"గిరిధారి గారు కూడా మనతో వస్తారు." అన్నాడు కృష్ణ.
"తప్పకుండా! అన్నట్టు, అన్నయ్యా, కస్తూరి కూడా" అంటూ గిరిధారి వైపు చూసి , "అసలు మీరు మాకు కస్తూరి వల్లనే పరిచయం . అదొక అడివి గొడ్డు! నాలుగక్షరం ముక్కలు చెప్పాలని ఎంత ప్రయత్నించానో-- మీ మాటంటే గురి! మీరైనా చెప్పి చూడండి!" అంది అపర్ణ.
గిరిధారి ఊహలో కస్తూరి భవిష్యత్తు తళుక్కున మెరిసినట్లైంది. "నిజమే, కస్తూరికి కొంత విజ్ఞానం అవసరం." అని ఒప్పుకున్నాడు.
ఆ తరవాత కొంతసేపటికి అతను సెలవు తీసుకున్నాడు. ఆదివారం ప్రోగ్రాం విషయంలో అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ అతని దగ్గర గట్టి మాట తీసుకున్నారు.
12
కస్తూరికి మీ మాటంటే గురి --- మీరైనా ప్రయత్నించండి !-- అని అపర్ణ చెప్పిన తరవాత గిరిధారికి కస్తూరిని గురించిన జిజ్ఞాస అధికమైంది. నిజంగా ఆమె తనకు తగినట్టే దొరికింది. తనీ మధ్య ఆమెను బాధపెట్టాడు. అమెకాస్తా తప్పుకుంటే -- ఇంత మంచి మనిషి దొరకటం కష్టం. అంత శ్రద్దా సక్తులతో మరొకరు చేయలేరు. తనలాగే ఆమె ఏకాకిని. భర్త వదిలిపోయాడు. జీవితమంతా ఎలా గడుపుతుంది? మరోకడిని ఎన్నుకుని మరొక దారి చూచుకునే తత్త్వం కాదు. ఆమెలోని అందమూ, ముగ్ధత్వమూ చూసిన వాడి మనసులో సంచలనం రెగక మానదు. తన స్థానంలో మరేవాడున్నా ఆమెను వదిలేవాడు కాదు. ఆమె జీవితం అంధకారం కావటం క్షణం పట్టదు. తరవాత భర్త వచ్చిన ఏలుకోడు. ఆమె జీవితం గడ్డి పూవులా ముగిసి పోతుంది.
అలా కాకూడదు. అలా అనుకుంటే సరిపోదు. తనను తాను నడిపించుకోగల విజ్ఞానమూ, సంస్కారమూ కావాలామేకు. కేవలం సంస్కారిణి అయినంత మాత్రాన స్త్రీ జీవితం స్వార్ధ పరుల స్వార్ధానికి బలి కాకుండా ఉద్దరించబడుతుందా? అంటే అది వేరు విషయం. కనీసం కొన్ని విషయాలలోనైనా ఆమె జాగ్రత్తగా మంచి చెడ్డ లాలోంచించుగలుగుతుంది గదా!
ఇప్పుడామె జీవితాని కేం లోటు? ఇలా అంట్లు తోముతూనా? ఇదీ ఒక జీవితమే! తన మాటేమిటి? ఆమె కన్నా ఎక్కువగా తను పొడిచి గెలుస్తున్న దేమిటి? నిజానికి ఆమెను గురించి ఆలోచించటానికి తనకేం అధికారముంది? జీవితంలో తనకు తానేమీ చేసుకోలేని తను మరొకరి జీవితా న్నుద్దరించాలని ప్రయత్నించటం ఎంత వరకూ న్యాయం? అది వేరు విషయం. అందరి జీవితాలూ ఒకే సమాంతర రేఖల పై పయనించటం లేదు.
కస్తూరి కి చదువు చెప్పాలి. ఆ నిర్ణయంతో బజారుకు వెళ్ళి పలకా, బాలశిక్షా కొని తెచ్చాడు.
"అదేం టయ్యగారు పలకా, బలపం తెచ్చా రెందుకు?"
"నీ కోసమే."
ఆమె విరగబడి నవ్వింది.
"నవ్వులు కాదు. నువ్వు వ్రాయటం, చదవటం నేర్చుకోవాలి!"
"పంతులమ్మను చేస్తారా నన్ను?"
"ఒకరు చేసేదేమిటి? నీవే అవుతావు! రేపు నీ మొగుడు ఉత్తరం రాస్తాడనుకో! చదివించుకోవడానికి ఎవరి దగ్గరకు పరుగెత్తుతావు?"
"మీరూ లేరూ?"
"నేను వెళ్ళిపోతే...."
'అపర్ణమ్మగారు...."
"ఆమె అత్తారింటికి వేళ్ళదూ!"
"వెళ్ళదు!"
"ఏం?"
"ఆమె కసలు ఆ ఆలోచనే లేదు."
"నీతో చెప్పిందా?"
"ఊ"
"ఏమని?"
"కస్తూరీ , మీ అయ్యగారికి పెళ్లైందా? అని అడిగింది. నాకేం తెలుసమ్మా? అయినా ఆయనకూ మీలాగే పుస్తకాలుంటే చాలు, మరేమీ అక్కర్లేదు అని చెప్పాను. ఎందుకొచ్చిన పెళ్ళి లేవే! చేసుకోకపోతే నేం?' అన్నది."
'అసలు పుస్తకాలంటే నీకింత కోపమెందుకు?"
"అవ్వుంటే మీరు ఇవతలి వాళ్ళ గొడవ పట్టించుకోరని?"
"పిచ్చి వాగుడు మానేసి బుద్ది మంతురాలిలా చదువుకో." లాలనగా పదేళ్ళ పిల్లకు చెబుతున్నట్టు అన్నాడతను.
"ఆయమ్మ చెప్పింది -- ఇక మీరు! ఆ అన్నట్టు నిన్న ఎళ్ళారుగా ! తెలిసింది లెండి! ఇది ఆమె గారి ఉపదేశమే!"
"నేను చెప్పినట్టు వింటే వెళ్ళేటప్పుడు వెంట తీసు కేళతాను."
"నిజంగానా!" ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి. "ఎప్పుడు వెళదాం?"
"నీ చదువు పూర్తీ అయ్యాక."
"అయితే చదువు కుంటాను."
అతను నవ్వుతూ పలక మీద అక్షరాలూ వ్రాసి ఆమె కిచ్చాడు.
13
ఆదివారం ఉదయమే వచ్చి గిరిదారిని మరో గంట కల్లా సిద్దంగా ఉండమని హెచ్చరించి వెళ్ళాడు కృష్ణ. ఆ గంట తరవాత తనే వచ్చి అతన్ని తీసుకు వెళ్ళాడు.
కాంతమ్మ గారు ఒక ఫేము బుట్టలో ఏవేవో సర్ది తెచ్చి హాలులో పెట్టింది. అపర్ణ ఒక సూట్ కేసు తెచ్చి టేబుల్ మీద పెడుతూ గిరిదారిని చూసి మందహాసం చేసింది.
అప్పుడే తలంటి పోసుకున్నట్లుంది. అరీ ఆరని జుత్తు పాయలు పాయలుగా పరుచుకుని ఉంది.
"వచ్చారా? మీకోసమే చూస్తున్నాం" అందామె. తెల్లని చీర, చెవులకు పెద్ద పెద్ద రింగులు. దోసగింజ అంత తిలకం బొట్టూ , కాటుకా.
"రండమ్మయి గారూ! చిక్కు తీస్తా నిప్పుడే! అనక మరీ బిగిసి పోతుంది." అంటూ దువ్వెనతో వచ్చింది కస్తూరి.
"ఇప్పుడా?"
"మరి....అలాగే విరబోసుకుని వస్తారా! ఎంత సేపు! చిటికే పని" అంటూ అపర్ణ ను తీసుకుని వచ్చి కూర్చో పెట్టింది. నిడుపాటి వెంట్రుకలు . ఆమె కుర్చీలో కూర్చుంటే చివరలు నేల కానుతున్నాయి. కస్తూరి పని ప్రారంభించింది.
అప్పుడే హాలులోకి వచ్చింది కాంతమ్మ గారు.
'అపర్ణా! నీకీ నడి హాలు తప్ప తలచిక్కు వదిలించుకోవటానికి వేరే తావు దొరకలేదా ఇంత ఇంటిలో" అంది.
అపర్ణ "ఫిలిమ్ ఫేర్" తిరగేస్తూ జవాబు కూడా ఇవ్వలేదు.
"ఏ మమ్మగారూ?" అంది కస్తూరి.
"నీకైనా బుద్ది లేకపోయిందే , కస్తూరీ! నేనంటే అన్నదాన్ని అవుతాను. చూస్తూ ఊరుకోలేను."
కృష్ణ గిరిధారి వంక చూస్తూ, "మీరు మా ఇల్లంతా చూడనే లేదు గదూ? రండి! చూపిస్తాను" అంటూ లేచాడు.
మారు మాట్లాడకుండా లేచాడతను.
గదులూ, ఇంటి చుట్టూరా తిరుగుతూ అరగంట గడిపేశారు. ఆ తరవాత కస్తూరి వచ్చి, 'అంతా అయింది. కిష్టయ్య గారూ. రిక్షాలూ పిలవ మంటారా?' అన్నది.
"రిక్షాలా? మీరూ రిక్షాలో రండి! మేము నడిచి వస్తాం" అన్నాడు కృష్ణ.
"మీ ఇష్టం! పెద్దమ్మ గారు రెండు రిక్షాలు తెమ్మన్నారు" అంటూ వెళ్ళింది.
* * * *
ఆ తోట ఊరుకు మైలు దూరంలో ఉంది. కాని ఆ మధ్య జాగాలో కూడా కొత్త కొత్త ఇళ్ళు వెలుస్తున్నాయి. మరికొన్ని ఇళ్ళకు తోట ఊరి బయట ఉన్నట్టనిపించదు.
కొబ్బరి , మామిడి , అరిటి , సపోటా, నిమ్మ, నారింజ వగైరా చెట్లన్నీ ఉన్నాయి. రెండు వందల గులాబీ చెట్లు, రకరకాలవి, రంగు రంగుల చేమంతులతో నేత్ర పర్వంగా ఉంది. నూతికి కరెంటు మోటారు. అక్కడి నుంచి తోట నలు దిక్కులకూ సిమెంటు కాలువలె ఉన్నాయి. మధ్యగా ఒక ఔట్ హౌస్ ఉంది. మూడు గదులూ, వాటికి వెనకా ముందూ వరండాలూ ఉన్నాయి. కరెంటు సౌకర్యం ఉంది.
అంతా సుమారు పదిహేనే'కరాలు ఉంటుంది.
"రకరకాల చెట్లు సమానంగా ఉండబట్టి కాంట్రాక్టు దగ్గర ఇబ్బంది వస్తోంది' అన్నాడు కృష్ణ.
"ఏమిటి?' అనడిగాడు గిరిధారి.
"సంవత్సరం పొడుగుతా ఇక్కడ ఉండి చూసుకునే వారు దొరకాలి. అదే మామిడి తోట అయితే సీజన్ బట్టి ఒత్తిడి , పోటీలు పడుతూ వస్తారు."
"నాన్నగారు పొరపాటే చేశారీ విషయంలో. రకానికొక చెట్టు మిగిలినవి వేసి మొత్తమంతా మామిడి తోట వెయవలసింది" అన్నది అపర్ణ. కాంతమ్మ గారూ, ఆ వెనకే కస్తూరీ వస్తున్నారు.
"నాన్నగారు పొరపాటు చేశారంటున్నావా , అపర్ణా?" కాంతమ్మగారు నొచ్చుకుంది. 'అయన ఎంత ముందు చూపు మనిషి! ప్రతిదీ చక్కని ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల చెట్లు ఉండబట్టే నెలజీతం వచ్చినట్టు ఆదాయం వస్తోంది. అంతా ఒకే మామిడి తోట అయితే ఎన్ని ఇబ్బందులు-- పూత రాలటం, గాలి దమ్ములు, కాస్త నస్జ్తం వస్తుందనిపిస్తే బయానాలు వదులుకుని పోయే బెరగాళ్ళూ..."
"అపు, పిన్నీ. ఆయనగారు సరిగానే చేశారు." విసుగ్గా అంది అపర్ణ.
ఎక్కడి కక్కడికి బాట లున్నాయి. ఆ దారిన నడుస్తున్నారంతా. అందరి వెనకగా నడుస్తున్నాడు పోతరాజు. అతను నూతి దగ్గరలోనే ఒక చిన్న చావురిల్లు వేశాడు. అందులోనే కాపురం. తోట పాలికి తీసుకున్నాక పోతరాజు ఊరి వారి బట్టలు ఉతకటం మానేశాడు. నవనీత కృష్ణ ఇల్లు మాత్రమే చేస్తున్నాడు. రైలు స్టేషను దగ్గర ఒక పళ్ళ దుకాణం తెరిచాడు. తోటలో ఒక దిక్కుగా కూరగాయల మళ్ళు పెట్టాడు. మంగాలు లేవలేకుండా ఉందిట.
"కిష్టు బాబు గారూ! సంగీతమయ్యగారికి నికరమైన తావు దొరక లేదంట. ఒంటి గాడు . తమరు "సరే' నంటే మన తోట ఇంట్లో ఒక గది...." అంటూ నీళ్ళు నమిలాడు.
"నాదెం లేదు, పోతరాజు! ఇదంతా అమ్మాయి గారి ఎస్టేటు. అమెగారి నడుగు."
"ఏమిటి, పోతరాజు? మంగాలు సంగీతం కాలే ఇంకా" అంది కస్తూరి.
"ఊరుకో , కస్తూరీ! పెద్దోరి దగ్గర ఏమిటా సేతురు!"
