చదువుతో విశాల ముఖంలో అమాయకం రాను రాను మాయమౌతోంది. ఆమె మాటల్లో క్రొత్తదనం, నడక లో హుందా తనం ముంచు కొచ్చాయ్. ఆమె అన్ని గుణాలకు రూపం మెరుగులు దిద్దింది. మామ్మతో అప్పుడప్పుడూ ఆమె కొద్దిగా వాదిస్తుండటం వినగలుగుతున్నాడు. ఇంటిని మరి కాస్త శుభ్రంగా వుంచటం, పెరట పూల గోలాలు, అప్పుడప్పుడూ తీసిన కూని రాగం లో సంగీతం మేళవింపు, చదువులో కూడా భావాల వుద్రేకపు వురకలు -- సూర్యం యివన్నీ కనిపెట్టూనే వున్నాడు.
రెండేళ్ళల్లో విశాల గడచిన పదిహేనేళ్ళల్లో పొందని అనుభూతులు, ఆ అనుభూతులతో ఆనందం వెతుక్కుంటూ అనుభవిస్తోంది. అన్వేషించి పొంది అనుభవించటం లో వచ్చిన ఆనందం, వూరకనే పొంది అనుభవించగా రాదు.
ఇన్నాళ్లూ సూర్యం ఏదో అన్వేషిస్తూనే వున్నాడు. తనకు గమ్యం తెలుసుకోకుండా అలా నడుస్తూ పోయే సాంధునిలా వుండాలని వుంది. త్రోవలో చిత్ర విచిత్రమైనవి చూస్తూ అలాంటి అనుభూతులే పొందవచ్చు. అలా పొందగలగటానికి కారణం తనలో ఆత్రుత వుండదు. అతృత వలన వచ్చిన సుఖం అనుభచించ లెం. విశాల కోసం ఆతృత పడినన్నాళ్ళూ అతను సుఖపడలేదు. ఇప్పుడు తను ఆతృత తన విషయంలో పడే కన్న తన ఆత్మీయుల విషయంలో పడవలసి వస్తోంది. యెదుటి వాళ్ళ బాగోగుల గురించి శ్రమ పడుతున్న కొద్ది తన కెన్నెన్నో క్రొత్త విషయాలు తెలుస్తున్నాయ్. శ్రమ పడ్తేనే లోకం పోకడ అవగాహన అవుతుంది. ఈ లోకంలో పుట్టి బ్రతికినన్నాళ్ళూ లోకం పోకడ తెలుసుకొని, సంఘం కదలిక లో, తనూ పాల్గొనకపోతే ఒక్క దగ్గర వదిలిన మట్టి ముద్దలా ఉండవలసిందే. జీవితం లో తోలి సారి సమస్య, అదీ గట్టి సమస్య తెచ్చి పెట్టింది తన చెల్లెలు. సూర్యం కు ఆ చెల్లలంటే గొప్ప మమకారం. ఇద్దరూ యించుమించు ఒక్కలాగే వుంటారని అంటారు. సూర్యం ని చూస్తె అతని చెల్లెలిని చూడక్కర్లేదని , ఆమెను చూస్తె ఫలానా సూర్యం చెల్లెలని సునాయాసంగా చెప్పేయ వచ్చని అంటారు. అంతే కాకుండా తను ఆడది యెలా వుండాలని కాంక్షిస్తాడో ఆ మంచి గుణాలన్నీ ఆ చెల్లెలులో వున్నాయని ఆమె అంటే యెడతెగని అభిమానం. గౌరీ మాటల్లోని మెత్తదనం, నడకలో నమ్రత, చూపుల్లో శాంతం, యెలాంటి యింటిలో పడినా కుటుంబానికి గౌరవం తెస్తుందన్న నమ్మకం యింటి అందరిలో వుండేది. అలాంటి గౌరీ యిప్పుడు సమస్య తెచ్చి పెట్టింది. మాటలను మనిషిని చూసి, సూర్యం తండ్రి, వెనక ముందూ చూడకుండా పిల్ల యెదిగి కూర్చుందని పెళ్లి చేసేశాడు. గోవిందరావు నిత్యానందుడు . ఒక్కసారైనా విచారంగా ఆలోచిస్తూ కూర్చోవటం యెవరూ చూడలేదు. నిజానికి అతను విచారించటానికి యెన్నెన్నో సంఘటనలు తన జీవితంలో కలిగాయ్. తల్లి చిన్నప్పుడే పోయింది. మారుతి తల్లి తననే కాక తన తండ్రినీ పీక్కుటింది. అతను పోయాక ఆమె ఉత్తము రాలై పోయింది. ఏదో వుద్యోగం సంపాదించు కోడానికి సరిపడ్డ చదువు అబ్బింది. అదీ తల్లి తల్లి ధర్మాన నాలుగు శాపనార్ధాలు పెట్టి మరీ చదివించింది. వీడిని చదివించటానికే బ్రతికినట్లుంది. ఉద్యోగం లేకుండా తిరిగిన గోవిందరావు లోకంలో మాయ, అధర్మం , అసత్యం అంతా చవి చూసాడు. పచ్చ టాకులు పుట్టడానికి కొన్ని ఆకులు ఎండి రాలి పోవాలి. వర్షం రావటానికి వెలుతురును కప్పే నల్ల మేఘాలు అల్లుకోవాలి. ఒకరు మేడ మిద్దె లపై సుఖ పడటానికి పదుగురి కడుపులు మాడ్చాలి, ధనార్జనకు అన్యాయం, సుఖ పడటానికి అవినీతి , బ్రతకడానికి అబద్దం -- వీటి అవసరాలు చూసి తనకు వెర్రి ముంచు కొచ్చింది. ఆ వెర్రి భార్య కాపరానికి వచ్చాక హెచ్చయింది. ఇంత కష్టపడుతున్న తనకు లేని సుఖం కష్ట పడకుండా వున్న తన పై వాడికి యెందుకుండాలి? అందం, గుణం తో తొణికిసలాడే తన భార్యకు లేని గౌరవం, కోతిలా కొరకొర లాడుతున్న పై వాడి భార్య కెందుకుండాలి?
నిజంచేప్పి తను బ్రటలేక పోతు న్నాడు. అబద్దం చెప్పేవాళ్ళు అంత హాయిగా ప్రశ్నలు తనలో వేసుకున్నన్నాళ్ళూ ఫర్వాలేక పోయింది. ఎప్పుడైతే బయటకు వేసాడో ముప్పు తెచ్చుకున్నాడు. ఆఫీసరు మొదట చిన్న గంటు పెట్టినట్లు' యేజన్సీ ' కి బదిలీ చేశాడు, దీనితో గోవిందరావు అగ్గి అయి పోయాడు. ఆఫీసరు తో వివాదము పెట్టుకున్నాడు. మాటలు యిద్దరు సరి సమానులు దెబ్బలాడు కున్నట్లు వచ్చాయ్. నివ్వెంత అంటే నివ్వెంత అన్నారు. ఆఖరికి నీ వుద్యోగం నీ దగ్గరే పెట్టుకో. నీలాంటి లంచాలు తినేవాడి దగ్గర పనిచేసే బదులు అడుక్కు తింటే మంచిదన్నాడు. దానితో గోవిందరావు ను యెర్ర పార్టీ వాడన్నారు. ఇంకెక్కడా గవర్నమెంటు లో వుద్యోగం దొరకనట్లు చేశాడు. అతను కొన్నాళ్ళు తలదాచు కోడానికి అత్తవారు తప్పించి ఆత్మీయులేవరూ లేరు చేత బిడ్డను పట్టుకుని గౌరీ కన్న వారింటికి వచ్చేసింది, అల్లుని వేపు చూసి సూర్యం తండ్రి కొద్దిగా ఏవగించుకున్నాడు. 'లోకం సంగతి తనకెందుకు తన సంగతి చూసుకోవాలి గానీ -- తన ఇల్లు మరమత్తు చేసుకోకుండా యెదుటి వాళ్ళ యిల్లు గురించి ఎందుకు బెడద పడటం-- లౌక్యంగా గుట్టుగా బతకటం నేర్చుకోక పొతే యెలాగ?'-- మామగారి యీ వాదనతో అంగీకరించని గోవిందరావు అత్త వారింట్లో నూ ఎన్నాళ్ళూ ఉండలేదు. ఉద్యోగాన్వేషణ కు పోవటం ఏదో ఒక రోజున తిరిగి రావటం . మామగారు యెడ ముఖం పెడ ముఖం పెట్టి 'బంగారం లాంటి వుద్యోగం పెదసరితనం చూపించి పాడు చేసుకున్నాడు. ఇప్పుడెవరిస్తాడు?' యిలా పరోక్షంగా తనకు వినిపించినట్లు అనటంతో గోవిందరావు మండిపడ్డాడు. మళ్లీ రానని పంతం పట్టాడు. గౌరీ బ్రతిమాలింది. 'నా ముఖం కాదు, మీ కూతురు ముఖం చూడటాని కైనా రండి' అంది. కూతురు పేరెత్తితే గోవిందరావు అంతా మరచి పోతాడు. మూడు మూర్తులు తన పోలికలే ఆ కూతురివి. తండ్రి రూపు గల ఆడపిల్ల అదృష్ట వంతురాలౌతుందని విన్నాడు. ఆమె అదృష్టం తెచ్చి పెట్టబట్టే ఆ బానిస కొలువు వదిలాననుకున్నాడు. మనిషిని మనిషిగా గౌరవించకుండా హోదాలతో గౌరవాన్ని ముడి పెట్టె ఈ బానిసత్వం పోనన్నాళ్ళూ దేశం బాగు పడదని చెప్పాడు. ఎదుటి వాళ్ళ మానవత్వాన్ని గౌరవించగలిగేవాడు, నిజానికి తన్ను తాను గౌరవించు కుంటాడు. అలా గౌరవించే సంస్కారం గల వాళ్ళు యెంత హెచ్చు మంది వుంటే సంఘం అంత పురోగతికి పోతుంది.
కూతురి మీద మమకారం గౌరి మీద అభిమానం గోవిందరావు కు తరచూ అత్తవారింట్లో మకాం వేయించేది. ఉన్న డబ్బు ఖర్చు కాగానే కొన్నాళ్ళ పాటు అత్తవారింట్లోనే ఉండిపోయాడు. సూర్యం తండ్రి అల్లుడిని చులకనగా చూసాడు. ఊరిలో పెద్ద యింటి వాళ్లతో తగువులు రాటానికి అల్లుడే కారకుడు కాగానే యింట్లో యుద్ధం అయిపోయింది.
'అన్యాయాన్ని చూస్తూ సహించటం మీకే చెల్లింది?'
'నీలా సన్యాసిని గాను. ఎలాగో బతికి యింత సంసారాన్ని యీడ్చుకు వస్తున్నాను. 'ఎవరిలో ప్రజ్ఞా వుందో కనిపిస్తోందిగా!'
'ఎలాగో, పందీ బతుకుతుంది.'
సూర్యం తండ్రి రుద్రుడై పోయాడు.
'నా యింట్లో తిని నన్ను పంది అంటావురా?'
'అవును మరీ-- వాడు చేసింది అన్యాయం. కూలీలకు చిన్న కుంచం తో కొలిచి ధాన్యం యిస్తున్నాడు. వాళ్ళ పొట్టలు మాడ్చి వీడు మిద్దెలు కట్టిస్తున్నాడు. మీరు గొప్ప బ్రతుకే బ్రతికితే యెలా వూరుకో గలుగుతారు?'
'ఈ వూర్లో మేమిలా బతకటం నీకిష్టం లేనట్లుంది. మేము మూటా ముల్లెతో బయటకు నీ మూలాన నైనా పోతాం.'
'మీరెందుకు పోవటం-- నేను బయటకు పోయే యీ అన్యాయాన్ని ఎదుర్కుంటాను.'
ఇలాంటి గొడవలు సూర్యం వరకూ ఉత్తరాల ద్వారా చేరి అతనిని ఆతృత పడనిచ్చాయి. తల్లి ఎన్నాళ్ళో యిక ఉండే పరిస్థితి కాదు. నాన్న అమ్మను పంపెయని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు.
'పెళ్లి చేసుకోరా నాయనా -- నేనిక వుండే లేను.'
'అప్పుడే నా కొద్దమ్మా' అన్నాడు.
'అలా పంతం పడ్తే యెలారా -- నా సంసారం వదిలి యెంతకాలం సుఖపడ్తూ కూర్చుంటాను.'
అవును-- అమ్మ చిన్నప్పటి నుంచీ సంసారం యిదుతూ కష్టాలు పడుతూనే వుంది. జీవితంలో తన కడుపు కే కాదు బిడ్డల కడుపులు నింపడానికి వెతుక్కోవటం తోనే సరిపోయింది. పెరిగిన బిడ్డలను ఒక యింటి వాళ్ళను చెయ్యటానికి యెంత ఆరాట పడిపోయేది. యెన్ని మొక్కలు మొక్కేది. వినోదాలకు, వేష భాషలకు సుఖ శాంతులకూ నోచుకోలేని అమ్మ యీ రెండేళ్ళు పైగా తనకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర యిచ్చి యెంత సుఖపెట్టింది. బల్లిలా నున్నవానిని బలిష్టంగా పెంచింది. నిరాశతో నున్నవాని లో ఆశలను సృష్టించుకునే ఆరోగ్యం యిచ్చింది. జీతం చేతిలో పెట్టగానే తన బాధ్యత తీరిపోయేది! ఎవరి కివ్వవలసినది వారికి ముట్ట చెప్పి దేనికీ వెతుక్కోకుండా సంసారం సాగించేది. సంసారం బాధ్యత అన్నది తను అమ్మ వుండగా మరచి పోయాడు. అన్ని విధాల తనను యింత మనిషిని చేసిన అమ్మ తనను వదిలి వెళ్లి పోతానంటే సూర్యం కు దిగులు పట్టుకుంది. కొడుకు దిగులును అర్ధం చేసుకున్న తల్లి ఒకనాడు భోజనం దగ్గర అన్నది.
'నేను వెళ్తే గానీ అక్కడ ఆ గందరగోళం ..సద్దు మణగదురా...పోనీ....ఎలానూ గౌరీ యింట్లో వుంది కదా? ఇదీ కన్నవారిల్లె కదా-- ఇక్కడ వుండి నీకు కాస్త వండి పెడ్తుంది.'
గౌరీ పేరెత్తగానే సూర్యం కళ్ళల్లో కన్నీరు పెరుకున్నాయ్. వెంటనే సమాధానం చెప్పలేక పోయాడు. ఆమె గురించి యెన్నెన్ని మంచి ఊహలు పెళ్లి కాక ముందు వూహించుకున్నాడో అన్ని విఫల మయ్యాయ్. తలచు కున్నదొకటి జరిగినది వేరోకటైతే మనసు అవమానంతో నిండి పోతుంది. ఇక కీడెంచి మేలెంచటమే మంచిదనుకున్నాడు. గౌరీ దీనమైన ముఖం రోజూ చూస్తూ యెలా వుంటానన్న ఆవేదనే తనకు వెంటనే జవాబు యివ్వనిచ్చింది కాదు. నాన్న తొందరపాటు తనకు తెలుసు. అతనికి కోపం వస్తే ఆ మాటల ప్రవాహానికి అడ్డు లేదు. ఎవరైనా అడ్డు పడ్డారో కట్టలు త్రెంచి మరీ విజ్రుంభిస్తారు. అతని కోపంతో గౌరీ ని బాధపెట్టే కంటే ఒక చల్లని కబురుతో, ఒక ఆశతో, ఉత్సాహ పరచి, ఆమెను వుంచటానికి తనెందుకు పాటు పడకూడదు? ప్రయత్నించి గోవిందరావు కు యెక్కడైనా యిక్కడే వుద్యోగం సంపాదించి మన యింట్లోనే వుంచే కూడదూ? తన మాట యందు గోవిందరావు కు గౌరవం వుంది. వద్దన్న పని చెయ్యడు ఇలా తర్కించుకుని తల్లి కోరినట్లే ఒప్పుకున్నాడు.
* * * *
