Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 7

 

    కొత్తగా నాటిన మొక్కలకు గొప్పులు సరి చేస్తున్నది నీరజ.
    కొత్త ఇంట్లో రకరకాలు మొక్కలు తెచ్చి నాటారు నీరజ, సురేంద్ర. సురేంద్ర మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు.
    కూనిరాగం తీస్తూ పాదులలో చిన్న చిన్న రాళ్ళు ఏరి పారేస్తున్న నీరజకు ఒక్కసారి నీళ్ళు చల్లగా ఒడలంతా తడిపేస్తుంటే గిరుక్కున లేచి వెనుదిరిగి చూసింది.
    సురేంద్ర నీళ్ళ గొట్టం నీరజ ముఖం మీద పడేట్టు పట్టుకుని పైకి కిందకి తిప్పుతూ పకపకా నవ్వుతున్నాడు.
    "ఉండండి. మీ పని చెప్తా?" పరుగు పరుగున వచ్చింది నీరజ.
    నీరజను దగ్గరకు రానీయకుండా ఎటు పడితే అటు తిప్పి ఒళ్ళంతా తడిపేశాడు . పై నుంచి కింది దాకా తడిసిపోయింది.
    తడిసిన చీరలో ప్రస్పుటమైన అవయవాల అందాలను తనివితీరా చూస్తూ "నీరూ! అగు కదలకు" నీ అందాన్నంతా నన్ను తనివితీరా చూడనీ" అని అలాగే నిలబడి పోయాడు సురేంద్ర.
    "ఛీ! పొండి" సిగ్గులేకపోతే సరి" ముఖం చేతులతో కప్పుకుని లోపలకు పరుగెత్తింది నీరజ.
    "నీరజా! అగు అగు" అంటూ ఆమె వెనకాలే పరుగు తీసి నీరజ వారిస్తున్నా వినిపించుకోకుండా అమాంతం రెండు చేతులతో ఎత్తుకుని లోపలకు తీసుకెళ్ళాడు సురేంద్ర.
    నీరజ శరీరంలో రక్తం వేడెక్కింది. సిగ్గుతో బుగ్గలు కందిపోయినాయ్. సురేంద్ర చేతులలో  నుంచి జారిపోయి గబుక్కున లోపలి కెళ్ళి తలుపేసుకుంది. బయట నుండి సురేంద్ర పకపకా నవ్వటం నీరజకు స్పష్టంగా వినపడింది.
    "తలకి స్నానం చేసి ఫాను గాలికి తలారబెట్టుకుంటున్న తన పక్కనే కూర్చున్న సురేంద్రను చూస్తూ "చూడండి! తలంతా తడిపెశారు. నాకు ఏ నిమోనియానో  ఏదైనా వస్తే..." అంది నీరజ.
    "నీరజా అంత మాటనకు! నేను భరించలేను"  అమాయకంగా నీరజ ఒడిలో తలదూర్చి పడుకున్నాడు సురేంద్ర.
    నీరజ ఆప్యాయంగా అతని తల నిమురుతూ కూర్చుంది.
    "ఉండు నీ జుట్టు నేను అరబెడతాను" నీరజ ఒడిలో నుంచి గబుక్కున లేచి ఆమె పొడవైన వెంట్రుకలు చిక్కు ఊడదీస్తూ అన్నాడు సురేంద్ర.
    "బాగానే ఉంది. ఎవరైనా చూస్తె నవ్వగలరు" చిరుకోపం ప్రదర్శిస్తూ లేచి వెళ్ళింది నీరజ వంట గదిలోకి.
    రోజులు క్షణాల్లా గడిచిపోసాగాయి. సురేంద్ర ప్రేమ వాహిని లో నీరజ అభ్యంగన స్నానాలు చేయసాగింది. మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితం వెన్నెలలో విందు భోజనం లా సాగిపోతున్నది.
    ఆరోజు రాత్రి తనకు ప్రమోషను వచ్చిన అవకాశం పురస్కరించుకుని విందు ఏర్పాటు చేశాడు సురేంద్ర.
    ఇల్లంతా దీపాల తోరణాలతో కళకళ లాడుతున్నది. ఇల్లు కట్టుకున్న తర్వాత పార్టీ చెయ్యాలేదని గొడవ చేస్తున్న తన స్నేహితులందరినీ పిలిచాడు సురేంద్ర. ఇల్లంతా తానె అయి హడావుడిగా తిరగసాగింది నీరజ.
    అప్పుడే సరోజను పరిచయం చేశాడు సురేంద్ర. చామనచాయ రంగులో సాధారణంగా కూడా లేని - ఒక మాములు క్లర్కు అయిన ఈ సరోజ -- ఈ విందుకు ఎంత మటుకు అర్హురాలా?- అని అర్ధం లేని ప్రశ్న లీలా మాత్రంగా ఉదయించి మాయమయింది ఆమె మనసులో.
    చిదిపి దీపం పెట్టవచ్చునన్న సామెతను అక్షరాలా నిజం చేస్తున్న నీరజ - హుందాగా వెన్నెలలో బార్ లైట్ల కాంతి లో అప్సరస లా అటూ ఇటూ తిరుగుతూ అందరి కళ్ళకూ బంధం వేసింది. ముదురు నీలం రంగు పట్టు చీరలో మహారాణి లా ఉన్న నీరజను చూసి ఈర్ష్య పడనీ వాళ్ళు  లేరు. అజంతా శిల్పం లా ఉన్న నీరజ ఒక్క సరోజ కు మాత్రం కంటక ప్రాయంగా ఉందన్న విషయం నీరజ గ్రహించ లేకపోయింది. విందు మధ్యలోనే సరోజ వెళ్ళటానికి బయలుదేరింది. సరోజను కిందికి వెళ్ళి గేటు వరకు దింపి వచ్చాడు సురేంద్ర. పై నుంచి కిందకు చూసింది నీరజ. దగ్గరగా నిలబడి నవ్వుతున్నది సరోజ సురేంద్ర కూడా నవ్వుతూ చెయ్యూపుతున్నాడు. నీరజ మనసు చివుక్కుమంది. స్త్రీ సహజమైన అనుమానపు బీజం సూక్ష్మాతిసూక్ష్మంగా మనసులో నాటుకుంది.
    విందు అయిపోయి అతిధులందరూ వెళ్ళిపోయారు. శ్రమ వలన అలసిపోయిన నీరజ వెంటనే నిద్రపోయింది.

                           *    *    *    *

                    
    "సార్! ఇవ్వాళ ఇడ్లీ -- కారప్పొడి స్పెషల్ " నవ్వుతూ టిఫిను బాక్సు బ్యాగు లో పెడుతూ అంది నీరజ ఆపీసుకు బయలుదేర బోతున్న సురేంద్ర తో.
    సురేంద్ర చిన్నగా నవ్వి బుగ్గ మీద చిటికేసి "వస్తాను" అని వెళ్ళిపోయాడు.
    ఇడ్లీ చేసిన రోజు సాధారణంగా "ఎన్ని పెట్టావు? ఇంకో రెండు పెట్టక పోయావా? ఇంకొంచెం కారప్పొడి వెయ్యి" అని గొడవ చేసే సురేంద్ర అతను నవ్విన చిన్న చిరునవ్వు నీరజను ఆలోచనలో పెట్టింది.
    "ఎందుకు ? ఎందుకలా ఉన్నారు? ఏం జరిగింది ? ఏమో-"
    తెల్లగా గంబీరంగా అందంగా ఉండే సురేంద్ర రూపానికే గాక గుణం లో కూడా అందగాడే! తను ఏ జన్మ లోనో చేసుకున్న పూజాఫలమని అపురూపంగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంది నీరజ.
    పచ్చని తన సంసారం ఊసర క్షేత్రంగా మారదు కదా!
    పవిత్రమైన ఈ దేవాలయం లోని భగవంతుడు దైవత్వాన్ని కోల్పోలేదు కదా! ఏమో! అయినా అర్ధం లేని ఈ ఆలోచనలేమిటి? తన అనుమానం కాని - సురేంద్ర అలాంటి మనిషి ఎన్నటికీ కారు.
    నీరజ ఆలోచనలన్నీ పక్కకు తోసి భోజనం చేసి వచ్చి పడుకుంది. నిద్రపట్టలేదు. ఆఫీసుకు ఫోను చేసింది.
    "హల్లో ! నేనండి ! నీరజను. సాయంత్రం త్వరగా రాకూడదూ! సినిమాకి వెళ్దాం."
    "సాయంత్రమా , చూద్దాం లే! తొందరేం . అయినా పనయిపోతే త్వరగానే వస్తాను" ఫోను పెట్టేసిన చప్పుడు క్లిక్ మంది చెవిలో. క్రింది పెదవిని ముని పంటితో కొరుకుతూ ఆలోచనలో పడ్డది. నీరజ సాయంత్రం అయిదయినా అట్లాగే ఆలోచిస్తూ కూర్చుంది. కిటికీ లోంచి బయటకు చూస్తూ.
    కాలింగ్ బెల్ మోగటంతో లేచి వెళ్ళి తలుపు తీసింది.
    ముఖం పీక్కుపోయి కళ్ళు ఎఱ్ఱగా ఉన్న నీరజను చూసి ఉలికిపడ్డాడు సురేంద్ర.
    "నీరూ! అదేమిటి అట్లా వున్నావు? అన్నం తినలేదా" భుజం చుట్టూ చెయ్యి వేసి లాలనగా అన్నాడు సురేంద్ర.
    అతని మాటలోని ఆప్యాయతకు నీరజ పంటి బిగువున బిగించి పెట్టిన ఆవేదన ఒక్కసారిగా అశ్రు రూపంలో బయట కురికింది.
    సురేంద్ర గుండెల మీద తల ఆన్చి వెక్కి వెక్కి ఏడవసాగింది.
    "నీరూ!ఏం జరిగింది? ఎందుకు? సినిమా కేల్దామన్నావు గా! పోదాం పద" అనునయంగా ఆమె తల నిమురుతూ సోఫా దగ్గరకు తీసుకెళ్ళి కూర్చుండబెట్టాడు.
    "వద్దు ! సినిమా కొద్దు- ఎక్కడికీ వద్దు! మీ గుండెల్లో నిద్ర పోవాలనుంది" సురేంద్ర దీర్ఘంగా నిట్టూర్చాడు. తన గుండెల మీద తల ఆన్చి పడుకున్న నీరజ తల నిమురుతూ హృదయానికి హత్తుకున్నాడు.
    "నీరజా! సురేంద్ర కను కోలుకుల్లో నుండి రెండు ముత్యాల్లాంటి బిందువులు నీరజ తల మీద నుంచి జారిపోయినాయి.
    మానవుడు విధి చేతిలో కీలు బొమ్మ అన్న విషయం ఎన్ని సార్లు ఎన్ని రూపాల్లో కనపడుతున్నా -- ఎంత అది "విధి" అని సరిపెట్టుకుందామన్నా -- సుకుమార మనస్తత్వం మీద అది గొడ్డలి పెట్టె ఆవుతుంది. ఒక్కొక్కసారి 'విధి' అని తలవంచని పరిస్థితి ఏర్పడుతుంది. అయినా అది 'విధి' ప్రకారం జరగవలసిందే? మారుతున్న కాలం - వివిధ రకాల మానవకోటి మీద ఏనాడు ఏ ప్రభావం తీసుకొస్తుందో -- ఎవరి బ్రతుకు బాటలు ఏ రకంగా మారుతయ్యో ఎవరి జీవితం ఏ చమత్కారమైన మలుపు తిరుగుతుందో - పూర్వజన్మ అని చెప్పబడే ఆ జన్మ తాలూకు పాపపు సుడిగాలికి ఎవరి జీవన కుసుమం ఏ రాళ్ళ కిందపడి నలిగి పోతుందో చెప్పటం కష్టం- ఆ క్షణం వరకు.
    ఒక కుసుమాన్ని నేలరాచిన మానవుడే మరో కుసుమాన్ని శిరస్సున అలంకరించు కోవటం అంతకంటే విచిత్రం.
    చిత్ర విచిత్రామైన ఈ మానవాళిలో విభిన్న మనస్తత్వాలు విభిన్న క్రుధాలు - ఎవరి మార్గం వారిదే! ఎవరి ఆలోచన వారిదే! ఎవరి ఔన్నత్యం వారిదే! ఎవరి పతనం వారిదే.
    తీసుకు వెళ్ళిన టిఫిను మూతయినా తియ్యకుండా తెచ్చిన రోజు - ఆఫీసు వర్కు ఎక్కువగా ఉన్నదంటే భర్త మాటలు అమాయకంగా నమ్మింది నీరజ. రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ బలవంతం మీద సినిమా కెళ్ళానంటే నమ్మింది.
    అమాయకమైన ఆ చూపుల్లో గాలిమెడలు కట్టుకుని అవి ఏ గాలికి చెదరవని శాశ్వతంగా ఉండేవనీ గుడ్డిగా నమ్మింది.
    ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ భయంకరమైన ఆ కాళరాత్రిలో మెడలో మంగల్యంతో ఉన్న సరోజ ను వెంట బెట్టుకుని వచ్చిన సురేంద్ర ను చూసినప్పుడు -- ఒకరి పక్కన ఒకరు భార్య భర్తలుగా నిలబడి నప్పుడు -- నిలబడినప్పుడు ....
    రెండు చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న నీరజను ఎలా ఊరడించాలో తెలియలేదు ఇందిరకు.
    "ఇందిరా! ఆ క్షణం లోనే నీరజ చచ్చిపోయింది. నా దైవం , నా ప్రాణం అని నమ్ముకున్న నా భర్త అగ్నిసాక్షిగా వివాహమాడిన అర్ధాంగికి తీరని ద్రోహం చేస్తూ తనతో ముడి వేసుకున్న నా జీవితాన్ని వేరు చేస్తూ నన్ను సవాల్ చేసిన ఆ క్షణం -- ఆ భయంకర మైన క్షణం లోనే -- అవమానాగ్ని లో నీరజ చచ్చిపోయింది ఇందూ"
    అగ్నిపర్వతాలు బ్రద్దలయి, సప్త సముద్రాలు ఉప్పొంగి - యుగాంతంలోని భయానక భీభత్స రూపంలోకి ప్రకృతి కాంత విలయ తాండవం లో - విధి కబంధ హస్తాలలో, స్వార్ధ పరుల కామ పీడితుల విషయగ్ని కీలలలో -- పువ్వు లాంటి నీరజ మాసై బూడిదై పోయింది. నేను జీవితంలో ఓడిపోయాను. ఆ క్షణంలో ఏ స్త్రీ అయినా ఏం చేస్తుంది? ఏం చెయ్యగలుగుతుంది? అసలేం చెయ్యాలో నా కర్ధం కాలేదు. అలాగే స్థాణువులా నిలబడ్డాను. క్షణం సేపు అయన నా కళ్ళలోకి చూసి "సరోజా! నువ్వు లోపలి కెళ్ళు" అన్నారు.
    సరోజ చూపులలో నా చూపులు కలిసినాయి. నా వైపు ఒక నిర్లక్ష్యమైన చూపు విసిరి వంకరగా నవ్వుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ నా గుండెలను, నా మనసును తన పాదాల కింద నిర్ధాక్షిణ్యంగా తోక్కేస్తూ మేడ మీదకి వెళ్ళింది.
    "నీరజా.....!" ఇందిర కళ్ళు రెండూ నీళ్ళతో నిండిపోయినాయి.
    "నాలుగైదు నిముషాలు అలానే నిలబడ్డాను. అయన ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా తలవంచుకుని బయటకు వచ్చేశాను. ఇందిరా! ఇప్పుడు చెప్పు ఎందుకు బ్రతకాలి నేను-- ఎవరి కోసం బ్రతకాలి-- ఎవరున్నారు నాకు" ఆవేదనతో ఆగిపోయింది నీరజ.
    "నీరజా! చివరకు నీ జీవితం ఇలా ముగిసిందా?" ఇందిర గొంతులో బాధ, ఆవేదన నిండిపోయినాయి.
    "ఇందూ! నా వైవాహిక జీవితం అలా ముగిసింది -- పూజ కొద్ది పురుషుడు . దానం కొద్దీ బిడ్డలూ అంటారు-- నా పూజా అట్లాగే వుంది -- నేను చేసిన దానం అట్లాగే ఉంది"
    "నీరూ?"
    "బలవంతంగా ప్రాణం తీసుకుందామన్నా వీలులేకుండా అప్పటికే మూడు నెలలు ఊపిరి నింపుకున్న సురేంద్ర రూపం నాకు అడ్డం వచ్చింది. విధి లేక పసి ప్రాణాన్ని చంపలేక నాకు బాగా పరిచితురాలైన ఒక వ్యక్తీ నీడలో బాధనంతా దిగమింగి జీవించసాగాను. అక్కడక్కడా నన్ను విధి వెక్కిరించింది. ఏడో నెల తోనే బాబు పుట్టి రెండు రోజులు నన్ను మురిపించి నన్నీ ప్రపంచానికి వదిలి వెళ్ళిపోయాడు." బుగ్గల మీద నుంచి వెచ్చని కన్నీరు జారిపోతుండగా అంది నీరజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS