గోపాలం బట్టలు మార్చుకుని మొహం రుద్దుకుని కాఫీ తీసుకుంటుంటే. ఓవల్టీస్ ఫ్లాస్కు తెచ్చి పక్కనపెట్టి, "నేను మామూలుగా వంట అయిపోయాక వస్తాను హాస్పిటల్ కి" అంది సునంద.
"ఎందుకు అక్కయ్యా నువ్వుకూడా వెళ్ళు ఆయనతో - వంట నేను వండుతాలే" అంది రత్నం.
"రెండు పూటలా నువ్వు ఎందుకు? ప్రొద్దున్న ఆఫీసు వంకని నేను ఎలాగ వండడంలేదు" అంది సునంద.

"ఫరవాలేదు....పోనీ, ఈ ఒక్కరోజుకీ వెళ్ళు రేపటినుంచి మళ్ళీ, రోజూ వంటచేసే వెళుదువుగాని" అంది. ఇందాక గోపాలం ముద్దువల్ల తనలో రేగిన ఉత్సాహపు వెల్లువ ఇంకా తగ్గని రత్నం.
"పోనీ- రా వదినా- పొద్దున అన్నయ్యకి గోల్డ్ ఇంజక్షన్ ఇచ్చాక నువ్వింకా హాస్పిటల్ కి వెళ్ళలేదుగా?" అన్నాడు గోపాలం.
"చిన్నపిల్ల రత్నాన్ని ఈ పూటకూడా శ్రమపెట్టనా?" అంటూ తటపటాయించింది సునంద.
"నువ్వు పడుతున్న శ్రమలో ఇది ఎన్నో వంతు? అయినా మీ చెల్లెలు కందిపోదులే రెండుపూటలా వండితే" అన్నాడు నవ్వుతూ గోపాలం.
'సరే' అని సునంద తీరా బయలుదేరే సరికి, బాబిగాడు "నేనూ వస్తానని మారాం చేశాడు. "నువ్వు వెళ్ళకూడదు. అక్కడ అయ్ ఉంది" అంది రత్నం కోపంగా. సునంద మనస్సు చివుక్కుమంది. నిజమే! క్షయవ్యాధి అంటురోగమే! పసిపిల్లల్ని దగ్గికి వెళ్ళనియ్యకూడదు. ఆ సంగతి తనకీ తెలుసు. కాని రత్నం ప్రత్యేకం, ఆ సంగతి చెప్పి మరీపిల్లాడిని భయపెట్టడం. ఆ భయానికి కారణం అయిన వ్యక్తి తన భర్తే కావడం, సునంద మనస్సుకి ఎందుకో బాధగా అనిపించింది. ప్రతి రోజూ బాబిగాడిని గురించి అడుగుతారాయన. కాని తీసుకువెళ్ళ డానికి లేదు- ఇదే తన స్వంత కొడుకైతే ఒక్కరోజైనా తనతో హాస్పిటల్ కి తీసుకువెళ్ళకుండా మానునా? అంటువ్యాధి అని ఇలా సంకోచం ఉండునా?......తనకీ ఆయనకీ సందున ఒక అలుసు ఉంటే-అంతటి అదృష్టంకూడానా తనకి?..... బాధగా నిట్టూర్చింది సునంద.
గోపాలం సునందా ఒకరి పక్కన ఒకరు నడిచి వెళుతున్నారన్న మతెకాని ఎవరి ఆలోచన్లో వాళ్ళు ఉండి ఒకర్నొకరు పలకరించుకోకుండా మౌనంగా ఉన్నారు. మనస్సులో బెంగేమీ తగ్గకుండా అలాగే ఉన్నా రత్నమూ, గోపాలమూ ఈ ఊరు ట్రాన్స్ఫరయి వచ్చినప్పటినుంచీ కొంత కాలక్షేపం అయి రోజుల త్వర త్వరగా దొర్లుతున్నాయి. ఇంతక్రితం ఏం తోచక ఒక్కత్తే ఆలోచిస్తూ బెంగగా కూర్చునేది. అవకాశం దొరికినప్పుడల్లా బాబిగాడితో ఉంటూండడంవల్ల ఇప్పుడు ఆ ఆలోచన్లూ బెంగారావడం లేదు ఇంటి బాధ్యతలు కూడా కొన్ని తగ్గాయి. ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే బుద్ధి గోపాలానికి పుట్టడంవల్ల తనకి కొంత స్థిమితం ఏర్పడింది. ఆయన ఆరోగ్యం కూడా కుదుటబడి మామూలు మనిషి అయితే.....మనస్సులోనే దేవుడికి దణ్ణం పెట్టుకుంది సునంద.
గోపాలం ఆలోచనలు కూడా దాదాపు ఆ మార్గంలోనే సాగుతున్నాయి. ఈ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాక తన మనస్సుకి కొంత సంతృప్తి ఏర్పడింది. అన్నయ్యకీ వదినకీ ఏదో చేతనైనంత వరకూ సాయం ఆపుతున్నాను కదా అని సంతోషంగా కూడా వుంది అయితే వాదించి వదినచేత ఈ ఉద్యోగం మాత్రం మాన్పించలేకపోయాడు. "వద్దు నాయనా. నీ మీద బరువు ఎక్కువైపోతుంది, ఆయన మందుల ఖర్చుకేనా ఉంటుంది. నన్నీ ఉద్యోగం చెయ్యనీ అంది ఎంత చెప్పినా వినకుండా. సరే కానియ్యి అని తనూ ఉదాసీనంగా ఊరుకున్నాడు. రత్నం కూడా మొదట ఊరు రావడానికి విసుక్కున్నా, సీతమ్మ వారిలాగా కష్టాల్ని ఓర్పుతో భరిస్తూన్న వదినని చూసేసరికి, జాలివేసి తను చేస్తున్న ఈ మంచి పనికి సంతోషిస్తూ తనతో సహకరిస్తోంది బహుశా వదినకి లేని ఆనందం తనకి ఉంది కదా అనే సంగతి అర్ధంఅయి, జీవితంలో సరియైన విలువలు తెలిసి తనతో రత్నం సహకరించడానికి సిద్ధపడి ఉండవచ్చు. ఏమైనా ఇంకో కొన్ని నెలలు వదిన దగ్గర ఉంటే, రత్నానికి చక్కని సంస్కారం, కష్టాల్ని ఎదుర్కోగలిగిన ఓర్పూ ఎదుటివాళ్ళని నొప్పించకుండా సానుభూతితో అర్ధం చేసుకొనే నేర్పూ అలవడతాయి. ఈ ఊరు వచ్చాక డబ్బుకి మాత్రం కటకట ఏర్పడి కొంచెం ఇబ్బందిగా ఉంది........ సరే..... అన్నయ్యకి ఆరోగ్యం చిక్కి మళ్ళీ మామూలు మనిషైతే అదే చాలు....ఈ ఇబ్బందులకేంలే-
బారులో పచార్లు చేస్తూ శివరాం కన్పించడంతో సునందకి ప్రాణం లేచివచ్చింది గోపాలాన్నీ సునందనీ చూసి, రండి అలా గార్డెన్ లోకి వెళ్ళి కూచుందాం అంటూ శివరాం గార్డెన్ వేపు దారితీశాడు. పచ్చిక మీద కూచున్నాక, ఓవల్టీస్ కప్పు అందుకుంటూ సునంద ముఖంలోకి పరిశీలనగా చూసి "ఏవిటి సునందా అలావున్నావేం ఇవాళ?" అంటూ పలకరించాడు శివరాం.
సునంద "ఎలా వున్నాను?" అంది ప్రయత్నంమీద పెదిమల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ.
"ఏరా గోపాలం! ఇవాళ మీ వదినముఖంలో ఏదో కలవరపాటు కనిపించటం లేదూ?" అని గోపాలాన్ని అడిగాడు శివరాం.
గోపాలం సునంద ముఖంలోకి చూశాడు. మామూలు ఆవేదనే కన్పించింది. వచ్చిన మార్పేవిటో అర్ధం కాలేదు.
"ఏం? ఆఫీసులో ఏదైనా చికాకు కలిగిందా?" శివరాం ప్రశ్నించాడు- "అబ్బెబ్బే అలాంటిదేం లేదు."
"మరి?"
సునంద మౌనంగా ఊరుకుంది.
"మీ వాళ్ళ దగ్గర్నుంచి వుత్తరం ఏవైనా వచ్చిందా?"
ఈ మారూ మాట్లాడలేదు సునంద.
ఆమె మౌనంలోని అర్ధాన్ని గ్రహించి "ఏం రాశారేవిటి?" అన్నాడు శివరాం.
"ఏముంది? మామూలే!" ముక్త సరిగా అంది సునంద.
"మళ్ళీ ఆ మాటేనా? నిన్ను నేను మోసం చేశానని? నా ఆకర్షణలో పడి నువ్వు......?"
"అబ్బే.....అదేం లేదు. ఉత్తరం రాసింది మా నాన్న కాదు. అమ్మ!"
"ఏవంటారు?"
"ఏవంటుంది. రేపు పండగలకి రమ్మంటుంది"
"పోనీ వెళ్ళకూడదూ?"
సునంద కోపంగా శివరాం కేసి చూసింది.
"అది కాదు సునందా! రెండు రోజులు ఉండి వస్తే ఆవిడ సంతోషిస్తుంది"
"ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలివెళ్ళనా?"
"మేం ఉన్నాం కదా వదినా-పోనీ వెళ్ళి రెండు రోజులు ఉండిరా"
సునంద ఏం మాట్లాడలేదు. గోపాలం మళ్ళీ అన్నాడు నిన్ను చూడాలని ఉందేమో మీ వాళ్ళకి"
"అంత చూడాలని ఉంటే వాళ్ళేరావచ్చుగా. మీ అన్నయ్యనీ. నన్ను కూడా చూసి మరీ వెళ్ళవచ్చు"
"అదీ వరస. దానితోటి వాదించి ఒప్పించలేంరా. దానికి ఎంత తోస్తే అంతే - మనం ఎంత చెప్పినా వినదు. ఇది ఇలా వెళ్ళదా" అక్కడ వాళ్ళేం అనుకుంటారు. ఇక్కడ నేనేదో ఆంక్షలు పెట్టి దీన్ని వెళ్ళనీయడంలేదని. వీళ్ళమ్మగారు అలా అనుకోరు అనుకో-మొదటి నుంచీ ఆవిడకి నా మీద మంచి అభిప్రాయమే ఉంది. వీళ్ళ నాన్నగారికి మాత్రం...."
"ఇప్పుడవన్నీ ఎందుకు? .... అయిన వాళ్ళ మీ గురించి ఏం చెడ్డగా అనుకోరు" - సునంద కళ్ళ నుండి ధారగా కన్నీళ్ళు కారుతున్నాయి. చేత్తో పచ్చగడ్డి తుంపుతోంది.
"అదిగో మాట్లాడితే నెత్తిమీద నీళ్ళకుండ తయారు ఇప్పుడు నిన్ను నేను ఏవన్నానని ఏడుస్తున్నావు" గట్టిగా అరిచాడు శివరాం. అరవక ఏం చేస్తాడు. సునంద కళ్ళనీళ్ళు పెట్టుకుంటే చూడలేడు అతని మనస్సంతా కలత వారిపోతుంది ఆమె కన్నీరు పెట్టుకుంటే -
వాళ్ళిద్దరి మధ్యా గోపాలం పని ఇబ్బందిగా ఉంది. ఎటూ చెప్పడానికీ, అలాగని మాట్లాడకుండా ఊరుకోడానికీ వీలు లేకుండా ఉంది. చివరికి వాళ్ళవాదనలో జోక్యం చేసుకుంటూ "నువ్వు ఉద్రేకపడకు అన్నయ్యా" అన్నాడు. శివరాం ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కూచున్నారు ముగ్గురూ చాలాసేపు ఆ తర్వాత శివరాం గోపాలం ఆఫీసు విశేషాలు అడిగాడు. ఈ ఆఫీసు ఎలా ఉంది, అంతా కొత్తకదా. ఎవరేనా స్నేహం అయ్యారా? ఆఫీసరు ఎలా ఉంటాడు అంటూ.
"మా ఆఫీసరు చాలా మంచివాడు రా అన్నయ్యా నా యోగక్షేమాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మీ అన్నయ్యగారి ఆరోగ్యం ఎలా ఉంది అనికూడా పలకరిస్తాడు."
"మంచిదే.....కాని ఈ ఆఫీసర్లని నమ్మమని లేదు. ప్రేమగా ఉంటున్నట్లే ఉంటారు. ఉండుండి గోతిలో తోస్తూ ఉంటారు."
"మా ఆఫీసరు అలాంటివాడు కాహ్డురా"
"అయితే సరే. అయినా కొంచెం అప్రమత్తతగానే ఉంటూ ఉండు. ఏమంటే. నీ దింకా కుర్రతనం. పట్టుమని పాతికేళ్ళు నిండకుండా వీడు అప్పుడే ఎకౌంటెంటు అయ్యాడని ఆఫీసు స్టాఫ్ లో ఎవళ్ళయినా అసూయపడి ఆఫీసరుకి లేని పోనివి ఎక్కించవచ్చు. ఇది లోకం.మన జాగ్రత్తలో మనం ఉండాలి" - శివరాం మాటలు విని గోపాలం తనలో తను నవ్వుకున్నాడు. తనింకా కుర్ర్రాడట - అన్నయ్యకి ఎంత ప్రేమో తనంటే.
"ఇంక చీకటి పడుతోంది వెళ్ళండి" అంటూ శివరాం వార్డువేపు కదిలాడు. గోపాలం. సునందా గేటుకేసి నాలుగడుగులు వేశాక, "ఇప్పుడే వస్తాను ఉండు గోపలం" అంటూ సునంద శివరాం వెనకాలే వెళ్ళింది.
శివరాం తెల్లబోయి "ఏం మళ్ళీ వచ్చావు?" అన్నాడు.
"రాత్రంతా నా మీద కోపంగా ఉండి నిద్రపాడుచేసుకుంటారేమోనని.... అర్ధోక్తిలో ఆగిపోయింది.
శివరాం నవ్వి, "అందుకోసం మళ్ళీ వెనక్కి వచ్చావా పిచ్చిదానా" అంటూ సునంద చెంపలు స్ప్రుశించాడు. ఆ స్పర్శకి పరవశించిపోయి కళ్ళు మూతలు పడిపోగా "ఏవండీ" అంది ఎంతో తమకంతో.
"ఏం సునందా!" ఇంకా దగ్గరగా వచ్చాడు శివరాం.
ఇంతలో తనని తాను సంబాళించుకొని, "ఇంకనేను వెళ్ళివస్తా. మళ్ళీ మీకు పెందరాళే కేరియర్ లో అన్నం పంపించవద్దూ" అంటూ ఫ్లాస్కు బుట్ట చేతికి తగిలించుకుంటూ వెళ్ళి పోయింది సునంద. "ఉత్త పిచ్చిది. నా కోసం, అయిన వాళ్ళనీ ఐశ్వర్యాన్నీ వదులుకొని వనవాసం చేస్తోంది. ప్చ్" అనుకొని వార్డ్ వేపు కదిలాడు శివరాం.
దారిలో గోపాలం "ఒదినా, నీకు కోపం రాదంటే ఒకటి చెప్తా నువ్వు మరీ అంత పట్టుదల వట్టి మీ పుట్టింటికి వెళ్ళడం మానెయ్యడం ఏం బాగోలేదు. నీ పట్టుదలవల్ల అటు మీ నాన్నా అమ్మా బాధపడుతున్నారు. అయ్యో అన్యాయంగా నన్ను అనుకుంటున్నారే నేను పంపించడం లేదని అని ఇటు అన్నయ్యా బాధపడుతున్నాడు. అందువల్ల నువ్వు కోపం మాని."
"నాకు ఎవరిమీదా కోపం లేదయ్యా.....ఈ పరిస్థితిలో వాళ్ళ గడప తొక్కకూడదను కున్నాను తొక్కను......అంతే!" అంది సునంద దృఢ స్వరంతో-
6
శనివారం కావడంవల్ల సునంద ఆఫీసు నుంచి పెందరాళే వచ్చింది. గోపాలం ఆఫీసు నుంచి ఎందువల్ల ఇంకా రాలేదు. ఆ రాత్రి బండికే రత్నం, గోపాలం ప్రయాణం పెట్టుకున్నారు. సంక్రాంతి పండక్కి వస్తే కాని వీల్లెదంటూ వచ్చి కూచున్న బావమరిదికి ఎలాగో అలాగ నచ్చచెప్పి పంపించాలని చూశాడు మొదట్లో గోపాలం. అన్నయ్యకి ఇలా ఉంది పండగ లేవిటి?" అన్నాడు "మేం పండగలకి వచ్చేస్తే ఇక్కడ వదిన ఒక్కత్తే ఉంటుంది" అన్నాడు. కాని సునంద జోక్యం చేసుకుని "అలా కాదు వేళ్ళు గోపాలం మన సమస్యలు ఎప్పుడూ ఇలా ఉంటూనే ఉంటాయి వాళ్ళంతా సరదాపడి పిలుస్తూంటే కాదనకూడదు. పైగా రత్నం చిన్నపిల్ల పైకి చెప్పకపోయినా మనస్సులో సరదాలుంటాయి తోడబుట్టినవాళ్ళు పిలిచారనీ వెళ్ళాలనీ. నాలుగు రోజులు అన్నయ్యలతోటీ, వదినలతోటీ కాలక్షేపం చెయ్యాలనీను. నీకు తెలియవు ఆడవాళ్ళ కోరికలూ ఆశలూను అంది. ఈ మాటలు అంటున్నప్పుడు సునంద మనస్సులో 'అయ్యో నాకు ఒక్క తోడబుట్టిన వాడులేకపోయాడే అన్న అసంతృప్తి ఒక్క నిముషం మెరిసి మాయం అయింది. సునంద మాటలు విని గోపాలం నవ్వుతూ "నువ్వు ఎలా గైనా గడుసుదానివి వదినా ఆ మధ్యన నిన్ను పండగకు వెళ్ళమని నేనంటే ఏదో కబుర్లు చెప్పి కాదన్నావు ఇప్పుడు నువ్వు అదే నాకు చెప్పి నన్ను ఒప్పిస్తున్నావు ఎదుటివాళ్ళు నోరు ఎత్తకుండా, నువ్వు చెపిన ప్రకారం నడుచుకునేలా చేసే శక్తి నీమాటల్లో ఉంది" అన్నాడు అది జ్ఞాపకం వచ్చి సునంద నవ్వుకొంది.
శీతాకాలం ఎండ ఇటే జారుకొంటోంది.
గోపాలం ఇంకా ఆఫీసునుంచి రాలేదు.
తోటికోడళ్ళు ఇద్దరూ బాబిగాడిని మద్యన కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మళ్ళీనాలుగైదు రోజులదాకా బాబిగాడు కనిపించడు అనే ఆలోచన రావడంతో సునంద మనస్సు అదోలా అయిపోయింది ఈ మధ్యన బాగా అలవాటయిపోయింది వాడితో.
ఇంతలో వీధిలో గుమ్మం ఎదురు గుండా, కారు ఏదో ఆగింది. తమ ఇంటికి కారులో ఎవరు వస్తారు చెప్మా అని అనుకొనే లోగానే జగపతీ శాంతా కారులోంచి దిగి నవ్వుతూ వాళ్ళకేసి నడిచి లోపలికి రాసాగాయి. సునంద ఆప్యాయంగా వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. "ఎవరు?" అని ఆశ్చర్యపోతూ చూస్తూన్న రత్నానికి, "ఈ అమ్మాయి శాంత అని మా ఆఫీసు మేనేజరుగారి కూతురు. బి.యస్.సీ పాసైంది. ఇతను జగపతి అని ఆమె భర్త. ఇంత కుర్రాడిగా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. మా ఇంటి పక్కనే ఉండేవారు వీళ్ళు" అంటూ ఇద్దర్నీ పరిచయం చేసింది సునంద.
"చూశావా మీ ఆడవాళ్ళ పక్షపాతం పోగొట్టుకున్నావు కాదు సంతకి ఉన్న డిగ్రీ చెప్పావు. నా డిగ్రీ ఉద్యోగం ఏం చెప్పావు కాదు" అన్నాడు నవ్వుతూ జగపతి. అతని మాటలకి శాంతా సునందే కాదు పరిచయం లేని రత్నంకూడా నవ్వింది. అంతా నవ్వు తున్నారు కదా అని తనకేం అర్ధంకాకపోయినా హనూ నవ్వాడు బాబిగాడు అది చూసి వాడిని చట్టున ఎత్తుకుని ముద్దుపెట్టుకుంది శాంత. "వాడిని ఎత్తుకోకండి గౌరవిస్తాడు" అంది రత్నం ఫరవాలేదు నాది టిష్యూ చీరేలెండి" అంది శాంత.
"అవును అన్నట్లు ఇతని డిగ్రీలు చెప్పడమే మరిచిపోయా నువ్వు పేసయింది ఎమ్. టెక్ కాదూ జగపతీ! ఫారిన్ రీసెర్చ్ డిగ్రీకూడా ఉన్నట్టుంది అవునా? బొంబాయిలో ఏదో విదేశీ కంపెనీలో టెక్నికల్ ఆఫీసరు అంతేనా? అంది సునంద.
"బాగుంది పరిచయం చెయ్యడం......ఏదో....అవునా....అంతేనా అంటూ" అన్నాడు అతి సీరియస్ గా జగపతి. తెచ్చిపెట్టుకున్న జగపతి కోపంచూసి శాంత నవ్వింది. సునందకూడా చిరునవ్వు నవ్వింది. అక్కయ్య స్నేహితులు, కొత్తా మొహమాటం అంటూ ఏం లేకుండా, ఎంత సరదాగా మాట్లాడుకున్నారు?" అని ఆశ్చర్యపోయి "కూచోండి ఇప్పుడే కాఫీలు కలిపి తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది రత్నం. ఇప్పుడేం వద్దని శాంతా జగపతీ ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా.
