ఈ రోజు ఈ సంఘటనతో రాజేష్ మరింత కదిలి పోయాడు. రాస్కెల్, వెధవని నలుగురిలో నిలబెట్టి మొహం మాడ్చాలి. భార్యని ఇలా ట్రీట్ చేసినందులకు నలుగురిలో నిలబెట్టి చెప్పుచ్చుకు కొట్టాలి రాత్రి యిలా తన యింట్లో వచ్చి పడుకున్నందుకు మరో సీను సృష్టించడు కదా. ఆలోచనల మధ్యలో నిద్రపట్టక ఏ తెల్లవారుఝాముకో కళ్ళు మూతలు పడ్డాయి రాజేష్ కి.
* * *
అలవాటుగా అలారం ఆరున్నరకి మోగగానే తుళ్ళిపడి లేచాడు. రాజేష్ తెల్లవారుఝామున ఏ నాలుగుకో నిద్ర పట్టిన రాజేష్ కి నిద్రమత్తూ రాత్రి డ్రింక్ మత్తు యింకా వదలలేదు. యీ వేళ ఆదివారం న్యూయియర్ డే కల్సి వచ్చాయి. శలవు రోజు కొంప మునిగినట్లు ఈ అలారంమోగింది మర్చిపోయి కీ ఇచ్చేశాను నిన్న అనుకొంటూ గడియారం నోరు నొక్కి బాంకెట్ ముసుగుపెట్టి పడుకోబోతూ చటుక్కున పక్క గదిలో అర్చన పడుకుందన్నది గుర్తురాగానే ఒక్క ఉదుటున బ్లాంకెట్ తీసేసి లేచి పక్క గది దగ్గరికి వెళ్ళాడు. తల్లి కూతురు నిండా కప్పుకుని ఆదమర్చి నిద్రపోతున్నారు. తలుపు కూడా వేసుకోకుండా, అంత గాఢ నిద్రలో వున్న ఆమెను లేపడానికి మనసురాలేదు. కాని తెల్లగా తెల్లారిపోయింది. అలా తనింట్లో ఆమె పడుకుందని తెలిస్తే ఆ మొగుడు ఏం గొడవచేస్తాడో- ఎవరేం అనుకుంటారో. పనిమనిషి పాలవాడు అందరూ వస్తారు. వీళ్ళమాటెలావున్నా ఆ మొగుడుగారు లేచేసరికి ఈమె, తన ఇంట్లో ఉండడం మంచిది కాదేమో - ఏడ్చాడు వెధవ రాత్రి చలిలో భార్యని బయటకు నెత్తిన ఆ వెధవకు అడిగేహక్కు ఎలా ఉంది? ఏం చెయ్యాలో తోచక ఒక్క క్షణం అలా నిలబడ్డాడు. మంచి నిద్రలో కూడా గదిలో ఎవరో వున్నారన్నట్టు సిక్త్ సెన్స్ చెప్పినట్లు అర్చన చెప్పింది ఎదురుగా రాజేష్ ని చూసి పాపని పక్కకి జరిపి చటుక్కున కూర్చుంది.
"సారీ.....ఆరున్నర దాటిపోయింది. మంచి నిద్రలో వున్నాలేపనా వద్దా అని ఆలోచిస్తుండగానే మీరు లేచారు. యిలా యింకా యిక్కడుంటే ఆయన ఏమన్నా అనుకుంటారేమోనని లేపుదామని వచ్చాను. 'సంజాయిషీ' యిస్తున్నట్టు గొణిగాడు. ఆమె మొహం దించుకుని ఒక్కక్షణం వుండి పోయింది ఏదో ఆలోచిస్తూ-తరువాత ఏదో నిశ్చయించుకున్న దానిలా మొహం ఎత్తి స్థిరంగా రాజేష్ వంక చూసి ఆయన ఏమనుకున్నా నాకింకేం లెక్కలేని స్థితికి వచ్చాను రాజేష్ గారూ. నిన్న అర్దరాత్రి
ఆడదాన్ని, చంటి పిల్లతో యీ చలిలో ఎక్కడికి పోతాను అన్న జాలి అయినా లేని, మానవత్వంలేని ఆ మనిషితో నాకింకేం సంబంధం లేదనుకునే, నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను రాజేష్ గారూ." ఆ గొంతు అన్ని భావాలకీ అతీతంగా, నిర్లిప్తంగా వుంది.
ఒక స్థితికి చేరాక ఏ దెబ్బా బాధించని స్థితిలో వున్న దాన్ని అన్నింటికి తెగించి ధైర్యంగా నిలబడడానికి స్థిరంగా నిశ్చయించుకున్నట్టుగా అంది ఆమె.
రాజేష్ కాస్త ఆశ్చర్యపడి చూశాడు. 'అయితే, మరి మీరు' కంగారుపడ్డాడు. ఆమె యింటికెళ్ళకపోతే మరి యిక్కడే వుంటుందా అని అన్నాడు. "ఈ ఒక్క పూటకి మీరు ఆశ్రయం యివ్వండి. సాయంత్రం ట్రైన్ వుంది. అందులో మా వూరు వెళ్ళిపోతాను. అంతే కాదు, నాకు ఇంకో సహాయం కూడా చేసి పెట్టాలి" అంటూ చేతికున్న బంగారు గాజులలో ఒక గాజుతీసి 'ఇది కాస్త అమ్మిపెట్టి, నాకు మా వూరువరకు ఒక సెకండ్ క్లాస్ టిక్కెట్టు తెచ్చి పెట్టండి. ప్లీజ్.......ఈ వూర్లో యింకెవరూ తెల్సిన వారు లేరు. నన్ను ఆదుకుని ఆశ్రయం యిచ్చిన నాకు ఈ సహాయం ఒకటి చేసి పెట్టాలి' ఆమె గొంతు క్రమంగా అర్ధమయింది. రాజేష్ కంగారు పడ్డాడు. "ఏమిటి మీరు వూరెళ్ళిపోతే యింక ఆయనతో" గాభరాగా అన్నాడు. ఇది అతను ఎదురుచూసిన మలుపు.
"అవును, యింక ఆయనతో కాపురం నా వల్లగాదు. నిన్న నా సహనం, శాంతం ఆఖరి మెట్టుకు చేరాయి. ఇన్నాళ్ళు లోకం కోసం కల్సిబతికాను. పరువు కోసం పాకులాడి కాపురం చేశాను. నన్ను ఎంతహీనంగా ట్రీట్ చేసినా నలుగురూ ఏమంటారోనని నోరు నొక్కుకున్నాను. యిప్పుడింక నా పరువు బజారున పడింది. గుప్పిట తెరిచే వరకే గుట్టు-యిప్పుడింక నేనెవరికి భయపడి యీ మనిషితో కాపురం చెయ్యాలి రాజేష్ గారూ. మీకు తెలీదు. ఈ రెండేళ్ళుగా నేననుభవించిన నరకం కన్నవారికి కూడా చెప్పుకోకుండా అన్నీ సహించాను' ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఆ క్షణంలో రాజేష్ ఆమెకి ఆప్తుడిలా కన్పించాడు. అతని ముందు మనసు విప్పి చెప్పుకోడానికి ఆమెకి సిగ్గనిపించలేదు. "నిన్న రాత్రి నేననుభవించిన అవమానం, హింస మీకు తెలియదు. నన్నిలా కుక్కని తరిమినట్టు అర్దరాత్రి యింట్లోంచి గెంటిన ఆ మనిషని....హూ మనిషికాదు. ఆ మృగంతో యింకా కాపురం" ఆవేశం బుసలు కొట్టింది. ఆమె గొంతులో "ప్లీజ్, కట్టుబట్టలతో వున్నాను, చేతిలో దమ్మిడిలేదు. నాకింతకంటే గత్యంతరంలేదు. ఈ గాజు అమ్మి టిక్కెట్టు తెచ్చి పెట్తే మీకు రుణపడి వుంటాను' వణికే గొంతుతో అంది ఆమె.
"అబ్బెబ్బే....బంగారం అమ్మడం ఎందుకండి-టిక్కెట్టు డబ్బు నేనిస్తాను. అది కాదు అసలు పాయింటు మీరిలా కట్టుగుడ్డలతో యింట్లోంచి వెళ్ళడం ఏమిటి-మీరు ఆయన భార్య-ఆ యింట్లో మీకు సర్వహక్కులున్నాయి-యిలా దొంగతనంగా పారిపోవాల్సిన ఖర్మ ఎందుకు యింట్లోంచి పొమ్మనే హక్కు ఆయనకి లేదు. పొమ్మంటే మీకు, పాపకి మెయిన్ టెనెన్స్ అదీ యిచ్చే ఏర్పాటు చెయ్యాలి. పొమ్మనడం అంత సులువు అనుకుంటున్నారా? నలుగురిని పిలవండి-ఆయన చేసిన పని చెప్పండి, ఏమంటారో చూడండి-మిమ్మల్నిలా హింసించినందుకు నిన్న రాత్రి ఆయన ప్రవర్తనకి సంజాయిషీ యిమ్మనండి" ఆవేశంగా తీవ్రంగా అన్నాడు రాజేష్.
"రాజేష్ గారూ......భార్యగా నా హక్కులు నాకు తెలుసు. కాని నలుగురిని పిలిచి అందరి ముందు సంజాయిషీలు చెప్పించుకోడం అనవసరం-ఆయనతో కాపురం చేసే ఉద్దేశం వున్నపుడు అదంతా అవసరం-చెప్పానుగదా నిన్నటితో ఆ సహనం ఆఖరి మెట్టుకి వచ్చిందని-యింకా ఆ యింట్లో వుండి అవమానాల పాలు గాలేను. నా భవిష్యత్తు ఏమయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాలనే నిర్ణయించుకుని వెడుతున్నాను నా నిర్ణయం సరి అయినది కాకపోవచ్చు, యిటు అటు అందరూ దీనిని సమర్ధించరని నాకు తెలుసు, వాద ప్రతివాదాలు, ప్రతిఘటనలు ఎదుర్కోవాలని తెలుసు-రేపు ఆ భవిష్యత్తు పూల బాటలా వుండదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు. అందుకే ఈ భయాలతోనే యిన్నాళ్ళు ఆయన జులుం సహించాను కాని యీ హీనస్థితి, అవమానాల కంటే ఆ బతుకు ఎదుర్కోవడమే నయమనిపిస్తూంది -ప్లీజ్, నిన్న రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను, ఇప్పుడింక ఏదో చెప్పి నా నిశ్చయం సడలిపోయేట్టు చెయ్యకండి" రాజేష్ ఏదో అనపోయి ఆమె మొహం చూసి విరమించుకుని-సరే మీ నిర్ణయాన్ని కాదనే హక్కు నాకేం లేదు-వుండండి ముందు కాస్త టీ తాగుదాం-బాత్ రూములో పేస్టూ వుంది వాష్ చేసుకురండి. ఈలోగా నేనూ టీ చేస్తాను'-అన్నాడు.
