Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 7


    "అవిగో అన్నాను" మీనాక్షి వంటిమీద మెరుస్తున్న నీటి ముత్యాలని చూపిస్తూ.
    మీనాక్షి తన శరీరంవంక చూసుకుని అరక్షణం సిగ్గుపడింది. "పో బావా ఇంకా నిజం అనుకున్నాను... పూరీ సముద్దం గవ్వలు, శంఖాలు, వగైరాలకి ప్రసిద్దిగదా, ముత్యాలుకూడా దొరుకుతాయనుకున్నాను......"
    "అమ్మ ఎంత ఆశ! హారం చేయించుకుందామనుకున్నావా?"
    మీనాక్షి రెండు దొర్లు దొర్లి నా దగ్గరికి వచ్చి మోచెయ్యిమీద ఆని నా మొహంలోకి వంగి చూసింది కొంటెగా. "అమ్మో బావగారికి సరసం కూడా తెలుసన్నమాట" అంది చిలిపిగా నాతడిజుట్టు గుప్పెటతో పట్టుకుని యిటు అటు గుంజింది.
    నామీదకి వంగున్న మీనాక్షి తగిలీ తగలని అర్ధనగ్న శరీరం, వంటిని పూర్తిగా కప్పని ఆ దుస్తులలోంచి కనిపించే మీనాక్షి సౌష్టవం చూసి వేడిరక్తం పొంగింది. కళ్ళుగట్టిగా మూసుకున్నాను... లేకపోతే యీ పాడు మనసు శరీరం ఏకంఅయి ఏం చెయ్యకూడనిది చేయిస్తుందో నాచేత!
    మీనాక్షికి ఎంత చొరవ! నిర్భయం! పరాయి మగవాడినన్న ఆలోచనకూడా లేనట్టు ఎంత నిర్భయంగా నా ప్రక్కన పడుకుంది!.... నామీద అంత నమ్మకమా? లేక నా నిగ్రహం, ప్రయోజకత్వం పరిశీలిద్దామనా? ....మీనాక్షి అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఆ కళ్ళలోకి ఎంత సేపుచూసినా కొంటెతనం మాత్రం కనిపిస్తుంది....
    ఎక్కువ సేపు మీనాక్షిని ప్రక్కనుంచుకుని నిగ్రహం చూపడం నా వల్ల కాలేదు! నాశరీరం వశం తప్పకముందే వివేకమో, సంస్కారమో, చెప్పలేను గాని తట్టి లేపాయి.... లేక పిరికితనమన్నా కావచ్చు.... చటుక్కున లేచి కూర్చున్నాను....
    "పద, మీనాక్షి వెళ్ళిపోదాం" అన్నాను...
    "అప్పుడేనా బావా!" అంది అదోలాచూస్తూ.
    "అప్పుడేనా ఏమిటి? మనం వచ్చి రెండుగంటలపైన అయింది వాళ్ళు హడావిడి పడుతుంటారు.. లే వెళ్ళిపోదాం.." అన్నాను లేచి నిలబడి.
    చేతులు రెండు చాచింది విలాసంగా లేపమన్నట్టు, చేతులందించి లాగాను. ఆ లాగడంలో మీనాక్షి ఆ వేగానికి తూలి పడబోయి నాగుండెల మీద చేతులు ఆన్చి నిలద్రొక్కుకుంది.... మీనాక్షి పడకుండా అప్రయత్నంగా నా చేతులు ఆమె నడుంచుట్టూ తిరిగాయి, ఒక్క క్షణం అలా నిలబడ్డాం ఇద్దరం. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, 'మీనాక్షి' అన్నాను బరువుగానే. నే నేమయిపోతున్నానో నాకే తెలియని స్థితి అది.
    మీనాక్షి కొంటెగా నవ్వింది నా మొహంచూస్తూ...... "బావా" అంటూ నా ముక్కు పట్టుకు వూగించి నీళ్ళలోకి పరుగెత్తింది, ఆ "బావా" అన్న మాటలో  "ఇంత పిరికివాడివేమిటి నీవు" అన్న అర్ధం స్ఫురించింది.
    నిజమే పిరికివాడినే.... లేకపోతే ఇలాంటి ఛాన్స్ ఎవరన్నా వదులుకుంటారా? ... మరి నేనెందుకు వదిలినట్టు? ... జవాబు ఆలోచించడానికి వ్యవధి లేదు... యీదుకుంటో వెళ్ళిపోతున్న మీనాక్షిని కలుసుకున్నాను.
    ఒడ్డుకి చేరేసరికి రామావతారం, శాంతి, పిల్లలు ఎవరూ కనబడలేదు, బహుశా ఆలస్యమయిపోయిందని హోటలుకి వెళ్ళిపోయివుంటారు. పిల్లలకి స్నానం చేయించిన బెస్తవాళ్ళు మమ్మల్నిచూసి బేగ్ అందించారు. "సే బాబూమానె, యిత్తె పర్యంతు దేఖికిరి ఎబైకా జాయిచ్చి బాబూ!" అన్నాడు.
    "పద వాళ్ళు ఇంతవరకు మనకోసం చూసి యిప్పుడే వెళ్ళిపోయారట" తువ్వలుతో తుడుచుకుని, బాత్ రోబ్ కప్పుకుని హోటలుకి బయలుదేరాం.
    ఇద్దరం హోటలికి వెళ్ళేసరికి పిల్లలకి భోజనాలు పెట్టించేసి మా కోసం చూస్తున్నారు రామావతారం, శాంతి. మేం వెళ్ళగానే రామావతారం కోపంగా మీనాక్షివంక చూశాడు. "ఏనాడనగా వెళ్ళారు....యింత సేపా, నీకసలు ఎక్కడికి వెళ్ళినా వళ్ళు తెలియదు... ఇంకా రారేమిటని మేం యిక్కడ కంగారుపడుతున్నాం..." కేక లేశాడు...
    "ఏమయిపోతాను... బావ వున్నాడుగా సాయం!" నిర్లక్ష్యంగా అంది మీనాక్షి లోపలికి వెడుతూ. నేనేం అనలేక గిల్టీగా చూశాను. శాంతి నన్నూ, మీనాక్షినీ పట్టిపట్టి చూసింది. మా మొహాలలో భావాలు వెదకటానికి ప్రయత్నిస్తున్నట్టు.. వాళ్ళిద్దరిని తప్పించుకుని లోపలికి వెళ్ళాను..... భోజనాల దగ్గర మాటల మధ్యలోగాని మామూలుగా అనలేకపోయాను.
    ఆ సాయంత్రం వూరంతా ఒకసారి తిరిగివచ్చి బీచిఒడ్డున కూర్చున్నాం. వెన్నెలరాత్రి! సముద్రం చంద్రుడిని చూసి ఎగిరిపడ్తూంది... వెన్నెల కెరటాలమీద ధగధగలాడుతూ మెరుస్తూంది! మీనాక్షి, శాంతి ఇద్దరూ పాటలు పాడారు అడగ్గానే. మీనాక్షికి పాటవచ్చిని, యింత శ్రావ్యంగా ఆమె గొంతు వుంటుందని ఆనాడే తెలుసుకున్నాను. సన్తి సంగీతం నేర్చుకుంది. ఆమె పాడటంలో వింతలేదు! మీనాక్షి గురించిన నిజాలు నాకేం తెలియవన్న మాట! మీనాక్షి వచ్చిం దగ్గిరనుంచి క్షణ క్షణానికి మీనాక్షి దగ్గరవుతూంది నాకు! రామావతారం అదృష్టానికి ఆ కొద్ది రోజుల్లోనే ఎన్నోసార్లు అసూయపడ్డాను.
    మర్నాడు ఉదయం స్నానం చేసి పూరీ జగన్నాధుని చూడ్డానికి బయలుదేరాం. రామావతారం పట్టుపంచెకట్టి అచ్చతెలుగు వేషం వేశాడు. మీనాక్షి శాంతి పట్టుచీరలు కట్టారు. వాళ్ళందరిని చూసి, పంచె కట్టుకోవడం అలవాటులేని నేను పైజామా, లాల్చీ కట్టుకున్నాను. అయినా ఆ దేవాలయానికి పేంటుతో వెళితే మళ్ళీ అదెందుకు పనికిరాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న నేను క్రిందటి సారిలా టెర్లిన్ పాంటు పాడుచేసుకోలేక పైజామా కట్టుకున్నాను.
    నిజంగా పూరీ దేవాలయం చరిత్ర ప్రసిద్ద మయినదే అయివుండవచ్చు. ఆ దేముడి మహిమ గురించిన నిజానిజాలు నాకు తెలియవు, గాని ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళివస్తే మరి వెళ్ళబుద్దిపుట్టదు అని నా ఉద్దేశం! సర్వం జగన్నాధం అంటూ కుండల్లో వుడికించిన అన్నం పప్పు పిడతలు వాటిమీద జుమ్మని ముసిరే ఈగలు. అవెంతో భక్తిగా "భోగం" అనుకుంటూ కొనుక్కుని కళ్ళకద్దుకు తినేప్రజలు, గర్భగుడిలో ఆ చీకటి, కాలుక్రిందపెడితే జర్రున జారే ఆ పాకుడు... డబ్బీయడం ఏ మాత్రం తక్కువయినా బండబూతులు తిట్టే పండాలు... కారు దిగగానే చుట్టు ముట్టే ఆ పండాలు... అదంతా చూస్తే దేముడిమీద భక్తి కలగటం అటుంచి వున్న భక్తి విశ్వాసాలు కూడా పోయి ఎప్పుడెళ్ళిపోదామా అని పించడం సహజం. దక్షణాదిని ఉన్నంత పరిశుభ్రంగా ఉత్తరాదిని దేవాలయాలు వుండవు. అందులో పూరీ, బెనారస్ దేవాలయాలు అపరిశుభ్రతకి ప్రసిద్ది. ఆ వాతావరణంలో ఓ క్షణం కూడా దేముడిమీద మనసు నిలవదు. అయినా ప్రజలు వెళ్ళడం మానరు! నాలాంటి వాళ్ళు యింతదూరం వచ్చాం ఓ సారి చూచిపోదాం అనైనా రాక మానరు! అదేమిటో పూరివెళ్ళి జగన్నాధుని దర్శించుకుని రాలేదంటే అదో వెలితిగానేకాక,. ఏదో తప్పు పని చేసినట్టు ఫీలవుతాం అంచేత ప్రతీసారివిసుక్కుంటూనే వెళ్ళడం పరిపాటి!
    కారు ఆగడం తడవు ఓ పదిమంది పండాలు చుట్టుముట్టారు దేవుని దర్శనం చేయిస్తామని. ఒద్దు మహాప్రభో అన్నా వినిపించుకోక వెంట పడ్డారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS