"భగవాన్! - గోపాలం. నా మాట విని కలకత్తావొచ్చీ. ఏదో ఒక ఉద్యోగం దొరికి తీరుతుంది. ఇంత డిస్పరేట్ గా..."
"అదేం లేదు శేఖర్. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెయ్యదలుచుకుని చేస్తున్నాను. దాని మాటకేం గాని. నీ విశేషాలు చెప్పు..."
కలకత్తా జీవితంగురించి చెప్పేడు శేఖర్. అతనికి పట్టణ జీవితం అందులో కలకత్తా జీవితం. బాగా అలవాటైపోయింది.
"ఈ పదిరోజులూ జైల్లో ఉన్నట్టుఉంది..."
"ఆ మాటే వసంతా అంది..."
చిత్రంగా అతనివేపు చూసి. "వసంత ఇప్పటో కలకత్తా వొస్తుందనుకొను. నాన్నగారి దగ్గరే ఉంటుంది అన్నాడు శేఖర్.
శేఖర్ ఎంత ప్రయత్నించినా, వసంత సంగతి తనకి చెప్పలేడని గోపాలం గ్రహించేడు....కాని, అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం, హాస్టల్లో అంత గొడవ జరిగాక వసంత అన్న దగ్గరకి కాకుండా, స్నేహితురాలి ఇంటికి వెళ్ళడం, ఆ అన్న ఆమెని తన రక్తంలో దాచుకుని, ఆమె పేరుని రక్షిస్తున్నాడు....తన దగ్గర కూడా.
సంభాషణ నడిచిన తీరుచూచి కొంచెం తికమక పడ్డాడు గోపాలం, వసంత తనతో అన్నీ చెప్పిన విషయం అతనికి చెప్పడమా, మానడమా అన్నది తేలలేదు. చెప్తే. అతను వసంతకి ద్రోహం చేసినట్టు అవడమేకాక అ విషయం శేఖరానికి బాధకలిగించవొచ్చును. కాని శేఖరం తన మిత్రుడు...
అప్పుడే వసంత కిందికి రావడాన్న ఈ ధర్మ సందిగ్ధంనించి బయటపడ్డాడు- తాత్కాలికంగా గోపాలం.
"హల్లో' అంది వసంత.
లేచి. రా వసంతా? అన్నాడు గోపాలం.
"బీచ్ లో తిరిగి వస్తాను. కాఫీ కావాలా? అంది వసంత.
"నువ్వూ తాగితే" అన్నాడు గోపాలం.
"సరే" అని సర్వెంటుని కాఫీ తెమ్మని వాళ్ళతో కూర్చుంది వసంత. నిన్నటి స్మృతులేవీ ఆమెని బాధిస్తూన్న సూచనలేవీ కనిపించ లేదామె ముఖంలో, సాదా తెల్లచీర కట్టుకుని ఇవాళ ముఖం మీద బొట్టుపెట్టుకోవడాన్న కాబోలు. ప్రశాంతంగా, మరీ అందంగా కనిపిస్తోంది.
"శేఖర్ కలకత్తా నువ్వు వెళ్ళగానే, నా పుస్తకాలు పంపించు అంది అన్నతో.
"ఏం పుస్తకాలు?" అన్నాడు శేఖర్.
"నా పుస్తకాలు. ఊర్మిళా ముఖర్జీ ఇంట్లో ఫేస్ చెయ్యలేక వొదిలేసిన కాలేజి పుస్తకాలు" అంది,
"అలాగే..." అన్నాడు శేఖర్.
"గోపాలానికి అంతా తెలుసును-నేను నిన్న చెప్పేను" అంది కంఠస్వరం మార్చకుండానే, వసంత.
తుళ్ళిపడ్డాడు గోపాలం.
తెల్లబోయి చూశాడు శేఖర్.
"అందుకే కిందికి వచ్చాను నేను. ఈ సంగతి స్పష్టంచేస్తే మీరిద్దరూ స్వేచ్చగా మాట్లాడుకో వొచ్చును."
కాఫీ వొచ్చింది-కేక్స్, సేండ్విచెస్ తో సహా.
తినడం, తాగడం, నిశ్శబ్దంగా ముగిశాక వసంత లేచి, "శమ్మీని తీసికెళ్ళి తిప్పుతాను-నువ్వు రేపు ఉదయం నేను లేవకుండానే వెళ్ళి పోతావు. అడ్రసు అడగడం రాత్రి మరిచిపోకు" అని, శమ్మీని తీసుకుని వసంత వెళ్ళిపోయింది,
ఆ తరవాత చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కాని, వాళ్ళ సంభాషణ ఆశించినంత ఫ్రీగా లేదు. ఆరున్నర అయాక వెంకటరామ్ వొచ్చారు- ఆయన వెనకాలే వసంతా వొచ్చి లోపలికి వెళ్ళిపోయింది.
"సారీ గోపాల్! ఇవేళ మఠానికి వెళ్ళి పోయాను. రేపు రా- మూడు గంటలకి శేఖర్ వెళ్ళిపోతాడు, తోచదుకూడా, ఏం?" అన్నాడు.
"అలాగేనండీ" అన్నాడు గోపాలం.
తరవాత శేఖర్ బలవంతంగా గోపాలాన్ని అతని ఇంటిదగ్గర డ్రాప్ చేశాడు. డ్రైవరు వున్నా, అతనుకూడా వొచ్చి వీడ్కోలు చెప్తూ, "బ్రదర్! వసంతని గురించి చెడ్డగా అనుకోకు- కనీసం నా చెల్లెలని ఐనా" అన్నాడు.
గాభరాపడి, "లేదు శేఖర్....అలాగే..." అన్నాడు గోపాలం.
కారు వెనక ఎర్రదీపం చూస్తూ నిమిషం నిలబడి లోపలికి వెళ్ళాడు గోపాలం.
"ఏమయ్యా అలాగ వున్నావు!" అని అడిగింది లలిత అతన్ని చూడగానే.
"ఏమీ లేదు వొదినా" అన్నాడు.
కాని చాలా వుంది. సాయంత్రం వసంత ప్రవర్తన అతన్ని చాలా కలవరపెట్టింది...జరిగిన దాన్ని కథగా కన్న ఆమె తీసుకోనట్టు కనీసం పశ్చాత్తాపపడుతోన్న సూచనలైనా లేవు ఆమెలో.
వొళ్ళు జిడ్డుగా వుంది. స్నానానికి బాత్ రూమ్ లోకి వెడుతూంటే, వేన్నీళ్ళు కావాలా? చలి వేస్తుందేమో?" అని అడిగింది లలిత.
"వొద్దు" అని త్వరగా వెళ్ళి స్నానంచేశాడు. ఇవేళ తన మెదడులో ఏం జరుగుతోందో అతనికి తెలియడం లేదు. వసంతని పూర్తిగా మరిచిపోవాలి....ఎలాగైనా సరే. లేకపోతే తనకి మనశ్శాంతి లేదు. ఆమె అగ్నిలాటింది-ఇతరులకి.....కనీసం తనకి.
స్నానం చేశాక వొళ్ళు కాస్త చల్లబడింది, కాని తలలో అలాగే వుంది.
బాబు లోపల ఏదో రాసుకుంటున్నారు. లలిత అతన్నీ, బాబునీ భోజనానికి పిలిచింది. ఇవేనా రామం నైట్ డ్యూటీయే.
భోజనం అయేసరికి నిద్రవొస్తూంది బాబుకి. కాని, గోపాలం దగ్గరికి వొచ్చి, 'కథ చెప్పు బాబయ్యా" అన్నాడు ఒళ్ళో పడుకుని.
"ఏం కథరా?"
"ఏదేనా సరే-"
"ఆల్ రైట్ - విను- ప్రతీమాటకీ "ఊఁ" కొట్టాలి.
"ఊఁ"
"పూర్వ కాలంలో ఒక రాజుగారు ఉండే వారుట"
"ఊఁ"
"ఆయనకి వేట అంటే చాలా ఇష్టం. అందుకని రాజ్యం మాట మరిచిపోయి అస్తమానం అడివిలో తిరుగుతూ, జంతువుల్ని వేటాడుతూ ఉండేవారుట"
"ఊఁ"
'ఒక రోజు పొరుగూరు రాజుగారు పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి అతని రాజ్యం మీద దండెత్తేరు.
"............"
"ఆ సమయానికి రాజుగారు ఒక జింకని చూసి దానివెనకాల పరిగెడుతున్నారు, అడవిలో."
బాబుకి నిద్రవొచ్చేసింది. ఏం అదృష్ట వంతుడివిరా! అనుకుని, నెమ్మదిగా వాణ్ని తీసి కెళ్ళి మంచంమీద పడుకోబెట్టి, పుస్తకం తీసుకున్నాడు. అది లైబ్రరీ నించి లలిత తెచ్చుకున్న ఇంగ్లీషు నవల.
పది పేజీలు చదివేసరికి వసంత జ్ఞాపకం వొచ్చింది..... ఆ రోజు తన చేతుల్లోంచి జారి పోయి దూరంగా వెళ్ళిన శశిరేఖా జ్ఞాపకం వొచ్చింది.
ఎంత భేదం ఉంది వాళ్ళిద్ధరిలో?
-వెంకటరామ్ గారు తనని రమ్మన్నారు. కాని, మళ్ళీ వసంతని చూడడంకాని, ఆమెతో మాట్లాడ్డంకాని. అతనికి ఇష్టంలేదు. ఆమె సౌందర్యాన్ని అతను మరిచిపోలేడు.... ఆమె ఈరోజు మాట్లాడిన తీరునీ అతను మరిచి పోలేడు...
"అంతగా ఆలోచిస్తున్నావు. శశిరేఖ జ్ఞాపకం వొస్తూందా?"
వసంత కుర్చీలో కూర్చుని అతన్ని పరీక్షగా చూస్తూ అడిగింది.
సిగ్గుపడుతోన్నట్టు నవ్వి, "కాదు వొదినా!" అన్నాడు. లలితతో అబద్ధం చెప్పడం అతనికి చేతకాదు.
"మరి?"
ఆమెకి ఏం చెప్పాలో బోధపడక కొంచెం తికమకపడ్డాడు గోపాలం. హఠాత్తుగా అతనికి అనిపించింది నిజం. కనీసం వసంతని గురించి చెప్తే తన మనస్సు శాంతించవొచ్చని. లలిత తనని అడిగినదీ తనమీది అభిమానంతోనేనని అతనికి తెల్సును. ఆమె తన స్నేహితురాలిగా అడుగుతోంది.
"వెంకటరామ్ గారు ఇక్కడ ఉన్నారని చెప్పేనుగా?"
"ఆఁ..."
"ఆయనకి వసంత అని ఒక అమ్మాయి ఉంది..."
ఆమెతో చిన్నప్పటి తన పరిచయం. ఈరోజు జరిగిన కథా బీచ్ లో ఆమె చెప్పినదీ. ఆ రోజు జరిగినదీ అన్నీ చెప్పేడు.
ఐదు నిమిషాలు మాట్లాడలేదు లలిత.
"గోపాలం! ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది కాదూ?"
"అవును"
కొంచెం ఆలోచించి, "ఆ విషయమంతా ఆ అమ్మాయి నీతో ఎందుకు చెప్పింది?"
"నాకు తెలీదు...."
"నిజం చెప్పు.....గోపాలం- శశిరేఖనీ ఆమెనీ ఎన్నిసార్లు సరిపోల్చావు?"
తల వొంచుకుని- "చాలాసార్లు" అన్నాడు గోపాలం.
"నావైపు చూడు గోపాలం.... వసంతని మరిచిపో సుఖపడతావు.
"అదే ప్రయత్నిస్తున్నాను వొదినా!"
నిట్టూర్చి లేచివెడుతూ అతని భుజంమీద లాలనగా చెయ్యివేసి లలిత. "తెల్లబట్టమీద చిన్న మచ్చకూడా బాగా కనిపిస్తుంది...గోపాలం! భగవంతున్న్జి ప్రార్ధించు" అని, లోపలికి వెళ్ళిపోయింది.
ఆమెమాటలు స్మరించుకున్నాడు గోపాలం. చాలాసేపటి దాకా అతనికి నిద్ర రాలేదు.
* * *
"డివిజన్ ఆఫ్ లేబర్ మనప్రస్తుత యాంత్రిక యుగానికి మొట్టమొదటి చిహ్నం. అప్పటిదాకా ఏదైనా నిర్మించడానికిగాని, తయారు చెయ్యడానికి గాని ఒక్కమనిషే అన్ని భాగాలూ తయారుచేసేవాడు. క్రమంగా ఆ నిర్మాణంలో కొన్ని విభాగాలు చేసి ఒక్కొక్క విభాగం మాత్రమే ఒక కార్మికుడు తయారుచెయ్యడంతో డివిజన్ ఆఫ్ లేబర్ మొదలయింది.
"దీనివల్ల ముఖ్యంగా సగటు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఒక్క మనిషి ఒక్కరకం పని పదే పదే చెయ్యడం వల్ల నైపుణ్యం చాలా వృద్ధి చెందడమేకాక కొత్తరకం టెక్నిక్స్ కనిపెట్టడం ఉత్పత్తి పరిమాణంలోనేకాక క్వాలిటీ. అంటే నాణ్యతకూడా వృద్దికావడం జరుగుతుంది. దీనివల్ల ఉత్పత్తి ఎక్కువ కావడం సగటు ఆదాయం పెరగడం. జీవన ప్రమాణం అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వృద్ది చెందడం జరుగుతుంది.
బలే డివిజన్ ఆఫ్ లేబర్ వల్ల కొన్ని నష్టాలుకూడా వున్నాయి, పదే పదే ఒకటే రకం పని చెయ్యడం వల్ల విసుగుపుడుతుంది. మనవాళ్ళు చెప్పేరుగా- తినగా తినగా గారి చేదెక్కుతుంది అని అలాగ..."
"వెరైటీ ఈజ్ ది స్పయిస్ ఆఫ్ లైఫ్" అని అందించేడు వెనక బెంచీలో కూర్చున్న ఒక విద్యార్ధి. క్లాసులో కొంచెం కలకలం -
"అలాగ అదీకాక ఒకటే రకం వస్తువులు తయారుకావడంవల్ల వస్తువుల ఉత్పాదనలో కళా, అందమూ నశిస్తాయి...."
గడియారం చూశాడు. టైమ్ ఐపోయింది.
"వొచ్చే సోమవారం నాటికి డివిజన్ ఆఫ్ లేబర్ మీద ఎస్సే రాయండి."
క్లాసు వొదిలేసి వెయిటింగ్ రూమ్ కి వచ్చి ముఖం కడుక్కుని ఇంటికి బయలుదేరేడు గోపాలం. ఈ నెలరోజుల్లోనూ తనకి అలవాటు ఐపోయింది లెక్చరింగ్. కొత్తదనం తగ్గి క్లాసుకి వెళ్ళినప్పుడల్లా కాళ్ళు వణకడం ఆగింది.
ఇవేళజీతం అందింది. నూట ఎనబై రూపాయలు.
వొదినకీ, అన్నయ్యకీ మంచిబట్టలు కొనాలి. తన జీవితంలో స్వతంత్రంగా ఆర్జించిన మొదటి డబ్బులో.
నెలరోజుల నుంచి శశిరేఖ ఉత్తరం రాయలేదు.
ఈ నెలలోనూ వసంత కనబడలేదు. ఆ ఛాయలకి పోనూలేదు తను.
ఆలోచిస్తూ మెయిన్ రోడ్డులో బట్టలకొట్టు లోకి వెళ్ళి అన్నకీ, బాబుకీ టెరిలిన్ షర్టులూ, వొదినకి బెంగుళూరు సిల్కు చీరె కొని నూట పదిరూపాయలు ఇచ్చి పేకెట్ తీసుకుని బయటికి వొస్తూంటే రామానంద్ కలిశాడు. గోపాలం ఏమీ అనేలోపునే, "హల్లో గోపాల్! మీ కోసం పదిరోజుల్నించి చూస్తున్నాను- మీ ఇల్లు తెలీక...కులాసాగా ఉన్నారా?" అన్నాడు.
"ఆఁ...మీరు..."
"ఫస్టుగా ఉన్నాను-పదండి. కాఫీ తాగుదాం."
గోపాలానికి ఇష్టంలేకపోయినా అతనేమీ చెప్పగలిగేలోపున రామానంద్ అతన్ని చెయ్యి తీసుకుని హోటల్లోకి తీసికెళ్ళేడు. టిఫిను ఆర్డరిచ్చి, "శశిరేఖ ఉత్తరం రాసేరు-మీరు కనిపిస్తే కులాసాగా ఉన్నాననీ, వాళ్ళనాన్నగారూ చాలా నయంగా ఉన్నారనీ, ఇక్కడికి ఇంకోవారంలో వొచ్చేస్తామనీ రాశారు. మొన్ననే అందింది" అన్నాడు రామానంద్.
