.jpg)
అది మహాసభ - సితా స్వయంవరార్ధ
మచట గూడెను; తళతళలాడు భూష
ణాలతో ఖండఖండాంతరాల దొరలు
శివధనుర్భంగమునకు విచ్చేసినారు.
బారులు తీర్చి భూపతుల బంగరుగద్దెలమీద గూరుచు
న్నారు - వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్దవిల్లు, శృం
గార మధూకమాలికను గైకొని జానకి చూచువారి నో
రూరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దల పెండ్లికూతురై.
ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకము లేలు రాజసము లోగొనగా - రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరసమట్టుల నమ్మునిరాజు వెన్క నా
జూకుగ నిల్చియుండె ప్రియసోదరులతో అభిరామమూర్తియై.
"స్వాగత మో స్వయంవర సమాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే హృది ప్రహర్ష పరిఫ్లుతమయ్యె - ఈ ధను
ర్యాగమునందు శంకర శరాసన మెక్కిడు నెవ్వ! డా మహా
భాగు వరించు నా యనుగుపట్టి సమస్త సభాముఖమ్మునన్."
అని జనకుండు మెల్లగ నిజాసనమం దుపవిష్టుడయ్యె - మ్రో
గెను కరతాళముల్; నతముఖీ ముఖపద్మమువైపు పర్వులె
త్తినవి నరేంద్రపుత్రుల సతృష్ణ విలోకన భ్రుంగపంక్తు; ల
ల్లన పులకించె మేను మిథిలాపురనాథుని ముద్దుబిడ్డకున్.
బిగువు నిండారు కొమ్ముటేనుగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు;
శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్య సమక్షమందు.
ముని చిఱునవ్వుతోడ తన ముద్దులశిష్యుని మోము చూచె - త
మ్మునకు ధనుస్సు నిచ్చి రఘుముఖ్యుడు జానకి నోరకంటితో
గనుచు, వినమ్రుడై గురువు గారికి - సింహకిశోరమట్లు ముం
దున కరుదెంచె; నచ్చెరువుతో నృపతుల్ తలలెత్తి చూడగన్ !
"ఫెళ్ళు" మనె విల్లు - గంటలు "ఘల్లు" మనె - "గు
భిల్లు" మనె గుండె నృపులకు - "ఝల్లు" మనియె
జానకీదేహ - మొక నిమేషమ్మునందె;
నయము జయమును భయము విస్మయము గదుర.
సిగ్గు బరువున శిరసు వంచినది ఒక్క
సీతయే కాదు - సభలోని క్షితిపతులును;
ముదముమెయి పూలు వర్షించినది సతీ శి
రోమణులె కాదు - దేవతా గ్రామణులును.
"చెల్లరే విల్లు విఱుచునే నల్లవాడు
పదిపదారేండ్ల యెలరాచపడుచువాడు
సిగ్గు సి"గ్గంచు లేచి గర్జించినారు
కనులుగుట్టిన తెల్ల మొగాలవారు.
లక్ష్మివంటి సీతామహాలక్ష్మి విజయ
లక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి యయ్యె;
భరత జనయిత్రి ప్రేమబాష్పాలలోన
అయ్యె నతి వైభవముగ సీతమ్మ పెండ్లి.
ఊర్మిళాకుమారి
ధవుని వెనువెంట జనిన సీతామతల్లి
గడపివచ్చు వత్సర మొక్క గడియమాడ్కి;
నాథు నెడబాసి శూన్యమౌ నగరిలోన
నెట్లు నిలిచెదు? పదునాలుగేండ్లు తల్లి!
రమణుడు చెంతనుండిన నరణ్యములే యపరంజి మేడలౌ
రమణుడు లేక మేడలె యరణ్యములౌ - నికనేమి జానకీ
రమణికి రాణివాసమె అరణ్య నివాసము -నీవు నీ మనో
రమణుని బాసి ఘోరపుటరణ్యములో బడిపోతి విచ్చటన్.
"వదినెయు నన్నగారు వనవాసము సేయగ నన్నగారి శ్రీ
పదముల సేవచేసికొను భాగ్యము స్వేచ్చగ నాకు కల్గు; నీ
యదనున నీవు రావల" దటంచు ప్రియుండు నిరాకరింప, నీ
హృదయము కృంగి, పొంగిపొరలెత్తిన దుఃఖము మ్రింగుకొంటివే!
అత్తరి "పోయి వత్తును ప్రియా! యికనే" నను భర్తకెట్టి ప్ర
త్యుత్తర మీయలేక యెటులో తలయెత్తి యెలుంగురాని డ
గ్గుత్తికతోడ నీలి కనుగొల్కుల బాష్పకణమ్ము లాపుచున్
"చిత్త" మటన్న నిన్ను గన చిత్తము నీరగునమ్మ ఊర్మిళా!
పైటచెఱంగుతో పుడమిపై బడకుండగ నద్దుకొమ్ము నీ
కాటుక కన్నుదామరల కాలువలై ప్రవహించు వేడి క
న్నీటికణాలు - క్రిందపడనీయకు! ముత్తమసాధ్వి వైన నీ
బోటి వధూటి బాష్పములు భూమి భరింపగలేదు సోదరీ!
అన్న పదమ్ములన్ గొలుచు నాస మనోహరు డేగినాడు - తా
జన్నది భర్తృపాద పరిచర్యకు ప్రేమపు టక్కగారు - ఏ
మున్నది దిక్కు నీ కిచట? నొంటరి వైతివి తల్లి! ఎంతయున్
జిన్నతనమ్ము - నీ వెటుల జేతువొ కోడఱిక మ్మయోధ్యలో!
"నన్ను నాపుత్త్రు జంపి, అన్నను అయోధ్య
గద్దె నెక్కింప వీరకంకణము దాల్చు
లక్ష్మణకుమారు దేవేరులా!" యటంచు
ఆడిపోయదె కైక ని న్నహరహమ్ము.
క్రొవ్వలపు జవ్వనపు మూగకోరికలకు
దాపురమ్మైన మీ లేతకాపురమ్ము
చేతిమీదుగ నడవిపాల్ చేసినాడు
కనులుగుట్టిన వేమొ రాకాసివిధికి.
చెల్లెం డ్రివ్వరు ప్రాణవల్లభుల సంసేవించుచున్నారు; తా
నుల్లాసమ్మున సీత వల్లభునితో నుండెన్ వనిన్; నీ వెటుల్
తల్లీ! భర్తృవియోగ దుఃఖమున నుల్లం బల్లకల్లోలమై
యల్లాడన్ కడత్రోతువమ్మ! పదునాల్గబ్ధమ్ము లేకాకృతిన్.
నలుగురు "నంగనాచి గహనాలకు కాంతుని గెంటి యింటిలో
కులుకుచు కూరుచున్న" దనుకొందు రటంచు రవంతయేని చిం
తిలకుము తల్లి! త్యాగమయదేవివి నీవని నీ చరిత్రమే
తెలుపుచునుండె - లోకము హృదిన్ గదలించు సదా త్వదశ్రువుల్!
కమ్మని జవ్వన మ్మడవిగాచిన వెన్నెలజేసి, భర్తృవా
క్యమ్ముల కడ్డుచెప్పక మహత్తరమౌ పతిభక్తిలోన సీ
తమ్మను మించిపోయితివి -తావక దివ్య యశోలతా వితా
నమ్ములు ప్రాకిపోయె భువనమ్ముల; పుణ్యవతీవతంసమా!
.jpg)
అల కలహభోజనుని ఫలహారమునకు
నినుప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు;
అమ్మ! నీ చేతి తాలింపు కమ్మదనము
భరతదేశాన గుమగుమ పరిమళించె.
అత్యపూర్వ మమోఘ మనంత మైన
తావక పతివ్రతా మహత్త్వమ్ములోన
ఆది సాధ్వీమణుల హృదయాలతోడ
నుక్కు సెనగలు తుకతుక నుడికిపోయె!
వేద వేదాంత సౌవర్ణ వీథులందు
తిరుగుచుండెడి దివ్యమూర్తిత్రయమ్ము
నేడు నీ వంటయింట దోగాడుచుండె
గోరుముద్దలు గుజ్జెనగూళ్ళు తినుచు.
