Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 9


    బామ్మ వచ్చి చేసే నిర్వాకమేమిటో తెలుసు కనుకనే "వద్దులే బామ్మా....అయిపోయింది" అంటూ గబగబా చీరకుచ్చెళ్ళు సర్దుకొని బయటకు వచ్చింది.
    ఓసారి కాదంబరి వంక ఎగాదిగా చూసి "ఒసే కాదా... నాకు తెలియక అడుగుతా, నీ వయసెంతే?" అంది బామ్మ.
    "ఇరవై రెండు" చెప్పింది కాదంబరి.
    "మరీ గెటప్పేమిటే.... ఆ రోజుల్లోనే పెళ్లయ్యేక కూడా నేను చుడీదార్లు వేసుకుంటానని మీ తాతయ్యకు కరాఖండీగా చెప్పాను. ఎప్పటి మాటనుకున్నావు?! యాభై ఏళ్ల క్రితం మాట...".
    "పోనీలేవే! ఇప్పుడా సంగతులెందుకు?" విసుగ్గా అంది.
    "ఎందుకేమిటే పిచ్చి తల్లీ.... యిప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లు వచ్చాయి. అవేమిటో నాకు నోరు తిరగదాయే.... ఆఁ... గుడ్డీలు...."
    "మిడ్డీలు బామ్మా!" సవరించి చెప్పింది కాదంబరి.
    "ఆ మిడ్డీల.... జీన్సు వచ్చాయి కదా అవి వేసుకో..."
    "నాకు యిలా వుంటేనే యిష్టం" అంది కాదంబరి.
    "హుఁ! బామ్మననే గౌరవం నీకేమాత్రం అయినా వుండి ఛస్తేగా... మీ అమ్మ, నాన్న నిన్ను నాకప్పగించి పోయారు. నిన్ను ఏ జమీందారుకో, పెద్ద కోటీశ్వరుడికో ఇచ్చి పెళ్ళి చేయాలన్న నా కోరిక యిలా అయితే తీరినట్టే....?!"
    "బామ్మా...." చెవులు మూసుకుంది కాదంబరి. బామ్మకు డబ్బు యావ ఎక్కువ. బాగా డబ్బున్నవ్యక్తికి తననిచ్చి పెళ్ళి చేయాలనీ చూస్తుంది. కానీ ఆడపిల్లకి పెళ్ళి అవ్వడమే అంతంతమాత్రం. అదీకాక బాగా డబ్బున్నవాళ్ళు తననెందుకు చేసుకుంటారు?
    "నిన్నేనే...." అని ఓసారి చీరకుచ్చెళ్ళను కిందికి జరిపింది.
    "ఏయ్....య్....ఏం చేస్తున్నావే?" కంగారుగా అడిగింది కాదంబరి.
    "చీర బొడ్డుకిందికి కట్టుకోవటం ఎప్పుడు నేర్చుకుంటావే..." అంది.
    "ఛీ....ఛీ...బొడ్డు కనిపించడం కోసం చీర కిందికి కట్టుకోవాలా? నాకిలాంటివి యిష్టం వుండదు" అంది కాదంబరి.
    "హూ మీ తాతయ్య ఇలానే అనేవాడు. కానీ ఓసారి పట్టుబట్టి నేనే బొడ్డుకిందికి చీరకట్టుకున్నాను".
    "నువ్వా.... తాతయ్య ఏమన్లేదా?!"
    "అనడానికి ఆయన వుంటేగా....నేను బొడ్డుకిందికి చీర కట్టుకోవడం చూసే పోయారే.... నా బొడ్డు చూసే పోయారే.... బొందిలో కైలాసం వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు...." దీర్ఘంగా విశ్వసించి అంది బామ్మ.
    కాదంబరికి నవ్వాలో? ఏడ్వాలో అర్ధం కాలేదు.
    "సర్లే... నేను త్వరగా ఆఫీసుకి వెళ్ళాలి... వడ్డించు" అంది అన్నం టిఫిన్ బాక్సులో సర్దుకుంటూ.
    కూరేం చేశావని అడగబోయి వూరుకుంది. ఇప్పుడు దానిమీద గంటసేపు లెక్చర్ ఇవ్వగలదామె.
    "అన్నట్టు మీ బాస్ కు అదే... చైర్మన్ కు ఎన్నేళ్ళుంటాయేంటి?" ఆరాగా అడిగింది బామ్మ.
    "ఎందుకూ?" అనుమానంగా అడిగింది కాదంబరి.
    "అబ్బ చెబుదూ...."
    "ఏమో.... ముప్పయ్ లోపే వుండొచ్చు".
    "పెళ్ళయిందా?"
    "తెలీదు" అనబోయి "లేదు" అంది.
    "హమ్మయ్య" అంది బామ్మ.
    "ఎందుకు హమ్మయ్య?" అనుమానంగా అడిగింది కాదంబరి.
    "యింకేమిటి....నీకేమిటే కాదంబరీ.... అందంగా వున్నావు. ఆఫీసులో ఎప్పుడూ అతన్ని అంటిపెట్టుకునే ఉద్యోగం నీదాయె... యింకేమిటి... కాస్త చనువుగా వుండు. మీ తాతయ్యను అలాగే లైన్ లొ పెట్టాను".
    బామ్మ చెబుతుంటే చెవులు మూసుకొని అంది కదంబరి. "చాల్లే ఆపు. నీకన్నీ ఇలాంటి పాడు ఆలోచనలే... అసలు నీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలేనా యివి?"
    "లేకపోతే నీలా మడికట్టుకుని కూర్చుంటే అయినట్టే నామాట విని అతనితో పార్క్ లకి, బీచ్ లకి వెళ్ళు".
    హైద్రాబాద్ లో బీచ్ లేదు" ఒళ్ళుమండి అంది కాదంబరి.
    "అదే మరి నాకు తెలీదేంటి? మాటవరసకి అన్నాను. అయినా బీచ్ లు లేకుంటే ఏం? బోలెడు రెస్టారెంట్లు, హోటల్సూ లేవు పిచ్చితల్లి. అది కూడా నేనే చెప్పాలి"
    "నువ్వేం నాకు చెప్పక్కర్లేదు గానీ, నే వెళ్తున్నా..." అంటూ చెప్పులు వేసుకొని బయటకు నడిచింది.
    "వెళ్ళు.... వెళ్ళు.... వచ్చేప్పుడు ఏ హోటల్ కి అతనితో కలసివెళ్ళి, వచ్చేప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ పార్సిల్ తీసుకురా..." వెనక నుండి అరిచింది.
    "నిన్ను చంపేస్తా..." అన్నట్టు చేత్తో చూపించి బెదిరించి వెళ్ళిపోయింది కాదంబరి.
    బామ్మ ముసి ముసిగా నవ్వుకుంటూ "పిచ్చి పిల్ల... బొత్తిగా లోకజ్ఞానం లేదు. అన్నీ నేర్పాలి..." అనుకుంది మనసులో....
    
                                       * * *


    షార్ప్ నైన్ థర్టీ....
    చైర్మన్ ఛాంబర్ లోకి అడుగుపెట్టింది కాదంబరి.
    "గుడ్మాణింగ్ సర్..." అంది చిర్నవ్వుతో....
    "వెరీ గుడ్మాణింగ్ కాదంబరీ... ప్లీజ్ బీసీటెడ్" అన్నాడు అభినయ్.
    కాదంబరి కూచోలేదు. నిలబడే వుంది.
    కాదంబరిలో చాలా విషయాలు నచ్చుతాయి అభినయ్ కు. మొహంలో ఎప్పుడూ చిర్నవ్వు కదలాడుతూ వుంటుంది. పి.ఎ. బాధ్యతలు కాదంబరికి తెలిసినట్టు మరెవరికీ తెలియవు అన్నట్టు వుంటుంది. అంతకు మించి సిన్సియర్ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఆమె ప్రత్యేకత. తన 'కలివిడి' తనాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసి, బాస్ ను ఆకట్టుకోవాలని అనుకోకపోవడం ఆమె సంస్కారం...
    "చెప్పండి సార్!" అంది కాదంబరి.
    "అర్జంట్ గా వైజాగ్ వెళ్తున్నాం నేనూ, విరజా కలిసి".
    "అలాగా సార్! విష్ యూ హేపీ జర్నీ సర్.... నేనిక్కడ పూర్తి చేయాల్సిన పనులు ఏమైనా వున్నాయా?"
    అదే అతనికి కాదంబరిలో నచ్చేది. అనవసర ఆసక్తి ఎప్పుడూ ప్రదర్శించదు.
    "కాదంబరీ, ఇవ్వాళ ప్రోగ్రామ్స్ ఏమిటి?"
    "ఫారిన్ డెలిగేట్స్ ని మీట్ అవ్వాలి. మీటింగ్ తర్వాత ఒబరాయ్ లో లంచ్. మేజర్ ప్రోగ్రామ్ అదే..."
    "యస్సెస్.... బట్ నేను తప్పకుండా వైజాగ్ వెళ్ళాలి".
    "ఓకే సార్.... ఐ కెన్ మేనేజ్... మీరూ, మేడమ్ హేపీగా వెళ్ళిరండి. నేను అర్జెంటనుకుంటే మీ సెల్ కి కాంటాక్ట్ చేస్తాను".
    ఇలా రెస్పాన్స్ బుల్ గా జాబ్ చేసేవాళ్ళు అతికొద్ది మంది మాత్రమే. కాదంబరి లాంటి పి.ఎ. లుంటే బాస్ ల పని హాయిగా వుంటుంది. నిశ్చింత అనిపిస్తుంది. ఏ పనైనా వారిపై వదిలేసి వెళ్ళొచ్చనిపిస్తుంది. అదే అన్నాడు కాదంబరితో.
    "థాంక్యూ కాదంబరీ! నీలో నాకు నచ్చే గుణం యిదే. బాస్ మూడ్స్ కు అనుగుణంగా రియాక్ట్ వుతావు. ఏ పని అయినా నీ భుజాన వేసుకొని సిన్సియర్ గా చేస్తావు"
    "థాంక్యూ సర్...." అంది కాసింత సిగ్గుపడుతూ కాదంబరి.
    "ఆఫీసు జాగ్రత్త.... అన్నట్టు ఓసారి స్టాఫ్ ని వాచ్ చేయ్.... మన కంపెనీకి సంబంధించిన విషయాలు బయట లీక్ అవుతున్నట్టు అనుమానంగా వుంది. టేక్కేర్..."
    "ఓ.కె.సార్..."
    "అలాగే బ్యాంకు నుండి రెండు లక్షలు డ్రా చేయాలి. రేపు సండే... ఎల్లుండి మార్నింగే అమౌంట్ అవసరమవుతుంది. యివ్వాళే వెళ్ళి అమౌంట్ డ్రా చేయాలి"
    బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి  చెక్ రాసి యిచ్చాడు కాదంబరికి.
    "సార్... యింత పెద్ద అమౌంట్....!"
    "ఇరవై లక్షలు అయినా నీ దగ్గర సేఫ్ గా వుంటుంది" చెప్పాడు అభినయ్.
    "థాంక్యూ సర్.... మీరు నామీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ వమ్ముచేయను".
    సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. కాదంబరి రిసీవర్ తీసింది. "యస్! విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్" అంది.
    "కాదంబరి.... నేను విరజను...."
    "మేడమ్ మీరా? వన్ సెకన్..." అంటూ రిసీవర్ అభినయ్ కు అందిస్తూ "సర్! మేడమ్" నుంచి.
    "విరజా! నువ్వా.... ఏంటీ సర్ ప్రయిజ్.... వచ్చేయిమంటావా? ఏంటీ నువ్వే వస్తావా? సరే... టికెట్స్ కన్ ఫర్మ్ అయ్యాయి... అలాగే..."
    "ఏం చేస్తున్నావు అభీ?"
    అభినయ్ కాదంబరి వంక చూసేడు.
    కాదంబరి బయటకు వెళ్ళిపోయింది.
    అప్పుడే డోర్ తీసుకొని వచ్చింది విరజ.
    ఆమె చేతిలో సెల్ ఫోన్.
    "ఏయ్... ఆఫీసుకువచ్చి బయట నిలబడి మాట్లాడుతున్నావా?" అడిగాడు సర్ ప్రయిజింగ్ గా ఫీలవుతూ అభినయ్.
    "దటీజ్ విరజ స్టయిల్..." అని కాదంబరివైపు చూసి, "హలో కాదంబరి.... బావున్నావా?" అడిగింది ఆమె భుజం తడుతూ.
    "అయామ్ ఫైన్ మేడమ్" అంది బయటకు వెళ్తూ కాదంబరి!
    
                                    * * *
    విషాదమనే నల్లటి ముసుగు ఆ యింటిని కప్పేసినట్టుంది. దైన్యమనే బూచి  వాళ్ళని తర్భని చూపి బెదిరిస్తున్నట్టుంది. వ్యాపార ప్రపంచానికి మకుటం లేని మహారాజు అయిన మహాపతి ఆ క్షణం సర్వం కోల్పోయి, కాందిశీకుడైనట్టు వున్నాడు.
    ఏ క్షణం... ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో... ఏ క్షణం కన్నీటి కెరటం ఉధృతమవుతుందోనన్న భయం... ఆ యింట్లో వేలాడే మనీ ప్లాంట్ ని చూస్తుంటే అతనికి నవ్వొస్తుంది. డబ్బుని అందించలేని ఆ చెట్టు.... యింటికి అందాన్ని యిస్తుంది.
    తనకూ, ఆ మనీ ప్లాంటుకూ పోలిక వుందా? డబ్బును తృణప్రాయంగా వదిలివేయగల తను తన ప్రాణానికి ప్రాణమైన బిడ్డని కాపాడుకోలేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS