ప్రకాశం మద్రాసు నుంచి వచ్చిన తక్షణం విశ్వనాధయ్య గారిని పొలం వద్ద కలుసుకొని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. అంత గంబీరమైన మనిషీ చంటి పిల్లాడిలా ప్రకాశాన్ని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు. ప్రకాశానికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"ఇక ఉమాపతి మద్రాసులో ఉంటె పూర్తిగా చెడిపోతాడు. అతణ్ణి చదువు చాలించి ఇంటికి రప్పించండి" అన్నాడు ప్రకాశం.
విశ్వనాధయ్య గారు ఆలోచించారు. ఉమాపతి ఇంటికి వస్తే ఒడిలో నిప్పులా తయారవుతాడు. వాడు వస్తే శారదకు, ప్రకాశానికి చచ్చినా పెళ్ళి జరగదు.
"ఎంత చెడాలో అంతా చెడిపోయాడులే, ప్రకాశం. ఇంకా చెడి పోవటానికి కేముంది? ఈ సంవత్సరం ఇక నాలుగు నెలలేగా? అక్కడే అఘోరించనీ" అన్నారు.
ప్రకాశం మౌనంగా ఉన్నాడు.
మళ్ళీ విశ్వనాధయ్య గారే అన్నారు.
"నాకు వాడి మీద ఏ ఆశలూ లేవు, ప్రకాశం. నా ఆశలన్నిటినీ కూల్చేశాడా వెధవ. నాకు నువ్వోక్కడే నచ్చిన వ్యక్తీ! అందుకే నువ్వంటే నాకంత అభిమానం! ప్రేమ!"
వీళ్ళతో నిండిన మేఘంలా ఉన్న ప్రకాశం మనస్సుకు యీ మాటలు చల్లటి గాలిలా తాకాయి. విశ్వనాధయ్య గారి మాటలకు ప్రకాశం హృదయం ద్రవించి పోయింది.
పొద్దు ఊరికి పడమట ఉన్న ఆవుల కొండ వెనక దాక్కుంది. సాయంకాలపు గాలికి వరిమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆవుల కొండ మీద అరుణ రాగం అలముకొంది. కూలీల కొచ్చిన జనం యిళ్ళకు బయలుదేరారు. ప్రక్కనే ఉన్న తన మడి వద్ద గుడిసెలో కూర్చుని జగన్నాధం గారు కూలీ బట్వాడా చేస్తున్నారు.
విశ్వనాధయ్య గారు యింటికి వెళ్ళిపోయారు. ప్రకాశం ముఖం కడుక్కోవడానికి బావి వద్దకు వెళ్ళాడు. కడుక్కుని బావి మెట్లెక్కుతూ ఉంటె, -- "అయ్యగారూ! మిమ్మల్ని మా అయ్యగోరు పిలుత్తుండారండి" అని జగన్నాధం గారి పాలేరు రాముడు పిలిచాడు.
జగన్నాధం తన నెందుకు పిలుస్తాడు? మాట్లాడే విషయాలు కూదాలేవే! తామిద్దరూ మాట్లాడుకుని దాదాపు ఎనార్ధం దాటిందే! ఊళ్ళో జగన్నాధం చేసే ప్రతి దుర్మార్గానికి తాను అడ్డు నిలవటం వల్ల తామిద్దరూ దాదాపు విరోధులైపోయారే! ఏమైనా కానీ అతడై పిలిచినప్పుడు పోకుండా ఉండకూడదు.
ప్రకాశం వెళ్ళేసరికి కూలీలు దాదాపు వెళ్ళిపోయారు.
'ఇలారా , ఇలా, ఇలా కూర్చో." మంచాన్ని చూపించాడు జగన్నాధం.
గంబీరంగా, గుండ్రంగా ఉన్న ముఖం. చదరంగా కఠినత్వాన్ని చూపించే గడ్డం. అందులో పాపకూపం లాంటి పెద్ద గుంట. ఎంత కుటిలత్వాన్నయినా దాచుకోగలిగిన నుదుటి మీది చర్మపు మడతలు. పొదల్లా పెరిగిన నేరిసీ నేరవని కనుబొమల క్రింద పులి కళ్ళలాంటి కళ్ళు. జగననాధం ఆకారంలో వశీకరణ శక్తి ఎంత ఉందొ, అంత హడలు కొట్టే శక్తీ ఉంది.
ఇంతలో జగన్నాధం కూతురు ఇందిర కాఫీ తెచ్చింది. ఇద్దరూ తాగారు.
"నువ్వు కాస్త బయటికి వెళ్ళమ్మా" కూతురుతో అన్నాడు జగన్నాధం.
"ఎందు కెళ్ళాలి? నే వెళ్ళను"విసురుగా అంది ఇందిర.
"నా తల్లివి కదూ! వెళ్ళు."
కోపంగా తల తిప్పి ఇందిర గుడిసె లోంచి బయటి కెళ్ళింది. ఆవిడ తలతో బాటు బాణాకర్ర తిప్పినట్టు తిరిగిన నల్ల నాగుబాము లాంటి జడ ప్రకాశానికి తగిలింది. జగన్నాధం మీసాల లోపలే నవ్వుకున్నాడు.
కాస్సేపు నిశ్శబ్దంగా గడిచింది. ఇళ్ళకు చేరుతున్న పశువుల అంబారవాలూ , కపిల బావి ప్రక్కనున్న వెదురు గుమిలో దూరుతున్న గాలి యీల తప్ప వాతావరణం కూడా నిశ్శబ్దంగా ఉంది.
"ప్రకాశం , నీతో ఒక ముఖ్య విషయాన్ని మాట్లాడాలని రమ్మన్నాను. మరేమీ అనుకోకు. నువ్వింకా కుర్రాడివి. నీకింకా ఉండేలు దెబ్బ యెంత గట్టిగా తగులుతుందో తెలీదు. నువ్వు అనవసరంగా గ్రామ విషయాల్లో వేలు పెడుతున్నావు. లేకపోతె నీకూ చెక్కెర ఫ్యాక్టరీ వాటాల సంగతెందుకు? అవి మనల్నేమన్నా బ్రతికిస్తాయా..."
"మనల్ని అంటే యితర ప్రజల్ని తప్పకుండా అదుకుంటాయి. బెల్లం కొంటున్న వాళ్ళు చేస్తున్న అన్యాయాలు చూస్తున్నారుగా?"
"నేనూ బెల్లం కొంటాను. అలాగైతే నేనూ అన్యాయం చేస్తున్నా నంటావా?"
"క్షమించండి . తోట మొదటి చుట్టకం మొదలుకొని అప్పులిచ్చి బెల్లాన్ని గానుగింటిలోనే అప్పుడున్న వెలకు కొనడం అన్యాయం కాదంటారా?"
'అది అన్యాయం కాదు ప్రకాశం. వ్యాపారం. "వ్యాపారం ద్రోహ చింతనం' అని పెద్దలే అన్నారుగా!' జగన్నాధం బిగ్గరగా నవ్వాడు.
'అలాంటి సామెతలు సరేలెండి. దాన్ని యీ కాలంలో మోసం చేయడం అంటారు."
మళ్ళీ నవ్వాడు జగన్నాధం. ఎదుటివాడు ఎంత మాటన్నా దాన్ని ఈశ్వరుడు గరాళాన్ని మింగినట్లు మింగేయగలడు. ఎంత కుటిలత్వాన్ని, కోపాన్ని అయినా బడబావలాన్ని సముద్రుడు దాచుకున్నట్టు తనలో దాచుకోగలడు.
'అన్డుకేంయ్యా , ప్రకాశం , నువ్వంటే నా కంత ప్రేమ! అందుకే యిప్పుడు నిన్ను పిలిపించాను. మరేమీ అనుకోకు. మా ఇందిర ఏదో ఇంటరు దాకా చదివింది. ఇందిర నా కళ్ళెదుట లేకపోతే నేను బ్రతకలేను. ఈ ఊళ్ళో నే ఉంటె నాకూ శాంతిగా ఉంటుంది...."
'క్షమించండి , జగన్నాధం గారూ. నాకు పెళ్ళి కుదిరింది" అన్నాడు ప్రకాశం.
"నేనూ విన్నాను. ఆ రత్నమ్మ కూతురేగా! ఇచ్చి పుచ్చుకోవడాలూ , అవీ మాట్లాడుకున్నారా?"
"ఇవి అవి ఇవ్వమని నేను అడగను. వాళ్ళిచ్చినా నేను పుచ్చుకొను."
'ఇంకా సంబంధం ఖాయం కాలేదుటగా! నేను చెప్పిన విషయం గూడా ఆలోచించు....'
'ఆలోచించడాని కేమీ లేదండి. మాట తప్పటం నా కలవాటు లేదు. క్షమించండి. నేను వెడతాను." ప్రకాశం లేచి మసక చీకటిలో కలిసిపోయాడు.
"శుద్ధ వెధవ! అడ్డ గాడిద! పోరం బోకు వీడు. వీడి ప్రజాసేవ! ఈ బాణం కూడా గురి తప్పింది. ఛ ఛ " అనుకున్నాడు జగన్నాధం.
ప్రకాశం వరి మడి కయ్యల వద్ద మలుపు తిరిగి చెరుకు తోట గుండా వెడుతుంటే ఇందిర కనబడింది. ఆవిడ తన కోసమే ఎదురు చూస్తుందని ప్రకాశానికి అనిపించింది. తలవంచుకుని నడక సాగించాడు ప్రకాశం.
'అన్నయ్యోయ్!" ఇందిర పిలిచింది. ప్రకాశం ఆగాడు.
"మీ మాటలు విన్నాను. మా నాన్న శుద్ధ క్రాక్."
"కాదు" అన్నాడు ప్రకాశం.
'అదీ నిజమే! గ్రామంలో ఇన్నాళ్ళూ అయన కత్తి కెదురు లేకుండా జరిగింది. ఇప్పుడు నువ్వొకడు దాపురించావు. నిన్ను ఈ నారాయణాస్త్రంతో జయించాలనుకున్నాడు."
ప్రకాశం నవ్వాడు.
'అన్నయ్యా నీకో రహస్యం చెబుతా. మనసు లోనే ఉంచుకున్తావు కదూ?"
ప్రకాశం తలూపాడు.
ఇందిర నోట్లోంచి మాట రాలేదు. ముఖాన రేగిన సిగ్గు తెరలు క్రింది పెదవి చివర ఉన్న గుంటలో దాక్కుంటూన్నాయి.
"భానుమూర్తి....మన ఊరి హైస్కూలు కు వస్తున్నాడు" అంది తల వంచుకుని.
"నాక్కూడా ఉత్తరం రాశాడు."
"మేమిద్దరం ఈ మేనేల్లో పెళ్ళి చేసుకోవాలను కున్నాం."
"శుభం. నా ఆశీర్వాదం సదా సిద్దం. మీ నాన్న ఒప్పుకుంటాడా?"
"అన్నయ్యోయ్. పెళ్ళి నాకు. మా నాన్నకు కాదు" అంది ఇందిర.
"పెళ్ళంటే జ్ఞాపకం వస్తోంది. నా పెళ్ళి కూడా కుదిరింది. ఓ! స్టాప్. తొందర పడకు. శారద పెళ్ళి కూతురు. తాంబూలాలు కూడా రేపు పుచ్చుకోబోతున్నాం."
"వెరీ గుడ్! చక్కని పిల్లను ఎన్నుకున్నావు" అంది ఇందిర.
'జగన్నాధానికి తగిన కూతురు' అనుకున్నాడు ప్రకాశం.
* * * *
రత్నమ్మ చెప్పిన మాటతో శారదకు నవనాడులూ కృంగి పోయాయి. రక్తనాళాలన్నీ చిట్లి శరీరమంతా రక్తపు మడుగై పోయినట్లయింది. శరీరం రెండు భాగాలుగా చీలిపోయినట్లనిపించింది. అప్రయత్నంగా పొట్ట తడిమి చూసుకుంది.
"నిజమేనే! నెల మీద పది రోజులు' అంది రత్నమ్మ.
