Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 8

 

    అప్పటికి అక్కడ వున్న కొత్త మనుషులు సామాను , కంటికి కనిపించి సిగ్గుపడి అవతలకు వెళ్ళబోతున్న కమలని చూసి శ్రీపతి 'పనివాళ్ళకే ఇంత తల బిరుసా' అంటున్న మాటలు వినపడై- వెంటనే నీరజ 'అన్నయ్యా' అని, రాజేశ్వరి 'శ్రీపతి' అని అరిచారు. కమల వెనక్కి చూడకుండా వెళ్ళడం పాప 'కమలీ' అంటూ కమల వెనక వెళ్ళడం చూసి శ్రీపతి కనుబొమలు ముడి పడినై. తల ఎగరేసి వూరుకున్నాడు.
    ఆరోజంతా బావామరుదులు వాళ్ళ విదేశీ వ్యవహారాలు చర్చించుకుంటూ మాట్లాడుకోవడంతో గడిచిపోయింది. నీరజ ప్రయాణ సన్నాహాల హడావుడి తో ఎవరికీ తీరిక లేకుండా పోయింది. నీరజ కిచ్చి పంపే వస్తువులు అల్లుడికి పెట్టె బట్టలు కొనడం,మిఠాయిలు చేయించడం లో ఇంట్లో వాళ్ళకి తీరుబడే చిక్కలేదు. ఆ రెండు రోజులూనూ పాప ఇటొక గంతు అటొక గంతు వేస్తూ ఆడుకుంటున్నది.
    నీరజ వూరికి వెళ్ళే రోజు రానే వచ్చింది. కమల దగ్గర కొచ్చి 'ఇక్కడి కొచ్చినాక నీతో బాగా కాలక్షేపం అయింది కమలీ ఎప్పటి కన్నా హాయిగా. అక్కడి కెళ్ళినాక నువ్వు లేకపోతె ఎట్లా తోస్తుందో ఏమో' అంటూ కమల చెయ్యి పట్టుకుని 'చూడు కమలీ అన్నయ్య స్వతహాగా మంచివాడే కాని నాలుగేళ్ల కిందట- అంటే ఈ పాప పుట్టి నాక ఏమైందంటే - అని తటపటాయించి 'మారిపొయినాడు కోపం ఎక్కువై పోయింది. ఒకవేళ నిన్నేమన్నా అన్నా కోపగించుకోకు, పాపా కోసం , అమ్మ కోసం' అని కళ్ళ నీళ్ళు కమ్మగా లేచి వెళ్ళిపోయింది.
    నీరజ భర్తతో బొంబాయి వెళ్ళింది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా వుంది. నీరజ ఎప్పుడూ పాపనో, కమల నో తోడు చేసుకుని నానా హంగామా చేసేది. ఇప్పుడిక ఎవరి పనుల్లోకి వాళ్ళు జారుకున్నారు.
    శ్రీపతి వచ్చినాక పనివాళ్ళంతా చప్పుడు చెయ్యకుండా తిరుగుతున్నారు. హెడ్ మాస్టర్ని చూసి 'పిల్లలు నిశ్శబ్దంగా తొలిగిపోయినట్టు తప్పుకుని తిరుగుతున్నారు. ఈ మార్పు రాజేశ్వరి గమనించింది. ఆఖరికి శ్రీనివాసరావు గారు కూడా మునుపటల్లె స్వేచ్చగా తిరగటం లేదు. శ్రీపతి ముఖం చూస్తేనే అంతా చప్పబడుతున్నారు. ఆ గడ్డాలు, మీసాలు సగం కారణం. శ్రీపతి ఎప్పుడు చూసినా , అశాంతిగా , అగ్రహంతోనే తిరుగుతున్నాడు. నాలుగు సంవత్సరాల కిందట అందరినీ నవ్విస్తూ , నవ్వుతూ మూల నున్న వాళ్ళని కూడా ముందుకు లాగి కవ్వించే శ్రీపతి ఇప్పుడు 'మనిషి కంపునూర్, నా కంపునీర్' అని తిరుగుతున్న రాక్షసుడల్లె వున్నాడు. మునుపు సంతోషంతో వెలిగే అ కళ్ళు ఇప్పుడు కర్కశంగా నిర్ధాక్షిణ్యంగా మండుతున్నై. ఎవరు దొరుకుతారా, ఎవర్ని హింసిద్దామా అన్నట్లు చూస్తాడు.
    రాజేశ్వరి దేవి శ్రీనివాసరావు గారు ఇది గమనించారు. తల్లి ప్రాణం విలవిల్లాడింది. దేశాల మీద పోయిన శ్రీపతి తిరిగొస్తున్నాడంటే , మనసుకి శాంతి చిక్కి ఆనందగా వస్తున్నాడను కుంది. కాని ఇట్లా అశాంతితో పాషాణమై తిరిగోస్తున్నాడనుకోలేదు. ఆమె ఆ పరిస్థితిని ఎదుర్కోలేక ఏమీ చెయ్యలేక అలమతిస్తున్నది.
    పాప ఇంకా 'బూచి' అనటం మానలేదు. ఆశ చూపించి పిలిచినా శ్రీపతి దగ్గరకి పోవటం లేదు. బలవంతాన  దగ్గరికి తీసుకుంటే ఎక్కుపుట్టేట్టు ఏడ్చి కమల దగ్గరికి పోతున్నది. రాజేశ్వరి శ్రీపతిని ఆత్రంగా చుట్టుకు చుట్టుకు తిరగటాన పాప ఆమె దగ్గరికి కూడా పోవటం లేదు. ఎంతసేపటికి కమలీ అంటూ కమలనే కరుచుక్కుర్చుంటుంది.
    ఇంక భరించలేక రాజేశ్వరి 'బాబూ శ్రీపతీ ఆ గడ్డాలు మీసాలు తీసెయ్యి నాయనా, పాప బెదిరిపోతున్నది. అవి తీస్తే నీకు మాలిమౌతుందేమో ' నన్నది. దానికి శ్రీపతి విసురుగా 'పక్కసున్నవాళ్ళు చేరనియ్యకపోతే అదేం చేస్తుంది పసిపిల్ల' అన్నాడు.
    ఆ విసురేవరికో అర్ధం చేసుకున్న రాజేశ్వరి వుస్సురన్నది. కమలదెం దోషం లేదని దానికి కారకురాలు కాదని ఆమెకు తెలుసు. తనే విన్నది ఎన్నోసార్లు 'నాన్నే' గా భయపడతా వెందుకు మాధురీ. ఇంతకు ముందు నాన్న కబుర్లు చెప్పేదానివే, పోయి ఆడుకో' అనటం, పాప 'నే పోను నీ దగ్గరే వుంటా . ఆబూచి నన్ను కొడ్తాడనటం .
    ఇదైన రెండురోజులకి శ్రీపతి ఏమనుకున్నాడో, గడ్డాలు, మీసాలు తీసేసి పూర్వపు శ్రీపతై 'ఎట్లా వున్నానమ్మా' అంటూ రాజేశ్వరి ముందు కొచ్చాడు. ఆవిడ ఆనందంతో 'నీకేం బాబూ , గ్రహణం విడిచిన చంద్రుడల్లె వున్నావని ' తన మాట ఆ మాత్రం విన్నందుకే సంతోషించింది.
    ఇంట్లో అందరూ కాస్త గట్టిగా గాలి పీల్చుకున్నాడు. ఇప్పుడు మరీ మునపటంత తప్పుకు తిరగటం లేదు. కాస్త మనిషిని చూసినట్టే చూస్తున్నారు. పాప కూడా కాస్త పిలిస్తే ముఖం చూడటం వరకూవచ్చింది, దగ్గరకు రాకపోయినా.
    శ్రీపతి కూడా నలుగుర్ని పలకరించడం మొదలు పెట్టాడు. కుశల ప్రశ్నలు వెయ్యడం సాగించాడు. వో రెండు నిమిషాలు మాట్లాడం నేర్చుకున్నాడు. రాజేశ్వరి, శ్రీనివాసరావు గార్లతో పాటు వ్యవహారాలు చూస్తున్నాడు. అది కాదు మామయ్యా ఇట్లా ఎందుకు చెయ్యకూడదంటూ సలహా లివ్వటంలోకి వచ్చాడు. తల్లి బైటకి, శ్రీనివాసరావు గారు లోపల ఈ వస్తున్నా మార్పుకి సంతోషించారు.
    శ్రీపతి ఇప్పటికీ కమలని శత్రువుని చూసినట్టే చూస్తున్నాడు. కనిపిస్తే మండి పడతాడు. ఏదైనా వెటకారం గా నొప్పించే మాట అంటాడు. బాధపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇది అందరూ గమనించినా ఏమీ చెయ్యలేక పోయినారు.
    కమలకి కష్టమనిపించేది కాని శ్రీపతి మాటలు అంత పట్టించుకునేది కాదు. ఇది చూసినవాళ్ళు 'మునుపు బాబుగారెంత కలిసి వుండే వారనుకున్నారమ్మా . ఎంత మంచివాడనుకున్నావ్, ఈ నాలుగేళ్ళగానే ...' అనేసి వెంటనే సంభాషణ ఆపేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏదో పని వున్నట్టు.
    నాలుగేళ్ళ నాడే మైందో కమలకి తెలియలేదు. పాప తల్లి చచ్చిపోయిందనుకోటం మినహా.
    పాపం  శ్రీపతి ఆవిడని ఎంతగా ప్రేమించాడో ఆవిడే పోగానే ఇంత మారిపొయినాడనుకుంది. సానుభూతితో జాలిగా. అందుకనే వీలైననంతవరకూ పాపని నచ్చజెప్పి తండ్రి దగ్గరికి పంపిస్తుండేది.
    ఈమధ్య పాప తండ్రీ దగ్గరికి బాగానే వెళ్తున్నది. శ్రీపతి కూడా వాచిపోయినట్టు దగ్గరికి తీస్తాడు. ఆడుకుంటాడు.అవ్వీ ఇవ్వీ తెచ్చి పెడతాడు. కాని పాపకి తను కోరుకున్నంత దగ్గర కాలేక పోతున్నాడు. ఏది చెప్పినా, చేసినా పాప 'మా కమలీ అయితే ఇట్లా చెప్తుంది, అట్లా చేస్తుంది' అని వంక పెట్టేది. 'మరి కమలీ ఈ కధ ఇట్లా చెప్పిందేం? కమలీ చెప్పిందే బాగుంది. ఇదేం బాగాలేదని ' గునుస్తుంది. తన కొచ్చిన కధలు శ్రీపతి కి చెప్తుంది . ఎవరు చెప్పారమ్మా అంటే ' మా కమలీ' అంటుంది.  ఒకరోజు ఏదో పాట సన్నగా పాడుతున్నది. 'అరె పాపా నీకు పాటలోచ్చా? నాకు తెలియదే' అన్నదానికి 'మా కమలీకి బోలెడు పాటలోచ్చు. కమలీ పాడుతుంటే నేను నేర్చుకున్నా' నన్నది.
    ప్రతిదానికి పాప కమలీ కమలీ అనడంతో అసలే కమల పట్ల శత్రుత్వం చూపిస్తున్న శ్రీపతి ఇంకా మండి పడేవాడు. తన బిడ్డని తనకి కాకుండా చేస్తున్నదని గోల చేసేవాడు. పాప ఎంతటి ఆటలోనైనా కమల పిలిస్తే పరిగెత్తేది. అన్నం తిందామని శ్రీపతి పిలిస్తే , పోక కమలీయే పెట్టాలనేది. నిద్రపోవడానికి అంతే, శ్రీపతి ఎంతో ప్రయత్నించేవాడు తన దగ్గర పడుకొబెట్టుకోటానికి. కాని పాప వినేది కాదు. ఒకవేళ మొదట్లో పడుకున్నా అర్ధరాత్రి వేళకి లేచి ఏడుస్తూ వెళ్ళేది. వీటన్నిటితో శ్రీపతికి కమలంటే మొదటి నుంచి వున్న నిరసన కసి పెరిగినై. దాంతో నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు పట్టేవాడు.
    పాపతో కమల తోటలో ఆడుకునేటప్పుడు పనిపెట్టుకుని వెళ్ళి పగలైతే 'ఎండలో పసిపిల్లని తిప్పుతావా ఆపాటి తెలియోద్డా' అని గద్దించే వాడు. సాయంత్రమైతే 'ఎద్దులల్లె వుండే పెద్దవాళ్ళకి చలిగాలి లేకపోతె పసిపిల్లలకి జబ్బు చెయ్యదా' అంటూ పాప ఏడుస్తున్నా ఆగకుండా చంక వేసుకోచ్చేవాడు. సరిగదా అని ఇంట్లో కూర్చుంటే 'పిల్లకి గాలి వెలుతురూ అక్కర్లేదా , ఆటపాటలక్కర్లేదా ఏముంది వందల కొలదీ లు జీతాలిచ్చి మెక్క పెడుతుంటే సోమరులై పోతారంటూ మండి పడేవాడు.
    కమలకి ఏమీ తోచేది కాదు. తనంటే అంత కచ్చ ఎందుకో అసలు బోధపడేది కాదు. తాను చేస్తున్న తప్పు అంత కన్నా కనబడేది కాదు. చేస్తే చేశానని లేకపోతె లేదనటం తో కాలు చెయ్యి ఆడక అల్లాడి పోయేది. మునపటలే ఇల్లంతా తిరగటం లేదు. తమ గదులోనే వుండిపోతున్నది. పెత్తనం చెయ్యటం లేదు.
    కళ కళ్ళాడుతూ తిరుగుతూ తనపని మూడొంతులు నెత్తినేసుకున్న కమల అట్లా ముడుచుకు మూల్నకూర్చోటం రాజేశ్వరికి బాధనిపించింది. శ్రీనివాసరావుగారు 'కమలా' అంటూ పిలిచి ఏది అని అడగటం 'ఎక్కడో వుంది మహారాణి' వంటి శ్రీపతి వెటకారపు సమాధానాలు విని శ్రీపతి మొహం లోకి  చూసి వూరుకునేవారు. పనివాళ్ళ విషయం చెప్పనక్కర లేదు. నాయకుణ్ణి . పోగొట్టుకున్న ప్రజాలల్లే తిరుగుతున్నారు.
    రాజేశ్వరి వుండబట్టలేక ఒకరోజు కమల గదికి వెళ్ళి నిస్తేజంగా కూర్చున్న కమల నిచూసి 'ఎమ్మా ఒంట్లో బాగుంటం లేదా' అని అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS