కృష్ణయ్యగారు, భార్యమాటను ఏమాత్రమూ ఆమోదించలేదు.
కమలమ్మగారు ఎన్నో విధాలుగా నచ్చచెప్పాలని పనికి మాలిన సంబంధాలను, సూచించసాగారు. కాని కృష్ణయ్యగారు కచ్చితంగా చెప్పేశారు. "నా కిప్పుడప్పుడే మీరకు పెళ్ళిచేసే ఆలోచన" లేదని.
గోపాలం చదువు పూర్తి కాగానే, ఆడపిల్లలను కన్న తల్లి తండ్రులు ఇంటికి రాసాగారు. కమలమ్మగారు వరుడి తల్లికుండే సహజమైన దర్పం చూపుతున్నారు. ఆడపిల్లను కన్నవారు సంకోచం తోనూ, దైన్యంతోనూ,
"పెద్ద మనస్సుచూసి మా పిల్లను చేసుకోండి" అని వేడుకున్నప్పుడు కమలమ్మగారు చెట్టుసరిగా.
"ఇపుడపుడే వాడి పెళ్ళికేం తొందర లెద్ధురూ. ముందు మీర పెళ్ళి కావాలి. తరువాతనే వాడి సంగతి," అనేవారు.
మీర స్నేహితురాలు నర్మద తండ్రి డాక్టరు సుబ్బారావుగారు తమ కూతురిని గోపాలాని కివ్వమన్నపుడు అంతటి శ్రీమంతులు తమ వియ్యంకోరుతున్నందుకు ఎంతో సంతోషించారు కృష్ణయ్య గారు.
ఒకరోజు కృష్ణయ్యగారు మీర చేతి చలవల్ల కళకళలాడుతున్న కూరమడులమధ్య బీన్స్ చెట్ల పొదల్లో కలుపుతీసివేస్తూ కూర్చున్నారు.
"నమస్కారం. ఏం చేస్తున్నారు?" గేటవతలనుండి అంతగా పరిచయంలేని కంఠం వినిపించింది.
3
ఆయన లోపలికి వచ్చేటప్పటికి, సుబ్బారావు గారు, ఆనాటి పత్రిక చదువుతూ కూర్చున్నాడు. చక్కగా షేవ్ చేసుకున్న ఆయన మొహం చూసి కృష్ణయ్యగారి చెయ్యి, అప్రయత్నంగా తమ మాసిన గడ్డం మీదకు వెళ్ళింది.
వారి బాతాఖానీలో రాని విషయమంటూలేదు. రాజకీయాలు, వాతావరణం, ధరల పెరుగుదల, సినిమాలు, సాహిత్యం, అన్నిటి మీదా దొర్లింది వారి సంభాషణ. గోపాలం హాస్పిటల్ కు వెళ్ళటానికి ముస్తాబయి, వరండాలోకి వచ్చాడు, అతడి చక్కటి నిలువు, పొగుడుకు తగ్గ లావు, తెల్లటి పాంటు, షర్టు, ఆరోగ్యాన్ని విరజిమ్మే దేహకాంతి, వీటిని చూసి సుబ్బారావుగారు ఆశ్చర్య పోయారు. గోపాలం, సన్నగా ఈల వేసుకుంటూ సైకిలును వరండాలో నుండి తీసుకొని, బయటికి వెళ్ళాడు. జేబులో నుండి గాగుల్స్ తీసుకొని పెట్టుకున్నాడు. కోటు ఒక చెయ్యి మాత్రం తొడుక్కొని, సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోయాడు.
"మీ అబ్బాయికదండీ. ఎంతవాడయ్యడపుడే!"
"అవునండీ మా పెద్దబ్బాయి గోపాలం"
"యం.బి.బి. యస్ పాసయ్యాడుకదూ?"
"అవును"
"ఎక్కడ పని చేస్తున్నాడిప్పుడు?"
"నాలుగు నెలలుగా హవుస్ సర్జన్ చేస్తున్నాడు. తరువాత బొంబాయి వెడుతానంటున్నాడు. ఇంకా యేదీ ఖచ్సితంగా తెలీదనుకోండి"
"అబ్బాయికి పెళ్ళెప్పుడు చేస్తారు?"
"ముందు ఉద్యోగ విషయం ఏదీ తేలాక కదా పెళ్ళిసంగతి."
"సాయంత్రం అబ్బయిని మా ఇంటికోసారి పంపండి నేను మాట్లాడి చూస్తాను. బొంబాయిలో ఓ పని కాళీ ఉన్నట్టుంది. నేను రెకమెండ్ చేస్తాను అదృష్టం ఉంటే ఆ పని మీ అబ్బాయికే దొరక వచ్చు"
కృష్ణయ్యగారు చకితులయ్యారు,. తమంతట తామే పని ఇప్పిస్తామంటున్న సుబ్బారావుగారి ఆంతర్యం, సరళ హృదయం గల కృష్ణయ్యగారు, గ్రహించలేక పోయారు. ఏం చెప్పాలో తోచక....
"అలాగేనండీ. అబ్బాయిని సాయంత్రం పంపుతాను." అన్నారు.
"ఇంకో విషయం అడగాలని మరచిపోయాను. మీ అబ్బాయి జాతకం ఓసారి ఇస్తారూ?
"ఆఁ..... అబ్బాయి...... ఇపుడే పెళ్ళి చేసుకోనంటున్నాడు." కృష్ణయ్యగారు తడబడుతూ సమాదాన మిచ్చారు.
"అందరు కుర్రాళ్ళు పెళ్ళికి ముందు, అలాగే అంటూ ఉంటారు. మా రాధ కూడ వెళ్ళొద్దనే అంటూ ఉంది. ముందు జాతకం ఇవ్వండి. జాతఃకానుకూలమైతే మీరు పెద్ద మనసు చేసి మా అమ్మాయిని, మీ అబ్బాయికి తెచ్చుకోవాలి...."
ఇక కృష్ణయ్యగారు బదులు చెప్పలేక, లేచి వంట గదికి వెళ్ళి.
"కమలా, అబ్బాయి జాతకం వోసారివ్వు" అన్నారు.
కమలమ్మగారు మామూలుగానే
"అబ్బాయికేం తొందర. ముందు మీర పెళ్ళి కానివ్వండి" అన్నారు.
"ష్...... జాతకం అడుగుతున్న దెవరో తెలుసా? డాక్టర్ సుబ్బారావుగారు. అబ్బాయికి బొంబాయిలో ఉద్యోగ మిప్పిస్తామంటున్నారు. అక్కడ డాక్టర్లందరూ తెలుసట..... ఆయనకు....."
డాక్టర్ సుబ్బరావుగారి పేరు చెప్పగానే కమలమ్మగారు మాట్లాడకుండా లేచి జాతకం తెచ్చి ఇచ్చారు. అంత కలిగిన వారు, పిల్లనిస్తామని రావటం, ఆమెకు, గర్వకారణమే అయింది.
జాతకం, చేతికి రాగానే సుబ్బారావుగారు లేచి నుంచొని "ఇక నేను వస్తానండి. సాయంత్రం అబ్బాయిని పంపుతారు గదూ, లేదా నేనే వచ్చి.."
"అబ్బే.... తప్పక పంపిస్తాను. మరేం శ్రమ తీసుకోకండి."
"సరయితే, వస్తాను. నమస్కారం" అని వాకింగ్ స్టిక్ వూపుకుంటూ వెళ్ళిపోయారు. డా. సుబ్బారావుగారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన గోపాలం ఈ సంగతులన్ని విని, కోపంతో అందరి మీద విరుచుకు పడ్డాడు.
"నే నిపుడపుడే పెళ్ళి చేసుకోను. ఆయన కూతురూ అక్కర్లా, ఆయనిప్పించే ఉద్యోగమూ అక్కర్లా" అని ఎగిరాడు.
కృష్ణయ్యగారు అంతా విని,
"అబ్బాయి, నా మాట విను. నిన్ను పంపిస్తానని సుబ్బారావుగారికి మాటిచ్చాను. నా మాట నిలబెట్టడానికి వాళ్ళ ఇంటికోసారి వెళ్ళిరా. అంతే. తరువాత నీ ఇష్ట ప్రకారమే కానీయ్."
"నాకు చెప్పకుండా ఎందుకు మాటివ్వాలి?" అని గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్ళాడు. గోపాలం.
పావుగంట తరువాత వంగ మొక్కలకు నీళ్ళు పోస్తున్న మీర దగ్గరి కొచ్చాడు. గోపాలం.
"మీరా....."
"ఏమిటన్నయ్యా?"
"నాన్న సుబ్బారావు గారింటికి వెళ్ళిరమ్మంటున్నారు....."
మీర కొంటెగా నవ్వుతూ.
"నీ ముస్తాబు చూసే తెలిసిందా సంగతి" అంది.
"అలాటిదేముందమ్మా నా డ్రస్సులో.....?"
"అబ్బే..... ఏమీ లేదూ... మరి...... ఈ ఉలన్ సూటు, సిల్కు జేబురుమాలు, ..... సెంటు......ఎందుకంటావ్ ఇదంతా చాలదని, ఆడవాళ్ళ పౌడరు కూడా రాసుకున్నావ్...."
"ఆహాఁ.... ..... చాలు. అదికాదమ్మా వాళ్ళ అమ్మాయిని నువ్వెప్పుడైనా చూశావా?"
"ఓ- చూడకేం? నర్మదా నేను ఒకే క్లాసు"
"నర్మద కాదు. వాళ్ళక్క సంగతి నే నడుగుతున్నది."
"ఓహో.... రాధా! చూశాను"
గోపాల్ కుతూహలంతో అడిగాడు.
"ఎలా ఉంటుంది చూడ్డానికి ?"
మీర మొహంలో నిరాశ స్పష్టంగా కనపడింది"
"ప్చ్..... లాభంలే దన్నయ్యా"
"ఏం నర్మదలా పళ్ళెత్తుగా ఉన్నాయా?"
"నర్మద, రాధ ముందు ఎంతో నయమనుకో. నీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు చెబుతాను."
"నీలా ఉంటే చాలు"
"అయ్యో.... నేనెక్కడ ఆమెక్కడ? రాధ చాలా నల్లగా వూతనలా ఉంటుందన్నయ్యా పేరు మాత్రం ముద్దుగా ఉంటుంది 'రాధ' అని. నర్మదను దంత వక్ర అన్నావా? ఇక రధ శిశుపాలు డనుకో....."
గోపాలం కోపంతో దోసిట్లో నీళ్ళు తీసి మీర మీద చిమ్మి వెళ్ళిపోయాడు.
సుబ్బారావుగారి ఇంటి ముందు నిలిచి "సార్"! అన్నాడు.
"ఎవరు" అన్న కోమల కంఠంతో బాటు, గాజుల గలగలలు వినిపించాయి. సుమారు పడహేడు, పదేనిమిది ఏళ్ల పిల్ల తలుపు తెరిచింది.
ఆమె కట్టుకున్న లేతాకు పచ్చరంగు చీర పసుపురంగు జాకెట్టు, వాలుజెడ, జడలో వప్పుకున్న ఎర్రగులాబి, చెవులకు జూకలు, ఆకు పచ్చ రంగు గాజులు కాళ్ళకు తొడుక్కున్న వెల్ వెట్ చెప్పులు, కళ్ళ కాటుకా, అన్నీ "నీ కోసం- నేను" అన్నట్టనిపించింది. బెదిరిన కళ్ళనూ, మెరుపులాటి పిల్లనూ చూసి గోపాలం అధీరుడయ్యాడు.
