"చస్తది చస్తది అన్నావ్? ఆ ముండ చావలేదు. ఈ ముండాకొడుకేమో బిళ్ళకుడుముల్లాంటి రూపాయలు జేబులో వేసుకొని వెళ్ళాడు. ఆ ముండ ఎప్పుడు చస్తదో? మళ్ళీ ఈ గాడ్దికొడుకు మనకెక్కడ దొరుకుతాడో? ఈ తొలేకాశినాటికి భూమి స్వాధీనం కాకపోతే అంతా నష్టమే. వచ్చే పంటమీద ఆశపడే ఇంత ధర పెట్టా మరి!"
కనకయ్య కుక్కిన పేనులా మాట్లాడకుండా సాంబయ్య వెనకే నడిచి ఊరు చేరాడు.
రోజూ సాంబయ్య పొలం వెళ్ళేముందూ, పొలంనుంచి వచ్చేప్పుడూ, అటు కనకయ్య ఇంటిమీదుగా వెళ్తూ కాంతమ్మ ఇంట్లోకి తొంగిచూసి, ఆమె ఆరోగ్యాన్ని గురించి వాకబుచేసి పోతూవుండేవాడు. సాంబయ్య మనాది పడి పోయాడు. కూలీలమీదా, ఇంట్లో ముసలమ్మమీద విరుచుకుపడుతూండేవాడు.
నెలరోజులు తిరక్కముందే ఓ రోజు కనకయ్య గాలివాటుగా వచ్చి సాంబయ్య ఇంట్లో పడ్డాడు.
"ఈసారి ఖాయం! దేవుడు దిగొచ్చినా ఆ కాంతమ్మ యీసారి బతకదు. అసలిప్పటికి అంతా అయిపోయి వుండాలి." వగరుస్తూ చెప్పాడు కనకయ్య.
సాంబయ్యకు చర్రున కోపం వచ్చింది. మళ్ళీ డబ్బు అవసరమై గుంజుకుపోవటానికి కనకయ్య ఎత్తు వేస్తున్నాడనుకున్నాడు.
"ఆ కాంతమ్మ నిన్నూ నన్నూ వల్లకాటికి సాగనంపిగాని తను పోదు!"
సాంబయ్య మాటలకు కనకయ్య గుండెలు చిక్కపట్టినై. తన చావనేసరికి కనకయ్య నిజంగా చావంటే ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నాడు.
చీకటి పడుతుండగా కాంతమ్మ శవం సాంబయ్య ఇంటిముందునుంచి వెళ్ళింది. మోసేవాళ్ళ కుదుపులకు శవం తల ఊగుతూ నోరు తెరుచుకొని, నిలబడ్డ సాంబయ్య కనకయ్యలకేసి చూసింది.
"సాంబయ్యా! అదృష్టవంతుడివి" అన్నట్టు కనకయ్య సాంబయ్యకేసి చూశాడు.
కాంతమ్మ చచ్చిన పదిరోజులకే పాపారావును పట్టుకొని పొలం రిజిష్టరు చేయించుకున్నాడు. పొలం స్వాధీనమయిన రాత్రి రెండు ఝాములదాకా ఐదెకరాల పొలంగట్టు తెగగొట్టి తన పొలంతో కలుపుకున్నాడు సాంబయ్య. గనెంమీద నిలబడి మొత్తం పొలాన్ని చూసుకొన్నాడు. తొమ్మిది ఎకరాల పొలం! సుక్షేత్రమయిన మాగాణి. అది తనది! బంగారం పండిస్తాడు. తన కొడుకు వెంకటపతి అదృష్టజాతకుడు. తొమ్మిదెకరాల మాగాణి! మూడెకరాల మెట్ట! వాడు పెరిగి పెద్దవాడయి ప్రయోజకుడయేసరికి తన ఆస్తిని ఇంతకు నాలుగింతలు చెయ్యగలడు.
దప్పికగొన్న వాడికి నీళ్ళిస్తే దాహం తీరుతుంది. కాని సాంబయ్యకు పట్టుకొంది భూమిదాహం. అది తాగినకొద్దీ పెరగసాగింది. ఆ రాత్రి కొడుకుని పక్కలో వేసుకొని పడుకున్నాడు సాంబయ్య.
పొలం దమ్ముచేసి నాట్లు వేయించాడు సాంబయ్య. మెట్టచేలో వేరుసెనగ విత్తులు చల్లాడు. ఈ సంవత్సరం దేవుడనుగ్రహిస్తే తొమ్మిదెకరాల మాగాణీ, మూడెకరాల మెట్టా బాగా పండితే, మళ్ళీ డబ్బు నిలవచేసుకోవచ్చు. ఉన్న నిలవంతా పొలం కొనటానికే అయిపోయింది. ఎన్నో రోజుల తర్వాత భోషాణంలో వున్న కొయ్యపెట్టె ఖాళీ అయింది. మళ్ళీ దాన్ని నింపేదాకా తనకు నిద్రపట్టదు.
అన్నం తిని మీసాలు తుడుచుకుంటున్న సాంబయ్యకు కనకయ్య రావటం కనిపించింది. పొలం కొన్నదగ్గర్నుంచి అంత అభిమానం చూపించటంలేదు కనకయ్యమీద సాంబయ్య. ప్రస్తుతం తన దగ్గర నిలువ రొక్కం లేదు. ఇప్పట్లో బేరసారాలు తను చేసేది ఏమీ లేదు. మాసూలు అయింతర్వాత నాలుగురోజులు ధాన్యం మిల్లుకు తోలేప్పుడు తప్ప కనకయ్యతో పనిలేదు. కనకయ్యను పూసుకుతిరిగినా, మాట్లాడినా నష్టంతప్ప లాభంలేదు. పొగాకుకాడ దగ్గిరనుంచీ తిండిగింజలదాకా అప్పూ సొప్పూ అంటూ గుంజుకుపోతాడు. ఇహ డబ్బు సంగతి సరేసరి! రూపాయలు కరిగించుకు తాగుతాడేమో మరి! వీడి కడుపుడక! ఎప్పుడూ ఆలోపాలోమంటూ ఉంటాడు.
లోపలకు దూసుకువస్తున్న కనకయ్యను చూసి తుండుగుడ్డ భుజాన వేసుకొని గబగబా బయటకు వచ్చాడు సాంబయ్య.
"అదేంటి సాంబయ్యా! నేను నీకోసం ఇంట్లోకి వస్తావుంటే నువ్వేమో వీధిలోకి పోతావు?"
"గరువున తాటిమట్టలు కొట్టిస్తున్నా క్షణం లేకపోతే తలో మట్టా లాక్కుపోతారు కనకయ్యా! నీకు తెలియందేముంది?" అంటూ సాంబయ్య కనకయ్యకేసి చూడకుండానే వీధిలోకి వచ్చి ముందుకు నడక సాగించాడు. వీధిమలుపు తిరిగాక వెనక్కు తిరిగి చూశాడు.
కనకయ్యను తప్పించుకున్నాననుకొన్న సాంబయ్య నిరాశచెందాడు. పిల్లిలా కనకయ్య సాంబయ్యను అనుసరిస్తున్నాడు.
కనకయ్యను గరువుదాకా రానిస్తే పది తాటిమట్టలూ, గులకలూ మోపు కట్టక మానడు. వట్టిచేతులతో తిరిగిపోవటం కనకయ్య వంశంలోనే లేదు. ఎలాగయినా కనకయ్యను అక్కడే వదిలించుకోవటం మంచిదని తోచిన సాంబయ్య చటుక్కున ఆగి నిలబడి అన్నాడు:
"అరెరే, కనకయ్యా! నువ్వటోయ్ వెనక నడిచేది? నువ్వప్పుడే వెళ్ళిపోయావనుకుంటున్నాను, చెప్పొద్దూ? ఏం సంగతి?"
"గరువు పొలానికేగా? ఏంలేదు. నేనూ ఆటే వస్తున్నా పద!" కనకయ్య మామూలుగా అన్నట్టు అన్నాడు.
సాంబయ్య అనుమానం ధృఢపడింది. వీడు తాటిజిబులూ, మట్టలూ మోపుకట్టందే వదలడు ఇవ్వాళ!
"ఈ ఏడు తాటాకుతోపాటు గులకా, మట్టాకూడా బేరం ఇచ్చేసాను" అన్నాడు సాంబయ్య.
"నీ గులకా మట్టా ఎవడిక్కావాలయ్యా?" విదిలించినట్టు అని కనకయ్య సాంబయ్య ముఖంలోకి చూశాడు.
నొసలు ఎగరేసి, కాలు జాడించి నడుస్తూ మళ్ళీ అన్నాడు కనకయ్య.
"గంగానమ్మ దిబ్బ దిగువున పన్నెండెకరాల మెట్టచేనువుంది చూడూ?"
"ఏదీ? ఆ డొంకమలుపులో వున్నదేగా?"
"ఆఁ! అదే - పరమయ్య మనవడిది!"
"వట్టి నాసిచేను. రాయిరప్పా! అదెవడు కొంటాడయ్యా తలకుమాసినోడు!" అన్నాడు సాంబయ్య. ఎటుదిరిగీ సాంబయ్య దగ్గర డబ్బులేదు.
కొనే ఎత్తుగానీ, ఉద్దేశ్యంగానీ అతనికి లేదు. అందుకనే ఆ మాట అన్నాడు. అయినా సాంబయ్య అన్నదాంట్లో కొంత నిజం లేకపోలేదు.
కనకయ్య సాంబయ్య ముఖంలోకి వ్యంగ్యంగా చూసి గూళ్ళెగరేస్తూ అన్నాడు:
"ఇదుగో సాంబయ్యా! ఎద్దుముడ్డి పొడుచుకొనేవాడికి నీకేం తెలుసు, వ్యవహార లక్షణం?"
కనకయ్య మాటల్లో, ప్రవర్తనలో ఏదో పెద్ద రహస్యం ఇమిడి వుందని సాంబయ్య పసికట్టాడు. అలా సాంబయ్యకు అనుమానాలూ, ఆశలూ కల్పించటంలో కనకయ్య కృతకృత్యుడయాడు.
"నువ్వు నీ కమీషన్ కొట్టటానికి సవాలక్ష మాటలు చెబుతావ్! ఎవడు నమ్ముతాడయ్యా నీ మాటలు?" సాంబయ్య మాటల్లో కరకుతనమున్నా అనే ధోరణి అతి సౌమ్యంగానే వుంది. అలా వుంటేగాని కనకయ్య దారికి రాడని తెలుసు.
"నా మాటలు నమ్మి నువ్వు చెడిందేమిటో చెప్పయ్యా సాంబయ్యా? నాది ముష్టి కమీషను! సంవత్సరమంతా సంపాదించినా ఒక్క పిల్లముండ పెళ్ళికూడా చేయలేకపోతున్నా! ఆ కాంతమ్మ మనవర్తి పొలం బలరామయ్య కిప్పిస్తే ఐదొందలకు తక్కువ కాకుండా ముట్టేది. పిల్లదని పెళ్ళి ఎల్లమారిపోయేది!"
"ఏంది కనకయ్యా? అక్కడికి నువ్వేదో నాకు ఊరికినే చేసినట్టు మాట్లాడుతున్నావ్? అటూ ఇటూ కూడా గుంజావుగదయ్యా?"
"ఏందయ్యా గుంజిందీ? అణా, పరకా పాతబాకీలు దగ్గిరనుంచి లెక్కలు కట్టి ఇరగ్గోసి కదయ్యా ఇచ్చావూ?" కోపాన్ని నటిస్తూ, "ఇహ ఛస్తే లాభసాటి పొలాల బేరం నీ దగ్గిరకు తీసుకురాను" అన్నట్లు మాట్లాడటం మొదలుపెట్టాడు కనకయ్య.
"ఇదిగో కనకయ్యా! కొత్తదయినా పాతదయినా బాకీ బాకీయేగదా? ఇహనెప్పుడూ నా దగ్గరకు ఏ అవసరానికీ రానివాడిలా మాట్లాడతావేం?" బాగా తగ్గి అన్నాడు సాంబయ్య.
