Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 7


    "ఛీ....ఛీ....దొంగతనంగా పాలు నాకే బుద్ది మీవంశంలో వుందా? నన్నడిగితే ఓ పాల ప్యాకెట్ కొని పెట్టేవాడినిగా....అసహ్యంగా ఆ పాలప్యాకెట్ కు బొక్కచేసి పాలు తాగుతావా?" కోపంగా అన్నాడు.
    'నీ బోడి పాలు నాకేం అక్కర్లేదు....అనవసరంగా నేలపాలయితే యిల్లు తుడుచుకోలేక చస్తావని జాలేసి, పాల చుక్కలు కిందపడకుండా మింగా...బ్రష్ చేసుకున్నాక, కాసిని పోస్తా, స్టవ్ మీద కాచుకుని, కాఫీ కలుపుకుని తాగు..." అంది కోపంగా అతని చేతికిందుగా వెళ్తూ.
    "దొంగలా అలా నా చంక కిందనుంచి ఎలా వెళ్తుందో చూడు..." అనుకుని, కిచెన్లోకి వచ్చి, పాల ప్యాకెట్ చూసి "హమ్మో హమ్మో పావు లీటరు పాలు తాగింది లేగదూడలా..."అనుకున్నాడు శ్రీచరణ్ గుండెలు బాదుకుంటూ,
    
                                                              * * *


    స్నానం చేసొచ్చి నైటీ వేసుకుంది ప్రనూష.
    టిఫిన్ చేసుకునే మూడ్ లేదు. పక్క కిచెన్లోకి తొంగి చూసింది. ఉప్మాచేస్తున్న వాసన వస్తోంది.
    "పక్క గదిలో ఉన్న మనుష్యులకు కాసింత ఉప్మా పెట్టాలనే మానవతా దృక్పధం చచ్చేడిస్తే గా ఆ మహానుభావుడికి...ఆ ఉప్మాలో ఉప్పెక్కువ కాను..." అని కసిగా అనుకొని, తన కిచెన్లోకి వెళ్ళి, ఆమ్లెట్ వేసుకుని బ్రెడ్ స్లయిసెస్ తీసి వాటి మధ్య పెట్టింది.
    టైం చూసుకుంది. ఎనిమిదిన్నర దాటింది. శారీ కట్టుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది.
    రెండు కిచెన్ రూమ్ లు పక్కపక్కనే ఉన్నాయి. తన కిచెన్ లోంచి ముక్కుతో వాసన పీలుస్తూనే వున్నాడు శ్రీచరణ్ ఆమ్లెట్ వాసన వచ్చింది.
    "ఓహో....బ్రెడ్, ఆమ్లెట్ అన్నమాట" అనుకున్నాడు.
    అతనికి నోరూరింది. కొద్దిగా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వచ్చింది.
    'ఛీ....తప్పు...." అంది అంతరాత్మ.
    ఇందాక నీ పాల ప్యాకెట్ సగం ఖాళీ చేసేయలేదు...నువ్వూ ప్రొసీడ్... అంది జిహ్వ..."
    వెంటనే ప్రనూష గదివైపు చూసాడు.
    తలుపులు దగ్గరగా వేసివున్నాయి.
    అంటే బట్టలు మార్చుకుంటోందన్నమాట. మరో పావుగంట వరకూ బయటకు రాదు.
    ప్రనూష కిచెన్ రూమ్ లోకి వెళ్ళాడు. ప్లేట్లో బ్రెడ్ ఆమ్లెట్ నోరూరిస్తోంది.
    నాలుగు చివరలా కొద్ది కొద్దిగా కొరికాడు.
    "చాలా టేస్ట్ గానే చేసుకుంది" అనుకున్నాడు.
    యింకా ఎక్కువ తింటే గమనిస్తుందని బుద్దిగా తన కిచెన్ లోకి వచ్చాడు.
    ప్రనూష బట్టలు మార్చుకుని, కిచెన్ లోకి వచ్చి, బ్రెడ్ ఆమ్లెట్ తినబోతూ దాని ఆకారం వంక చూసింది. నాలుగు చివరలూ...ఎలుక కొరికినట్టు వున్నాయి.
    అనుమానంగా శ్రీచరణ్ కిచెన్ వైపుచూసింది.
    ఉప్మా తింటున్నాడు. ఆమెకు అనుమానం కలిగింది.
    "ఇక్కడెవరైనా దొంగతనంగా ఆమ్లెట్ తిన్నారా?" శ్రీచరణ్ కు వినిపించేలా అరిచింది.
    వెంటనే సమాధానంగా 'మ్యావ్...మ్యావ్...."అని అరిచి శ్రీచరణ్.
    "ఏదో ఇందాక ఓ పిల్లి నీ గదిలోకి వచ్చి, ఏదో తిని, అసహ్యంగా అనిపించి, నా గదిలో వాంమ్టింగ్ చేసుకోబోయింది" అన్నాడు.
    "అవునవును మీ పిల్లికి నల్లమీసాలున్నాయి కాబోలు. ఐదున్నర అడుగుల ఎత్తు... పైగా ఆ పిల్లి ప్యాంటు, షర్టూ కూడా వేసుకుంటుందా?" తన గదిలోనుంచే అంది శ్రీచరణ్ ని ఉద్దేశించి.
    "పిల్లులు ప్యాంటూ, షర్టులు వేసుకుంటాయా? విఐపి ఫ్రెంచ్ అండర్ వేర్స్ వాడతాయా? లాంటి సంగతులు నాకేం తెలుసు....మాది జంతువుల వంశం కాదు. మీకు మల్లే....." అన్నాడు. రిటార్ట్ గా శ్రీచరణ్.
    "ఛీ....ఛీ....రెండు కిచన్లు ఉన్నా....లాభం లేక పోయింది. ఈ ఇల్లు ఖాళీ చేస్తే కానీ, నాకు మనశ్శాంతి లేదు". గట్టిగానే అంది ప్రనూష.
    "ఆ పన్జేస్తే సన్సిల్క్ షాంపుతో తలంటుకుంటా..." శ్రీచరణ్ బదులిచ్చాడు.
    "ఛీ....ఛీ.... కొందరి నోట్లో నోరుపెట్టి మాట్లాడ్డమంత బుద్దితక్కువ మరోటి వుండదు..."
    "అవునవును ఫ్రీగా ఇంగ్లీషు సినిమాల్లోలా ముద్దుపెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళను ఎవరు మాత్రం ఏం చేస్తారు?"
    ప్రనూషకు విసుగెత్తి అరవడం మానేసి బుద్దిగా బ్రెడ్ ఆమ్లెట్ తింది.
    "ఉప్మా తినాలని అంత కోరికగా వుంటే అడగొచ్చు. మాకూ ఉంది పావుకేజంత మానవత్వం" అన్నాడు శ్రీచరణ్.
    "అబ్బో...ఆ పావుకేజీ అట్టిపెట్టుకుంటే ఎప్పుడైనా పనికొస్తుంది" అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది పెద్ద శబ్దంతో.
    "ఆ తలుపు డామేజీ అయితే, ఆ వడివేలుగాడు ఊర్కోడు....అసలే పిచ్చిముండా కొడుకు... తెలుగు, అరవం కలిపి తిడతాడు..." అన్నాడు గట్టిగా శ్రీచరణ్.
    శ్రీచరణ్ తో వాదించే ఓపిక లేక మిన్నకుండిపోయింది. ఆ పూటకు వాదించే ప్రోగ్రామ్ వాయిదా వేసుకుని.
    టైం తొమ్మిదిన్నర...
    మళ్ళీ ఉరుకులు..... పరుగులు.... ప్రనూషకు తప్పలేదు.
    
                                                                * * *
    
    ఆయాసంతో వగరుస్తూ సైకిల్ ని ఆ ఇంటిముందు ఆపాడు వడివేలు. సైకిల్ స్టాండు వేసి, ఓసారి ఆ ఇంటిచుట్టూ తిరిగి అన్నివైపులా పరిశీలనగా చూసాడు.
    శ్రీచరణ్ వుండే ఇంటి ఓనర్ పేరు వడివేలు. ఎప్పుడో పాతికేళ్ళ కిందటే సికింద్రాబాద్ లో సెటిలైన వడివేలు....ఇప్పటికీ ఆ పాతికేళ్ళ కిందటి డొక్కు సైకిల్ ఉపయోగిస్తాడు. అదేమిటంటే, అది కలిసొచ్చిన సైకిల్ అంటాడు. ప్రతీ నెలా అద్దె కోసం వస్తాడు. అద్దెతో పాటు బస్సు చార్జీలు కూడా వసూలు చేస్తాడు. అతనిదో విచిత్రమైన క్యారక్టర్....
    
                                                                * * *

    వడివేలు ఇంట్లోకి అడుగుపెడుతుండగా, ప్రనూష అప్పుడే కంగారుగా బయటకు వస్తూంది. అప్పటికే తొమ్మిదిన్నర అయింది.
    "నమస్కారం మేడమ్..." అన్నాడు వడివేలు.
    అతనికి అతి వినయం ఎక్కువ!
    "నమస్తే....నమస్తే...." అంది వెళ్ళే హడావిడిలో.
    "నమస్కారం మేడమ్...." మళ్ళీ అన్నాడు వడివేలు.
    కొద్దిగా చికాకు వేసింది ప్రనూషకు.
    అసలే ఆఫీసు టెన్షన్ లేటయితే, ఆ వేదాచలం వూర్కోడు. అసలే నిన్నటి గొడవ విషయంలో కోపంగా ఉన్నాడు. "నమస్తే....నాకు ఆఫీసుకు టైమయింది. నేను వెళ్ళేదా?" అంది. అప్పుడు గుర్తొచ్చింది తాను ఈ నెల అద్దె డబ్బులు ఇవ్వలేదని.
    "రేపు తీసుకోకూడదా అద్దె." అంది ప్రనూష.
    "రేపయితే మళ్ళీ రేపటి బస్సు చార్జీలు కూడా ఇవ్వాలి మేడమ్" అన్నాడు చేతులు కట్టుకుని.
    "అలాగే...!! అంది బయల్దేరబోతూ వెంటనే శ్రీచరణ్ ప్రనూష పక్కకు చేరి 'రేపటి బస్సు చార్జీలు నేను చస్తే ఇవ్వను.
    నువ్వివ్వు..." దొరికిందే ఛాన్స్ అన్నట్టు అన్నాడు.
    'మీరా....మీకూ నమస్కారం సార్..." అన్నాడు వడివేలు శ్రీచరణ్ వైపు చూస్తూ.
    "యిందాక రెండు నమస్కారాలు పెట్టారుగా....మూడోది ఎందుకు లెండి..." అన్నాడు శ్రీచరణ్. ప్రనూష హడావుడిగా వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS