మాట జారాడు. తన పొరపాటును గ్రహించాడు సాంబయ్య. కనకయ్యకు తను అలుసు ఇచ్చినట్టయిపోయిందని మధనపడి, అయినా కనకయ్యతో తనకు అవసరాలు తప్పవుకదా అని సర్దిచెప్పుకొన్నాడు.
ఇనుము మెత్తబడింది. కనకయ్య సమ్మెట ఎత్తాడు.
"చూడు సాంబయ్యా! ఆ వాగువొడ్డు తుమ్మలబీడు పక్కది ఎవరిది?" అడిగాడు కనకయ్య.
"ఏదీ? ఆ తుమ్మలబీడు పక్కదా? నాకు తెలిసింతర్వాత అందులో నాగలికర్ర మోపినట్లు నేను చూడలేదు. తుప్పపొదలు తప్ప అందులో ఏముందయ్యా? ఏంటి కనకయ్యోయ్! ఇయ్యాళ నీ చూపంతా ఎందుకూ కొరగాని భూములమీదకు పోతోంది? ఎవడ్ని ముంచాలనయ్యా?"
"ముంచుతానో తేల్చుతానో చూస్తూ వుండు. అది బంగారం కాబోతుంది బంగారం!" ఈసారి కనకయ్యకు నిజంగానే కోపం వచ్చింది.
"నీలాటి పిసినారికి అంత అదృష్టం ఎట్లా వస్తుందయ్యా? అదృష్టజాతకుడు ఎవడో కొంటాడు ఆ పొలం అంతా! రెండేళ్ళు తిరిగేసరికి -చూడు......నువ్వు కొన్న కాంతమ్మ పొలం, దానికి బలాదూరు కాకపోతే.....నీ చెప్పు నా మెళ్ళో తగిలించు......"
సాంబయ్య బిత్తరపోయాడు.
"ఏందీ? నీకేమయినా పిచ్చా? నక్కుతూ నాగలోకానికీ సంబంధం ఏమిటి? పనికిరాని నాపచేనును నా మాగాణీతో పోటీ పెడ్తారా?"
"ఆ! నవ్వినా నాపచేనే మాగాణీ అనబోతుందయ్యా పిచ్చివాడా!" అని కనకయ్య నాలుక్కరుచుకొన్నాడు.
సాంబయ్య అయోమయంలో పడిపోయాడు. ఎంత ఆలోచించినా బుర్రకు తట్టటం లేదు.
ఇందులో ఏదో కిటుకు వుంది. కనకయ్య సామాన్యుడు కాడు.
"తస్సాదియ్యా! ఇదంతా మాగాణీ అవటమే? భగీరథుడెవరన్నా గంగ నెత్తుకొని దిగివస్తున్నాడా?" బుర్ర బద్దలుకొట్టుకొని ఆలోచించగా సాంబయ్య మాట్లాడగలిగింది అది.
"ఆ! సాక్షాత్తూ ఆ గంగమ్మతల్లే వస్తున్నాదయ్యా! కాలవ పడబోతుందయ్యా, కాలవ!"
సాంబయ్య ఠక్కున ఆగి నిలబడ్డాడు.
"నిజంగా కాలువ వస్తోందా? నీకెవరు చెప్పారు? ఎట్టా తెలిసిందీ?"
"మా బావమరిది తమ్ముడు రెవిన్యూలో పనిచేస్తున్నాడు కదయ్యా! వాడు చూసేది ఆ కాలవకు సంబంధించిన సెక్షనేనట." గర్వంగా చెప్పాడు కనకయ్య.
ఎప్పుడు తెలిసిందేమిటి సంగతి?"
"ఎప్పుడో ఎక్కడయ్యా? రాత్రే మావాడు వచ్చాడు. తెల్లారిలేచి ఇట్లా పొలాలమీద పడ్డాను. వాడు కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చాడు. అటునుంచి కాలవ పోతుందట." అని కనకయ్య సాంబయ్యను ఎగాదిగా పరిశీలనగా చూశాడు. సాంబయ్య తన తోవలో పడుతున్నట్టు తోచాక మళ్ళీ అందుకొన్నాడు కనకయ్య:
"ఈ సంగతి ఇంకా మనవాళ్ళెవారికీ తెలియదు. ఆ బలరామయ్య చెవున వేస్తే ధరలు పెరక్కముందే ఓ ఏభయ్ ఎకరాలన్నా కొనుక్కుంటాడు."
"కనకయ్యా! నువ్వేదో తెలివికలవాడివనుకున్నాను" అన్నాడు సాంబయ్య మొలపంచ బిగించుకుంటూ.
"ఏం?"
"నీ కసలు బుద్ది లేదయ్యా?" తలగుడ్డ బిగించుకుంటూ మందలించినట్లు సాంబయ్య అన్నాడు.
"ఆ మాట నిజమే సాంబయ్యా! లేకపోతే నిన్ను పట్టుకు వేలాడతానా?"
"నాకు నువ్వూ నీకు నేనూకాక ఏమయిపోతాం కనకయ్యా? ఆడపిల్లలు గలవాడివి. అదనుచూసి నాలుగు డబ్బులు వెనకేసుకో." తన మాటలు తనకే కొత్తగా తోచాయి సాంబయ్యకు.
కనకయ్యకు తను చెప్పాల్సిన అవసరంలేదు. అయినా ఈసారి కనకయ్య తప్పటడుగు వేసినట్లు అనిపించింది. సాంబయ్యలో వేళ్ళు తన్నిన స్వార్ధం, భూమిమీద ఉన్న కాపీనం చిగురించి మొగ్గలు తొడిగాయి.
"నీ దగ్గరేముందయ్యా ఇంకా? ఉన్న రొక్కం అంతా కాంతమ్మ పొలం కొంటానికే సరిపోయిందన్నావుగా?" కనకయ్య సాంబయ్యను పూర్తిగా తన తోవలోకి లాక్కొచ్చాడు.
"ఆ మాట నిజమే కనకయ్యా! కాని నువ్వు తల్చుకుంటే అడ్డేముంది?" నువ్వే శరణ్యం అన్నట్లు మాట్లాడాడు సాంబయ్య.
"ఈ కాలువ సంగతి అందరికీ తెలిసేముందే ఇక్కడ భూమి కొన్నవాడిదే అదృష్టం అంతా బంగారమే!" అన్నాడు కనకయ్య.
"నేను చెప్పేదీ అదే కదా? ఈ సంగతి మనమధ్యనే ఉంచు మరి! మనకు పోటీ లేకుండా చూడు. పంట చేతికొచ్చేదాకా ఈ రహస్యం దాచగలిగావంటే నీ ఋణం వుంచుకోను కనకయ్యా! ఎట్టా లేదన్నా ఈ సంవత్సరం ఇరవైపుట్ల ధాన్యం ఇంటికొస్తది. ఏభయ్ కంటే ఇప్పుడు మెట్టపొలానికి పెట్టేవాడులేడు. తుమ్మలబీటీ పక్కధయితే ఇంకో పది తగ్గొచ్చు. ఏమంటావు కనకయ్యా?"
కనకయ్య ఆలోచనలో పడినట్లు నటించసాగాడు. కొంచెంసేపు మౌనం వహించి, తర్వాత తల పంకించి అన్నాడు:
"ఇది సర్కారుతో పని. మనం దాచాలంటే మాత్రం దాగుతుందా సాంబయ్యా?" నొసలెగరేశాడు కనకయ్య.
"సర్కారులో వుంది నీ బావమర్ది తమ్ముడేనంటివిగా? ఆ మాత్రం చెయ్యడా ఏం నువ్వు చెబితే?" ముఖం చిట్లించాడు సాంబయ్య.
"ఆహా! మన మాట వినడనికాదనుకో. వాడూ నాలుగు డబ్బులు తెచ్చుకునేవాడేగదా అని ఆలోచిస్తున్నాను."
కనకయ్య చెప్పినదాంట్లో బేసబబు ఏమీ కనిపించలేదు సాంబయ్యకు. అయితే కనకయ్య అప్పుడే డబ్బులుకక్కించే ప్రయత్నంలో వున్నట్టనిపించింది. ఆమాత్రం లాభంలేంది వాళ్ళుమాత్రం ఎందుకు తనకు సహాయం చేస్తారు?
"అదంతా మనలో మనం చూసుకుందాంలే! సరే! మళ్ళీ సాయంకాలం కన్పిస్తావుగా? జాగ్రత్త, ఈ సంగతి ఊళ్ళో ఎవరికీ పొక్కకూడదు!"
"పెందలాడే వస్తావుగా!" అన్నాడు కనకయ్య.
"పొద్దుకూకే లోపలే వస్తా!" అని సాంబయ్య పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, చేతిలో కర్ర ఊపుకుంటూ తాటితోపుకేసి నడిచాడు. కనకయ్య వదులుగా వున్న జుట్టు గట్టిగా కట్టుకుని ఊళ్ళోకి తిరిగి వచ్చాడు.
తాటితోపులోని ఆకూ, మట్టలమీద సాంబయ్య దృష్టి నిలవటంలేదు. ఏసోబుకు అజమాయిషీ అప్పగించి, కనకయ్య చెప్పిన పొలాలన్నీ తిరిగి చూసొచ్చాడు. కాలవ పడితే మాగాణి భూమంతా తిరిగి చూసుకొన్నాడు. అందులో బీదా బిక్కీ, డబ్బు అవసరాలతో కుంగిపోయే కుటుంబాలవాళ్ళ పొలాలన్నీ తిరిగి తిరిగి ఎంచుకొన్నాడు. సాయంకాలం అయేసరికి తాటితోపులోకి వచ్చి ఆకులూ, మట్టలూ పేర్పించి, ఓ మోపెడు మట్టలూ, గులకలూ, విడివిడిగా మోపులు కట్టించి ఏసోబు నెత్తినపెట్టి సాంబయ్య బయలుదేరాడు.
ఏసోబు వెంటరాగా సాంబయ్య నేరుగా కనకయ్య ఇంటికొచ్చాడు. అప్పుడే బయటకు వెళ్ళబోతున్న కనకయ్య సాంబయ్యను చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఏసోబు నెత్తిన వున్న తాటి మట్టల మోపు తానే స్వయంగా దించి, కనకయ్య దొడ్లో వేశాడు సాంబయ్య. "సాంబయ్య మంచి వూపులో వున్నాడు. ఈ రోజుకు తాటిమట్టలతోనే సరిపెడతాడా ఏం ఖర్మ!" అనే ఆలోచన వచ్చింది కనకయ్యకు.
ఇంటిముందు మంచంవాల్చి సగౌరవంగా సాంబయ్యను కూర్చోబెట్టాడు కనకయ్య.
"మీ ఇంటికే బయలుదేరా! సమయానికి నువ్వె వచ్చావ్?" అన్నాడు కనకయ్య.
పెద్దపిల్లను కేకవేసి మంచినీళ్ళు తెప్పించాడు. ఆ పిల్ల ఖాళీచెంబు తీసుకెళుతుంటే-
"ఇదే మా పెద్దమ్మాయి. లగ్నాలు పెట్టుకొన్నాం. అయిన సంబంధమే. అయినా పెళ్ళి ఖర్చులు వుండనే వున్నాయిగా!" ఉండలోనుంచి దారాన్ని బయటకు లాగాడు కనకయ్య.
"పెళ్ళెప్పుడు?" సాంబయ్య అడిగాడు.
"ఎంతో గడువు లేదు" వేళ్ళు లెక్కవేసి "ఇంకా ఇరవై రోజులుంది. నాకు చేతనయింది నేను సంతన చేసుకున్నాను. మీ వంతు అయిదు వందలు!" అన్నాడు కనకయ్య.
