గోపాలం స్థితి నానాటికి దిగజారి పోతోంది. 'యీ వయస్సు లో మళ్లీ పెళ్లి చేసుకున్నానే' అన్న బాదే అతన్నీ, శరీరాన్నీ కూడా ఆక్రమించుకుని నొకానొక అంతు చిక్కని వ్యాధికి గురి చేసి నిలువునా కృంగ దీస్తోంది మనిషిని పూర్తిగా. ఇన్నాళ్ళ కి కొడుకు గుర్తుకు వచ్చినట్లు శ్రీనివాస్ ని పిలిచి మంచం మీద కూర్చో బెట్టుకుని అన్నాడు : 'చూడు శ్రీనివాస్ ఆడపిల్ల నమ్మి వస్తే మాత్రం నాశనం చేయకు. నాకు ప్రొద్దు పడమటికి మళ్ళింది. మిమ్మల్ని అనాధల్ని చేసి వెళ్లి పోతున్నాను అనేరా బెంగ. సుభద్ర నీ' సరస్వతీ ని రెండు కళ్ళుగా చూసుకో,
'నాన్నా' గాబరాగా అన్నాడు శ్రీనివాస్.
'నాకు తెలుసు శ్రీనివాస్ యింక ఈ ప్రాణం రోజుల మీదో క్షణాల మీదో వుంది. నాకు జీవితం మీద భరోసా లేదు . కానీ.....
గుమ్మం దగ్గర పని మీద వచ్చిన సుభద్ర పరుగున వచ్చేసి భర్త గుండెల్లో తల దూర్చి చాలాసేపు వుండి పోయింది. ఆగి ఆగి దుఃఖం తెరలు తెరలుగా వస్తుంటే ఒక్కసారి ఘొల్లు మంది.
శ్రీనివాస్ మనసు గందరగోళంగా అదేదో విచిత్రావస్థ లో వుంది. అతను యింత కష్టపడి పిన్ని యిస్తే తను బియ్యే బదులు బి.యస్.సి నే చదవాలనుకున్నాడు. అది పూర్తయ్యేందుకు మరో ఆరు నెలలు వున్నాయి. పినతల్లి సర్వం మరిచిపోయి ఆ వృద్దుడి కౌగిట్లో యిమిడి పోతుంటే అతనికి సిగ్గు వేయలేదు. ఎబ్బెట్టు గా కూడా అనిపించలేదు. తొక్కలా వ్రేలాడుతున్న తండ్రి చేతులూ శరీరం సుభద్ర జీవితంతో యెలా ముడి వేసుకుని విదిపోతున్నాయో అర్ధం కాలేదు. చాలారోజుల నుంచి గోపాలానికి అస్వస్థత గానే వుంది. బలవంతంగా చావుని కోరుకునే మనుషులు చేసే కొన్ని ఘోరమైన పనుల్ని అతనూ చేశాడు. విపరీతంగా త్రాగడం లాంటివి.
గోపాలం లో వొక రకం మైకం ఆవరించుకుంది. సుభద్ర కి అనుమానం గానే వుంది. 'చూడు సరస్వతీ మీ నాన్న,' సుభద్ర మాట పూర్తీ కానేలేదు సరస్వతి తండ్రి చేతిలో చేయి వేస్తూ దిక్కులు పగిలేలా యేడ్చింది. మంచు ముద్దలాంటి చేతుల్ని సరస్వతి త్వరగానే గుర్తు పట్టింది.
గోపాలం అరని వేదన ఒక్కసారి ముప్పుకుని పైకి యెగిసి చప్పున ఆరిపోయింది. గోపాలం నిస్తేజంగా కళ్ళు మూసుకున్నా 'సుభద్ర నీ, సరస్వతీ ని రెండు కళ్ళల్లా చూసుకో శ్రీనివాస్!' అని అజ్నాపిస్తున్నట్లుగానే వుంది. శ్రీనివాస్ శూన్యంలో కి చూస్తుంటేనే సూర్యుడు అంతర్ధానం అయిపోయి తూర్పు నుండి పైపైకి ఎగబ్రాకి వచ్చేశాడు.
సుభద్ర తండ్రి, కూతుర్ని చూసి తలదించుకున్నాడు. తల్లి గుండెల్లో కంటా తీసుకుని 'కన్నబిడ్డ కుంకుమ రేఖల్ని చేజేతులా తుడిచేశాం యిందుకు మనమే కారణం.' అంటోంది అర్ధం లేకుండా. ఎవళ్ళు ఎన్ని అన్నా విధికి ప్రమేయం లేదు. గోపాలాన్ని కాటికి అప్పగించి గడప లో అడుగు పెట్టాడు శ్రీనివాస్.
పదమూడు రోజులు దొర్లాయి. తల్లీ తండ్రీ యిద్దరూ పోయాక చాలా వెలితిగా ఉన్నట్లు కనిపించింది. సుభద్ర వైపు చూస్తుంటే తీరని బాధను పెనవేసుకు పోతోంది. అందంగా యౌవ్వనం లో అడుగు పెట్టిన సుభద్ర తెల్లని చీర కింద వెల వెల బోతూ వుంటే 'ఏం మనుషు లోయ్ శ్రీనివాస్, మనసుల్లోనే మీది వో బ్రతుకే' అంటున్నారు శ్రీనివాస్ లో యెవరో కనిపించని మనుషులు.
'పిన్నీ మీరింక భోజనం చేయకపోతే యెలాగ? ఎన్నాళ్ళు యిలా? లేచి కొంచెం యెంగిలి పడండి. మనం బ్రతకాలి కద. పోయే వాళ్ళతో మనం కూడా పోగల్గుతే అదృష్ట వంతులం అయే వాళ్ళం.'
సుభద్ర కళ్ళు యెరుపు రంగు కు మారి పోయాయి. 'నీ కనవసరం . నా గురించి మీకు అక్కర్లేదు యెవరికి. వెళ్ళు శ్రీనివాస్ నన్ను మాట్లాడించకు.'
నిర్ఘాంత పోలేదు అతను. తలితండ్రులే చూస్తూ చూస్తూ గొంతు కోస్తుంటే దాని తాలుకూ ప్రతీకారపు నిప్పు రవ్వలు చెదిరి మరొకరి మీదికి పడడంలో అర్ధం వుందనే సరి పెట్టుకున్నాడు.
'వచ్చేయి సుభద్రా! యివాళ కన్న వాళ్ళే కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ యింట్లో నీకు యెవరూ లేరు. బ్రతికి వున్నందు కూ, కన్న తల్లీని, కనుక నిన్ను పిలుస్తున్నాను నేను. నాతొ రా!' సుభద్ర తల్లి దుఃఖాన్ని దిగమింగి అడిగింది.
'హు.' కన్నతల్లి. 'ఎందుకమ్మా అనవసర బంధాలు. అవునన్నా కాదన్నా ఈ యింటితో నాకు చాలా సంబంధం వుంది. ఈ పని నువ్వు కొన్నాళ్ళ క్రితం చేసి వుంటే బాగుండి పోయేది.
'కన్నతల్లిగా ఆలోచించక పోయావా అమ్మా అంత పెద్ద మనిషికి యిచ్చి చేస్తుంటే. ఆరోజు లేని మాతృప్రేమ యివాళ వున్నదన్నా నాకు నమ్మకం లేదు. నేను రాను.'
'అను. నీ యిష్టం వచ్చినట్టు అను. నీకు తెలియదా యిది. నా పేర మా నాన్న వో యేకరం రాసి వుంటే చూస్తూ చూస్తూ నా కూతుర్ని నట్టేట్లో ముంచి నేను ఒడ్డున నిల్చుని ఆనందించను.
'నేను నిన్ను రమ్మని అంటున్నాను. అంతే వచ్చేయి. నా కూతురికి యీ తల్లి నీడన ప్రశాంతత రావాలి. మనం వెళ్ళిపోదాం పద!'
'నాకు యిప్పుడు యెక్కడికీ రావాలని లేదమ్మా. బ్రతికే మూడు నాళ్ళూ యెక్కడున్నా వొకటే. నా స్థానాన్ని పోగొట్టు కుని మీ యింట వదిన చేతి క్రింద ...చాలు ఆ జీవితం యింక నేను తలుచు కోలేను. నీ మీద నాకు అంతగా ప్రేమ అనిపించడం లేదు. అందుకు నువ్వు యేమైనా అనుకో.'
'నేను రాను యెక్కడికి. నన్ను చూడాలనిపిస్తే మాత్రం యీ మాటలు కడుపులో దాచుకో. నీకు వేళ అవుతోంది . వెళ్లిరా.' సుభద్ర గొంతు చీరుకు పోతోంది. దాంట్లోంచి రక్తం క్రమంగా నీరుగా మారిపోయి కళ్ళల్లోంచి రాలి పడుతున్నాయి చుక్కలుగా.
అన్ని సంభాషణ లూ శ్రీనివాస్ చెవుల వరకూ వెళ్ళాయి. కానీ అతను యేవీ చెప్పలేదు. సుభద్ర తల్లీ తండ్రి వెడుతూ వెడుతూ మాట మాత్రంగా అయినా పలకరించ లేదు శ్రీనివాస్ ని.
శూన్య గృహం లో వెలితిగా బోసి పోతుంటే ముగ్గురూ మూడు వైపులా కూర్చుండి పోయారు. లైట్లు వెలిగినా మనసులో ఆరిపోయిన దీపాలు బయటి కాంతి గ్రహించ లేక పోతున్నాయి.
* * * *
'ఈ సంవత్సరం గడవడం కష్టం పిన్నీ యింకా ఎన్నాళ్ళూ జరగాలి. నేను చదవను యింక. యే ఆఫీసులో నైనా పనికి కుదురు కుంటాను. ఈ సంసారం జరుపుకు రావాలంటే నేనింక యీ చదువు యిక్కడికి అపు జేయడమే మంచిది. ' శ్రీనివాస్ తలుపుకి కొంచెం పక్కగా జరిగి యీ మాటలు పిన తల్లికి అందేలా వేశాడు.
'ఈ అరునెల్లూ మరో యేడాది క్షణం లో పూర్తీ అయిపోతాయి. నువ్వు ట్రైనింగ్ అవాలి. అంత పేచీ పెట్టుకున్నాను మీ నాన్నగారితో. ఆయనతో పేచీ మాత్రం మిగిలి పోకుండా నువ్వు చూడాలి. నీ చదువు కోసం ఆయన్ని నిలవనీయ లేదు నేను.'
'అదేలాసాధ్యం?'
'యెందుకు కాదు? రెండు పూటల తినే వాళ్ళం వొక పూటతో సరి పెట్టు కుంటాం కొన్నాళ్ళు. చచ్చి పోము యీ లోగా. సరస్వతి ని యేదైనా పరీక్షలకి కట్టించు. నేను మాత్రం చేసేది యేముంది?'
'పిన్నీ' శ్రీనివాస్ తెల్లబోయాడు. ఆడపిల్లలు చదవడం అంటే అతనికి మంచి అభిప్రాయమే వుండేది కానీ యిలా తన పినతల్లి అనడం లో యెందుకో బాధ అనిపించింది. ఒకవేళ తను గాని పోషించడనుకుని యిలా భవిష్యత్ కి పునాదులు వేసుకుంటుందో యేమో? మంచి మనసుతో అర్ధం చేసుకుంటే ఆవిడ వొంటరిగా జ్ఞాపకాలు తవ్వుకుంటూ యేడవడం తప్ప మరేవీ లేదు. వొప్పు కుంటే ........
'వీల్లేదు.' మనసు తలెత్తి నొక్కి చెప్పింది : 'ఒద్దు పిన్నీ మీరిద్దరూ ఆడవాళ్ళూ చదివి బయటికి వెళ్లి వుద్యోగాలు చేసి నన్ను చదివించి నన్నో వాజమ్మ క్రింద జమ కట్టేసి నలుగురి లో తలెత్తు కోకుండా చేయకండి. నేను యింక చదవను.'
సుభద్ర అంది: 'నేను అన్నది అదికాదు. నువ్వు చదువు మానేస్తే మేము అలాగే చేయవలసి వస్తుందనే మాట వరస కి అన్నాను.' సుభద్ర వెళ్ళిపోయిన అలికిడి వినిపించింది.
* * * *
గోపాలం బ్రతికి వున్న రోజుల్లో రామదాసు ఆర్ధికంగా ఆడుకునే వాడు. ఆ రామదాసే యిప్పుడు స్వయంగా శ్రీనివాస్ కి వుత్తరం రాశాడు తను ఆదుకుంటాననీ, రాజమండ్రి లో బి.యిడి చదవమనీ.
రెండు మూడు రోజులు అలోచించి చివరకు అన్నాడు శ్రీనివాస్ : 'రాజమండ్రి లో రామదాసు మామయ్య ఇంట్లో వుండి చదువు కుంటాను పిన్నీ! యేడాది ఎంతలో దొర్లిపోతుంది?'
సుభద్ర మాట్లాడలేదు. మౌనంగానే తన యిష్టాన్ని తెలిపింది.
'నువ్వూ వెళ్ళిపోతే యీ యింట్లో యిద్దరం ఆడవాళ్ళ మే. కష్టంగా వుంటుందన్నయ్యా . యేకంగా అక్కడే వుంటేఏం ?" అమాయకంగా అంది సరస్వతి.
'ముగ్గురిని పోషించాలంటే క్రొత్త వూళ్ళో మాటలు కాదు. యేడాది వోపిక పట్టు. కాలం ఒకేలా వుండదు. మనం సుఖ పడే రోజులూ ముందు వున్నాయేమో యెలా చెప్పగలం?'
సరస్వతి మాట్లాడలేదు. బ్రతుకంతా వొకే లాగ వుంటూంటే యెవరితో యేమని పెచీకి దిగుతుంది? ఏమని వాదిస్తుంది? తన అన్నగారి చదువు అయోపోతే మంచి వుద్యోగం దొరికితే అందరి ఆడపిల్లల మాదిరే తనూ బ్రతక గలదేమో . ఈ ఆశలోనే వూపిరి పోసుకుంది. శ్రీనివాస్ రాజమండ్రి ప్రయాణం ఖాయం అయింది.
* * * *
గోదావరి వొడ్డున పేరు ప్రతిష్ట లున్న కుటుంబాల్లో రామదాసు కుటుంబం వొకటి. రామదాసు తాతలో, ముత్తాత లో యెవరో మతం పుచ్చుకుని క్రైస్తవులు గానే స్థిరపడి పోయారు.
హిందూ, క్రైస్తవుల పండగలు రెండూ రెండు కళ్ళల్లా ఘనంగా చేస్తూ యేడాది పొడుగునా యింటిని పచ్చ తోరణం లాగే వుంచుతారు. పద్మావతి రామదాసు రెండవ భార్య. భర్తకి అడుగులకు మడుగులు వొత్తే ఆ యిల్లాలు అతని కంటికే కాదు నలుగురికీ రంభ లాగే కనిపిస్తుంది. నవ్వుతూ చిటికెన వేలితో గుమ్మం మీద తాళం వేస్తూ అన్నాడు రామదాసు! 'మరోలా అనుకోకు శ్రీనివాస్. నీకు వుండేందు కు యిల్లూ, అవసరం అయితే డబ్బు సర్దుబాటు చేసేందుకూ ....యింకా యేమైనా కావాలన్నా నేను వున్నాను. కానీ.......
'చెప్పండి మావయ్యా. మీరు యెలా చెబితే అలాగే చేస్తాను.
'నాకు తెలిసి వున్న వాళ్ళు అయిదారుగురు యీ వూళ్ళో నే కాలేజీ కి దగ్గర లోనే వున్నారు, నేను మాట్లాడ తాను,'
శ్రీనివాస్ వింటున్నాడు.
'కాలేజీ కి వెడుతూ వెడుతూ భోజనం చేసే యేర్పాట్లు ఆ యిళ్ళల్లో , అతని గొంతు మరి ముందుకు సాగలేదు.
'తప్పకుండా . అలాగే మావయ్యా,' శ్రీనివాస్ కి మొహమాటం కానీ, అభిమానం కానీ అనిపించలేదు. తన తల్లి అంటుండేది. గొప్పగొప్ప వాళ్ళంతా డబ్బున్న కుటుంబాల్లో పుట్టలేదని. నిజమే కావచ్చు. అందరూ అదృష్టాన్ని బొడ్డు లో దోపుకుని పుట్టి వుంటే ప్రపంచం లో బ్రతికేందుకు విసుగ్గా వుండేది అనుకున్నాడు మనసులోనే.
రామదాసు యేది అన్నా అది శ్రీనివాస్ కి జపమాలే అయిపోతుంది. ఆ మాటలే తలుచుకుంటూ వుంటాడు ఆ రోజంతా.
'మనకేం తక్కువ బాబాయ్. ఆయన్నీ యిక్కడే వుండమను. యింతమంది లో మనం ఆయన్ని వోక్కరినీ దూరంగా పంపేసి ....' అంది రామదాసు పెద్ద కూతురు రాజేశ్వరి.
'వుహూ.' రామదాసు నెమ్మదిగా అన్నాడు: 'పాడు ప్రపంచం హర్షించదు. వొంగుని వంకాయా, తొంగుని దోసకాయా తిన్నామనే యెత్తి చూపిస్తుంది. అతని పరువుతో మన ప్రతిష్టలు ముడిపడి పోవాలి. అతని భవిష్యత్ మనం పాడు చేయకూడదు,' రామదాసు లౌక్యం తెలిసిన మనిషి.
రాజేశ్వరి కళ్ళల్లో రకరకాల భావాలు కదిలాయి. శ్రీనివాస్ యింక యేవీ అనలేదు.
