"ఏం లేదు మీరు వస్తే మంజుల సంతోషిస్తుంది" అంది ఏమనాలో తెలియక.
"మీరు దుఃఖిస్తారటనా?"
సంభాషణ ఇంతవరకూ రానిచ్చినందు కే మదన పడుతున్న ఇందిర కు ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. మాట్లాడకుండా టక్కున టెలిఫోను పెట్టేసింది. ఛీ తనెందు కలా మాట్లాడాలి? అంతనేమనుకుంటాడో , అసహ్యంగా!
ఈ ఆలోచనలతో నిద్ర మత్తు పూర్తిగా వదిలి పోయింది. అతను తన్ని చచ్చేట్లు వేళాకోళం పట్టించవచ్చు! లేకపోతె అవమానించ వచ్చు. ఏం చేసినా అతన్ని అనడానికి వీల్లేదు. మంజుల వచ్చేదాకా అలాగే చింతిస్తూ కూర్చుంది ఇందిర. మంజుల ఇంటికి రాగానే ఆమెకి చెప్పింది, "మాధవరావు ఫోన్ చేశాడు......అత్త సంగతి అడిగాడు." అంటూ.
"చూసి పొమ్మనలేక పోయావా?"
"చెప్పాను, వస్తే రమ్మని. " తేలిగ్గా ఊపిరి పీల్చింది ఇందిర. ఔను. కేవలం సభ్యత కోసం చెప్పానని అతనను కోవచ్చు. అందులో తప్పేం లేదు అని సమాధాన పరుచుకుంది. ఆమె తనను తాను. దురుసగా టెలిఫోను పెట్టేసింది కాబట్టి అతనేలాగూ రా ప్రయత్నించడివాళ అనుకున్నాక మనస్సు కొంచెం తేలిక పడింది. కానీ ఆ నిబ్బరం ఎంతసేపో నిలవలేదు. సరిగ్గా ఆరు కొట్టేసరికి కాలింగ్ బెల్ మోగడమూ, నాయర్ వెనకే హుందాగా నడుస్తూ మాధవరావు డ్రాయింగ్ రూము లోకి అడుగు పెట్టడమూ జరిగాయి. అతని రాక వల్ల కలిగిన ఆశ్చర్యమూ, అంతక్రితం తను తీసుకున్న చొరవ జ్ఞాపకం రాగా కలిగిన సిగ్గూ ఆమె కళ్ళల్లో కదలాడాయి. కుర్చీ లోంచి లేచే ప్రయత్నం కూడా చెయ్యకుండా చేతులు జోడించింది. అతను చిరునవ్వుతో నమస్కరించి గోపాలరావు గారిని గురించి అడిగాడు మంజులను.
"నాన్నగారి[ప్పుడే రారు. ఆలస్యంగా వస్తానన్నా రివాళ" అంది మంజుల.
"అమ్మ కెలాగుంది?"
"అట్టే తిరగడం లేదు. నొప్పి తగ్గిందట చాలావరకు."
"ఒకమాటు చూడచ్చా?"
"తప్పకుండానూ. రండి లోపలికి ." మంజుల దారి తీసింది. మాధవరావు బుద్ది మంతుడిలా ఆమె వెనకాలే వెళ్ళాడు. హల్లో ఇందిర ఒంటరిగా మిగిలిపోయింది. అరగంట అయ్యాక మాధవరావు ఒక్కడే తిరిగి గదిలోకి ప్రవేశించాడు.
ఇందిరకు సరిగ్గా ఎదురుగా కూర్చుని "ఏమిటి విశేషాలు?" అని అడిగాడు.
"మీరే చెప్పండి." గొంతు పెగల్చుకుని సమాధాన మిచ్చింది ఇందిర.
"నేను చెప్పగలిగిన వన్నీ మంజుల చెప్పేసి ఉంటుందీ పాటికి. మరి, మీరేం చేశారు నిన్న?" ఆ కవి పుంగవుడు విచ్చేశాడా?"
అంత సౌమ్యంగా అతను అడగటం చూసి నిజంగానే అన్ని విశేషాలు చెప్పాలని పించింది ఇందిరకు. తను అమెరికన్ల తో కలవడం, సాహిత్య సభకు వాళ్ళతో వెళ్ళడం చెప్పింది. ఆ తరవాత జోగీందర్ తటస్థపడిన విషయం చెప్పినప్పుడు మాత్రం అతను కుర్చీలో ముందుకి వంగి , అరచేతికి గడ్డం ఆనించుకుని , కళ్ళు చిన్నవి చేసి ఆసక్తి తో వినడం గమనించింది.
"మంజుల ప్రత్యర్ధి అతనేనా?' మాధవరావు నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.
మంజుల కోపం, పరుషోక్టులూ గుర్తుకి వచ్చాయి ఇందిరకు. తనకు తెలియని వాళ్ళు ఇందిరకు స్నేహితులయితే మంజుల తన కేదో అన్యాయం జరిగినట్టు బాధపడుతుంది. పిచ్చి మంజుల! ఆమె అసహనం ఎంత అసందర్భామో చెప్పింది ఇందిర అతనితో. జోగీందర్ తనకెంత సన్నిహితుడో , అతని చెల్లెలు పోయిన తరవాత అతని తల్లి దండ్రులు తన్ను చూసి ఎంత ఊరడిల్లారో అతనికి వివరంగా తెలిపింది.
అంతా శ్రద్దగా అతను విన్నాడు. ప్రపుల్లమైన వదనంతో చురుగ్గా మాటలందిస్తున్న అతన్ని చూసి, చటుక్కున తెలివి తెచ్చుకుంది ఇందిర. 'తను ఎంతగా వాగుతుంది!' మంజుల కు కూడా ఇంతవరకూ జోగీ ని గురించీ, కిరణ్ ని గురించీ చెప్పలేదు. మాటలాడి సంకోచిస్తూ కూర్చున్న ఇందిర ను కదిపాడతను.
"ఇంకా ఏం చేశారు నిన్న?"
"ఇంకేం లేదు."
"చిత్ర ప్రదర్శన ఎలాగుందింతకీ? వార్త పత్రికల్లో మాత్రం మంచి విమర్శలు వచ్చాయి."
తన స్నేహితుల సంగతి అంతవరకూ చర్చించిన ఇందిర కు, తనకు సంబంధించిన విషయాన్ని గురించి మాట్లాడ్డం తేలిక అనిపించింది. అందుకే హుస్సేన్ పాయ్ చిత్రాలను చూసిన అమెరికన్ల భావాలు, ఉద్దేశాలు చెప్పి, కొన్ని చిత్రాలు తమ కేవ్వరికీ అర్ధం కాలేదంది.
"పాయ్ పెయింటింగు లు మీ కర్ధమవుతాయా, సాధారణంగా?' ప్రశ్నించింది ఇందిర.
అతను ఆసక్తి తో ఆమె వంకే చూస్తున్నాడు కుర్చీలో జేర్లబడి కూర్చుని. అతని అందమైన వెడద కను దోయిలో ఏదో వింత వెలుగు కనబడుతుంది.
క్షణం సేపు చిత్రంగా అతని వంక చూసి గట్టిగా అంది, "మీరు వినటం లేదు బొత్తిగా" అని.
"ఏమిటన్నారు?' అప్పుడే నిద్రలేచిన వాడిలా తల విదిలించి అడిగాడు.
"ఉహూ , మీరు అసలు విననే లేదు. నేను బాగా బోరేత్తించి ఉంటాను. ఔనా?"
"అబ్బెబ్బే, మీరెంతో చక్కగా మాట్లాడారు. ఎంతో హాయిగా ఉంది వింటుంటే . నిజం ఎందుకండీ అంత నవ్వు?"
"లేకపోతె ఎడవ మన్నారా ఏం? ఈ మేడ ఎంత శ్రావ్యంగా ఉంది అన్నట్టుంది మీ పొగడ్త . నేనన్నదేం విననన్నా లేదు కాని, మాటల్లో సొగసు గ్రహించారన్న మాట."
'ఆహా, మాటల్లోని సొగసూ, మనిషి లోని సొగసూ కూడా గ్రహించాను. ఇంతకీ మీరడిగిందేమిటి?"
"ప్రశ్న."
"అదే, ఏమిటీ?"
"లక్ష్మణ్ పాయ్ "ఎల్లో బర్డ్ ' కు అర్ధం చెప్పగలరా అని అడిగాను."
"నేనింత వరకూ చూసినట్టు లేదా చిత్రాన్ని. చూపించండి, క్షణం లో చెబుతాను."
"నేనింకా చిత్రాలు కొనడం మొదలు పెట్టలేదు లెండి."
"పోనీ, ఆ చిత్రం ఉన్న చోటికే తీసుకు వెళ్ళండి , చూపించండి. అప్పుడు మాట్లాడుదురు గాని" సవాలు చేశాడు.
"అసలు మీకు మోడర్న్ ఆర్ట్ అర్ధం అవుతుందా? ముఖ్యంగా మీకు పాయ్ చిత్రా అర్ధమవుతే కదా నాకు చెప్పడానికి."
"ఆహా, అర్ధం అవుతాయండి....నిక్షేపంగా అవుతాయి. ఏవన్నా బ్రహ్మవిద్యా అంత కొరుకుడు పడక పోవడానికి? పాయ్ అంటే ఆడపిల్లల కళ్ళని నిజంగా నక్షత్రాల్లా గా వేస్తాడు, అతనే గదూ?"
"మరే.."
"చెప్పండి, నన్నెప్పుడు తీసుకు వెళ్తారో ప్రదర్శన కి?"
"నేను తీసుకు వెళ్ళేదేమిటి , మీరు ఎయిఫాక్స్ హాలుకి వెళ్లి చూసిరవచ్చు."
"అదేం కుదరదు."
"మరీ మంచిది."
"ఏమిటంత వాదించు కుంటున్నారు?" మంజుల ప్రవేశించింది.
"తల్లి గారి సేవలో మునిగియావేమిటి, మంజులా , ఇంతసేపూ?" మాట తప్పిస్తూ అడిగాడతను.
"మరే , కాలికి కాస్త అమృతాంజనం రాశాను. అమృతాంజనం ఇందిరే బాగా రాస్తుందండీ..."
"అయ్యో, నన్ను పిలవక పోయావా, మంజూ?"
"ఏం, ఇంకో సర్టిఫికేట్ కొట్టేద్దామనా? నేనూ బాగానే రాశానులే. విచారించకు."
"ఇంక నేను పోతాను. మంజులా, నాన్నగారితో చెప్పు వచ్చి వెళ్లాను అని." అతను లేచాడు.
"బాగుంది . నేను రాగానే మీరు వెళతా నంటున్నారు."
"నేను వచ్చిన పని అయిపొయింది . నీతో చెప్పి వెళదామనే ఆగా నింతవరకూ. నాకూ వేరే పని ఉంది. పోవాలి" అని ఇందిర వంక చిరునవ్వుతో తల ఊపి , మంజుల తో పైకి వెళ్ళాడు.
అతనితో ఎప్పుడూ లేనంతగా వాగినా, తప్పు చేసినట్టనిపించలే దామెకు. ఎందుకో మనస్సంతా తృప్తి తో నిండిపోయింది.
* * * *
మరునాడు క్లాసులో ఉండగా ఫ్యూన్ వచ్చి చెప్పాడు, ఇందిర కోసం ఎవరో టెలిఫోన్ చేశారని.
"నంబర్ నోట్ కర్ కే రఖో, బాద్ మే కరేంగే హమ్" అంది ఇందిర.
"నహీ , సాహెబ్ , బహుత్ అర్జంట్ కహతీ"
ఇంత అర్జంటు గా ఫోన్ చేసినదేవరా అని ఆలోచిస్తూ క్లాసు లోంచి పైకి వచ్చింది ఇందిర. "హలో" అని అవతలినించి వినవచ్చిన గొంతు గుర్తు పట్టేసింది ఆమె-- మాధవరావు ! ఆమె కంతా అర్ధమయి పోయింది చిటికెలో.
"ఏమిటి ఈ సాయంత్రం 'ఎల్లో బర్డ్' ని చూపిస్తారా, లేదా?"
"చూడమన్నానుకదా, దీనికేనా అర్జంటన్నారు? నేను క్లాసు వదిలి వచ్చాను, చప్పున తేల్చండి."
గట్టిగా నవ్వు వినిపించింది అవతలి నుంచి.
"హాలో, నేను విద్యార్ధినే ప్రస్తుతం. మీకు ఇతరత్రా ఏమన్నా వ్యాపకాలున్నాయా, ఈ సాయంత్రానికి?"
క్షణం అలోచించి లెవంది ఇందిర.
"మరయితే మూడింటి కల్లా కాలేజీ కట్టి పెట్టి తయారుగా ఉండండి. ఎయిఫాక్స్ వెళదాం."
"లాభం లేదు . మూడు పదికి నాకు ఆనర్స్ క్లాసుంది. నాలుగింటికి ఒక్క నిమిషం ముందుగా రాలేను."
"మీ అజ్ఞ. అయితే సరిగ్గా నాలుగింటికి తయారుగా ఉండండి. ఇక మీరు మీ క్లాసుకి పోవచ్చు. గుడ్ బై' టెలిఫోను పెట్ట్టిన చప్పుడు.
మెత్తగా నవ్వుకుంది ఇందిర. కానీ వెంటనే గుర్తు వచ్చింది తను జోగీ ని కలుస్తానని మాట ఇచ్చిన సంగతి. జోగీ ఆఫీసు కి వెంటనే డయాల్ చేసింది.
"జోగీ, ప్లీజ్ , నేను సాయంత్రం రావడం లేదు. ఏమనుకోకు. ఇంకెప్పుడైనా చెబుతాను కారణం. నన్నడక్కు ఇప్పుడు, ఏం? థాంక్స్."
ఫోను పెట్టేసి క్లాసు లోకి వెళ్లి పాఠం సాగనిచ్చింది.
"మై బాయ్ ఫ్రెండ్ సిరిల్ టెలిఫోన్ మీ, సే ఇట్ ఇన్ ద నెగిటివ్, శశీ."
క్లాసంతా చిలిపిగా నవ్వారు.
కాస్త కోపం నటిస్తే గాని మళ్ళీ ధోరణి లో పడలేదు.
టంచన్ గా నాలుగింటికి కాలేజీ గేటు దాటింది ఇందిర. గేటు పక్కగా నిలబెట్టిన కారు లోంచి దిగి "రండి ఇటు" అన్నాడు మాధవరావు. అతని వంక నడిచిందామె. కారు ముందు తలుపు తీసి పట్టుకుని , ఆమె కూర్చున్నాక తలుపు వేసి, తల లోపలికి పెట్టి "మీరు చాలా పంక్చువల్ గా వచ్చారు" అన్నాడు.
"థాంక్స్. కారు నడిపే ప్రయత్నం ఏమన్నా చెయ్యదలుచు కున్నారా , లేదా?"
"ఎందుకండీ అంత శ్రమ? ఇది కారు కాదు పుష్పక విమానం రెక్కలున్నాయి దీనికి. ఎగురుతుంది. తెలుసా." డ్రైవింగ్ సీట్లో కి వచ్చి కారు స్టార్టు చేస్తూ అన్నాడతను.
'అలాగా! మీకు పుణ్య ముంటుంది. వైకుంఠం లో మాత్రం డ్రాప్ చెయ్యకండి నన్ను."
ఇంకేం మాటలు పెంచకుండా కారు తిన్నగా పోనిచ్చాడతను. పరిసరాలు గమనించే స్థితిలో లేదు ఇందిర, రోడ్డు మీదికి దృష్టి నిలిపిందే గాని, ఏదో సాహస కృత్యం చేయబోతున్నట్టు, హడావిడిగా గుండెలు కొట్టు కుంటున్నాయి. అర్ధం లేని తన్మయత్వంతో కళ్ళు సగం మూసుకుని, సీట్లో జార్లబడి కూర్చుంది. చటుక్కున కారు ఆగగానే చుట్టూ చూసింది. హోటల్ లాగూవా ముందు ఆగిందా కారు. తలుపు తెరిచి పట్టుకుని మాధవరావు నవ్వాడు 'దిగుతారా? దింపాలా?"
"పాయ్ పెయింటింగు లు లగూనా లో ప్రదర్శిస్తున్నారని నే చెప్పిన గుర్తు లేదు."
"నాకు గుర్తుంది కానీ దిగుదురూ."
"ఉహూ . ప్రదర్శనాలకు తీసుకు వెడితే సంతోషిస్తాను, ప్లీజ్."
"నాకు మహా చెడ్డ ఆకలి వేస్తుంది. ఇష్టం లేకపోతె మీరు ఏం తీసుకోనక్కర్లేదు. వచ్చి కూర్చుంది కంపెనీ కి." బ్రతి మాలుతున్నట్టున్నాడు.
"పదండి." అని దిగిందామె కారులోంచి ఏం చెయ్యలేక.
ఒక కాఫీ తప్ప ఏం ముట్టుకొని ఇందిరను చూసి "లావేక్కుతారని భయమా?' అని ఎగతాళి చేశాడతను.
జవాబివ్వలేదు ఇందిర.
"మీరు నిరాహారదీక్ష పూనారు కాబట్టీ చప్పున గాలరీ కి వెళ్ళడమే మంచిది" అంటూ లేచి పైకి వచ్చాడు.
హల్లో అడుగుపెట్టాక ఎందుకు వచ్చానా ఇతనితో అని అనుకుంది ఇందిర. సగానికి పైగా చిత్రాలు వివిధ భంగిమలతో ఉన్న నగ్న స్త్రీలవి.రెండు రోజుల క్రితమే ఇద్దరు యువకులతో అదే చిత్రాలను తిలకించి మంచి చెడులను చర్చించిన ఇందిర కు, అవే చిత్రాలను ఈతని తో చూడటం చాలా కష్ట మనిపించిందెందుకో. ఒళ్ళంతా గ్లూకోన్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు వేడెక్కగా , చేతిలో నున్న కేటలాగు చదువుతూ నుంచుండి పోయిందామే. అతను మాత్రం చూడదలుచుకున్న చిత్రం నంబరు కేటలాగులో వెతికి, సరాసరి దాని దగ్గిరికి వెళ్ళాడు. ఆ చిత్రం లో ఒక నగ్న స్త్రీ ఒయ్యారంగా పడుకున్నది. చక్కని రంగులతో దృష్టి నాకర్షించే నేపధ్యానికి చూపు పూర్తిగా పోనీయకుండా నిలుపుతున్నది ఒక చిన్న పచ్చ పిట్ట , పడుకుని ఉన్న యువతి నడుం మీద నుంచుని. పూర్తీ అయిదు నిమిషాల పాటు తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ నుంచున్నాడు మాధవరావు.
