Previous Page Next Page 
జీవన వలయం పేజి 7

 

    ఉదయం పది గంటలవుతూంది. డైనింగ్ టేబులు మీద పొగలు కక్కే వేడి వేడి అన్నం కూరలు వాసనలు గుబాళిస్తూ రమాకాంత్ నాహ్వానిస్తున్నాయి. అన్నీ బల్లమీద సర్ది రవి, సుధలకోసం బయటకు వచ్చిన లత అలాగే కొంచెంసేపు నిలుచుండి పోయింది. కుర్చీలో మధుమూర్తి కూర్చుని ఉంటే కుర్చీ చేతి మీద కూర్చుని రవి అతని మెడ వాటేసుకుని చెవిలో ఏదో చెబుతున్నాడు. సుధ ఒళ్ళో కూర్చుని, "నాకు చెప్పు, మామయ్యా, వాడేం చెప్పాడు?" అని మధు గడ్డం పట్టుకు ఊపుతూంది. మధు ఇద్దర్నీ ముద్దులు పెట్టుకొంటుండగా లత వాళ్ళను పిలిచింది. మధు వాళ్ళతో గుమ్మం వరకూ వచ్చి లోపలకు తప్పుకొన్న లతతో "ఈ రోజు మీ చేతి భోజనం రుచి చూడాలని వచ్చాను" అన్నాడు. ఒక్కసారి లత ఆశ్చర్యంగా చూసి మర్యాదగా "రండి" అంది.
    రమాకాంత్ కు చెరొక పక్క కూర్చొని ముద్దుగా తింటున్న సుధా, రవిలను చూస్తున్నాడు ఎదురుగా కూర్చున్న మధుమూర్తి, రమాకాంత్ అతనిని చూసి, "అరే! మీ రలాగే కూర్చున్నారే?" అని, "లతా! మధుబాబుకు ఏం కావాలో చూడు" అని పిలిచాడు. లత వచ్చి పక్కనే ఉన్న పప్పు వేయబోయింది.
    "నేను గట్టిపప్పు తిననండి" అని చెయ్యి అడ్డం పెట్టాడు మధు.
    "పప్పులో ప్రోటీన్సు ఉంటాయి. పప్పులో మరి కొంచెం నెయ్యి కలుపుకొంటే బాగుంటుంది తినండి" అంటూ వడ్డించింది. ఆ ఆప్యాయతకు మధు కళ్ళు చెమర్చినాయి. ఆమె ముఖంలోకి ఒక్కసారి చూసి మారు మాట్లాడకుండా కలుపుకొన్నాడు.
    "మీకు ఆఫీసు ఉండదుగా, రమాకాంత్ బాబూ?"
    "ఏం?" అన్నట్లు చూశాడు రమాకాంత్.
    "నేను మీ ఇంటికి భోజనానికి ఎందుకు వచ్చానో తెలుసా?"
    "రోజూ రా, మామయ్యా" అంది సుధ.
    "ఈ రోజు శాస్త్రిగారు పోవటం వల్ల హోటళ్ళన్నీ బంద్ చేశారు. అందుకే మీ అతిథి నయ్యాను" అన్నాడు నవ్వుతూ. అంతవరకూ ఈయన ఇలా అడిగి పెట్టించుకు తింటున్నాడేమా అని ఆలోచిస్తున్న లత ఆలోచన మబ్బులా తేలిపోయి ఆ స్థానంలో అతనిమీద జాలి నిండుకొంది. హోటలు తిండి తినే ఈ అభాగ్యుడి మీద ఆమెకు తెలియని మమత పుట్టుకొచ్చి కొసరి కొసరి తినిపించింది. పెరుగు వడ్డించి నిలబడిన లతను "నీలాగ అందరూ ఉప్పులేకుండా తింటా రనుకొన్నావా? ఆయనకు ఉప్పు వడ్డించు" అన్నాడు రమాకాంత్.
    ఒక్కసారి దెబ్బ తిన్నట్లు ఆమె వంక చూసి "మీరు మజ్జిగలో ఉప్పు వేసుకోరా?" అన్నాడు.
    "ఉహు" అంటూ ఉప్పు వడ్డించింది లత. చేయి కడుక్కోవటానికి వెళుతూ లత నిలబడిన తీరును మరొక్కసారి పరీక్షగా చూసి వెళ్ళిపోయాడు మధు. వచ్చినప్పుడు అతనిలో ఉన్న ఉత్సాహం వెళ్ళేటప్పుడు లేకపోవటం, మాటిమాటికి తన నలా చూడటం లతకు అతని మీద కలుగుతున్న మమత పోయి అసహ్యం పేరుకోటానికి కారణమైనాయి.
    ఆ సాయంత్రం చాప మీద జాజులను కుప్పగా పోసి మాల కడుతున్న లత పక్కనే వచ్చి కూర్చున్నాడు రమాకాంత్.
    "మధుబాబు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు" అన్నాడు అప్పుడే రెండవసారి చూచి వచ్చిన రమాకాంత్.
    "ఆ మధుబాబు పద్ధతి నాకేం బాగా లేదు" అంది మాల కడుతున్న లత.
    "ఏం? అతనేం చేశాడు?"
    "ఏం చేశాడా? మాటిమాటికి అలా చూస్తాడేమిటి ఆడవాళ్ళను?" నుదురు చిట్లిస్తూ అంది.
    "ఆడవాళ్ళ నందర్నీ కాదేమో! అందమైన ఆడవాళ్ళను మాత్రమే ననుకొంటా." చిరునవ్వుతో అంటున్న అతనిని చురుగ్గా చూసింది లత.
    "అది కాదు, లతా. అతడు చిత్రకారుడు. అందమైన ప్రతిదీ అలాగే చూస్తాడు. అంతేకాని దురుద్దేశంతో కాదు. మధు తలుచుకొంటే నీ లాంటి వారిని పదిమందిని కొనగలడు."
    "అలాగే కొనుక్కోమనండి. నేను మాత్రం ఆ చూపులను భరించను."
    "అయితే నీ అందమైన ముఖాన్ని ఇలా ముసుగులో దాచుకో" అంటూ జాజిమాలను జడలో పెట్టుకొంటున్న ఆమె తలమీదుగా చీరె చెంగు లాగాడు. అప్పుడే లేచి వచ్చిన మధుమూర్తి అక్కడే నిలుచుండిపోయాడు. తెల్లని చీరె తల నిండుకు కప్పుకుంది లత. ఆ చీరె పొరలో నుండి ముద్దగా కనిపిస్తున్న తెల్లని జాజులు. ఆమె పక్కనే రవి. లతను చూస్తూంటే అతనికి పాత స్మృతులేవో జ్ఞాపకం వస్తున్నాయి. లత చేతి భోజనం చేస్తున్నప్పుడు, వారి కుటుంబం మధ్య కూర్చున్నప్పుడు అతనికి ఎన్నడో దూరమైన శాంతి లభించినట్లు ఉంటుంది. వారి మధ్య మసలుతున్నప్పుడు జారవిడిచిన మణి చేతికి లభ్యమైనట్లు అనుభూతి చెందుతున్నాడు.
    "అరె! నిలబడిపోయారే? వచ్చి కూర్చోండి, మధుబాబూ. మీకోసం రెండుసార్లు వచ్చాను." మధు ఇంకా అలాగే చూస్తున్నాడు లతను. కొంచెం చకితుడై, "కొంపదీసి మా లత చిత్రం గీస్తారా? ఏమిటి అలా చూస్తున్నారు?" అన్నాడు. మధు తప్పుచేసిన వాడిలా తొట్రుపడ్డాడు. లత టీ తెచ్చి ఇచ్చింది.
    "మీ రెప్పుడూ నాకు రెండు రంగుల్లోనే కనిపిస్తారు"
    అర్ధంకానట్లు చూసింది లత.
    "అంటే?" అన్నాడు రమాకాంత్.
    "తెల్లని తెలుపు. నీలి ఆకాశం రంగు. ఈ చీరెల తోనే కనిపిస్తారు."
    "అదా! ఆ రెండు రంగుల్లో ఆకాశం రంగు ఆమెకిష్టం. తెలుపు నాకిష్టం." ఒక్కసారి మధు ముఖం నల్లబడింది. ఒక్క మాటకూడా మళ్ళీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు రమా లతలు.
    సాయంత్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. చల్లని చిరుగాలి ఆగి ఆగి వీస్తూంది. తోటలోని పూలచెట్లు ఒకటితో ఒకటి పోటీ పడి విరగబూసినాయి. నీలిరంగు చీరె కట్టుకొన్న లత తల నిండుకు నీలాంబరాలు పెట్టుకొంది. చేతుల నిండా నీలంగాజులు వేసుకుంది. ముఖాన పెద్ద కుంకుమ బొట్టు ఆరుద్ర పురుగు లాగ మెరుస్తూంది. తోట మధ్య గులాబీల గుబురులో సిమెంటు బెంచీ మీద కూర్చుని చదువుకొంటూంది. కాలుమీద కాలు వేసుకొని ఒక చేయి చెంపకు ఆన్చి తదేకంగా చదువుతున్న ఆమెను అప్పుడే బయటకు వచ్చిన మధుక్షణం కన్నార్పకుండా ఆమె వంకే చూశాడు. తరవాత ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా వెళ్ళి స్కూటరు స్టార్ట్ చేశాడు. లత ఒక సారి తలెత్తి చూసి మళ్ళీ చదువులో పడింది.
    స్కూటరు దిగిన మధుమూర్తి సరాసరి సునీత ఇంట్లో ప్రవేశించాడు. సురేష్ అప్పుడే ఆఫీసునుండి వచ్చి బట్టలు మారుస్తున్నాడు. మధును చూడగానే, "రండి, రండి, మధుబాబూ" అంటూ ఆహ్వానించాడు. మరి కొంచెం సేపటికి సురేష్ భార్య రమ, సునీత అంతా అక్కడే వచ్చి కూర్చున్నారు.
    "నాన్నగారు ఇంట్లో లేరా?" అన్నాడు మధు.
    "ఇప్పుడే అలా షికారు వెళ్ళారు. బయట తిరిగిన కొంచెం సేపే ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండేది. ఇంటికి వచ్చి నప్పటినుంచీ మా సునీత పెండ్లి దిగులే" అన్నాడు సురేష్.
    "సునీత పెండ్లి విషయంలో అంత దిగులు పడవలసిన అవసరం ఏముంది?"
    "ఎందుకులేదు, మధుబాబూ! ఒక్క ఆడపిల్ల కావటం వలన మంచి సంబంధం తేవాలని మా తాపత్రయం. కాని అలాటి సంబంధం కావాలంటే వేలుకావాలి. అవి మాదగ్గర లేవు. చూస్తూ చూస్తూ మామూలు సంబంధాల కివ్వలేక పోతున్నాము." సునీత లేచి లోపలికి వెళ్లిపోయింది.'
    "అంత పెద్ద రచయిత్రికి కూడా వివాహ సమస్యేనా? ఆమె రచనలతోనే ఎంతో సంపాదిస్తూంది గదా? ఇంకా కట్నం ఎందుకు?"
    "సునీత కూడా కట్నం అడిగే వారిని చేసుకోనని భీష్మించుకు కూర్చుంది. సునీత రచయిత్రిగదా! ఆమె రచనలను ఆదరించి, ప్రోత్సహించే భర్త కావాలి. ఏమంటారు?"
    "మీరు చెప్పింది నిజం" అన్నాడు మధు సునీత ఇచ్చిన కాఫీ అందుకొంటూ వంట చేయాలంటూ రమ లోపలికి వెళ్ళింది. సురేష్ పని ఉందని బయటకు వెళ్ళాడు. ఇక అక్కడ మిగిలింది సునీత, మధుమూర్తి.
    ఈమధ్య మధుమూర్తి సునీత ఇంటికి తరుచు వస్తున్నాడు. ఆ ఇంట్లో అంతా తన నెంతో ఆప్యాయంగా చూస్తారు. వారిలో ఒకడుగా మెలుగుతున్నాడు. సురేష్ తన కుటుంబ విషయాల దగ్గరనుండి సమస్తం మధుమూర్తికి చెపుతూనే ఉంటాడు. సునీత, మధుమూర్తి చాలా చనువుగా మెలుగుతారు. ఈ కొద్ది పరిచయంలోనే వారిద్దరూ సన్నిహితులయ్యారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS