"బావకు ఉత్తరం రాయరాదూ తీసుకు వెళ్ళమని. అయన మాదిరి నువ్వూ భీష్మించుకుని కూర్చుంటే ఎలా అన్నాను.
"ఆయనకు నేనక్కర్లేక పొతే బ్రతిమాల మంటావా. నాకేం పట్టింది." అన్నది. ఈ మాటకు నవ్వాలో, ఏడవాలో తోచక బాధపడ్డాను.
"సరేగాని ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోరాదుటే" అన్నది చేత్తో చూపిస్తూ. అటు చూశాను. శ్రావణ కుమార్ , మమ్మల్ని చూసి ఇటు వచ్చాడు.
'ఓ, గుడీ వినింగ్ , షాపింగ్ కు వచ్చారా" తనూ మా ఎదురుగా కూర్చున్నాడు.
"కాదు, గాలి మేద్దామని. ఈ హాలు చూస్తుంటే భారీ ఎత్తున వేసే టిక్కెట్టు లేని నాటకాలా ఎంతసేపు కూర్చున్నా కాలం గడిచి పోతుంది." అన్నాను.
అతనూ నవ్వి, "నేను కాలక్షేపానికే వచ్చాను." అన్నాడు.
పక్కనున్న కూల్ డ్రింక్ షాపు నుంచీ మూడు ఐస్ క్రీం లు తెచ్చాడు. మా ఇద్దరికీ చేరోకటి ఇచ్చి తానొకటి తీసుకున్నాడు. ఏదో మర్యాద కు అతను తెప్పించినట్లు పైకి కనబడినా అంతర్యం లో అతను నాకు సన్నిహితుడు కావటానికే ఇట్లా మసలు కుంటున్నాడెమోనని అనిపించింది.
"చల్లని ఐస్ క్రీం ఇప్పించారు. మా చెల్లెల్ని పెళ్ళి చేసుకోరాదుటండీ" అన్నది అక్కయ్య.
నా శరీరమంతా చల్లబడి పోయింది . చాలా సేపటి వరకూ తేరుకోలేక పోయాను. అక్కయ్య ను నమిలి మింగుదామన్నంత కోపం వచ్చింది. ఈ తెలివి తక్కువ దద్దమ్మ మాటలు నా తల కొట్టేసినంతగా బాధ పెట్టాయి. అతనూ అయిదు నిమిషాలు మాట్లాడలేదు.
"ఇంత చల్లని ఐస్ క్రీమ్ తింటూ మీ అక్కయ్య గారు ఎంత చల్లని మాట చెప్పారో చూశారా" అన్నాడు.
"అక్కయ్య కేం? చెప్తుంది. అమ్మటానికి పెంకిటిల్లు ఉన్నది కనుక దాని పెళ్ళి ఇల్లమ్మి చేశారు. ఇంక నా పెళ్లి చెయ్యాలంటే నాన్న తను అమ్ముడు పోవాల్సిందే" అన్నాను అక్కయ్య మీద కోపంతో.
"అక్కర్లేదు. నేనే మీకు అమ్ముడు పోతాను. మీ మనస్సు మాత్రం నాకు కానుకగా ఇవ్వండి" అని వెళ్ళిపోయాడు శ్రావణ కుమార్.
4
నాన్నగారు ఆకాశమంత పందిరీ భూదేవంత అరుగూ వేయలేదు. మేమున్న పాకముందే షామియానా వేయించారు. పది చాపలు వేయించారు. పైసా కట్నం లేకుండా నిరాడంబరంగా పెళ్లి జరిగింది. అందరి ఆశీస్సులూ లభించాయి.
ఆఫీసులో వాళ్ళంతా అన్నారు "మీరేం ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు గట్టి దాఖలా ఏమీ లేదు. ఓ పదిహేను రోజులు సెలవు పెట్టి హానీమూన్ కయినా వెళ్ళిరండి."
"మాది సినిమా పెళ్ళిలా కనిపించిందా మీకు" అన్నాను నవ్వుతూ.
"సుభాషిణి మాటలు తేనెలా ఉంటాయి. మనస్సు చల్లని వెన్నెల, ఇంక వేరే హనీమూన్ ఎందుకూ" అన్నారు శ్రావణ కుమార్. అంటే మా శ్రీవారు.
మాటలకు మాత్రమె చేరువైన పది మంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు కలిగే సంతోషం కన్న మనస్సుకు చేరువైన ఒక జీవిత భాగస్వామితో మాట్లాడుతుంటే కలిగే అనుభూతి సంతోషమూ ఎన్నో వందల రెట్లు మన జీవితానికి ఆనందం కలుగజేస్తాయి.
మొదటి రాత్రి తోలి అనుభవాలు శరీరాన్ని పుష్కలంగా ముంచెత్తినా మనస్సులోని మాటలు మధురానుభూతిని చవి చూపిస్తాయి. కాని నా జీవితం లో మొదటి రాత్రి ప్రతి నిమిషం లోనూ నా మనస్సు కు హద్దుల్ని ఏర్పరచింది.
"సుభా, ఆనాటి నా కోరిక తీర్చుకునేందుకు నా మాటలు గుర్తున్నాయ్యా." అన్నారు.
నేను గోముగా చూసి మనసారా నవ్వుతూ వారి గుండెల మీద తల వాల్చి అడిగాను.
"ఏమిటా మాటలు, ఏమా కోరిక"
"నీ మనస్సు నాకు కానుకగా ఇవ్వమని కోరుకున్నాను, గుర్తుందా"
"ఆ ఐస్ క్రీమ్ తో పెళ్ళి సంబంధం కుదిరిన సంఘటన గుర్తుంది, ఈసారి కూల్ డ్రింక్స్ ఇప్పిస్తారా"
"కూల్ డ్రింక్స్ ఫ్రిజిడీర్ ఉన్నంత సేపే చల్లగా ఉంటాయి. ఆ తరువాత ఆ చల్లదన మంతా వేడెక్కుతుంది. వైవాహిక జీవితమూ అంతే"
ఎదురుగా టేబుల్ మీద ఫలహారాల పళ్ళెం నోరూరిస్తున్నది. ఒక మైసూర్ పాక్ తెచ్చి నోటికి అందించాను.
"వైవాహిక జీవితం అంతే అన్నారు. ఎంటేమిటి?"
ఆనాటి టైప్ చెయ్యవలసిన కాగితం సంగతే తరువాత జరిగిన గ్రంధమూ గుర్తొచ్చింది. కాని ఇది ఆఫీసు కాదు. ప్రత్యేకించిన గది.
"నీ మనస్సుని కానుకగా ఇవ్వమని కోరుకున్నాను. పెళ్ళయింది కాని మనస్సు మాత్రం ఇవ్వలేదు" అన్నారు. వారి కళ్ళల్లోకి చిలిపిగా చూశాను. ఈ సృష్టి లో ఆకలి దప్పులు అందరికీ ఉండేవి. కాని మత్తెక్కించే మధురాను భూతి వయస్సు లో ఉన్న యువ జంటల ప్రత్యేకత.
"పెళ్ళి చేసేది పెద్దలు, వాళ్ళ బాధ్యత అంతవరకే. భార్య మనస్సుని భర్త మాత్రమే ఒడుపు గా చేజిక్కించు కోవాలి. నీ మనస్సు కానుకగా కావాలి అంటూ పందిరి మంచం మీద పడుకున్నంత మాత్రాన రాదు" అన్నాను.
"కాదు సుభా, నీ అందచందాల్ని చూసి నేను నిన్ను ప్రేమించలేదు. అసాధారణమైన నీ మనసు చూసి నిన్ను ప్రేమించాను. ఆ మనస్సు నా మనస్సు లో కల్సిపోవాలి' ప్రాధేయ పూర్వకంగా అడిగినట్లు చూశారు.
"నా మనస్సు అసాధారణమైందని అంటున్నారు. ఆ ప్రత్యేకత ఏమిటో నాకే తెలీదు. సాధారణమైన అసాధారణమైన ఉన్న మనస్సుని మీరు నా మెళ్ళో మూడు ముళ్ళూ వేస్తున్నప్పుడే మీకు సమర్పించాను.'
"ఒట్టు"
నాకు నవ్వొచ్చింది. చిన్న పిల్లాడిలా చెయ్యి జాపారు.
"నా టైపిస్ట్ ఉద్యోగం తోడు" అరిచేతిలో గిల్లి వళ్ళో వొరిగి పోయాను.
"నీ మనస్సు నాదయినప్పుడు నా మనస్సు వయస్సూ నీది. నేను చెప్పినట్లు నువ్వు వింటావు కదూ."
"ఓ వింటాను, చెప్పండి. నా మనస్సు మీదయినప్పుడు, మీ మనస్సు నాదన్నారు. అంటే గుండె మార్పిడి లా మనస్సు మార్పిడా." ఎగతాళిగా అన్నాను. తను లేచి వెళ్ళి పళ్ళెం లో వున్న జీడిపప్పు లు తెచ్చి ఒక పప్పు సగం కొరికి తతిమ్మా సగం నాకిచ్చారు.
"సుభా, కట్నం లేని పెళ్లి ఉప్పు లేని పప్పులా చప్పగా వుంటుంది. కాని ఆ చప్పని పప్పులో తగినంత ఊరగాయ కలుపుకుంటే ఎంతో రుచిగా వుంటుంది. ఆ ఊరగాయ నీ చేతిలో వుంది."
నా కుడిచేతిని తన చెంపలకు రాచుకుంటూ అన్నారు.
"వంటింట్లో ఆవకాయ జాడీ పట్రమ్మన్నారా"
"కాదు సుభా, నువ్వు ఉద్యోగం చెయ్యాలి. ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగం మానేయ్య కూడదు."
"అట్లాగే. ఇంక ,మీ కోరికల లిస్టు తీరిగ్గా రేపు చెప్తురు గాని ఈ రోజుకి నిద్రపోతారా."
వారం రోజులు గడిచాయి. నేను కాపురానికి వచ్చేశాను. వచ్చేటప్పుడు అమ్మ నన్ను కావలించుకుని ఏడ్చింది. కాపురానికి కూతుర్ని పంపేటప్పుడు అది ప్రతి కన్నతల్లికి అలవాటేమో అనుకున్నాను.
"సుభా, కోరిన వరుణ్ణి కట్నం ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకుని సుఖంగా కాపిరానికి వెళుతున్నావు. నువ్వుంటే అక్కయ్య తెలివిన పడుతుందేమో అనుకున్నాను. నువ్వు ఉంటేనే దాని మనస్సు చీకట్లో వుంటుంది. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతే ఇంక దాని జీవితం పూర్తిగా చీకటై పోతుందేమో." అన్నది అమ్మ.
సహజ ధోరణి లో అక్కయ్య , వెకిలిగా నవ్వి "ఎక్కడికి పోతుందే. కొన్నాళ్ళు మొగుడితో గడిపాక అదీ ఇక్కడికే వస్తుంది, అది రాకపోతే నేవెళ్లి తీసుకొస్తాను" అన్నది.
అమ్మా, నాన్నా నుదురు బాదుకుంటూ "మా కర్మ కొద్ది దొరికావే. శుభమా అంటూ అది కాపురానికి వెళుతుంటే నీ అపశకునం మాటలు నువ్వూనూ." అని అక్కయ్య ను కేకలేశారు.
