Previous Page Next Page 
స్వర్గంలో ఖైదీలు పేజి 7


    వెండిగిన్నెలో పరమాన్నం పెట్టుకుని తల్లిదగ్గరకెళ్ళింది.
    విద్య ఓసారి కూతుర్ని తనివిదీరా చూసుకుని "హేపీ బర్త్ డే తల్లీ!" అంది.
    వర్ష తల్లి కాళ్ళకి నమస్కరించింది.
    క్రిందనుండి పనిమనిషి వచ్చి "అమ్మా ఎవరో అబ్బాయివచ్చాడు" అంది.
    "ఎవరూ? చూసిరా!" అంది విద్య.
    వర్ష గబాగబా క్రిందకి వచ్చి 'కె.....వ్వు'మని అరిచినంత పనిచేసింది.
    సంజయ్ నిలబడి వున్నాడు.
    "మీరు....మీరు...." అని కంగారుగా మేడమీదకి చూసింది.
    "హేపీ బర్త్ డే బేబీ...." అని బొకే అందించాడు.
    వర్షకి ఆ పూవులను చూడగానే మనసంతా రసరాగరంజితమైనట్లు అనిపించింది. తెల్లని లిల్లీల మధ్యన ఒకే ఒక కెంపురంగు గులాబీ!
    "థాంక్యూ...." అని అందుకుని "మీకు మా ఎడ్రెస్ ఎలా తెలుసు? అసలు మీకు తెలీని సంగతేలేదా!" ఆశ్చర్యంగా అడిగింది.
    అతను గొంతు సవరించుకుని "ఇంక మిమ్మల్ని అజ్ఞానవతి మీర అంధకార చీకటి.....ఇంక పదాలు దొరకడం లేదుకానీ.....అందులో వుంచదలచుకోలేదు. వినండి.. గడిచిన రెండు సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ఫాలో అవడం తప్పించి ఏ పనీ చెయ్యడం లేదు. మీరు హోలీమేరీ కాలేజ్ లో చేరినప్పటినుండీ, మీరు ఏ టైంకి వెళ్తారో.....ఏ రూట్ లో వెళ్తారో.....ఏ టైప్ డ్రెస్సులు ఇష్టపడ్తారో, ఏ రకం శాండిల్స్ యూజ్ చేస్తారో.....ఎక్కడా ఫాస్ట్ ఫుడ్స్ తింటారో, ఎక్కడ కాస్మాటిక్స్ కొంటారో అన్నీ చిట్టాలా వ్రాసిపెట్టాను..... మా అక్క ఏం వ్రాస్తున్నావురా అంటే రామకోటి అని చెప్పాను. ఆమె సంతోషించి 'కోటి పూర్తయ్యాకా చెప్పు బాబూ కళ్యాణం చేయిద్దాం అంది. ఈ రోజుతో ఆ కోటీ పూర్తయ్యాయని అనుకొంటున్నాను. మరికళ్యాణం సంగతి పెద్దవాళ్ళతో మాట్లాడమంటారా?" అడిగాడు.
    వర్షకి తల తిరిగినంతపనయింది. ఆసరాగా సోఫా పట్టుకుని "వాట్? రెండు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారా? నా గురించి ఇన్ని డీటైల్స్ తెలుసుకుని వ్రాసిపెట్టారా? ఎందుకూ?" అంది.
    సంజయ్ చిన్నగా నవ్వి "ఒకే ఒక సింపుల్ రీజన్ వల్ల ఇన్ని కష్టాలు పడవలసివచ్చింది. మెల్లగా....మెల్లగా వచ్చి.....గొల్లుమని ఏడిపించిపోతుంది......అదే వలపు!" అన్నాడు.
    వర్ష గాభరాగా "మీకు పిచ్చి అనుకుంటాను!" అంది.
    "అవును పిచ్చి. ప్రేమపిచ్చి" అన్నాడు.
    "అయ్యో.....నెమ్మది.....అమ్మ ఇంట్లోనే వుంది. ముందు మీరు కూర్చోండి" గుసగుసగా అంది.
    "థాంక్యూ......గెట్ అవుట్! అంటారనుకున్నాను" అన్నాడు.
    "వర్షా.....ఎవరమ్మా?" అన్న విద్య గొంతు వినిపించింది.
    వర్ష జవాబిచ్చేలోపే "నేనండీ....సంజయ్ ని...." అంటూ వర్ష అడ్డంపడ్తున్నాతప్పించుకొని సంజయ్ చేతిలోని పెద్దప్యాకెట్ ని ఊపుకుంటూ మేడమెట్లు ఎక్కేశాడు.
    "అయ్యో.....ఇప్పుడెలా?" వర్ష నుదురు కొట్టుకుంది. ఆమెకి అతని వెనకాలే మేడమీదకి వెళ్ళే ధైర్యం లేక అశక్తంగా అక్కడే కాసేపు నిలబడిపోయింది. నుదురంతా సన్నగా స్వేదం అలుముకుంది. మనసంతా ఉద్విగ్నంగా మారి, పులకింతో కలవరమో తెలీని స్థితిలో ఒక రకమైన అలౌకిక పరిస్థితిని అనుభవిస్తూ వుండిపోయింది.
    "వర్షా.....వర్షా...." అన్న తల్లిపిలుపు ఇహలోకంలోకి తీసుకురాగా, ధైర్యాన్ని కూడగట్టుకునిమేడమీదకివెళ్ళింది.
    విద్య బ్యాండేజితో వున్నకాలు గాల్లో వదిలి, ఇంకో కాలి మీద భారమంతా మోస్తూ మేడ దిగిరావడానికి ప్రయత్నిస్తూ "వర్షా, ఇతను చెప్పేదినిజమేనా?" అంది.
    వర్షకి ఏం జవాబు చెప్పాలో తోచక తల నిలువుగా ఊపి అంతలోనే భయంతో అడ్డంగా ఊపింది.
    "అదేంటి.....నిన్ను అడిగేకదా ఫైనలైజ్ చేసింది..... ఇప్పుడు ఇష్టం లేదంటున్నావా?" అంది.
    "అడగలేదు అమ్మా!" కంగారుగా అనేసింది.
    "వాట్!" విద్య అదిరిపడినట్లుగా చూసి, "నిజంగా నువ్వే అంటున్నావా?" అంది.
    వర్షకి తల్లి అలా నిలదీస్తుంటే ఏడుపు ముంచుకు వచ్చేసింది. సంజయ్ వైపు కొరకొరా చూస్తూ "నిజం అమ్మా" అంది.
    "నీకేమైందే ఇలా మాట్లాడుతున్నావు. ఆ రోజు వసుంధరా ఆంటీకి ఈ డ్రెస్ డిజైన్ ఇచ్చినప్పుడు నువ్వు చాలా బావుందమ్మా అని నన్ను మెచ్చుకోలేదూ!" ఆశ్చర్యంగా అంది విద్య.
    "డ్రెస్సా?" ఈసారి వర్ష విస్మయంగా అడిగింది.
    "ఎస్ మేడమ్....ఇప్పుడు నాకు నచ్చలేదు అని మీరంటే ఎలా? అందులోనూ మీకోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిందికూడానూ!" సంజయ్ ప్యాకెట్ లోంచి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ లో వున్న సల్వార్ సూట్ తీసి చూపిస్తూ అన్నాడు.
    "ఇది.....ఇది....."మాటల కోసం తడుముకొంది వర్ష.
    సంజయ్ పెదవులమీద పలుచని చిరునవ్వు. "మా అక్క చాలా కష్టపడి కుట్టింది." అన్నాడు. "మీ అక్క గురించి నాకు తెలుసు. హండ్రెడ్ పర్సెంట్ పనికి న్యాయం చేస్తుంది. మా స్నేహం ఈనాటిదా?" మెచ్చుకుంటూ అంది విద్య.
    వర్షకి అంతా అర్ధమయింది. సంజయ్ వసుంధర తమ్ముడు. అందుకే తన బర్త్ డే డేట్ నుంచి, తన ఇష్టాలవరకూ అన్నీ తెలిసిపోయాయి. అదీకాక వాళ్ళ ఇల్లు తమ ఇల్లుండే వీధి చివరే!
    అతను చెప్పిన అబద్దాలన్నీ విని థ్రిల్ అయిపోయిన తన అమాయకత్వం తలుచుకుంటే తన మీద తనకే విపరీతమైన కోపం వచ్చింది. సంజయ్ వంక కొరకొరచూసింది. అతను మాత్రం అదే మోహనమైన చిరునవ్వుతో తనవంక చూస్తున్నాడు.
    వర్ష కదలబోతుండగా "ముందు డ్రెస్ వేసుకొని రా.....ఏవైనా మార్పులుంటే చెప్పచ్చు!" అంది.
    వర్ష ఆ డ్రెస్ వేసుకొని తన అందం చూసి తనే ఓ క్షణం మోహపడింది! ఆ తర్వాత ట్రేలో స్వీటూ, హాటూ పట్టుకుని ముందు గదిలోకి వచ్చింది.
    చెవులకి వేళ్ళాడే పగడపు పూసలున్న పెద్ద హ్యాంగింగ్సూ, మెడలో నాలుగు వరసలలో మెడ దగ్గర్నుండి గుండెలవరకూ జారుతున్న కెంపు నెక్లెస్, నడుముకి మువ్వలతో వున్న వడ్డాణం, చేతుల్నిండా తెలుపూ, మెరూన్ కాంబినేషన్ లో వున్న బ్రాడ్ పట్టీలాంటి లంబాడీ గాజులూ, కుడిచేతి వేళ్ళకి ఒకేలాంటి ఉంగరాల సెట్టూ, నుదుట మెరుస్తున్న ముత్యానికి మెరూన్ రాళ్ళ వలయం వున్న బిందీ....జుట్టు దివ్వి అలాగే వదిలేది, పాపిట్లో ఎరుపూ, తెలుపూ రాళ్ళున్న పాపిడిబిళ్ళా...ట్రేపట్టుకుని ఆమె నడిచివస్తూ వుంటే ఎడమ భుజంమీద నుండి ముందుకి పాము కుబుసంలా జాలువార్తున్న మెత్తటి తెల్లపట్టా......వాటిమీద కెంపురంగు టిక్లీల పనితనం!
    ఈ అలంకరణతాలూకు శోభంతా ఒకఎత్తయితే.....ఆమె కనురెప్పల విన్యాసం ఒక్కటీ ఇంకొక ఎత్తు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS