ఆ వార్త క్షణాల్లో ఊరంతా గుప్పుమంది. "లాకప్ మరణం" వార్త అతి వేగంగా చుట్టు ప్రక్కల ఊళ్ళలో మారు మ్రోగింది. అధికార్ల అనధికార్ల ప్రజల ఫోన్ లతో స్టేషన్ మారుమ్రోగిపోతుంది. నోరువిప్పితే ఏమౌతుందోనని భయంగా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు పోలీసులు. చూస్తుండగానే స్టేషన్ చుట్టూ జనం పోగయ్యారు. ఇదే అదననుకొని కొన్ని రాజకీయ పక్షాలవారు కూడా వాళ్ళతో చేరిపోయారు. నినాదాలహోరు, జనంతో పాటు కొన్ని అరాచక శక్తులు కలిసాయి. స్టేషన్ మీద రాళ్ళ వర్షం కురిపించారు ప్రజలు. పోలీసులకు గాయాలయ్యాయి. లాఠీచార్జీ జరిపారు పోలీసులు. జనం తగ్గినట్లే తగ్గి మళ్ళీ విజృంభించారు. పోలీసు జీపు, బుల్లెటు దహన కాండకు గురి అయ్యాయి. అప్పుడే అక్కడికి చేరుకున్న డి.యస్.పి. మైకులో ప్రజల్ని శాంతించమని, కలెక్టరుగారు ఎస్.పి గారు విచారణ జరిపి దోషులపై చర్యతీసుకుంటారని చెప్తూ ప్రజల్ని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులను శాపనార్ధాలు పెడుతూ, ఎస్.ఐ.ని సస్పెండు చేయమని నినాదాలు చేస్తూ రెచ్చిపోతున్నారు ప్రజలు.
లాకప్ మరణం గురించి ప్రజలకు ఏమని జవాబివ్వాలో తోచక తలలు పట్టుకుని కూర్చున్నారు కలెక్టరు, ఎస్.పి. ఇద్దరు ఎంక్వయిరీకి బయలుదేరారు. లాకప్ సెల్ లో ఉన్న శవాన్ని ఉన్నది ఉన్నట్లుగా వుంచమని కదపవద్దని హుకుం వచ్చింది.
కలెక్టరు యస్.పి. స్టేషన్ కు చేరుకున్నారు. ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. జనం తగ్గలేదు. కలెక్టరుగారి మీదికి రాయి వచ్చిపడింది. ఇక గత్యంతరం లేక ఫైరింగ్ ఆర్దర్సు ఇచ్చారు. తుపాకులకు జీవం వచ్చింది. నాలుగు రౌండ్లు కాల్చేసరికి జనం చెల్లాచెదురు అయిపోయారు. పట్టణంలో 144వ సెక్షన్ విధించారు. శాంతిభద్రతలు అదుపులోనికి వచ్చాయి.
కలెక్టరు, యస్.పి.గారు ఇద్దరూ కూర్చుని విచారణ మొదలు పెట్టారు. జరిగింది జరిగినట్లుగా విన్నవించుకున్నాడు ముఖం మీద కత్తివాటుకు కూడ నెత్తురు చుక్కలేనట్లున్న ఎస్.ఐ. "ఇది లాకప్ హత్య కాదు సార్. కోటయ్య తన పంచెతో ఉరివేసుకున్నాడు సార్" అని మొత్తుకున్నాడు. యస్.పి. గారు కలెక్టరుగారు వినలేదు. ఆర్. డి. వో ను న్యాయ విచారణకు ఆదేశిస్తూ నివేదిక అందేవరకు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా యస్.ఐ.ని, హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ తతంగం అంతా ముగిశాక సెల్ చెక్ చేయడానికి లేచారు. అధికార్లు ఇద్దరూ శవాన్ని బయటకు తీయించారు. సెల్ లో పద్దులు రాసుకునే పుస్తకం, ఓ పెన్సిల్ కనపడ్డాయి. కలెక్టరుగారు సైగతో అవి అందుకొని ఆయనకు అందించాడు కానిస్టేబుల్. పద్దుల పుస్తకంలో రాస్తున్నది తనలో తను చదువుకొని యస్.పి.కి అందించాడు మౌనంగా కలెక్టర్ గారు. యస్.పి. గారు బిగ్గరగా చదివారు నోట్ పుస్తకంలోని చివరి పేజి.
"నేను దొంగను కాను. పది సంవత్సరాల నుంచి ఆండాళ్ళమ్మ గారింట్లో వళ్ళుదాచుకోకుండా నమ్మకంగా, కుక్కలా విశ్వాసంగా పనిచేశాను. దానికి ప్రతిఫలంగా నేను చేయని దొంగతనాన్ని నాపై మోపి నన్ను పోలీసులకు అప్పచెప్పారు. రాత్రి అయ్యగారికి గుండె నొప్పి రావడంతో నేనే డాక్టరుగారిని పిలిచాను. నిన్న పగలల్లా అన్నం లేదు. రాత్రి అమ్మగారు నాకు అన్నం పెట్టడం మరచిపోయి పడుకున్నారు. అయ్యగారికి ఒంట్లో బాగోనప్పుడు భోజనం అడిగి పెట్టించుకోలేక మంచినీళ్ళు తాగి పడుకున్నాను. పోలీసులు కొట్టే దెబ్బలను తట్టుకోలేక చేయని నేరాన్ని ఒప్పుకున్నాను. ఈ రోజు సాయంత్రం పోలీసులు వస్తువును చూపించమని మళ్ళీ కొడతారు. చేయని నేరాన్ని అయితే ఒప్పుకోగలిగాను కానీ, లేని వస్తువును ఎక్కడ నుండి తేగలను. అందుకే చచ్చిపోతున్నాను. నాలాంటి వారి చావుకి కారణం ఆండాళ్ళమ్మ వంటి కృతజ్ఞత నమ్మకంలేని యజమానులే". చివరకు కోటయ్య సంతకం.
యస్.పి. గారు గట్టిగా చదివి చుట్టూ చూసేసరికి బ్యాండేజి కట్లతో వున్న పోలీసులు, బిక్కమొహం వేసుకొని నిలబడ్డ యస్.ఐ. తప్ప అక్కడెవరూ లేరు.
* * *
