సుజాత అప్పటికప్పుడు అప్లికేషన్ రాసేసి, రెండేళ్ళ క్రితం పెళ్ళిచూపులకోసం తీయించుకున్న ఫోటో ఒకటి జతపరచి కవరంటించేసింది. అప్పటికప్పుడే వీధిచివర పోస్టు డబ్బాలో పడేసి వచ్చేవరకు సుజాత ఆరాటం తగ్గలేదు.
"ఎండలో యెక్కడి కెళ్ళావే" అన్న కామాక్షమ్మకి "ఏదో ఉద్యోగం అప్లికేషన్ లే పోస్టుచేసి వచ్చాను" అనిమాత్రం చెప్పింది సుజాత. వివరాలు యిప్పుడెందుకు! వచ్చినప్పటి సంగతి చూసుకోవచ్చని తల్లికి, తండ్రికి ఆ ఉద్యోగం సంగతి చెప్పలేదు సుజాత.
3
హైదరాబాదు ఎక్స్ ప్రెస్ బయలుదేరడానికి సిద్దంగా వుంది.
థర్డ్ క్లాసు స్లీపర్ కోచ్ లో కిటికీ దగ్గిర కూర్చుంది సుజాత. తండ్రి సూర్యనారాయణగారు ఆఖరి క్షణాలలో యింకా కూతురికి ఏవేవో జాగ్రత్తలు బోధిస్తూ అప్పగింతలు పెడుతున్నారు.
"వెళ్ళగానే అన్ని వివరాలు రాయమ్మా ఆ యింట్లో ఎవరెవరుంటున్నారో నీవేవేం చెయ్యాలో, నీకు అన్నీ నచ్చాయో లేదో అన్నీ రాయి సుమా! జాగ్రత్త క్రొత్తవూరు. దిగగానే స్టేషన్ కి యెవరూ రాకపోతే కంగారు పడకు. ఎడ్రసు వుందిగా. ఆటోరిక్షా యెక్కి తిన్నగా తీసికెళ్ళమను. పగలేగా భయం వుండదులే. ఇదుగో, యీయన హైదరాబాదు వెడుతున్నారు. ఈయనతో చెప్పాను. దిగగానే నిన్ను ఆటో యెక్కిస్తారు. నీకేం కావల్సినా ఆయన్ని అడుగు" గాభరాగా, గాభరాగా యేవేవో చెప్పేస్తున్నారు సూర్యనారాయణ గారు.
"మరేం ఫరవాలేదు నాన్నా. మీరేం గాభరా పడకండి. అంత చిన్నపిల్లనా, నోట్లో నాలిక లేదేమిటి నాకు. ఎడ్రసుందిగా యిల్లు కనుక్కుని వెళ్ళగలను. మీరేం దిగులుపడకండి" సుజాత నవ్వుతూ అంది.
"ఏమిటోనమ్మా వద్దంటే వినకుండా బయలుదేరావు ఆడపిల్లవి, పొరుగూరు మొదటిసారి వెడుతున్నావు-గాభరా కాదా."
రైలు కూత పెట్టింది. "మరి వుంటా, వెళ్ళగానే ఉత్తరం రాయి సుమా నచ్చకపోతే వెంటనే వచ్చెయ్యి ఈ ఉద్యోగం కాకపోతే మరోటి."
కదులుతున్న రైలు వెంట నడుస్తూ యింకా యేదో అంటున్న తండ్రికి చేయి వూపింది సుజాత. "ఉండు నాన్నా నా కోసం దిగులేం వద్దు చేరగానే రాస్తాను" అంది.
రైలు కనుమరుగయ్యేవరకు అలా చూస్తూ నిల్చుని వెనుదిరిగారు సూర్యనారాయణగారు. ఆయనకి అలా కూతుర్ని ఒక్కర్తినీ క్రొత్త వూరు ఉద్యోగానికి పంపడం నిజానికి ఇష్టంలేదు. కానీ యేం చెయ్యగలరు, పరిస్థితులతో రాజీ పడడం మినహా. దొరక్క దొరక్క దొరికిన ఉద్యోగం! సుజాత ఎంతో యిష్టపడిన ఉద్యోగం దొరికిన తరువాతఆమెని యెలా ఆపగలరు?పెళ్ళి చెయ్యలేకపోయినందుకు కనీసం ఆమె బ్రతుకు ఆమె బ్రతికే అవకాశం దొరికినప్పుడు అభ్యంతరం యెలా పెట్టగలరు? కూతురి సంపాదనకోసం ఆయనెప్పుడూ ఆశపడలేదు. కనీసం తన బ్రతుకు తను బ్రతికితే చాలనుకున్నారు. అదేదో వున్న వూర్లో అయితే సంతోషంగా వుండేది. పైవూరు, ఆడపిల్ల అని ఆలోచించారు. కాని సుజాత పట్టుదలవల్ల ఆ అభ్యంతరాన్ని వదులుకున్నారు.
కనీసం మొదటిసారి సుజాత వెంట వెళ్ళి అక్కడ దింపి ఆ ఉద్యోగం, పరిస్థితులు, ఆ వాతావరణం అన్నీ చూసి రావాలనుకున్నారు ఆయన. కాని సుజాత ప్రయాణానికే నెలాఖరులో డబ్బులేక అప్పుచెయ్యాల్సివచ్చింది. తనూ వెంట వెళ్ళడం అంటే మరో యేభై రూపాయల ఖర్చు అని వెనక్కితీయక తప్పలేదు. అయినా సుజాత అన్నట్టు ఆమె బ్రతుకు ఆమె బ్రతకడానికి తయారవుతున్నప్పుడు యీ చిన్న చిన్న అవాంతరాలని ఎదుర్కోలేకపోతే రేపటినించి యెలా వంటరిగా జీవిస్తుంది! - అనుకుని మనసుకి నచ్చచెప్పుకున్నారు ఆయన.
ఎంత నచ్చచెప్పుకున్నా మొదటిసారి సుజాత ఇంటిలోంచి వెడుతూంటే కూతుర్ని అత్తవారింటికి పంపుతున్నట్టే అన్పించింది సూర్యనారాయణగారికి, కామాక్షమ్మగారికి.
నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ దిగులుగా ఇంటి మొహం పట్టారు సూర్యనారాయణగారు.
4
వేగంగా పరిగెత్తుతున్న రైలులో కిటికీ దగ్గిర కూర్చుని అలా బయటికి చూస్తుంటే, ఆలోచిస్తుంటే ఇంకా తనకి ఉద్యోగం వచ్చిందన్న విషయం తనే నమ్మలేకపోతూంది! అప్లికేషన్ పంపిన పదిరోజులకే తనకి ఉద్యోగం ఇస్తున్నట్టు, వెంటనే వచ్చి చేరమని వచ్చిన జవాబు చూసి ఓ క్షణం అలా నోటిమాట లేనట్టుండిపోయింది. తరువాత సంతోషాశ్చర్యాలతో ఆ ఉత్తరం పదే పదే చదువుకుంది. కలలోకూడా అనుకోని సంఘటన జరిగినందుకు సంతోషంతో తబ్బిబ్బు అయిపోయింది. ముందు తల్లి తండ్రి కాస్త అభ్యంతరాలు చెప్పినా, మరో గత్యంతరం లేక అంగీకరించడం మరో మూడురోజులలోనే ప్రయాణానికి సిద్దపడడం.
ఇప్పటికీ ఇదంతా నమ్మశక్యం కానట్టే వుంది సుజాతకి. తను వెళ్ళబోయే ఇల్లు యెలా వుంటుందో? ఆ డాక్టరు యెలా వుంటారో? తనేం చెయ్యాలో అక్కడ.....తను వాళ్ళకి సంతృప్తికరంగా అన్నీ చేయగలదా?.......ఏవేవో ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలతో యేదో గొప్ప ఎడ్వంచర్ చేయడానికి వెడుతున్నట్టు, చేస్తున్నంత ఎక్సైటింగ్ గా వుంది సుజాతకి.
