"అనుకుంటే...." అయోమయంగా అడిగాడు అభినయ్.
"ఏం చేస్తాను.....రిజర్వేషన్ దొరకని శాల్తీ ఎవరో ఒకడుంటాడుగా.... వాడ్ని తీసుకెళ్తా...."
"హవ్వవ్వవ్వవ్వ..." ఘోరమైన శబ్దం చేశాడు అభినయ్.
"ఆ మాత్రం రియాక్షన్ చాలు. వెంటనే పి.ఎ.కి ఫోన్ చేసి టికెట్స్ తెప్పించు...." అంది ఫైనల్ స్టేట్ మెంట్ కన్ ఫర్మ్ అన్నట్టు!
"మిష్టర్ శర్మా.... రేపు ఈవినింగ్ గోదావారికీ థర్డ్ ఏ.సి.లొ రెండు టికెట్లు కన్ ఫర్మ్ చేయండి. వెరీ అర్జెంట్. యస్.... నేనూ, మేడమ్ వెళ్తున్నాం. అన్నట్టు మిస్ కాదంబరి వున్నారా?" అడిగాడు సెక్షన్ ఇన్ ఛార్జ్ శర్మతో ఫోన్ చేసి.
"లేరు సార్.... యిందాకే వెళ్ళిపోయారు".
"యిట్సాల్ రైట్... ఆమెను రేపు ఎర్లీగా ఆఫీస్ కు రమ్మని మెసేజ్ పంపించండి".
"ఓ.కె. సార్...".
లైన్ డిస్ కనెక్ట్ చేశాడు అభినయ్.
"థాంక్యూ అభీ!" అంది విరాజ తృప్తిగా.
"అయినా విరూ! ట్రైనే అని ఎందుకు పట్టుబట్టావు. ఫ్లయిట్ లో అయితే టైమ్ సేవ్ అయ్యేది గా.....!"
"ఏం వద్దు హాయిగా నీతో ట్రైన్ లొ కలిసి వెళ్ళాలి. అదే నా కోరిక".
"నీ కోరికలు కొన్ని చిత్రంగా వుంటాయి సుమా!" అన్నాడు ముక్కుపట్టి వూపుతూ.
"కావచ్చు నేను విరజను కదా!" అంది జడముందుకు వేసుకొని ఫోజు పెడ్తూ.
"కెమెరా దగ్గరుంటే ఈ ఫోజ్ లో ఓ స్నాప్ తీసేవాణ్ణి..." అన్నాడు దగ్గరకు లాక్కుంటూ.
"అది సరే గానీ, టిఫిన్ ఏం చెయ్యమంటారో సెలవిస్తే.... పదినిమిషాల్లో చేస్తాను".
"నీకెందుకు శ్రమ.... మల్లి లేదూ!...."
"మల్లి దాని మొగుడుకి టిఫిన్ చెయ్యడానికి వెళ్ళింది గానీ, తమరికేం కావాలి?" అంది.
"వేడి వేడి మసాలా ఆమ్లెట్ తీసుకురా!" అన్నాడు మంచంపై వాలిపోతూ.
"ఓ.కె. ఇప్పుడే తెస్తా..." అంటూ కిచెన్ లోకి నడిచింది విరజ.
అతను డ్రెస్ చేంజ్ చేసుకొని కిచెన్ లోకి నడిచాడు. లోపలి నుండి వాసనలు ఘుమాయిస్తున్నాయి.
సన్నగా ఉల్లిపాయముక్కలు తరుగుతోంది విరజ.
కళ్ళవెంబడి నీళ్ళు...
"విరజా! నీకు బుద్ధుందా?"
"ఏవిటి?" ఆశ్చర్యపోతూ అంది.
"నీ కళ్ళవెంట నీళ్ళు తెప్పించే ఆ ఉల్లిపాయల్ని కొయ్యకపోతేనేం? అవి లేకుండా వెయ్యి ఆమ్లెట్".
"అభీ! ఉల్లిపాయలేనిదే టేస్ట్ ఏం వుంటుంది! నువ్వెళ్ళు నేను ఐదునిమిషాల్లో తెస్తానుగా!".
"నో! యిటివ్వు నేను కోస్తాలే..." అంటూ లాక్కున్నాడు చాకుని, ఉల్లిపాయల్ని.
"అబ్బ! వినవు కదా!" ముద్దుగా విసుక్కుంది విరజ.
"నువ్వేదో పెద్ద నేను చెప్పినమాట వింటున్నట్టు, వొట్టి మొండి దానివి. మల్లికి బుద్ది లేదసలు. ఎందుకు మానేసింది. రానీ చెప్తాను".
"దాన్నేమీ అనకు పాపం! వంట్లో బాగోలేదంటే నేనే పంపించేశాను. అంతకు మించి మనిద్దరమే ఇంట్లో వుంటే బావుంటుందనిపించింది".
అభినయ్ అపురూపంగా చూశాడామెవైపు. కొన్ని ఫీలింగ్స్ చాలా కరెక్ట్ గా చెప్తుంది విరజ. తనవీ అచ్చు అలానే వుంటాయి.
ప్రేమికులకు అభిప్రాయాలు కలవడంకంటే సంతోషం ఇంకేం ఉంటుంది.
అందుకే విరజంటే అంతిష్టం అతనికి.
సిన్సియర్ గా చేస్తుంది ఏ పనైనా. అందులో కల్తీ వుండదు. అందుకేగా తను కట్టుబడి పోయి, బందీ అయిపోయింది అనుకున్నాడు అభినయ్. ఆ క్షణం అతని మనసు మలయమారుతమే అయింది. కొన్ని ఫీలింగ్స్ చాలా అద్భుతంగా వుంటాయి.
మనకోసం తన విరజ కిచెన్ రూమ్ లో వంటలతో కుస్తీ పడుతూ, మొహానికి పట్టిన చెమటను చీరకొంగుతో తుడుచుకుంటూ వంట చేస్తుంటే ఆ దృశ్యం ఎంత బావుంది.
"అభీ! ఆమ్లెట్ రెడీ" అంది ప్లేట్ అందిస్తూ.
"నువ్వూరా! ఇద్దరం కలిసి తిందాం!".
"నువ్వు తిను తింటూ కబుర్లు చెప్పు నేను వంట చేస్తాను".
"నేను కూడా హెల్ప్ చేస్తాను".
"ఏం వద్దు నాకు రాదా ఏంటి? నేను సాంబార్ ఎంత బాగా చేస్తానో తెల్సా? మా ఫ్రెండ్సంతా మెచ్చుకుంటారు".
"అవునా! అయితే అదే చెయ్యి నేను కూరలు కోసి ఇస్తాను".
"వద్దు అభీ!".
"ప్లీజ్! నా తృప్తి కోసం..." అంటూ ఆమ్లెట్ తను సగం తిని, విరజ నోట్లో కొంచెం పెట్టాడు.
* * *
విరజ రైస్ కుక్కర్ దించి, సాంబార్ కు తాలింపు పెడుతోంది.
"అబ్బ.... విరూ.... సాంబారు వాసన నాసికాపుటాలను తాకేస్తోంది" అన్నాడు ఆమె వెనగ్గా చేరి.
అతని చేతిని తననడుం మీద వేసుకుని తన తలను అతని ఛాతీకి ఆన్చి.
"వర్షం పడుతూంటే, వేడివేడి అన్నం, సాంబారు, అందులోకి వడియాల కాంబినేషన్ బావుంటుంది కదూ...."
"అవునవును..... పిజ్జాకార్నర్ లో కూచొని తినే పిజ్జాలకన్నా.... ఈ సాంబార్ అన్నం రుచి చాలా బావుంటుంది." అన్నాడు ఆమె మెడ భాగమ్మీద ముద్దు పెట్టుకుంటూ.
"రేపీ పాటికి ట్రెయిన్ లో వుంటాం... ఎల్లుండి బీచ్ లో... ఆ తర్వాత అరుకు.... బుర్రాకేవ్స్.... విరజ చెప్పుకుంటూ వెళ్తోంది.
అభినయ్ అవేమీ వినకుండా ఆమెను తన వైపుకి తిప్పుకొని ఆమె గుండెల చెవి ఆన్చి ఆమె 'గుండెసవ్వడి' వింటున్నాడు.
"ఏయ్....! ఏం చేస్తున్నావు...?" దబాయిస్తూ అడిగింది.
"నీ గుండె సవ్వడి వింటున్నా! డోంట్ డిస్ట్రబ్" సీరియస్ గా ముఖంపెట్టి అన్నాడు.
"ఏమంటోంది నా గుండె?".
"ముద్దు కావాలంటోంది..." మూతి సున్నాలా చుట్టి అన్నాడు.
"అదేం కాదు.... అభీ.... అభీ.... అంటోంది నా గుండె. నువ్వు సరిగ్గా విని వుండవు. తమరికి చెముడు వున్నట్టుంది కదా!..."
"పిచ్చి విరజా! నీ గుండె నాకోసం ప్రతిక్షణం కొట్టుకుంటూ వుంటుందని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నాకు తెలుసు" మనస్ఫూర్తిగా అన్నాడు.
"థాంక్స్! రా! భోంచేద్దాం!" అంది అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్తూ.
* * *
"కాదంబరీ... ఒసే... కాదా...." బామ్మ గొంతు ఆరునొక్కరాగంలో పలికింది.
చీరకుచ్చెళ్లు సర్దుకుంటున్న కాదంబరి బామ్మ అరుపులు వింటూనే వుంది. చైర్మన్ నైన్ థర్టీకల్లా ఆఫీసుకు రమ్మని చెప్పాడని సెక్షన్ ఇన్ ఛార్జి కబురు చేసాడు. పంక్చువాల్టీని యిష్టపడే చైర్మన్ దృష్టిలో తను లేట్ కమర్ కాకూడదు. పైగా ఎంతో అర్జెంట్ వని అయితేతప్ప ఎర్లీగా రమ్మని చెప్పడు. ఆఫీస్ అవర్స్ దాటి అయిదు నిమిషాలు కూడా ఆఫీసులో వుండొద్దని చెబుతాడు చైర్మన్ అభినయ్.
అందుకే చైర్మన్ అంటే గౌరవం భయం అభిమానమా....
ఆరు గంటలకే అలారం పెట్టుకొని యింటి పనులన్నీ పూర్తిచేసింది.
"కాదా.... ఒసే కాదంబరీ.... పిలిస్తే పలకవేమిటే? అవున్లే.... నీకీ ముసల్ది చేదయింది. ఎంతప్పట్నుంచీ అనుకున్నావు... యింతప్పట్నుంచీ.... నిన్ను పెంచానే..."
కాదంబరికి బామ్మా వాక్ప్రావాహం ఆగదని అర్ధమైంది.
"వస్తున్నా బామ్మా... చీరకుచ్చెళ్ళు సరిగ్గా రావడం లేదు" తన గదిలో నుంచే అరిచింది.
"నేనొచ్చి సర్దేనా?" అడిగింది బామ్మ.
