"బర్మా వెళ్ళొచ్చినందువల్ల మీ అమ్మ మమ్మల్నందర్నీ మర్చి పోయిందేమో గానీ, మా ఆవిడకి సాక్షాత్తూ పినతల్లి కూతురే మీ అమ్మ. మా ఊర్లో వారాలు కుదిర్చి మా ఇంట్లోనే మఖాం పెట్టుకోమని నే పంతులుగా వున్న బల్లోనే చదువు చెప్పాను మీ నాన్నకి.
'ఆ తరవాత ఈ సమ్మంధం మాట్లాడి పెళ్ళి చేయించా. నలుగురు పెద్ద మనుషుల్తోటి సిఫార్సు చేసి ఆ చందా మీద జీతం కట్టుకుంటూ మెట్రిక్యూలేషన్ చదువు కుందుకు వసతులన్నీ ఏర్పరచింది నేనే ననుకో. ఏదో అప్పుడు నా దగ్గర నుంచి మంచి మోతుబర్లు , కమ్మలూ! రెడ్డి బిడ్డలూ చదువు తుండేవారు గనకా అవన్నీ చెయ్యగల్గాను. సరి అతడూ తెలివైన వాడూ గనక చేసిన ఉపకారం సార్ధకం అయ్యేటట్టు ఇంత వాడయ్యాడనుకో! నాకెంతన్నా ఆనందంగా వుందమ్మా! ఒస్తా' అంటూ బయల్దేరాడు. అదృష్టంతో మీ అమ్మ కళ్ళు నెత్తి కెక్కి ఇంతటి ఉపకారాన్ని, మరిచి గర్వపడుతుంది సుమా' అన్న భావాన్ని చెప్పకుండానే వెళ్ళి పోయాడు, ఆచోకీల్లాగడం లో, అతి నేర్పు గల ఆ పంతులు తనని వుండమన్లేదన్న కోపం కొద్దీని.
'అలాగా? అంటూ హృదయ పూర్వక మైన వో నమస్కారం పెట్టి ఆయన్ని సాగనంపి లోపలి కెళ్ళిపోయింది లీల.
ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుండడం! తన పూర్వ పరిస్తితినిమరిచి కాస్త తక్కువలో వున్న బంధువుల్నీ, స్నేహితుల్ని చులకన చేస్తుండే తల్లిని పిల్లలంతా మండలిస్తూండడం తరచూ పరిపాటే.
'రాత్రి పొద్దుపోయాక గుంటూర్నుంచి తిరిగొచ్చిన దత్తు గారితో రాధ లేకపోవడం చూసిన రాజమ్మ గారు 'రాధని తీసుకు రాలేదేం?' అన్నారు తెల్లబోతూ.
'రాధనా? ఇప్పుడా? ఎందుకూ అన్నారు ఆశ్చర్యంగా, అయన.
'అయ్యో రామా అయితే మీరిప్పుడు గుంటూరెందుకెళ్ళినట్టూ.'
'ఎందుకేమిటి , వో ముఖ్యమైన పనుండి వెళ్లాను, అసలు--
'రేపు ప్రయాణవన్నది జ్ఞాపకం వుందా?'
'ఆ? అయినా వెనకటికి మన మురళి కి సీటు కోసం శర్మ గారికి రాసినందుకే, ఏదో అక్కడికి మన హోదా కేదో తగ్గిపోయి నట్టుగా విసుక్కున్న దానివే, ఇప్పుడు ' సకుటుంబ సపరివార సమేతంగా వారింట్లోనే దిగుదాం.' అనడం లో అర్ధం వేవిటో, నాకు బోధపడడం లేదు' అన్నారు పచార్లు చేస్తూ.
'ఒకప్పుడు మీ కంతకన్నా తోచిందేవిట్లేండి' చిరాకు పడిందావిడ.
'అదికాదు నాన్నా, వారింట్లో పెళ్ళీ కున్న అబ్బాయి చాలా చక్కని వాడనీ గొప్ప మేధావి , మురళి చెప్పాదులే. అప్పట్నుంచీ వారి మీదున్న లోకువ భావం గౌరవ భావంగా మారిపోయి నట్టుంది అమ్మకి,' అంది కిటికీ లో కూర్చున్న లీల.
'అయితే నిజంగా రాధకి పెళ్ళి ప్రయత్నం చేద్దావనేనా. ఏవిటి నీ అభిప్రాయం. అన్నారు ఆవిడ మొహం లోకి చూస్తూ.'
'మరి నిజంగాకాక అబద్దంగా అంటారా ఏవిటి?'
'ఎవరికీ? మా రఘుకే? ఈ రాదనే? రామరామ . అతన్ని తల్చుకుంటే జాలేస్తుంది నాకు' హాస్యానికి ముక్కేగబీలుస్తూ అన్నాడు మురళి.
'చాల్లేరా, మనవాళ్ళే మన పిల్లల్నిలా అంటుంటే ఇక పరాయి వాళ్ళ మాట చెప్పాలా!' విసుక్కున్నారావిడ.
'అబ్బ, అతనంతకంతా లోస్వభావం గలవాడు. దీన్నెంత తొందర బుద్దో-- అతన్దంత మనో నిబ్బరం గలవార్ని ఎక్కడో గాని చూళ్ళెం అసలు. ఏదో సామ్యం చెప్పినట్లు, మడుక్కీ, మహా పర్వతానికి భేదం వుంది సుమా' అని చెప్పాను. ఇద్దరి స్వభావాలు, బాగా ఎరిగున్న వాణ్ణి గనక. ఆ పైన నీ యిష్టం. అయినా ఈ లీల కన్నా రాదేంతో నయవేలే. దానికి అందంగా వున్నానన్న గర్వం వున్నా, ఏదో 'నీ అంతటిది లేద'ని పొగడితే నన్నా కాస్త మాట వింటుంది. అదీ లేదుగా ఈ లీలకు. ఉత్త మొండి ఘటం . అన్నాడు కళ్ళూ ముక్కూ చిట్లిస్తూ మురళి తమాషాకి.
'ఏయి. నన్నీడుస్తా వెందుకూ మధ్యనా' కసిరింది లీల.
'నువ్వక్కడ కిటికీ లో కూర్చుంటే, నేనిక్కడ అమ్మ దగ్గర కూర్చున్నా గదా. నిన్నీడ్చానంటే నమ్మదుటే ఎవరై నానూ.' అభినయం తో కూడా అన్న ఈ మాటలకి అంతా ఫక్కున నవ్వారు. నోట్లో ఉన్న తాంబూలం పొరబోయి ఉక్కిరిబిక్కిరయ్యారు రాజమ్మగారు.
'ఏం వాగుడ్రా . మురళి. ఎన్నేళ్ళు వచ్చినా ఒకలాగే వున్నావ్.' అన్నారు భార్య తల మీద తడుతూ దత్తుగారు. రాజమ్మ గారికి సర్దుకుందుకు వో అయిదు నిముషాలు పట్టింది.
'అయితే నిజంగానే ఆ అబ్బాయంత పట్టుదల, స్వభావం గలవాడంటావా?' అన్నారు మళ్ళీ రాజమ్మ గారు సందేహం జంకూ కలిసిన గొంతుకతో.
'ఆ అందులో సందేహం ఎంత మాత్రమూ లేదు అన్నాడు ఖచ్చితంగా మురళి.
'ఆ, ఈ పట్టుదల్లూ ఈ అలవాట్లూ అన్నీ మాయమై అమ్మగారి చేతి మైనమైన వాళ్ల నెందర్నీ చూళ్ళేదు పోనిద్దూ ఎవరి దాకానో ఎందుకూ మీ అన్నగారేం చేశాడనీ' చివరి మాటల్ని మూతి విరుస్తూ అసూయ తో అన్నారావిడ.
'హు. అన్నయ్య కేం తక్కువ. అన్ని విధాల అంత యోగ్యురాలైన వొదిన దొరికాక. నిజం చెప్పాలంటే ఒక్క అన్నయ్యే కాదు. మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులం. అంత శాంతి సహనాలు గల ఒదిన మనింటి కోడలై నందుకు' అంటూ లేచాడు ఆవలించి ఒళ్ళు విరుచుకుంటూ మురళి.
'మరి ఆ రాధ రావడం మాటే విట్రా?' అన్నారు గొంతు సవరించుకుంటూ ఆవిడ.
'రాధ రేపు మధ్యాహ్నం దాని స్నేహితురాలు రోహిణి వాళ్ళ కార్లో ఒస్తుందే! పొద్దున్నేదో స్పెషల్ క్లాసుందిట అందుకని నాతొ రానంది..'
'ఇదేం మనిషమ్మా? మరి ఇందాక 'రాధా! రావడావా' అన్నారూ!' తృప్తి తో కూడిన దొంగ కోపంతో అన్నారావిడ.
'బతికాను . నన్నేక్కడ 'టెన్నిస్ ' ఒదులుకుని పొమ్మంటావోనని హడలి పోయా!' అన్నాడు మురళి.
"నీ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయిలే గాని నీ చిన్న కూతురంత సుళువుగా ఒప్పుకుంటుందా ఈ ప్రయత్నానికి.'
'ఆ. ఒప్పుకోకేం చేస్తుందీ?' పై కేదో ధైర్యంగా అన్నారే గానీ. ఆవిడకి లోలోపల ప్రాణాలు పీచు పీచు మంటూనే వున్నాయి. రాధ ఎక్కడ ఎదిరిస్తుందోనని.
అదీ నిజమే. స్వతహాగా గర్వి అయిన రాధ, అంత సుళువుగా పెద్ద వాళ్ళ ఏర్పాట్లు కొప్పుకోవడం! అందులోనూ ముక్కూ మొహం ఎరగని వాళ్ళింట్లో దిగడానికి. అందరికీ ఇది ఆశ్చర్యంగానే ఉంది. అయితే తన స్నేహితురాలు రోహిణి వల్ల రఘుని గురించి తెల్సుకున్నప్పట్నుంచీ అతన్ని గురించే కలలు కంటున్న రాధ 'అందుకేధన్నా సందర్భం లభించక పోతుందా' అని ఎదురు చూస్తున్న సంగతి వాళ్ళందర్నీ కి ఏం తెలుస్తుందీ? పాపం?'
'అది ఒప్పుకోవడం మాటలా వుంచు. అసలిలా పిల్లని తీసుకెళ్లడం. మన్లో సంప్రదాయం వుందా. అని.' అన్నారాయన.
'ఆ, ఏ కాలపు మాటలు మాట్లాడుతున్నారు మీరు!' అంటూ అయన ఆలోచనని మొదట్లోనే కొట్టి పారేశారావిడ. అప్సరస లాంటి తన కూతుర్ని ఏదో ఒక విధంగా రఘు కంట పడేటట్టు చేస్తే ఇక పెద్ద వాళ్ళ వద్ద ప్రాధేయ పడాల్సిన అవసరం ఏమీ లేకుండా పెళ్లి కుదిరిపోతుందన్న నమ్మకం ఆవిడకి.
'అన్నట్టు ఏం చెప్పాలో వాళ్లతో గుర్తుంచుకున్నారా. లేకపోతె తీరా సమయానికి వోదాని కొకటని, లేని ఇబ్బందుల్ని తెచ్చి పెడతారా?' కోడల చుట్టు పట్లేక్కడన్నా వుందేమోనని నాలుగు వేపులా వోసారి పరకాయించి మరీ అందావిడ.
'గుర్తుంది గాని అయినా మరోసారి కనుక్కోవడం ఎందుకన్నా మంచిదిలే. అంటే కట్నం ....లంచానాలూ వగైరా ....ఆ తర్వాత పిల్ల ఒంటిని పెట్టాల్సిన --
'నా మొహం కాదూ? ఇంకా నయం ఎందుకన్నా మంచిదని అడిగాను గనక సరిపోయింది'.... మాట మధ్యలోనే విసుక్కుంటూ అన్నారావిడ.
'ఏం, మరి--'
'అది కాదు నాన్నా-- ఇవన్నీ మాకు పిల్లని మాట్లాడేటప్పటి కోసరం తయారు చేసిన కోశ్చెన్ పేపర్. మన పిల్లకి పెళ్లి మాటలంటే పూర్తిగా దీనికి వ్యతిరేకంగా వుండాలిగా ఆ అడిగే ప్రశ్నలూ !- నవ్వుతూ అన్నాడు మురళి.
'వోహో . అదా? మర్చిపోయా మర్చిపోయా, అన్నారు. గడ్డం తడువుకుంటూ ఆలోచనగా.' మరి ఆ అడ--
'మహా ప్రభో. మీరేవీ అడగనూ వద్దూ తెల్సుకోనూ వద్దూ. మీ సొంత విషయాలేవో మీరు చూసుకుని రయిలేక్కండి చాలు' అన్నారు. లేచి వెళ్ళిపోతూ ఆవిడ. బతికేంరా బాబూ, అనుకుంటూ ఆయనా గడగడా గ్లాసుడు పాలు తాగేసి పై కెళ్ళి పోయారు.... మురళి మాత్రం నామకానికి పుస్తకం ముందుంచుకుని మనసంతా నళిని మీద పెట్టుకుని చాలాసేపటి వరకూ అలా టేబిల్ లైట్ వద్ద కూర్చునే వున్నాడు. అంతవరకూ పరపరా ఇల్లు కడుగుతూ, గరిటెలూ, గిన్నెలు గల గలా చప్పుడు చేస్తూ యేవో వంటింటి పనుల్ని చక్క పెట్టుకుంటున్న అయ్యరు రాజమ్మ గారు లేచి వెళ్ళిపోయిన చడి వినగానే మెల్లిగా వోసారి లోపల్నించి గడియారం వంక చూసి దబదబా మిగతా పన్లు చక్కపెట్టేసుకు వొచ్చి 'కొంచెం సినీమా పాటలు పెట్టుమ్మ' అంటూ రేడియో కెదురుగా చతికిలబడ్డాడు, తమలపాకుల పెట్టెతో సహా.
* * * *
