Previous Page Next Page 
మమత పేజి 7

 

                                    4

    జీవితంలో మూడవ వంతు కాలం నిద్రలో బ్రతుకుతాడు ప్రతి మనిషీ - శాస్త్రజ్ఞులు అలా అంచలా కట్టారు. మిగిలిన కాలంలో నూటికి తొంభై పాళ్ళు ప్రపంచం కోసం , పదిపాళ్ళు - కేవలం తనకోసం బ్రతుకుతాడన్న సరిపోతుందేమో అంచనా.    
    తాను తల్లికి జబ్బుగా వుందంటూ - అప్రయత్నంగానే అబద్దం చెప్పటం జరిగింది. శలవు గూడా యిచ్చేసారు. హెడ్ మాష్టారు. ఒక తప్పు పది తప్పులకు దారి తీస్తుందన్న సూక్తిలో నిజం కనిపించింది స్వామికి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనాన్న భయంతో నాన్నా ఊరుకి వెళ్ళి రాక తప్పేటట్లు లేదు.
    వెళ్ళకపోతే తనను ప్రాణాలతో బ్రతకనివ్వరు హెడ్ మాష్టారు. అసలు తను అంతటి అబద్దం ఆడిన సంగతి తెలుస్తే - అయన గుండె ఆగిపోయే ప్రమాదముందనిపించింది.
    నిజానికి మొదటి జీతం అంతా కళ్ళ జూడకుండా వచ్చాడు తల్లి దగ్గరకు- ఈలోగా వెళ్ళకూడదనే నిశ్చయంతో బయలుదేరి వచ్చాడు. ఇన్నాళ్ళకు తాను ఉద్యోగంలో చేరాడు. ఈరోజు కోసమే ఏళ్ళ తరబడి తన తల్లి ఎదురు చూసింది. జీతాన్నంతా రూపాయి బిళ్లలుగా మార్చి తల్లి దోసిట్లో గుమ్మరించి సంతృప్తిగా సంబరపడుతున్న ఆమె ముఖం చూడాలనుకున్నాడు. ఇంగ్లీషు రాకపోయినా , తనకు ఉద్యోగం తెచ్చిన ఆర్డరు కాగితాన్ని తడిమి చూసుకొని 'ఇంతవడివి కాగలవని నాకు తెలుసురా స్వామి-' అంటూ పొంగి పోయింది సీతమ్మ గారు. 'ఆయనే వుంటే యెలా పొంగి పోయేవారో !' అంటూ కళ్ళు తుడుచుకుంది.
    ఎంత ఆలోచించినా మొదటి జీతం చేతి కందకుండా వెళ్ళటానికి యిష్టం లేకపోయింది. కాని గత్యంతరం కనిపించడం లేదు.
    'ఇవాళ మొదలు పెట్టండి ప్రయివేటు మాష్టారూ!' అంది నోటు పుస్తకాలూ, పెన్సిలూ పుచ్చుకొని పావని.

 

                                


    'మనస్సు బాగుండలేదండి-- తర్వాత -- అన్నాడు స్వామి.
    "అసలు మనస్సంటూ ఉంటె -- ఇదే చావండి దానితో. ఈపాడు మనస్సు గురించి ఆలోచిస్తేనే ఒక్కోసారి మహా బోరనిపిస్తుంది' ఏమంటారు?'
    'ఔనండి.'
    'పోనీ మీ దగ్గర ఏమన్నా పుస్తకముంటే యిస్తారూ కాలక్షేపానికి.'
    'లేవండి'
    'ఆ టేబిల్ మీద ఆ పంచరంగుల అట్టది.'
    'ప్రాచీన భారతదేశ చరిత్రండీ! శర్మ గారిది.'
    "భళి! భళి! బ్రహ్మాండమండి! మొత్తానికి బడిపంతులనిపించారు. కనిష్కుడి రాజ్యానికి సరిహద్దు లేమిటో కళ్ళతో చూసి వచ్చినట్లు ఖచ్చితంగా రాసేస్తారే పెద్ద మనుషులు,ఉన్న ఊరి ఎల్లలతోనే సంబంధం లేకపోయినా మీకు మాత్రం బోరు కొట్టటంలా ఈ పాడు ఊళ్ళో. ఆ దిక్కుమాలిన టూరింగ్ సినిమా ఉందన్నమాటే గాని పదిరోజులకు గాని ఒక బొమ్మ మారదు.నిజం చెబుతున్నా మాష్టారూ...'
    చెబుతోనే వుంది కామాలూ పుల్ స్టాప్ లూ లేకుండా పావని.
    "పావనమ్మా! ఓ బిందెడు మంచినీళ్ళు తెచ్చి పెట్టవే తల్లి నడుం నొప్పితో చస్తున్నా --' కేక పెట్టింది శారదమ్మ గారు.
    'మీ అమ్మగారు పిలుస్తున్నా రండి'
    'నానెత్తి -- ఆనీలాటి రేవుకు వెళ్ళటమంటే మంట నాకు. అమ్మలక్కలకు అదొక షికారు. ఊళ్ళో గొడవలన్నీ అక్కడే వుంటాయి. పదిమంది అమ్మలక్కలు నడుం దాకా నీళ్ళలో దిగబడి - అక్కడ లేని అచ్చమ్మ కుటుంబ రహస్యాలన్నీ తృప్తిగా చర్చించుకుంటారు. అమ్మ వెళ్ళి నప్పుడల్లా 'మీ పావనమ్మ కు సంబంధం కుదిరిందా? అంటూ కాకుల్లా పోడుస్తుంటారట.?'
    "ఉసేయ్! కొంరకంచూ!' మళ్ళీ కేక పెట్టింది శారదమ్మ గారు.
    'ఏమిటీ?' అలా కూర్చునే మారుకేక పెట్టింది పావని.
    'వంటింట్లో చెప్పులిప్పా వెమిటే పాపిష్టి దానా. ఆ చెప్పులలా మండువా లో తగలేసి, యిలా ఒకసారి తగలడవే."
    విరగబడి నవ్వింది పావని.
    ఒక మహాశిల్పి చెక్కి తీర్చి దిద్దిన చిత్రాన్ని చూస్తున్నట్టు నివ్వేరపోయి చూస్తున్నాడు స్వామి.
    'మరీ కంగారుపడకండి మాష్టారు. మా అమ్మకు మన నీడ గూడ గిట్టదు. ఇంటిపనులు నేర్చుకో మంటుంది. వంట వండటం చేత కాదంటుంది. మరీ రుచిగా వండుకుని ముప్పూటలా తింటే యింకా లావై పోముటండీ? ఇలాగా దినదిన ప్రవర్ధమానంగా లావెక్కి దర్వాజాలు పట్టకుండా ఊరిపోతానేమోనని అసలే భయంతో చస్తుంటే ఈ బెంగతోనే చివరకు 'హరీ' అంటానేమో.'
    ;నీ దుంపతెగ' అంటూ గరిట పుచ్చుకు వచ్చిన తల్లిని చూసి, ఎగిరిపడి లేడి పిల్లలా లోపలకు పరిగెత్తింది పావని.
    సత్యభామ పోలికలున్న పావని.
    'ఎంత నిర్లక్ష్యం? తల్లి అనే మర్యాద కూడా లేకుండా' అనుకుంటూ ఆటే పదిక్షణాలు రెప్ప లార్పకుండా చూశాడు స్వామి.
    కాఫీ పెట్టుకుంటానికి కుంపటి అంటించుకుంటూ , కాగితాలు రాజుకుంటానికి విసన కర్ర కరువై బల్ల మీదున్న శర్మ గారి పరిశోధన గ్రంధం - ప్రాచీన భారతదేశ చదిత్రను - మసి చేతులతోనే అంది పుచ్చుకొని- తడి బొగ్గుల్ని జయించి అగ్ని హోత్రుడ్ని ఆహ్వానించడం మొదలు పెట్టాడు. పాపం శర్మగారు! దేశాదేశాలూ తిరిగి, శిలా శాసనాలన్నీ వెలికి తీసి, కీవితాన్ని ధారపోసి, పరిశోధనలు చేసి, ఆ ఉద్గందాన్ని రచించాడట ఆ మహానుభావుడు. ఆ కీర్తి శేషుడు తిరిగి వచ్చి ఆ దృశ్యం చూడటం జరిగితే - అయన ఆత్మ ఎంతటి వేదన అనుభవిస్తుందో ఆలోచించగల స్థితిలో లేడు స్వామి మనస్సు.
    
    స్వామి మనస్సు అనుభవిస్తున్న వేదన వేరు. తడి బొగ్గులతో ఆ విధంగా యుద్ధం చేస్తున్న 'ప్రాచీన భారతదేశ చరిత్ర' ను ఒక్క గుంజుతో లాక్కుంది సగం తడిసిన బట్టలతో తల్లి పోరు పడలేక ఓ బిందెడు నీళ్ళు యింట్లో గుమ్మరించి వచ్చిన పావని. ' మీ భుజ బలమంతా చూపెట్టటానికి ఆ చరిత్ర పుస్తకమే దొరికిందటండీ?' అంటూ గోడ దగ్గరకు వెళ్ళి 'ఏసు ప్రభూ! ఈ పుస్తకం ఆ పెద్ద మనిషి ఎంత కష్టపడి వ్రాశారో అయన ఆత్మకు శాంతి కలిగించు' అంటూ కిలకిల నవ్వింది.
    'మండటం లేదండి బొగ్గులు' కళ్ళల్లో నిండిన పొగ కన్నీటిని తోడుతుంది బయటకు.
    'అలవాటేనండి చిన్నప్పటి నుంచీ, ట్రయినింగు చదువుతున్న రెండేళ్ళు నేనే వండుకు తిన్నాను. నేకాచిన సాంబారంటే లొట్టలు వేసుకుంటూ తినేవాడు మా ఆనందం.'
    'అతనేవరండోయ్'
    'నా ప్రాణ స్నేహితుడండీ- ఆ గడియారం -' పొరపాటున మాట జారింది. అంతలోనే సర్దుకొని' 'చాలా మంచివాడండీ' అనేశాడు.
    'మా కాంట్రాక్టరు నాకు అర్ధణా వాటా కూడా యిస్తానన్నాడు' అని రాశాడు ఆనందం ఉత్తరం.
    'గడియారమేమిటండి?అన్నట్లు మీ చేతి గడియారం కనిపించడం లేదీ మధ్య.'
    సమాధానం కోసం తడుముకున్నాడు స్వామి.
    'పోయిందేమీటండీ కొంప తీసి'
    'అబ్బే లేదండీ. ఆనందం వచ్చి తీసుకు వెళ్ళాడు. అసలు అది నాది కాదండి. ఊరికినే పెట్టుకోచ్చా.'
    'ఎందుకు పెట్టు కొచ్చారండీ? ఎరువు సొమ్ము బరువు చేటన్నారు. అది పొతే కొంపతీసి, జీతం లోని కట్టుకోవాల్సి వచ్చేదంటారా కాదా?'
    'ఔనండి, కట్టుకోవాల్సి వచ్చేది'
    తలవంచుకు సమాధానం చెప్పిన స్వామి ముఖంలోకి జాలిగా చూసింది పావని.  అంతవరకూ ఆమె పెదవుల మెరుస్తున్న చిరునవ్వు అదృశ్యమైపోయింది .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS