Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 7

 

    కృష్ణమూర్తిగారి విశాలమయిన ఇంట్లో ఎక్కడా మనుష్యుల జాడ కనిపించలేదు. వస్తువులన్ని వేటి స్థానంలో అని ఉన్నా స్త్రీ పర్యవేక్షణ లేని ఇల్లు అని తెలుస్తూంది. ఇల్లంతా విలవయిన వస్తువులు అమర్చి ఉన్నాయి. గోడకు మంచి చిత్రాలు వేలాడుతున్నాయి.
    కృష్ణమూర్తిగారు బట్టలు మార్చుకుని శ్రీనివాస్ కు ఎదురుగా కూర్చున్నారు. ఆయన వయస్సు నలభై అయిదూ ఆ ప్రాంతాన ఉన్నా మంచి నిండుగా ఉన్నారు. ముఖంలో ఏదో ప్రత్యేకమయిన ఆకర్షణ. ఆయన కళ్ళలో విజ్ఞానదీపిక వెలుగు కనిపిస్తున్నాయి. వంటబ్రాహ్మడు కాఫీ తెచ్చి ఇచ్చాడు ఇద్దరికి. కృష్ణమూర్తిగారికి శ్రీనివాస్ ను చూడగానే ఏదో దివ్యానుభూతి, మునుపెన్నడూ ఎరగని అనుబంధం కలిగింది ఆయన మనస్సులో.  అతనితో కబుర్లు చెబుతూ ఆసక్తిగా అరగంట గడిపారు. శ్రీనివాస్ వెడతానని లేచాడు. వద్దంటున్నా వినకుండా కార్లో పంపించారు కృష్ణమూర్తిగారు. 'ఈ పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళకు గట్టిగా ఎదురుచెప్పడం కష్టం.' ఇబ్బందిగా అనుకున్నాడు శ్రీనివాస్. ఇంత ఇంట్లో ఒంటరిగా ఉండటం కష్టం అనిపించింది శ్రీనివాస్ కు. ఆశ్చర్యంకూడా వేసింది. అనూరాధను కలుసుకున్నప్పుడు తెలిసింది, ఆయనకు పిల్లలు లేరనీ, భార్య పోయిందనీను.
    కృష్ణమూర్తిగారిని ఏదోవిధంగా తరుచు కలుసుకోవలసివస్తూంది శ్రీనివాస్ కు. సాయంత్రంపూట ఆయన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేముందు లైబ్రరీవైపు నుండి వెళ్లడమో, తరుచుగా ఇంటికి ఆహ్వానించడమో చేస్తారు. ఆయన తనపట్ల చూపిస్తున్న ప్రత్యేక ఆసక్తి కొంచెం ఆశ్చర్యం కలగ జేసింది శ్రీనివాస్ కు. పిల్లలు లేని కారణంగా కృష్ణమోహన్ ని, అనూరాధని చాలా అభిమానిస్తారు. తనూ అంతేనేమో అని సరిపుచ్చుకోపోయినా, అతని మనస్సు ఈ అతిబాంధవ్యాలకు, స్నేహాలకు ఎక్కువ ఇష్టం చూపలేక పోయింది. తెలియని వాళ్ళమధ్య, అందరికి దూరంగా ఉండాలని ఇక్కడికి వస్తే, అనుకోనివిధంగా అనూరాధ కుటుంబంతోనూ, తద్వారా కృష్ణమూర్తిగారి తోనూ పరిచయం అయింది. ఎంత వద్దనుకున్నా, దూరమవుదామనుకున్నా వీలు కాకుండా పోయింది.

                                    10

    హాస్పిటల్ హడావిడిగా ఉంది. రకరకాల వ్యాధులతో రోగులు, వారిని చూడటానికి వచ్చే విజిటర్లు, డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు ఎవరి దోవన వారు హడావిడిగా ఉన్నారు.
    లలిత, ఆమె తల్లి ఆ రోజు హాస్పిటల్ కి వచ్చారు. డాక్టర్ కృష్ణ మోహన్ అక్కడే హౌస్ సర్జనుగా ఉండటం వల్ల, అతనికి తెలిసిన ఒక పెద్ద డాక్టరును పరీక్షకు ఏర్పాటు చేశాడు. నిపుణత కలిగిన డాక్టర్ల దర్శనం చేసుకోవాలంటే ఎక్కడయినా సిఫారసు కావలిసిందే.
    పొద్దుననగా వచ్చిన వాళ్ళకు పరీక్షలన్నీ పూర్తి అయ్యేటప్పటికి మధ్యాహ్నమయింది. వెయిటింగ్ రూమ్ లో కూర్చున్న లలిత దగ్గిరికి వచ్చాడు ఆమె తల్లితో సహా కృష్ణ మోహన్.
    కుర్చీలోంచి లేచి నిలబడుతూ, "మీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియడంలేదు" అంది లలిత.
    "చెప్పుకోకండీ. కృతజ్ఞత చెప్పుకోవడం అయిపోయింది కదా అని మరిచి పోతారు. తెలుపుకోకపోతే ఆ విషయం ఎప్పుడూ గుర్తుంటుంది" అన్నాడు నవ్వుతూ.
    "సహయం చేసేవారు చాలామందికి చేస్తారు కాబట్టి, పదిమందిలో ఒకరుగా మరిచిపోతారు. కాని సహాయం పొందినవారు ఎప్పటికీ మరిచిపోరు."
    చిరునవ్వుతో ఆమెవంక చూచాడు. "ఒక పావుగంట ఆగండి. నేను కారులో దింపుతాను."
    "అబ్బె, వద్దండి. ఇప్పటికే మా కింద ఒక పూట అంతా గడిపారు. రిక్షాలోనో, బస్సులోనో వెడతాం."
    "ఫరవాలేదు. నేను ఎలాగూ వెడుతున్నాను. ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండండి."
    ఇంటిముందు కారు ఆగగానే లలిత తల్లి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. "థాంక్యూ వెరీ మచ్. మీకు శ్రమ ఇచ్చాం" అంది లలిత.
    "ఇది నా డ్యూటీ. శ్రమ కాదు. ఇవాళ మీకు కాలేజీ లేదా?" అడిగాడు.
    "లేకేం? ఉంది. పొద్దున సెలవు తీసుకున్నాను. ఇంక ఇప్పుడు వెళ్ళాలి."
    "రండి, నేను దింపుతాను."
    "వద్దండీ." నాన్చేసింది.
    "మరీ మీ కింత మొహమాటం అయితే కష్టం. ఫరవాలేదు. పదండి" అన్నాడు డోర్ తెరుస్తూ.
    "ఉండండి, ఇప్పుడే వస్తాను" అని లోపలికి వెళ్ళి తల్లితో చెప్పి పుస్తకాలు తీసుకుని బయటికి వచ్చింది.
    "మిమ్మల్ని చాలాకాలంగా చూస్తూ నే ఉన్నా ఇంతమటుకు ఎప్పుడూ మాట్లాడే అవకాశం, అవసరం కలగలేదు" అన్నాడు.
    జవాబుగా నవ్వి ఊరుకుంది.
    "మీరు చాలా బాగా పాడారు ఆ రోజు."
    "థాంక్యూ."
    ఏదో విషయం అడగాలనుకుని, అడగటమో, మానటమో నిర్ణయించుకో లేక తటస్థంగా ఉండిపోయింది లలిత.
    "ఏమిటీ, ఏదో మాట్లాడుదామని మానేసినట్లున్నారు?"
    కొద్ది క్షణాలు ఊరుకుని, "సామాన్యంగా డాక్టర్లు ఎప్పుడూ నిజం చెప్పరు. ఎలా ఉన్నా ఏం భయం లేదంటారు. మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను. నిజం చెబుతారా?"
    "నేనూ డాక్టర్నే. నిజం చెప్పడం నాకూ చేతకాదేమో!" నవ్వాడు.
    "హాస్యంగా తీసుకోకండి. నేను నిజంగా అడుగుతున్నాను" అంది.
    "ఓకె. నేనూ నిజంగానే చెబుతాను. అడగండి."
    కొంచెంసేపు మౌనంగా గడిచింది. ఏదో నిర్ణయించుకున్నట్లుగా "ఇవాళ డాక్టర్ పరీక్ష చేస్తున్నప్పుడు మీరు దగ్గిరే ఉన్నారనుకుంటాను. మా అమ్మ ఆరోగ్యంపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగింది. వెంటనే జవాబు ఇయ్యలేదు కృష్ణమోహన్. ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆలోచించి చెబుతున్న సమాధానంలా "పేషంట్సుతోగాని, వాళ్ళకు సంబంధించినవాళ్లతోగాని కనీసం కొంతవరకు ఆనెస్ట్ గా ఉండటం మంచిదని నా అభిప్రాయం. డాక్టర్లైనా వాళ్ళకు కొంతయినా ఆశ లేకపోతే రోగులలో కలిగించాలని ప్రయత్నించరు. చదువుకున్నారు. అర్ధంచేసుకోగలరనుకుంటాను. హార్ట్ కు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఎప్పుడూ గారంటీ లేదు. నిజానికి గారంటీ దేనికీ లేదు. కాని కొన్ని జబ్బులకు నివారించగల ఆశ ఉండటంవల్ల గారంటీ ఇవ్వగలుగుతారు. తరుచుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి, బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కాని ఉద్రేకపు ఒడిదుడుకులు రాకుండా ఉండటం చాలా ముఖ్యం. మనసుకు కలిగే భావోద్వేగాలు గుండెలమీద ఒత్తిడి తీసుకు వస్తాయి" అన్నాడు. సౌమ్యత నిండిన కంఠంలో గంభీరత ప్రవహిస్తూంది. దృష్టి రోడ్డుమీద ఉంచి డ్రైవ్ చేస్తున్నా మధ్యమధ్య రంగులు మారుతున్న లలిత ముఖాన్ని పరిశీలించడంలో నిమగ్నమవుతూనే ఉంది.
    కాలేజీ ఆవరణముందు కారు ఆగగానే నీటిపొరలు కప్పిన కళ్ళతో కృతజ్ఞతగా చూసి కారు దిగి వడివడిగా లోపలికి నడిచింది. ఆమెవంక సాభిమానంగా కనుమరుగయ్యేంతవరకు చూస్తూ కారు ముందుకు పోనిచ్చాడు ఇంటివైపు.

                                      11

    "ఇవాళ మీరు అదోలా ఉన్నారు, అనూరాధా!" అన్నాడు శ్రీనివాస్.
    "ఊఁ" అంటూ తల ఎత్తింది పరధ్యానంగా.
    "మీరు దేన్నిగురించో ఆలోచిస్తున్నట్లున్నారు. నేనుగాని అంతరాయం కలిగించానా?" అన్నాడు సున్నితంగా నొచ్చుకుంటూ,
    "అబ్బే, ఆలోచన ఏమీ లేదు. అయినా నాలాంటివాళ్ళ ఆలోచనలవల్ల కలిగే ఫలితం లేదు" అంది నిట్టూరుస్తూ.
    ఆశ్చర్యంగా చూచాడు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ, ఉత్సాహానికితప్ప మరోదానికి తావివ్వని అనూరాధ ఏదో పెద్దమనిషిలా, భాధ్యతాయుత వ్యక్తిలా మాట్లాడేసరికి ఆశ్చర్యం కూడా కలిగింది.
    "ఆలోచనలవల్ల చెయ్యగలిగేది ఎప్పుడూ ఉండదు. ఏదైనా ఆచరణలోకి వచ్చాకే ఏం సాధించగలిగినా, ఫలితం కలిగినా ఇంతకీ అదేమిటో తెలుసుకోవచ్చా?" అన్నాడు.
    "ఇవాళ ఎందుకో ఒళ్ళు మండిపోతూంది. ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వీపు పగలగొట్ట బుద్ది వేస్తూంది" అంది విసుగ్గా.
    ఒకసారి అటూ ఇటూ చూచి, "ఈ చుట్టుపక్కల అవి అందుకోగల అదృష్టవంతులెవ్వరూ కనిపించడంలేదు నేనూ, ఆ సముద్రుడూ తప్ప" అన్నాడు దూరంగా అక్కడక్కడ కనిపిస్తున్న మనుష్యులవంక చూసి చిరునవ్వుతో.
    కాని అనూరాధ ఆ హాస్యాన్ని ఆనందించగల ధోరణిలో లేదు. అది గమనించగలిగిన శ్రీనివాస్ మౌనంగా, నీల్మగా ఎగిరి పడుతున్న అలలవంక చూస్తూ ఉండిపోయాడు.
    కొద్ది నిమిషాలు నిశ్శబ్దతను అనుసరించాయి. చుట్టుపక్కల మనుష్యులతో సందడి కలిగింది.
    "మనమూ, మన పద్ధతులూ ఎప్పుడయినా మారుతాయంటారా?" అంది ఉన్నట్లుండి, సన్నగా తీగ మీటినట్లు వచ్చిన ఆమె మాటల ధ్వని జలతరంగణిలా అలల చప్పుడులో కలిసిపోయింది. ఆమె చెప్పింది అర్ధంకానట్లు ఆమెవంక చూచాడు.
    "ఇవాళెందుకో నాలో అంతులేనంత సంచలనంగా ఉంది."
    "అది గమనించాను."
    "మన ఆచారాలు, పద్ధతులు ఎంతమంది మనోవ్యథకు కారణమవుతున్నాయో గమనించగలిగే శక్తి ఎప్పటికైనా మనకు వస్తుందంటారా?"
    "మన కొన్ని ఆచారాలు మనుష్యుల మనోవ్యథకు కారణ మవచ్చుగాని, మనిషి మంచి నడవడి కోసమే ఈ ఆచారాలు ఆచరణలోకి వచ్చాయి."
    "మంచి నడవడికోసం వచ్చినవి ఏమోగాని, మన పెళ్ళి పద్ధతులు మనోవ్యథగాక మంచిని ఎలా కలిగిస్తాయి చెప్పండి?"
    "ఇవాళ ఏదో జరిగింది, అనూరాధా. మీరు ఎప్పుడూ లేనంత కొత్తగా కనిపిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా?"
    "ఇవాళ లలిత అమ్మగారు మా అమ్మకు కబురు పంపింది, తెలిసినవాళ్ళ చేత ఏదైనా లలితకు పెళ్ళి సంబంధం చూడమని."
    కనుబొమ్మలు ముడిపడ్డాయి. అర్ధంకానట్లు ఆమెవంక చూచాడు.
    "నిన్న లలిత మేనత్త దగ్గిరనుండి ఉత్తరం వచ్చిందిట. చూడండి, దేని కయినా మితం ఉండాలా? చిన్నప్పటినుండి లలితకు, వాళ్ళ బావకు పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు అతనికి పరువు ప్రతిష్ఠ, కట్నం కానుకలు తెచ్చి ఇచ్చే అమ్మాయి కావలిసివచ్చింది. కొద్ది రోజుల్లో పెళ్ళి కాబోతూంది. ఇప్పుడు ఆవిడ బాధ చూడాలి. ఎవరూ లేరు. అయినవాళ్ళలో చేసుకుంటే దాన్ని గురించి దిగులుండదు. కాని అది వాళ్ళకు ఉండాలి."
    "అతనేం చదివాడు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS