"ఏదో సరదా!" ఘోల్లున నవ్వాడు అవధాని. అవధాని ఘొల్లున నవ్వింది దేనికో తెలియని గోపాలం కళ్ళప్పగించి చూశాడు.
"అవును! సహజమే! ఇతరులను అపాయంలో చూట్టం అంటే ఎక్కువమంది మనుష్యులకు సరదాగానే వుంటుంది."
అవధాన్లు అర్ధంకాక నొసలు ముడిచి గోపాలంకేసి చూశాడు.
"బాక్సింగ్, సర్కస్, పులుల మధ్య సింహాల మధ్య కూర్చొని వాటిని రెచ్చగొట్టటం ఇలాంటివి చూట్టానికిమనుష్యులు ఎందుకు విరగబడతారంటారు గురువుగారూ?"
"ఎందుకేమిటి? అదో సరదా! కాలక్షేపం! ఇందులో ఇతరులు అపాయంలో వుంటే చూసి సంతోషించటం అనే ప్రసక్తి ఏముందీ?" విసుగ్గా వుంది అవధాన్ల స్వరం.
"మరీ అంత విసుక్కోకండీ; ఎవడైనా పిల్లులతో, కుక్కలతో ఆడతారంటే జనం విరగబడతారేం? ఎవడైనా పదిగజాల ఎత్తునుంచి నేలమీదకు దూకుతాడంటే టికెట్ కొనుక్కొని చూట్టానికి వెళతారా?"
"ఎందుకెళతారు? అందులో ఏం విశేషం ఉందిగనుక?"
"అందులో ఏం విశేషం వుంది అనకండి! అందులో ఏం అపాయం వుంది అనండి!" అన్నాడు గోపాలం.
"అంటే నీ ఉద్దేశ్యం ఇలాంటివి చూడాలని కుతూహలం పడటంలో క్రూరత్వం ఉందంటావు."
"ఒక రకంగా అంతే! మనిషి జంతువులనుంచి వచ్చాడనే దానికి నిదర్శనం ఇది. చాలామంది మనుషుల్లో ఇంకా జంతు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొందరిలో నిగూఢంగా ఉంటాయి. మానవుడి లోని ప్రాథమిక గుణాలకు అంటే పాశవిక ప్రవృత్తులకు సంతృప్తి కావాలి."
"ఏమో గోపాలం, నీవాదన నాకు అర్ధంకాదు. ఇన్నింటికీ నువ్వు ఎగ్జిబిషన్ గ్రౌండ్సుకు వస్తావా రావా?" నిలదీసినట్లు ప్రశ్నించాడు అవధాన్లు.
గోపాలానికి ఇలాంటి దృశ్యాలనుచూట్టం ఇష్టముండదు. చిన్నప్పుడు తమ ఊళ్ళో దొమ్మరివాళ్ళు గడకర్రలమీద పిల్లిమొగ్గలు వేస్తుంటేనే చూడలేక కళ్ళు మూసుకొనే వాడు. పిల్లలంతా గోపాలాన్ని పిరికి పందగా భావించి గేలి చేసేవారు.
ఈ రోజు గోపాలం మనస్సేమీ బాగాలేదు. అవధాన్లతో కాలక్షేపం బాగుందనిపించింది. "వస్తాను పదండి!"అనేశాడు గోపాలం.
ఇద్దరూ ఎగ్జిబిషన్ గ్రౌండ్సుకు వచ్చేటప్పటికి బాగా చీకటిపడింది ఎగ్జిబిషన్ ఆవరణలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. జనం వస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళూ పిల్లలూ మరీ ఎక్కువగా ఉండటం గోపాలానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. "ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకురావడం ఎందుకో!" అనుకున్నాడు గోపాలం.
టిక్కెట్టు కొనుక్కుని బావిదగ్గరకు వెళ్ళారు. అప్పటికే జనం చుట్టూ కూర్చొని ఉన్నారు. ఇప్పటినుంచే ఆజనంలో కూర్చోవటం గోపాలానికి నచ్చలేదు. అసలు గోపాలానికి ఆ దృశ్యం చూడాలనిలేదు. ఆ కుర్రాణ్ణి ఓసారి చూడాలనివుంది. అవధానుల కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నట్లనిపించింది గోపాలానికి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ దూరంగా నడిచారు. కొంచెందూరంలో ఓ చిన్న గుంపు కనిపించి, అటు నడిచారు. జనం పది పదిహేను మంది కంటే ఎక్కువలేరు. మధ్యలో కాకీ దుస్తుల్లో ఓ కుర్రాడు నిల్చొని ఉన్నాడు. చుట్టూచేరి జనం ఏదో ఏదో అడుగుతుంటే ఉత్సాహంగా జవాబు లిస్తున్నాడు. ఆ కుర్రవాడు ఎవరో గోపాలానికి, అవధానులకూ అర్ధం అయింది. ఆత్రంగా జనంలో జొరబడ్డారు.
అంతలో గుబురు మీసాలవ్యక్తి ఒకడు చుట్టూ మూగిన జనాన్ని తప్పుకోమని మందలించాడు. అతను అవధానుల్ని చూస్తూ చేతులు జోడించి నమస్కరించాడు. అవధానుల మొహం విప్పారింది.
"అయ్యవార్లుగారూ! రండి! రండి! పొద్దున తమకోసం కబురు పెట్టాను," అన్నాడు అతడు, అయ్యవార్లు స్వయంగా సాక్షాత్కరించినందుకు సంతోషపడుతూ.
"కబురందింది యాదగిరీ! ఉదయం రావటానికి తీరిక చిక్కలేదు. అందుకే ఇటు వచ్చాను." అన్నాడు అవధాన్లు.
"తమరు టికెట్ కొనుక్కొని రావటం ఏమిటి అయ్యవారూ? నాకు కబురుచేస్తే స్వయంగా వచ్చి తీసుకొచ్చేవాణ్ణిగా?"
"దానికేంలే! ఈ కుర్రాడు కొన్నాడులే టికెట్లు నాక్కావాల్సిన కుర్రాడేలే!" అవధాన్లు అన్నాడు. యాదగిరి గోపాలానికి నమస్కరించాడు. గోపాలంకూడా మౌనంగా నమస్కరించాడు. యాదగిరి ఆ కుర్రాన్నీ, అవధాన్లనూ, గోపాలాన్నీ తీసుకొని జనంలోంచి దారి తీశాడు. అవధాన్లకూ, యాదగిరికీవున్న సంబంధం ఏమిటో ఆలోచిస్తూ నడుస్తున్నాడు గోపాలం.
బావికి పదడుగుల దూరంలో చుట్టూ మూయకట్టిన డేరాలోకి నలుగురూ వెళ్ళి కూర్చున్నారు.
"ఎల్లుండి కొత్తఇంట్లో సత్యనారాయణవ్రతం చేయిద్దామని తమరికి కబురు పెట్టాను." అన్నాడు యాదగిరి.
యాదగిరి గత పాతికేళ్ళుగా తిరునాళ్ళలోనూ, ఎగ్జిబిషన్స్ లోనూ, మెర్రీగోరౌండ్సూ, లక్కీడిప్పులూ చట్కాలూ చిట్కాలూ కలిపి అనేక తమాషాలు చేయించి, జనానికి వినోదాన్ని అందించి ఓ లక్షరూపాయలదాకా సంపాదించాడు.
కొత్తయిల్లు కట్టించాడు. పూజలకూ, పునస్కారాలకూ అవధానుల్నే పిలుస్తూండేవాడు. యాదగిరికి పాపభీతి లేకపోయినా దైవభక్తి పరాయణుడు.
"అలాగే! దివ్యంగా చేయిస్తాను." అవధానులకు మనసు సత్యనారాయణవ్రతంలో పొందబోయే సంభావనలమీదకు మళ్ళగా, కళ్ళుమాత్రం ముచ్చటగా, గంభీరంగా కూర్చునివున్న కుర్రాడిమీదే ఉన్నాయి. యాదగిరి కుర్రాణ్ణి అవధానులకు పరిచయం చేశాడు.
అవధానుల్ని కుతూహలంగా చూస్తూ చేతులు జోడించాడు ఆ కుర్రాడు. పచ్చగా బొద్దుగా ఉన్నాడు. ముఖ కవళికలు స్పష్టంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒత్తుగాఉన్న కనుబొమలక్రింద ఉన్న ఆకర్షణీయమైన ఆ కళ్ళలో ఎన్నో ఆశలూ, భావాలూ తొణికిస లాడుతున్నాయి. దృఢంగా కొంచెం పెద్దదిగా ఉన్న పై పెదవిమీద స్పష్టంగా కనిపిస్తున్న నల్లనిచార, అతని శరీరాన్ని ఆక్రమించబోతున్న యవ్వనాన్ని ఎత్తి చూపిస్తుంది. ఆ అందమైన ముఖాన్ని విడవలేక బాధపడుతున్నదా అన్నట్లు ఇంకా పసితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది.
