Previous Page Next Page 
మారిన విలువలు పేజి 7

 

    శాంత పెళ్ళి పని మీద పొరుగూరు వెళ్ళి వచ్చిన సూర్యారావు చీకట్లో తడుముకుంటూ , ఇంట్లో అడుగుపెట్టేడు.
    'అమ్మా! కనకం! జానకీ! అంతా ఎక్కడికి పోయారర్రా? ఇంట్లో దీపమైనా లేకుండా తలుపులు బార్లా తెరిచి ఉంచారేం?' కాస్త గట్టిగానే కేక వేశేడు సూర్యారావు.
    అందరి కన్న ముందుగా జానకి గడిచిన గాధల గాలి దుమారం లోంచి తప్పుకోంది. ఎంత మరిచిపోదామన్నా మరపున పడకుండా వెంటనంటేని జ్ఞాపకాలే. జీవిత గతినే మార్పు చేసే సంఘటన లైతే మరీ బలంగా పట్టుకొంటాయి. తలపు కొచ్చిన, ప్రతి సారీ అప్పుడే జరిగిన అనుభూతి ని కలుగజేస్తాయి. అప్రస్తుతమైన ఆలోచనలను పక్కకు తోసి అన్న ముందుకు వచ్చింది జానకి.
    "వచ్చావా', అన్నయ్యా? ఇంకా రేపు కాని రావనుకొంటున్నాం" అన్నది.
    "నా రాక మాటకేం గాని, ఇంట్లో అంతా ఎక్కడి కెళ్ళేరు? వాకిట్లో దీపమైన పెట్టకుండా గదిలో నువ్వేం చేస్తున్నావు?"
    "ఏదో ఆలోచిస్తూ పడుకొంటే నిద్ర వచ్చిందన్నయ్యా! నీ పిలుపుతో మెలకువ వచ్చింది. అమ్మా, వదినా పెరట్లో ఉన్నారేమో?" గూట్లో అగ్గిపెట్టె తీసుకొని లాంతరు వెలిగించింది జానకి.
    వాళ్ళ మాటలు విని, "ఎవరే వచ్చేరు, జానకీ?" అంటూ వచ్చింది సుందరమ్మ.
    "అన్నయ్యోచ్చెడమ్మా."
    "చూడు, కనకం. అబ్బాయి కాళ్ళకి నీళ్ళు పట్టుకురా." కోడలికి పని పురమాయిస్తూ కొడుకు దగ్గర మంచం మీద కూర్చున్నది సుందరమ్మ.
    'అన్నయ్యా,  నా పరీక్ష పాసయింది!" సంతోషంగా శాంత విజయవార్త అందించింది శాంత.
    "ప్రకాశంది ఏమయింది?' సూర్యారావు శాంత వైపు చూడకుండానే ప్రశ్నించేడు.
    శాంత ముఖం చిన్నబుచ్చుకొంది.
    పరీక్ష పాసైన పిల్లను అభినందించకుండా , ప్రకాశం రిజల్టు పై అన్నయ్య ఆత్రం చూపడం జానకికి బాగాలేదనిపించింది.
    "వాడి గురించి మనం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కదా, అన్నయ్యా! కష్టపడి చదివి శాంత పరీక్ష పాసయింది. నాకు చాలా సంతోషంగా ఉంది."
    "శాంత పరీక్ష పాసయిందంటే నాకు మాత్రం సంతోషం కాదుటమ్మా? కాని, చూడు. వాడు మగాడు కదా? గడించుకొని బ్రతకవలసిన వాడు. అందుకే వాడి చదువు విషయంలో నాకు ఆత్రం, బెంగ. శాంతకి ఇప్పుడు రెండు సంబంధాలు చూసివచ్చేనా? ఏది సేటిలయినా ఈ ఏడు పెళ్ళి చేసేద్దాం అనుకొంటున్నాను. అటువంటప్పుడు...."
    "పాసయినా , పోయినా ఒక్కటే." ప్రకాశం లోపల అడుగు పెడుతూ అన్నయ్య మాట పూర్తీ చేసేడు.
    "ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నావురా?' సుందరమ్మ ప్రశ్నించింది.
    "పరీక్ష తగలేట్టుకొని తిన్నగా ఇంటికి రావాలనేనా తోచలేదా?"
    "పాసయితే చెప్పడానికి వెంటనే వచ్చి ఉండేవాడి నన్నయ్యా! మన గురించి చెప్పుకొంది కేం ;లేదు కాబట్టి స్నేహితుల్ని కంగ్రాచ్యులేట్ చెయ్యడానికి వెళ్ళెను. నిజంగా ఈ ఏడు రిజల్ట్స్ చాలా బాగున్నాయమ్మా! రమారమి నాకు తెలిసిన వాళ్ళంతా పాసయేరు."
    "సిగ్గు లేకపోతె సరి, ఆ మాట చెప్పిందికి!" అన్నది శాంత.
    "మధ్యన నా కేందుకే సిగ్గు? రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్న నీకుండాలి సిగ్గు! ఆ అడగడమే మరిచి పోయెను. అన్నయ్యా, ఏమైంది , నువ్వెళ్ళిన పని?"
    "నేనేం పెళ్ళి చేసుకోబోవటం లేదు. నే కాలేజీలో చేరుతాను. నీలా ఒకొక్క క్లాసు మూడేళ్ళు చొప్పున తప్పడం లేదు కదా? అన్నయ్య నన్ను చదివిస్తాడు. నేనూ అక్కలా ఉద్యోగం చేస్తాను" అన్నది శాంత అన్నయ్య ముఖంలోకి చూస్తూ.
    'అవునమ్మా! అలాగే. ఆడపిల్లలు మీరు ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషిద్దురు గాని. మేమిలా రోడ్లనిసర్వే చేస్తూ తిరుగుతుంటాం." అన్నాడు సూర్యారావు ప్రకాశం వైపు చూస్తూ.
    "ఆ మాట నా గురించే అంటున్నావని నాకు తెలుసు, అన్నయ్యా! ఇప్పుడు ఈ ఊర్లో నాకు తెలియని ఒక్క సందు లేదన్నాయ్యా! నే చూడని ముఖం ఒకటి కూడా లేదు. ఈ పరిచయాన్ని , ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చేమో అని ఆలోచిస్తున్నాను."
    "ఆలోచించు , ఆలోచించు. అడుక్కు తినిందికి అ సందులు, ఈ పరిచయాలు పనికొస్తాయి." అన్నాడు సూర్యారావు కోపంగా.
    "అన్నయ్యా , ఒక్కమాట చెప్పనా? నా కంఠం లో ప్రాణం ఉండగా ఒకరి ముందు చెయ్యి జాపి అడుక్కొను. నాకు బుద్ది బలం లేకపోతె దేహబలం ఉంది. మీరు మీ తెలివితేటల్ని అమ్ముకొని బ్రతుకుతుంటే నేను నా కండల్ని అమ్ముకొని బ్రతుకుతాను."
    "కండబలంతో ఏం చేస్తావోయి?తాపీ మేస్త్రీ వెనక ఇటుకలు మోస్తావా? రైలు స్టేషను లో లైసెన్సు కూలీ పని చేస్తావా?"
    "ఏదైనా చేస్తాను, అన్నయ్యా! బ్రతికిందికి ఏమి చేసినా , దొంగతనం, యాచన మినహా , తప్పు లేదని నా అభిప్రాయం. కాయకష్టం చేయడం అవమానం కాదని మనం తెలుసుకోగలిగితే , ఈనాడు మనం ఎదురుకొంటున్న నిరుద్యోగ సమస్య చాలావరకు తీరిపోయి ఉండేది."
    "మరేం! ఆ సమస్య లేకుండా  చేసిందికే భగవంతుడు నీలాటి మట్టి బుర్రల్ని కొందరిని సృష్టిస్తుంటాడు."
    ప్రకాశం తనక్రాప్ లోచేయ్యి దూర్చి బుర్ర తడుముకొని , "అన్నయ్యా! నువ్వేదో అనుకొంటున్నావు. కాని, ఈ బుర్ర చాలా మంచిదన్నయ్యా. ఒక్కచదువు లోనే సాయం చెయ్యనని మొండి కేసుక్కుర్చుంటుంది కాని, ఉండుండి ఎలాటి సలహా లిస్తుంటుందనుకున్నావు?' అన్నాడు.
    "నిజంగానా , ప్రకాశం!' అంతవరకు నోరు తెరచుకొని ప్రకాశం మాటలు ఆశ్చర్యంగా వింటున్న కనకం ప్రశ్నించింది.
    "మరేమిటనుకొన్నారు వదినా! ఇంక ప్రకాశం ఆర్జనపరుడు కాబోతున్నాడు. జేబులో డబ్బులు గల గలా గలగలా మోగవలసిందే!"
    "నిజం?" నమ్మలేక మళ్ళా అడిగింది కనకం.
    "ఎందుకా సంశయం, వదినా? నేను మీతో ఎప్పుడైనా అబద్దం చెప్పేనా?"
    తన చిన్న మరిది ఈ వయస్సులోనే ఆర్జించబోతున్నాడంటే కనకం సంతోషం పట్టలేకపోయింది. "చూసేరా , అత్తయ్యా! ఇంకా చిన్నపిల్లాడు అనుకొంటున్న ప్రకాశం ఎంతలో పెద్దవాడాయిపోయెడో! అన్నకన్న ముందు తనే ఆర్జన మొదలు పెడతాడట. వదిన గారికి అక్షర లక్ష లిచ్చి కనకాభిషేకం చేయిస్తారుట -- తోడబుట్టిన అప్పచెల్లెల్ని , రెండు రోజులై కొంచెం మల్లెపూలు తేరా అంటే గతిలేదు కాని!" శాంత అన్నను దెప్పి పొడిచింది.
    "కొంచెం రోజులు ఓపిక పట్టవే, శాంతా! నీక్కావలసినన్ని మల్లె పూలు రోజూ తెచ్చి పెడతాను."
    "అయితే మరిదీ! అన్ని పూలు మీ చెల్లెలి కెనా?" నాకేమైనా భాగం పెడతావా?"
    "ఎవరైనా మీ తరువాతే , వదినా" అన్నాడు ప్రకాశం వదిన గారి వంక అభిమానంగా చూస్తూ.
    "నాకు తెలుసులేవోయి. ఈ మాటలన్నీ ఆవిడ గారు వచ్చే వరకే!" నవ్వుతూ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది కనకం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS