
    "ఏమీ అనలేదే?"
    "ఇంకేమంటుందిలే. అనవలసినవన్నీ నాతో అందిగా!"            "అదిసరే....నా కొకటి తడుతోంది."
    ఏమిటన్నట్టు చూసింది లీల.
    "బయల్దేరు, మనం రాజమండ్రి వెళదాం."
    "ఎందుకు?"
    "అక్కడ శరణాలయం ఉంది."
    "శరణాలయమా?"
    "అవును. అనాథ శరణాలయం. పాపలు, బాబులు బోలెడంత మంది ఉంటారు. మన గురించి లోకులు విపరీతార్ధాలు తియ్యకముందే వెళ్ళి మనకి నచ్చిన ఓ పాపనో, బాబునో తెచ్చి పెంచుకుందాం."
    'ఇప్పుడేం ఖంగారు వచ్చిందండీ!"
    "నీ కేం ఖంగారు ఉండదు. ఉన్నదల్లా మిగిలిన వాళ్ళకే. అసలు.... మా అక్క ఎందుకొచ్చిందో తెలిస్తే ఇలా తీరిగ్గా కూర్చొని తాపీగా మాట్లాడవు."
    "సంగతేమిటో చెప్పకుండా ఏమిటో మాట్లాడితే ఎలాగండీ?"
    "ఎవడో వల్లకాట్లో రామనాథం గాడు పెంపకానికి పిల్లాన్ని ఇస్తానంటే ఆశ్చర్యం, అసహ్యం వేసింది. ఈ వాడు మా అక్కే ఆ పనిమీద వస్తే దాన్నిచూసి ఏం చెయ్యాలో, ఏమనుకోవాలో తెలియడం లేదు."
    "మీ అక్కగారా? వాళ్ళ చిన్నబాబును ఇస్తానంటోందేమిటి?"
    "చిన్నబాబుని కాదు. పెద్దమ్మాయి సంధ్యనే!"
    "సంధ్య నెందుకండీ? మనం పెంచుకుందుకు?"
    "పెంచుకుందుకు కాదు, పెళ్ళాడి ఇక్కడుంచుకో డానికే!"
    పిడుగు పడినట్టు అదిరిపడింది లీల. ఆమె గుండె గుబగుబ లాడింది. 'నిజంగానా?' అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది ప్రభాకరాన్ని.
    "ఇప్పుడు తెలిసిందా ఆవిడగారు ఇక్కడికి హఠాత్తుగా ఎందుకు దిగబడ్డారో? నీ మీదా, నా మీదా ప్రేమ పొర్లి రాలేదు. అసలు నాదే పొరబాటు. ఈవేళ అనుకొన్న మాట- ఏది...శరణాలయం మాట-ఆ నాడే అనుకొని ఉండవలసంది. బయల్దేరు!"
    "ఇప్పుడా?"
    "ఇప్పుడే."
    "వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు!"
    "అలా ఉండగానే మనం వెళ్ళాలి. అదే వాళ్ళకి మందు."
    లీలకేమీ తోచలేదు. ప్రభాకరం చెయ్యి పట్టుకుని "పదండి" అంది.
    "అదేమిటి, మారుచీరన్నా తెచ్చుకోకుండా ఇలాగేనా?"
    "ఇలాగే రాజమండ్రి వెళ్ళి తిరుగు బస్సులో రావడానికి మారుచీరకూడా ఎందుకు? మంచి ఉద్దేశానికి మంచి ముహూర్తం ఉండదు - పదండి."
    చిన్న చేతిసంచీలో టవలు, సబ్బు, టార్చిలైటు లాంటి చిల్లర సామానుతో గుమ్మం దిగుతున్న లీలనీ, ఆమె వెనకాలే మంత్రం వేసినట్టు నడుస్తున్న ప్రభాకరాన్నీ చూసి రుక్మిణమ్మ నిర్ఘాంతపోయింది.
    
                             *    *    *

                

    పక్షులు రోద చేస్తూండగా, గాలికి ఊగుతూ కొమ్మలు వింతశబ్దం చేస్తున్నాయి. ఒక చెట్టు కింద సిమెంటు బెంచీమీద కూర్చుని ఉంది లీల. పక్కన నాలుగేళ్ల బాబు-బిస్కట్టును తింటూ!
    "మాతో వచ్చేస్తావా? నాకు బోలెడు బిళ్ళలూ, బొమ్మలూ ఇస్తాను..."
    ముఖంమీద పడుతున్న ఉంగరాల జుత్తును సర్దుతూ అడుగుతూంది లీల.
    ఎక్కడి కన్నట్టుగా తింటున్న బిస్కట్టును అలాగే పెట్టుకొని, నోరు తెరిచే ఉంచి కళ్ళతో ప్రశ్నిస్తున్నట్టు చూశాడు వాడు.
    దూరంగా ప్రభాకరం శరణాలయం అధికారిణితో మాట్లాడుతున్నాడు.
    'ఇప్పుడే ఇంత పచ్చగా బొద్దుగా ఉన్న వీడు....సరిగ్గా పోషణ ఉంటే ఇంకెంత బావుంటాడో అనుకొంది లీల, జాలిగా వాడివంక చూస్తూ!
    "మరి....నేను అప్పిచ్చి పెట్టాగా....నీ పేరు ఇప్పుడు చెప్పు."
    "బాబు..."
    "బాబు కాదు.... నీ పేరు చెప్పాలి..."
    "బాబే!"
    "సరేమరి.....నీకు ఏం కావాలి?"
    "నువ్వెవరు?" ముద్దుముద్దుగా అడిగాడు.
    "నేనా... నేను....అమ్మని!" అప్రయత్నంగా అనేసింది లీల.
    తరవాత అ భావనే ఎంతో మధురంగా అనిపించ సాగింది. తనలో తానే గొణుక్కొంటున్నట్లు "అమ్మ ....అమ్మ...." అనుకోని ఒక్కసారి వాడిని గట్టిగా గుండెలకి అదుముకొంది. అంత అందమైన బాబుకు తల్లి కాబోతూన్నందుకు గర్వపడింది. ప్రేమగా వాడి ఒళ్లంతా నిమిరి, తలమీద ముద్దు పెట్టుకొంది.
    వాడు ఆమె ప్రవర్తనను వింతగా గమనిస్తున్నట్లు ఉండిపోయాడు.
    ప్రభాకరం ఆవిడతో లోపలికి వెళ్ళినట్లున్నాడు-అక్కడ లేడు.
    "అబ్బ....తెమల్చరు..." విసుక్కొంది లీల.
    "ఒరేయ్......నాన్నా.....నువ్వు బంగారు కొండవిరా!"
    తనకే ఆశ్చర్య మనిపించేటంత ప్రేమ పొర్లి వస్తూంది ఆమెకు. 'పూర్వ జన్మలో బహుశా వీడు నా కొడుకేనేమో' అనుకొంది. ఇన్నాళ్ళ నుంచీ వాడిని చూడకుండా ఉన్నందుకు బాధపడి, తనను తాను తిట్టుకొంది,
    "లీలా..... ఓ లీలా...." ప్రభాకరం పిలుపు రమ్మన్నట్లుగా చేయి ఊపుతున్నాడు.
    బాబుతోసహా అతన్ని సమీపించిందామె.
    "ఏమండీ.....వెళదామా?" అంటూ.
    "లేదు....మళ్ళీ వద్దాం..."
    "వద్దూ....ఎందుకు? వీడినే తీసుకెళ్ళాలి..."
    "నే చెపుతా నడు." ఆమె చేయి పట్టుకోబోయాడు కానీ.....ఒక్కసారి విదిల్చి దూరంగా జరిగి, "చెప్పండి, ఎందుకొద్దు?" అంది.
    "ఏమిటిది? ఎవరైనా చూస్తే? రా..."
    "ఎవరు చూసినా ఫర్వాలేదు. మీరు కారణం చెప్పందే కాలు కదపను. ఇప్పుడు వీడెందుకొద్దు?" డివా జబ్బ పట్టుకొని ఊపుతూ కోపంగా అడిగింది లీల. బిక్క ముఖం పెట్టి, ఇరువురి వైపూ చూడసాగాడు వాడు.
    "అబ్బబ్బ....ఏమిటిది? నడు, లీలా! రా....బయటికి వెళ్ళాక చెపుతాను... ఆదరంగా ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు ఆమె పరిస్థితిని గమనించినవాడై.
    "ఇంకెవరినైనా చూస్తారా?"
    "అక్కర్లేదు..." ఏడుపు మిళితమైన స్వరంతో పలికి అతనితో యాంత్రికంగా బయటకు నడిచింది.
    "లీలా! వాడి హిస్టరీ అంత బాగులేదు. రిజిస్టరు చూశా కదా!"
    "పైగా.....వాడిని చాలా దూరపు బంధువులెవరో తీసుకొచ్చి చేర్పించారుట. వాళ్ళ నాన్న ఎక్కడికో పారిపోయాడు..."
    "సినిమాలో లాగా కట్టుకథలు నాకేం చెప్పవద్దు. అయినా....వాళ్ళ నాన్న పారిపోతే నా కెందుకు? ఉంటే నా కెందుకు?" నడుస్తున్నది ఆగిపోయి అంది లీల.'
    "నడు....చెపుతా."
    "వాడు లేకుండా నేను రాను!"
    "ఏమిటీ మొండితనం? వాడి తరఫు బంధువు వీణ్ణి వచ్చి చూసి పోతూంటాట్ట! అయినా... వాడి రిజిస్టరు ఏమీ బాగా లేదన్నాను-వినంతే!"
    "రిజిస్టర్.....రిజిస్టర్ అంటారు. అదెందుకండీ మనకీ?"
    "లీలా చూస్తూ చూస్తూ అలాంటివాణ్ణి తెచ్చి మన ఇంట్లో ఉంచుకోగలమా? పెంచగలమా? పైగా .... మనం సర్దుకుపోయినా మన బంధువులు ఒప్పుకొంటారా? ఎంతయినా చూస్తూ చూస్తూ హంతకుడి కొడుకును ఎలా తెస్తాం?"
    "మీ రేదో ఇష్టంలేక అబద్ధం చెపుతున్నారు. వాడిని చూస్తే మీకు అలా అనిపిస్తున్నాడా?"
    "అయినా.... నా కిష్టమైన వాడిని తెచ్చుకొందాం అని ఎందుకనాలి? లేనివి ఎందుకు ఆశ చూపించడం?"
    "నడు ఇంటికి...."
    "ఏముం దా ఇంట్లో .... నేను రాను" అంటూ సందు మలుపయినా తిరగకుండానే రెండు చేతుల్లోనూ ముఖం దాచుకొని ఏడవడం మొదలెట్టింది లీల.
    ఏం చేయాలో అర్ధంకాలేదు ప్రభాకరానికి. ఎంత నచ్చ చెప్పుకొందామన్నా మన స్సంగీకరించని కథ వాడిది. అలాంటి వాడిని ఆదరించగలిగే అంతగా తాము ఇంకా ఎదగలేదు. పైగా .... ఏనాడయినా వాడి తండ్రి వచ్చి 'నా కొడుకుని ఇయ్య'మని లాక్కెళ్ళిపోతే లీల భరించగలదా? శరణాలయంలో అటువంటి ఏర్పాట్లు చేసుకొని వెళ్ళాడట అతను.
    "లీలా...." అంటూ బలాత్కారం కనిపించనంత ఆదరంగా ఆమెను పట్టి రిక్షాను పిలిచి అందులోకి ఎక్కించాడు.

                          *    *    *

    ఇంటికి వచ్చిన కొద్ది రోజులవరకూ మామూలు మనిషి కాలేకపోయినాడు.
    "మాతృత్వపు కాంక్ష లేదనుకొంటున్న ఈమె మనసులో ఇంత కోర్కె ఉందా?" అని ఆశ్చర్యపోయాడు ప్రభాకరం.
    "లీలా..... పోనీ ఇంకెవరినైనా తెచ్చుకొందాం" అన్నాడు ఊరట కలిగించడానికి.
    "ఎవరూ అక్కర్లేదు. చేసింది చాలు" అంది లీల విసుగ్గా.
    "లీలా....పోనీ, ఆ ఊళ్ళో వద్దంటే పోనీ.....కానీ.....నేను రెండు రోజుల్లో హైదరాబాద్ వెళుతున్నాను. అక్కడ శరణాలయాలు చూస్తావా?"
    "హైదరాబాదే కాదు....మద్రాసయినా రాను." ఇంక ఆమెను ఊరడించీ లాభంలేదని ఊరుకొన్నాడతను.
    "పోనీ బంధువుల పిల్లల్నే తెచ్చుకోకూడదా?" అని ప్రశ్నించారు దగ్గర పరిచయస్థులు ప్రభాకరాన్ని.
    "లేదండీ..... ఒకసారి మేం తెచ్చుకొన్నామంటే వాడు పూర్తిగా మా వాడు కావాలి. అంతేగానీ....చీటికీ మాటికీ ఆ తల్లిదండ్రులు వచ్చి మాకు ఇబ్బంది కలిగించకూడదు....అందుకనే కాస్త వచ్చిన వాణ్ణి ఏ అనాథనో తెచ్చుకోవాలని ఉద్దేశ్యం."
    
                                  9

    "వెధవ రైలు....గంటన్నర లేటు. పైగా ఎక్స్ ప్రెస్ అన్న పేరొకటి. ఎక్స్ ప్రెస్ అయితే తొందరగా తగలకూడదూ?' అని ప్రభాకరం విసుక్కుంటూ సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూమ్ వైపు నడుస్తూ కుడిపక్క పిల్లలకోడి నక్షత్రంలాగా కూర్చున్న దంపతుల తల్లిని చూసి ఆగాడు.
    ఆవిడ నిండుగా పైట కప్పుకొని 'ఎవరు, బాబూ, మీరు?' అన్నట్టుగా చూసింది.
    ఇంతలోనే 'గంటన్నర లేటులే" అంటూ ఒక ముసలాయన అటు వచ్చి ఆవిడని పలకరించాడు.
    ప్రభాకరం ఆయనవైపు చూసి, "మీరు..." అంటూ తడబడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS