Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 7


    ఆ రోజు నుంచి ఆ యింట్లో వాళ్ళిద్దరి మధ్య విచిత్ర సహచర్యం మొదలైంది.
    రోజంతా విరజతోపాటు వుండడమే అతని ఉద్యోగం!
    
                                    * * *
    
    అలా మొదలైన వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. ఆమెలోని ప్రేమరాహిత్యాన్ని అతను పారద్రోలాడు. అతనిలోని ఆకలి తాలూకు అభద్రతాభావాన్ని ఆమె తరిమేసింది.
    కొద్దిరోజుల స్నేహం, కొద్దినెలల అభిమానం.... సంవత్సరం తిరిగేలోగా ప్రేమగా మారింది.
    ఈ సంవత్సర కాలంలో చాలామార్పులు. అభినయ్ మొదట్లో పేయింగ్ గెస్ట్ అయ్యాడు.
    విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అభినయ్ ని చైర్మన్ ని చేసింది విరజ.
    స్టాఫ్, మిగతా డైరెక్టర్స్ విస్తుపోయేరు.
    వాళ్ళ మధ్య సాన్నిహిత్యం వాళ్ళకు అర్ధమైంది.
    త్వరలో పెళ్ళి అని కూడా అనౌన్స్ చేసింది.
    పెళ్ళయ్యేక చేపట్టాల్సిన బాధ్యతలన్నీ, పెళ్ళికిముందే చేపట్టాడు అభినయ్. విరజ చైర్మన్ పదవి నుండి తప్పుకొని, రిలీఫ్ ఫీలయ్యింది.
    అసలా రోజు ఆ సంఘటనే వూహించలేదు. నమ్మలేని నిజం నమ్మకమైంది. వాస్తవమైంది. ఊహించని విషయం ఊహాతీతమైంది. ఊహే నిజమైంది.
    
                                     * * *
    
    "విరజా... ఏమిటిది?" ఆశ్చర్యమా, ఆర్ద్రతా కలిగలిసాయి అభినయ్ గొంతులో.
    "ఏది?"
    "నేను చైర్మన్ అవ్వడం...."
    "అది నిజం.... యిందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటి?"
    "నేను.... నేను చైర్మన్ ఏమిటి?"
    "అభీ.... ఈ వ్యాపారం.... డబ్బు గొడవా.... లావాదేవీలు.... యివన్నీ నాకు ఆనందాన్ని యివ్వవు.... చిన్నప్పటినుంచీ ఈ వ్యాపార ప్రపంచంలో పెరిగాను. నిజం చెప్పాలంటే ఈ యింట్లో కూడా వ్యాపారమే కొనసాగేది. ఆఫీసు వాతావరణం.... వ్యాపార ప్రపంచపు పోకడా యింట్లో కూడా కనిపించేది. డాడీ ఎప్పుడు చూసినా వ్యాపారం గొడవలోనే మునిగితేలేవాడు. ఒక్కక్షణం కూడా తీరిక వుండేదికాదు తనకి.
    నా ప్రతీ బర్త్ డే ఎప్పుడు జరిగేదో తెలుసా? దాదాపు అర్దరాత్రి సమయంలో...సాయంత్రం ఆరుగంటల నుంచి ఎదురుచూపులు... నా స్నేహితులు అంతా నేను ఎప్పుడు కేక్ కట్ చేస్తానా? అని ఎదురుచూసేవాళ్ళు.... నేను డాడీకోసం ఎదురుచూసేదాన్ని.
    అమ్మ ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్పేది. నాన్న మరి కాసేపట్లో వస్తారని. నా స్నేహితులంతా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను కేక్ కట్ చేయకుండానే అర్దరాత్రి వరకూ మెలకువగా వుండి డాడీకోసం ఎదురు చూస్తుండేదాన్ని.
    అప్పుడు అర్ధరాత్రి డాడీ వచ్చేవారు. చేతిలో డైమండ్ నెక్లెస్.... ఖరీదైన ప్రజెంటేషన్. నావంక చూసి 'సారీ మై చైల్డ్' అనేవారు.
    "డాడీ! ఎందుకు లేటయింది?" అంటే...
    "ఇదిగో ఈ డైమండ్ నెక్లెస్ కోసం వెళ్ళాన్రా! అక్కడ లేటయిపోయింది..."
    "నాకివన్నీ వొద్దు డాడీ! మీరు ఇది లేకుండా త్వరగా వస్తే బావుండేది"
    "సారీ బేబీ..." అనేసేవారంతే.
    అమ్మ ఎప్పుడూ నాన్నను ఈ విషయంలో పోరుతూ వుండేది.
    "నేను మాత్రం ఏం చేయను? మీతో గడపాలని నాకు మాత్రం ఉండదా? ఈ విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎవరికోసం చెప్పు? మన పాప భవిష్యత్ కోసమే కదా!" అంటూ వాదించేవాడు.
    ఇలా ఇద్దరి వాదనలతోనే ఆ వున్న కొద్ది సమయం కూడా కరిగిపోయేది.
    ఓసారి డాడీ మమ్మీని, నన్ను శ్రీశైలం తీసుకెళ్తానన్నారు. కార్తీకమాసం అని అమ్మ మరీ మరీ పట్టుపట్టింది. నేను, మమ్మీ అన్నీ సర్దుకుని తయారయ్యేక నాన్నగారు అర్జెంట్ పనిమీద కలకత్తా వెళ్ళవలసి వచ్చింది.
    మరోసారి తీసుకు వెళ్తానని అమ్మకి ఎంత నచ్చచెప్పినా అమ్మ విన్లేదు.
    నాన్నగారు కోపంతో కొట్టారు.
    అమ్మ ఒకటే ఏడుపు. అలా నా బాల్యం అంతా నాన్న ప్రేమకు దూరంగానే గడిచింది. నాన్నగారికెప్పుడూ బిజినెస్ డెవలప్ చెయ్యాలనీ, కంపెనీని పదిరెట్లు పెంచాలని... వాటికోసం కష్టపడే సమయంలో నూరోవంతయినా మాతో స్పెండ్ చేస్తే హేపీగా వుండేది. కానీ అది జరగని పని. అష్ట ఐశ్వర్యాలకు దగ్గరగా, అత్యంత యిష్టమైన నాన్న అనే ఐశ్వర్యానికి దూరంగా... అలా.... అలా గడిచిపోయింది నా బాల్యం.
    చివరికి ఏమీ తీసుకోకుండా, ఎలా వచ్చారో.... అలా ప్రపంచం నుంచి నాన్న నిష్క్రమించారు. నాన్నతోపాటు అమ్మ కూడా...
    నాకు ప్రేమ కావాలి...
    అనుబంధాలు, ఆప్యాయతలు రుచి చూడాలి. చదువుకోసం విదేశాలకు వెళ్ళి కొంతకాలం వాళ్ళకు దూరమయ్యాను.
    కారణాలేమైనా కావొచ్చు.
    కావలసిన ప్రేమ మాత్రం నాకు ఎక్కడా దక్కలేదు.
    నాకు నిజం చెప్పాలంటే ప్రియమైన స్నేహితులెవరూ లేరు. ఆప్తులు లేరు అంతా స్వార్ధం.
    మా వాడికి ఉద్యోగం యిప్పించమని ఒకరు.... మేము మీతోపాటు వుంటాం.... అని మరొకరు.... ఎవరికి వారు ఎవరి స్వార్ధంతో వారు. అలాంటి నా ఈ ప్రపంచంలోకి స్వచ్చందంగా వచ్చిన వాడివి నువ్వు...
    ఓ మంచి ప్రేమికురాలిగా, నీ భార్యగా, మామూలు యిల్లాలిగా వుండడమే నాకిష్టం. నువ్వు ఆఫీస్ నుంచి రాగానే, నీకు వేడి వేడి కాఫీ చేసి యివ్వాలి. నీ షూస్ కి నేనే పాలిష్ చెయ్యాలి. నువ్వు స్నానం చేసేక నేనే నీ తల తుడవాలి. నీ బట్టలు నేనే ఐరన్ చెయ్యాలి. అలిసిపోయి వచ్చిన వేళా.... నీ అలసట తీర్చాలి. నువ్వు భోజనానికి కూర్చున్న వేళ.... నేనే వంటచేసి వడ్డించాలి.... యిలా చిన్నచిన్న మీకు కోరికలు.... ఏవేవో వస్తుంటాయి. నాకు యిందులోనే థ్రిల్లుంది.
    విరజ మాటలు వింటూ అలాగే వుండిపోయేడు అభినయ్.
    ఎంత ముచ్చటగా, మరింత మురిపెంగా అనిపించాయి. అనుభవాలను మించిన పాఠాలేముంటాయ్?
    ఆమెనెలా ఓదార్చాలో అతనికర్ధం కాలేదు.
    విరజ అభినయ్ దగ్గరికి వచ్చింది. అతని గుండెలమీద తలపెట్టింది.
    "ఇదిగో.... ఇక్కడ... ఇక్కడే నాకు నిశ్చింత వుంటుంది" అంది.
    ఆమెనలాగే పొదివి పట్టుకున్నాడు అపురూపంగా...
    
                                       * * *
    
    "హ....లో.....వ్....."
    కళ్ళు తెరిచాడు అభినయ్.
    విరజ తనవైపే చూస్తూ వుంది.
    తన గుండెలమీద తల వాల్చిన విరజ.
    "ఏంటీ స్టాట్యూలా నిలబడిపోయేవు?" అడిగింది విరజ.
    చిన్నగా నవ్వి చెప్పాడు అభినయ్.
    మన పరిచయం.... ప్రేమగా మారడం వరకూ గుర్తొచ్చి....
    "ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయావా? సర్లే.... యింతకీ మన వైజాగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు?"
    "రేపు వెళ్దామా? పోనీ ఎల్లుండైతే..... రేపు ఫారిన్ డెలిగేట్స్ తో చిన్న గెట్ టుగెదరుంది" ఆమె రియాక్షన్ వూహిస్తూ భయంగానే అడిగాడు.
    అతనూహించిన రియాక్షన్ అతనూహించిన దానికన్నా ఎక్కువే కనిపించింది. పక్కనే వున్న ఫ్లవర్ వాజ్ చేతిలోకి  తీసుకొని అభినయ్ తలకేసి గురి పెట్టింది. వితిన్ సెకన్స్ లో ఆ ఫ్లవర్ వాజ్ అభినయ్ తలకు ఫట్ మని తాకేదే.... లాస్ట్ మినిట్ లో కంట్రోల్ చేసుకొని ముక్కు ఎగబీల్చింది.
    "చచ్చాన్రోయ్...." అని అరిచేసాడు అప్పటికే అభినయ్.
    "ఇంకా చచ్చలేదు.... అందుకు సంతోషించు.... మన వైజాగ్ ప్రోగ్రామ్ కన్నా, నీకా గన్నాయ్ గాళ్ళతో గెట్ టుగెదర్, వంకాయ్ సాంబార్ ముఖ్యమా?" అంది కోపంగా.
    "వాళ్ళు గన్నాయ్ గాళ్ళు కారు, ఫారిన్ డెలిగేట్స్"
    "వాళ్ళే డెలిగేట్స్ అయితే నాకెందుకు? రేపు ఈవినింగ్ గోదావరిలో థర్డ్ ఏ.సి.లో మనం వెళ్తున్నాం. నువ్వు రాలేదనుకో...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS