4
పాప పుట్టిన రోజొచ్చింది. అప్పటికి కమల వచ్చి కూడా చాలా రోజులే అయింది. నలుగురు తెలిసిన వాళ్ళని పిలిచి చాలా గొప్పగా చేశారు. నీరజ బలవంతంగా తన పెద్ద చీరే ఒకటి కమలకి కట్టింది వద్దంటే వినకుండా. సహాజంగా చక్కని పిల్ల. మంచి పోషణ తో, హాయైన వాతావరణం లో ఇక్కడి కొచ్చినాక ఇంకా అందంగా తయారైంది కమల. ఈరోజు ఆ పట్టుచీరతో సొమ్ములు లేకపోయినా నిండుగా అందంగా తిరుగుతున్న కమల ని చూసి ఎవరని అడిగారు చాలామంది రాజేశ్వరి ని, నీరజ ని. ఒకావిడే ఇదే ప్రశ్న పాప నడిగింది. పాప వో క్షణం అలోచించి 'మా అమ్మ' అన్నది.
ఆ మాటలకి రాజేశ్వరి, నీరజ, కమల చేష్టలుడిగి నిల్చున్నారు ఎక్కడి వాళ్ళ క్కడ. కాని అంతమంది ఆడవాళ్ళున్న చోట నిశ్శబ్దం నిలవలేదు కనక మళ్ళీ మాటలు మొదలైనై.
కమల సిగ్గుతో ఆ సందట్లో లోపలికి వెళ్ళటం గమనించింది నీరజ. కొంతసేపటికి బైటి కొచ్చినా మునపటి వుత్సాహంతో తిరగలేదు కమల.
అందరూ వెళ్ళినాక కమల గదిలో కూర్చుని ఏడుస్తున్నదని రమణమ్మ చెప్పడంతో నీరజ రాజేశ్వరి వెళ్ళారు 'పిచ్చి పిల్ల' అనుకుంటూ.
అప్పటికి పాప కమల వొళ్ళోచేరి 'కమలీ ఏడవొద్దు ఎందుకేడుస్తున్నా'వంతూ కళ్ళు తుడవటం మొదలు పెట్టింది. వీళ్ళు వెళ్ళే టప్పటికి కమల 'మాధురీ నన్ను అమ్మ అని ఎందుకు చెప్పావ్' అని అడుగుతున్నది కొంచెం కోపంగానే. పాప బిత్తరపోయి ఏడుపు గొంతుతో 'మరి నాకు మామ్మవుంది, అత్త వుంది, నాన్నారున్నారు, అమ్మ లేదు . నువ్వంటే నాకిష్టం అందుకని అమ్మ అని చెప్పాను' అని ఏడవటం మొదలెట్టింది.
కమల ఇంకా వుండబట్టలేక 'పాపా' అంటూ చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది. తన చిన్ననాడు మేనమామ ఎంత బాగా చూసినా తల్లి కోసం తను పడ్డ ఆవేదన గుర్తు కొచ్చింది.
ఇద్దరూ ఏడుస్తూ ఒకళ్ళ నొకళ్ళు సముదాయించుకోటం చూసి తల్లీ కూతుళ్ళు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ దిగులుగా వెనక్కి తిరిగారు. ఇప్పుడు పాపకి కమలంటే అంత ప్రేమ ఎందుకో అర్ధమైంది వాళ్ళకి. ఏంచెయ్యాలో తెలియక ఇద్దరూ ఆ రాత్రంతా ఆలోచనలతో గడిపారు. నిజమే వాళ్ళు పాపకి ఎంత చేసినా తల్లి లేని కొరత తీర్చలేక పోతున్నాం గదా అనే వ్యధతో రాత్రంతా బాధపడ్డారు.
మర్నాటి నుంచి కమలని వాళ్ళు కొత్త కోణాల్లోంచి చూట్టం మొదలు పెట్టారు. పిల్ల చక్కటిదే. మంచిదే పాపకి ప్రాణం. కమల కూడా పాపని చాలా ఆదరణగా అభిమానంగా చూసుకుంటున్నది , ఏదైనా పాప తరవాతే అన్నట్టు.
'కాని' అన్న ఈ ప్రశ్న వాళ్ళని ఎన్నో విధాలుగా వేధిస్తున్నది. ఈ పిల్లని కోడలిగా చేసుకోటానికి వాళ్ళకే అభ్యంతరం కనపడలేదు. వాళ్ళలో వాళ్ళు తల్లీ కూతుళ్ళు తర్జన భర్జన జరుపుతున్నారు. ఇంతకూ ముందు జరిగినదాంతో , కట్టిన బొప్పులతో కమల ఒకవిధంగా వాళ్ళ దృష్టికి కనిపించింది. ఈ ఆలోచన వాళ్లకి బాగానే తోచింది. సంతోషంగా కూడా వుంది. ఆస్తిపాస్తులు అంతస్తులు లేకపోతేనేం మనకున్నది చాలదా. అనుకున్నారు.'
కాని కమల ఒప్పుకుంటుందా ? శ్రీపతి ఒప్పుకుంటాడా. శ్రీపతి దగ్గర ఈ ప్రస్తావన తెచ్చే ధైర్యం వాళ్ళిద్దరికీ లేదు. వాళ్ళు చెయ్యకలిగిందేమీ లేదనుకుని నిట్టూర్చి వూరుకున్నారు తల్లీ కూతుళ్ళు.
కమల , పాప ఇంకా మమేకంగా వుండటం చూసి చివరికి ఏమవుతుందో అన్న ఆలోచన ఎక్కువైంది వీళ్ళకి. నీరజతో వొంతు పెట్టుకుని ముగ్గురూ ఆడుతున్నా పాపా కమల ఒకటిగా కనపడేది చూసేవాళ్ళకి. ఎవరితో ఎంత ఆటలో వున్నా పాప ఉన్నట్టుండి 'కమలీ' అంటూ కమలను వెతుక్కుంటూ పరిగెత్టేది.
పాపకిప్పుడు చదువు చెప్పటానికి ఒక టీచర్ ని పెట్టారు. కమల వెళ్లి పక్కన కూచుంటే గాని అడుగు వేసేది కాదు. చదువు కునేది కాదు పాప. వారం రోజు లిట్లా గడిచినాక మెల్లగా కమలే 'మధ్యలో లేచి రావటం తరవాత పాపని ముందు పంపించి తను వెనక వస్తానంటూ మెల్లగా మరిపించేది. అప్పుడప్పుడు పేచీ పెట్టినా క్రమంగా అలవాటైంది.

నీరజ వెళ్ళే రోజు దగ్గరి కొచ్చింది. తల్లి మెళ్ళో కేదైనా కొనుక్కోమని ఇచ్చిన డబ్బు తీసుకుని కమలతో షాపు కెళ్ళింది. అక్కడ తనకు నచ్చిన పచ్చల నెక్లెస్ తీసుకుంది. కమల కూడా మెళ్ళోకి రెండు వరసల చుట్టిన ముత్యాలు ఎప్పుడైనా పెట్టుకోటానికి కొనుక్కుంది. రోజూ పెట్టుకోటానికి లావాటి ఒంటి పేట గొలుసు, తెండు జతల గాజులు కొనుక్కుంది! ఇక్కడి కొచ్చిన దాదాపు ఈ సంవత్సరంగా నెలకి మూడు వందల జీతం వస్తున్నది. ఖర్చూ లేదు.
నీరజ ఆ ముత్యాలకి సరిపోయే ఒక చిన్న ముత్యాల దిద్దుల జత కొని కమల కిచ్చింది. కమల వద్దనటంతో నీరజ కి కోపం వచ్చి ఇంటి కొచ్చినాక దూరదూరంగా తిరగటం చూసి ఏమిటిందన్నదానికి ఇద్దరూ జవాబు చెప్పలేదు. కమల అవతలికి వెళ్ళినాక జారిగింది నీరజ ద్వారా తెలుసుకున్న రాజేశ్వరి 'పోనీ నేనిస్తాతీసుకో కమలా' అని బలవంతం చేసి ఇచ్చింది. కమలకి తప్పలేదు. ఆ గొలుసు, గాజులు ముత్యాలతో తిరుగుతున్న కమల ని చూసి వాళ్ళు ముచ్చట పడ్డారు.
ఒకరోజు వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటూ వుండగా శ్రీనివసతావు గారు ' అమ్మాయ్ నీరజా మీ అన్నయ్య దగ్గర్నించి టెలిగ్రాం వచ్చిందమ్మా. నిన్న బొంబాయి వచ్చాట్ట. ఇక్కడికి ఎల్లుండి పొద్దున్న వస్తున్నాడు అన్నారు.
ఆ మాట విన్న వాళ్ళ ఆనందానికి అంతు లేదు. మూడున్నర సంవత్సరాల ముందు వెళ్ళిన శ్రీపతి ఇంటి కొస్తున్నాడని అనుకుంటేనే వాళ్ళకి సంతోషం పొంగి వొస్తున్నది. 'పాపా నాన్న వస్తున్నాట్టమ్మా' అని మధురికీ పదేపదే చెప్పారు.
కమలకి మాత్రం తమాషాగానే వుంది ఇదంతా. తను ఇన్నాళ్ళుగా వున్నా తల్లీ కూతుళ్ళు ఒక్కసారైనా ఆ ప్రస్తావన తేలేదు. అప్పుడప్పుడు రాజేశ్వరి దిగులుగా వుండటం చూసిందే కాని కారణం తెలుసుకోలేక పోయింది.
మునుపు ఎవరైనా వస్తే కమలకి అప్పజెప్పే పనులన్నీ ఇప్పుడు వాళ్ళే స్వయంగా చేస్తున్నారు. కమల వెళ్ళినా 'నీకు తెలియదు కమలా అన్నయ్య ఈ మధ్య చాలా కోపిష్టి గా తయారైనాడు. ఏ లోపం వచ్చినా చంపేస్తాడు. వాడితో నువ్వు పడలేవు' అంటున్నారు.
వాళ్ళు సంతోషంలోనే భయం భయంగా వుండటం కమల చూసి ఆశ్చర్యపోయింది. 'ఏమిటి వీళ్ళిద్దరూ నిదానస్తూలేనే. మంచి వాళ్లేనే. ఈ శ్రీపతి అంత రాక్షసుడా' అనుకునేది.
సరేలే నాకెందుకానీ పాపని తీసుకుని తోటలు దొడ్లు తిరిగేయ్యడం మొదలు పెట్టింది. అక్కడొక పక్కగా వో పెద్ద మల్లె తీగె పాకిన ఆర్చి కింద ఇసుక తిన్నెలు వేసి వున్నై. పక్కనే చిన్న కొలను. ఈమధ్య పాప కమల ఇక్కడి కొచ్చి పిచ్చుక గుళ్ళు కట్టి ఆడటం మొదలు పెట్టారు. ఆరోజు కూడా కాసేపాడి, పాపచేత పాటలు పాడిస్తూ కూర్చుంది కమల. ఇంతలో పాప కమల పాడే త్యాగరాజ ఆకృతి పాడ్డం మొదలు పెట్టింది. సన్న గొంతేసుకుని. కమల చటుక్కున పాపను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుని ఎవరు చెప్పరమ్మా అంటే 'నువ్వేగా పాడతావు. నేను నేర్చుకున్నా.బాగుందా.' అన్న పాప మాటలకి కమల మరోసారి ముద్దు పెట్టుకుంది.
పాప పడుకోపోయేవరకూ నాన్న ఎలా వుంటాడు. ఏమిటి అన్న ప్రశ్నలకి కమల తోచిన సమాధానం చెప్తూ నిద్ర పుచ్చింది. 'ఇంకా రెండు రోజులకి కదమ్మా నాన్న వచ్చేది' అంటూ దాటేసింది పాప యక్ష ప్రశ్నలు, మరి పాపకి ఎంత తెలుసో తనకీ అంతే తెలుసు.
మర్నాడు ఇంట్లో హడావుడిగా వుంది. శ్రీనివాసరావు గారితో సహా అందరూ తొక్కిళ్ళడుతున్నారు. మర్నాడొచ్చే శ్రీపతి కోసం. వాళ్ళ మధ్య ఏం చెయ్యటానికి తోచని కమల పాపని తీసుకుని బైటకి నడిచింది. కొంతసేపు ఇద్దరూ తోటంతా తిరిగారు. ఉయ్యాలలూగి కొలను దగ్గరి కొచ్చారు. అక్కడ ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి పాప ఇది నాది,ఇదినీది, ఇది అత్తది అంటూ భాగాలు పెడుతుంటే కమల నవ్వుతుంది.
పాప వున్నట్టుండి 'బూచి' అంటూ ఏడవటం మొదలెట్టింది. కమల ' ఎవరమ్మా మాధురీ' అంటూ చేతుల్లోకి తీసుకుంది. అప్పుడు పాప వేళ్ళ సందుల్లోంచి చూస్తూ కమల వెనక్కి చూపించింది.
కమల వెనక్కి చూసింది. అక్కడొక కొత్త మనిషి మీసాలు, గడ్డాలతో ఖరీదైన అధునాతనమైన వేషం వేసుకుని నల్లద్దాల పెట్టుకుని సిగరెట్టు తాగుతూ వీళ్ళనే చూస్తూ నుంచున్నాడు. ఈ మనిషేవరా, ఇక్కడి కెట్లా వచ్చాడా అనుకుంటూ పాప చెయ్యి పట్టుకుని 'లేమ్మా చాలా సేపయింది వెళ్దాం' అంటూ నడవటం మొదలు పెట్టింది గబగబ కాస్త భయంతో.
ఆ మనిషి వెనకనే వస్తున్నాడు. కమల పాప నెత్తుకుని ఇంకాస్త జోరు చేసింది నడక. అంతలో 'పాప అగు' అని ఆ వ్యక్తీ పిలవడంతో పాప ఏడుపు లంకించుకుంది. కమల కూడా 'అయ్యో మాలీ అన్నా ఇక్కడ లేడే' అనుకుంటూ ఆగకుండా పోతున్నది.
'ఆగమంటుంటే నిన్నుగాదు అగు' అనే పొలికేక పెట్టడంతో కమల పాపను గట్టిగా పట్టుకుని గబగబా ఇంట్లోకి పరిగెత్తింది.
దోవలో సామాను అడ్డదిడ్డంగా వున్నై, కొత్త మనుషులెవరో వున్నారు. కాని కమల అదేం గమనించే స్థితిలో లేదు. రొప్పుతూ వచ్చిన కమల ని ఏడుస్తున్న పాపని చూసి నీరజ, రాజేశ్వరి ఒక్కసారి ఎమైందని' అడగటం మొదలెట్టారు. పాప ఏడుస్తూ 'బూచి వచ్చాడు మామ్మా' నన్ను పిలిచాడు నాకు కమలీకి భయం వేసి పరిగెత్తు కొచ్చాం' అని ఏడుస్తూ చెప్పింది. 'బూచెవరమ్మా అని అడగ్గానే 'గడ్డం మీసం' అంటూ వాకిలి వంక చూసి ఆ వ్యక్తే మళ్ళీ కనబడటం తో కమల కుచ్చెళ్ళలో మొహం దాచుకుని మళ్ళీ ఏడ్చింది.
పాప చూపించిన వైపుకి చూసిన నీరజ కి వాళ్ళ అమ్మకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు.
'అది మీ నాన్న తల్లీ, శ్రీపతి . బూచి కాదూ ఏమీ కాదు.'
ఆ మాటలకి కమల ఆశ్చర్యంతో చూసింది. ఆ మనిషి వైపు. అట్లా చూస్తున్న కమలతో నీరజ 'మా అన్నయ్య కమలా, రేపు రావాల్సింది ఈరోజే వీలైవొచ్చాడు. పాప ఏదంటే తోటలో ఆడుకుంటూన్నదని చెప్తే వచ్చాడు. మా అన్నయ్యతో పాటే మా అయన కూడా వచ్చారు. నేను ఎల్లుండి వెళ్తున్నా' అంది.
