సాంబయ్య గొంతులో ఉంగిడి పడ్డట్టు అయింది. ఐదు వందలు! ఇప్పుడు తన దగ్గిర ఐదుకాసులన్నా లేవు!
"ఏమిటి కనకయ్యా, అంత దగ్గిర్లో లగ్గాలు పెట్టుకున్నారు? ఎటూ కాని సమయమే? డబ్బుకు కటకటలాడిపోతున్నారు జనం. ఓ మూన్నెల్లు ఆగలేవా?" నడిగాడు సాంబయ్య.
"అవతలవాళ్ళు తొందరపెడుతుంటే తప్పనిసరి అయి తల వూపాను." కనకయ్య ఓ పట్టు పట్టేట్టే అనిపించింది సాంబయ్యకు.
తనను పెద్ద చిక్కులోనే పడేశాడు. తను కాదంటే ఈ రాత్రికే బలరామయ్య దగ్గిరకు పరుగెత్తేలా వున్నాడు! అయినకాడికి ఆ బలరామయ్య - అదునైన పొలం అంతా కొనేస్తాడు. ఏం చేయడం?
"యీ ఏడే గదా కాంతమ్మ పొలం కొన్నాను? మళ్ళీ పంటవచ్చే దాకా నా చేతిలో దమ్మిడీ తిరగదే? నన్నిట్టా అడకత్తెరలో పడేస్తే ఎట్టా చెప్పు?" ప్రాధేయపడుతూ అన్నాడు సాంబయ్య.
కనకయ్య సాంబయ్య పరిస్థితికి సానుభూతి చూపించాడు.
"నాకు తెలియందేముంది సాంబయ్యా, నీ పరిస్థితి? దానికేదన్నా ఉపాయం అలోచించాలి మరి!"
"నన్ను కోసినా కానీ దొరకదు. ఆ ఉపాయమేదో నువ్వే చూడు మరి."
కనకయ్య ఆలోచించినట్టు నటించాడు. అంతకుముందే ఆలోచించి పెట్టుకున్న విషయాన్ని బయటపెట్టాడు:
"మన ధాన్యం కొనే శేషావతారం లేడూ?"
"ఉంటే? ధాన్యం మిల్లుచేరందే పైకం ఎట్లా ఇస్తాడూ?"
"అట్టా ఇచ్చేకాడికి యీ కనకయ్య ఎందుకు? అంతా నాకు వాదులు సాంబయ్యా, రేపీపాటికి రూపాయలు నీ చేతిలో రాల్తాయ్!"
సాంబయ్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు, కనకయ్య భరోసా చూసి వెంటనే అనుమానాలు నీడలు సాంబయ్య బుర్రలో అల్లుకుపోయాయి.
"అలువులు సులువులకు ధాన్యం కట్టుకోడు కదా?" సాంబయ్య నసిగాడు.
"నేనేం అంత వెర్రివెంగళాయి ననుకున్నావా? దానికీ ఓ పద్దతి ఉంటుంది. ఆ వ్యవహారాలన్నీ నీకు తెలియవులే. అంతా నే చూసుకుంటాను. తెల్లవారుఝామునే బయలుదేరుదాం. సరేనా?" కనకయ్య లేచి నిలబడ్డాడు. వ్యవహారం అంతా పరిష్కరించినట్టు నిట్టూర్పు విడిచాడు.
సాంబయ్య గోవులా తల ఆడించి లేచాడు. పైపంచ దులిపి భుజాన వేసుకొని ఇంటి ముఖం పట్టాడు. ఆ రాత్రంతా ఏదో ఆలోచించాలని ప్రయత్నించాడు కాని బుర్రకేమీ తట్టలేదు.
తెల్లవారుఝామునే కనకయ్యవచ్చి సాంబయ్యను లేపుకొని బస్తీకి తీసుకెళ్ళాడు.
సాంబయ్య బొటనవేలుకు సిరారాసి కాగితంమీద అద్దించాడు కనకయ్య. ముద్దరపడిన చోట ఊది శేషావతరం చేతికిచ్చాడు. శేషావతారం వెయ్యి రూపాయలు తెచ్చి కనకయ్య చేతిలో పెట్టాడు. ఐదువందల రూపాయలు తను జేబులో వేసుకొని, మిగతా ఐదువందల్ని "ఇంద, లెక్క చూసుకో!" అంటూ సాంబయ్య చేతిలో పెట్టాడు కనకయ్య.
సాంబయ్యకు ఇదంతా ఓ పట్టాన అంతుపట్టలేదు.
"ఈ ఐదువందలూ ఇప్పుడు నేనేం చేసుకోను?" అన్నాడు అమాయకంగా సాంబయ్య.
బస్తీకి వెళ్ళగానే సాంబయ్యకు వున్న మతి సగం పోయింది. శేషావతారం, కనకయ్య మాటలు వింటుంటే ఆమిగాతా సగంకూడా పోయినట్టయింది.
"అయితే నా దగ్గిర వుంచమంటావా?" చెయ్యిజాపుతూ అన్నాడు కనకయ్య.
"ఆహా, అది కాదు. ఈ డబ్బు ఏ లెక్కన ఇచ్చినట్టు? కొంచెం ఇడమర్చి చెప్పమని నే ననేది."
"నీ తెలివి బంగారంగానూ! ఇందులో ఏముందయ్యా! రైతులందరికీ ఇచ్చే పద్ధతిలోనే నీకూ ఇచ్చా, కొత్తేముంది?" అన్నాడు శేషావతారం.
"నే చెబుతా విను సాంబయ్యా! నీకు పండిన ధాన్యం అంతా శేషావతారం మిల్లుకు తోలాలి. ఆ రోజున్న రేటు ప్రకారమే మన ధాన్యానికి ధర కడతారు. మనకు ముందు డబ్బు ఇచ్చినందుకుగాను బస్తాకు అర్ధరూపాయి ఇరగ్గోసుకుంటాడు. అంతే!" కనకయ్య పక్కనున్న రాసిలో గుప్పెడు వేరుశనక్కాయలు తీసుకొని వొలిచి నోట్లో వేసుకుంటూ అంత సులువుగానూ చెప్పాడు.
"బస్తాకు అర్ధరూపాయి తగ్గుతుందా? అంటే మూడొందలు బస్తాలు తోలితే నాకు నూటఏభయ్ రూపాయలు తగ్గుతాయా? పుట్టి ధాన్యం ఉట్టినే తీసుకొంటాడా శేషావతారం? ఇదేందయ్యా ఇంతన్యాయం కనకయ్యా?"
"అదంతేలే సాంబయ్యా, లే పోదాం!" అంటూ లేచాడు కనకయ్య. మరో నాలుగు గుప్పెళ్ళు శనక్కాయలు తీసి పైపంచ కొసన కట్టాడు.
మిల్లుగేటు దాటిపోతున్న కనకయ్యను శేషావతారం కేకవేశాడు. ఒక్క పరుగులో కనకయ్య శేషావతారం దగ్గిరకొచ్చి "మళ్ళీ నీ గొడవేమిటి శేషావతారం?" అన్నాడు గొంతు తగ్గించి సాంబయ్య వినకుండా.
"వెయ్యి రూపాయలకూ ఈ నాలుగు నెలలవడ్డీ గురించి చెప్పలేదమయ్యా సాంబయ్యకూ?"
"మనిషి అసలే కంగారులో వున్నాడు. అది చెబితే బెదిరిపోతాడు. నువ్వుండవయ్యా! తర్వాత చూసుకుందాం" అన్నాడు కనకయ్య.
"అది కాదు కనకయ్యా! ఆయన ముందే చెప్పలేదని తర్వాత పేచీ పెడితేనో?"
"ఆ వడ్డీ గిడ్డీ అంతా నోటులో రాసేవుంది కదయ్యా! ఆయన ఇవ్వనంటే మాత్రం చెల్లుతుందా? నువ్వేమీ మాట్లాడక ఊరికే వుండు."
"అది సరేననుకో. ఎందుకైనా మంచిది. ఓ మాట చెబితే బాగుంటాది కదా అని?" శేషావతారం గునిశాడు.
"ఆ సంగతి ఇంటికి పోయాక సమయం చూసుకొని నేను చెబుతాగా! నువ్వేం కంగారు పడొద్దు" అంటూన్న కనకయ్య సాంబయ్య ముందుకు రావడం చూసి గాబరా పడ్డాడు.
ఇంటికి రావడంతోనే సాంబయ్య బొడ్లో దోపిన నోట్ల పొత్తిని తీసి భద్రం చేశాడు. చొక్కా విడిచి దన్నానవేస్తూ "రావమ్మా! బుడ్డోడు ఎక్కడ?" అని అడిగాడు.
"మద్దేన్నటేల నుంచీ కాక తగిలింది. ముద్దకూడా తినలే, పడుండాడు!" అంది ముసలమ్మ.
సాంబయ్యకు అంతా అశుభంగా తోచింది. అసలు ఇలా డబ్బు తేవటమే ఏదో పెద్ద అరిష్టంగా వుంది! దానికితోడు యింటికొచ్చేటప్పటికి పిల్లాడు పడక వేశాడు.
సాంబయ్య ఇన్ని వేన్నీళ్ళు మీద పోసుకొని అన్నం పళ్ళెం ముందు కూర్చున్నాడు. ఆకలి దహించుకుపోతోంది. కాని అన్నంమీద మనసు నిలవటంలేదు. అన్నం అయితే మామూలుగా తినేంత తిన్నాడు. కానీ అందులో రుచిగానీ, ఆనందంగానీ, తృప్తిగానీ పొందలేదు. ఎద్దులకు ఎండుగడ్డీ, జనపకట్టే, రెండూ కలిపి వేసి వచ్చి బరువుగా మంచంమీద వాలాడు. పక్క దుప్పటి చుట్టచుట్టి తలకింద పెట్టుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. పడుకొన్న అయిదు నిమిషాల్లోనే గుర్రుపెట్టి నిద్రపోయే సాంబయ్యకు ఆ రాత్రి వెంటనే నిద్ర రాలేదు. కనకయ్యా, శేషావతారం, బస్తాకు అర్ధరూపాయి కోత.....మనసులో మెదిలాయి. అంతా చీకటి చీకటిగావున్న మనసులో వెలుగురేఖ ఒకటి కదులాడింది. కొత్త కాలవలో నీళ్ళు జలజలా ప్రవహిస్తున్నాయి. ఎనభై ఎకరాల మెట్ట మాగాణి అయింది. పుట్లకొద్దీ ధాన్యం బస్తాలకు ఎత్తుతున్నాడు. నాలుగామళ్ళ దూరంలోవున్న ఊళ్ళల్లో సహితం తనగురించి చెప్పుకొంటున్నారు. ఊళ్ళో బలరామయ్య కంటే తనే ఆస్తిపరుడు. తన కొడుకు వెంకటపతి లక్షాధికారి. అదృష్టజాతకుడు. ఇప్పుడేకనక దుర్గి వుండివుంటే ఎంత మురిసిపోయేదో! సాంబయ్య ఆలోచనలు దుర్గమ్మమీదకు మళ్ళాయి.
ఆచారి గరళం పోసేముందు దుర్గమ్మ తనకేసి చూసిన చూపులు ఇంకా గుర్తేవున్నాయి.
"దుర్గమ్మా! నీకేం తక్కువ చేశానే? ఆనాడు డబ్బులు వృధాచేస్తే నీ కొడుక్కు ఇంత అదృష్టం ఎలా పట్టేది?" దుర్గమ్మను గురించిన ఆలోచనలన్నీ బలవంతాన వెనక్కు తోశాడు సాంబయ్య.
పొద్దున్న లేస్తూనే సాంబయ్య కనకయ్య ఇంటిమీదకెళ్ళి పడ్డాడు.
వేపపుల్ల నోట్లోనుంచి బయటకుతీసి, చేదుగా ఊసి ఏంటి సాంబయ్యా? ఇంత పొద్దున్నే ఊడిపడ్డావ్?" అన్నాడు కనకయ్య.
