Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 7

 

    ఇంతలో రెండో బండి వీళ్ళ బండిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. "బాబుగారు! మీ బండి వెనుకబడిపోయింది" అన్నాడు వెంకటేశం. దాన్లో కస్తూరి, శివపార్వతి, తులసి మిగిలిన పిల్లలున్నారు.

    "తుస్....చూశారా పిన్నీ! బండిని తోలటం కూడా చేతకాదు. మీ అల్లుడికి. ఇక సంసారం అనే బండిని ఎలా తోలతాడు? బాబూ సురేంద్ర బావగారూ! మీరు తప్పుకుంటే నేను తోలతాను బండిని" అంది జయంతి.

    "నోరు మూసుకోవే.....బండిని తోలటమంటే మజాకా అనుకున్నావా? నీకు బొత్తిగా భయం, భక్తీ లేకుండా పోతున్నాయి." అంది భ్రమరాంబ.

    "ఇదిగో అత్తో! బండిని తోలటం గొప్ప కళేం కాదు" అంటూ వెనకనుంచి ముందుకు వచ్చి సురేంద్ర పక్కనే కూర్చుని అతని చేతిలోని చండ్రాకోల తీసుకుని "ఛళ్" అంటూ ఎడ్లను కొట్టింది. అని వేగంగా పరుగులు తీయసాగాయి.

    "అరెరె....సురేంద్రా! దాని మాటలకేంగానీ బండిని నెమ్మదిగా పోనియ్ రా" అంది భ్రమరాంబ.

    "నువ్వుండవే బండికేం కాదు గానీ.....ఎద్దులతోపాటే దీని పొగరు కూడా అణుస్తాను." అన్నాడు సురేంద్ర.

    "జయంతి నీకు తెలియదు ఊరుకో.....నువ్వు వెనక్కి వచ్చేయ్, ఎడ్లు బెడురుతాయి" అంది దాక్షాయణి.

    "ఏం బెదరవులే పిన్నీ! నువ్వు కంగారుపడకు, ఆ వెంకటేశంగాడి బండిని మనం దాటిపోవాలి" అంది జయంతి.

    "ఇంకోసారి మనిద్దరం తీరిగ్గా పందాలు వేసుకుందాంగానీ నువ్వు తప్పుకోవే చింపిరిజుత్తు బండిలో అందరూ ఉన్నారు. పల్టి కొట్టిందంటే బాగోదు.లేలే" అంటూ జయంతి వీపు మీద రెండు చరిచాడు సురేంద్ర.

    "సరే రేపే పందెం కాసుకుందాం. అత్తో నువ్వు కూడా విను. పందెంలో నేను గెలిస్తే ఇక మీరు నా పెళ్ళి ప్రస్తావన తీసుకురాకూడదు. నేను ఓడిపోతే ...... అసలు ఓడిపోను అనుకో. ఒకవేళ ఓడిపోతే అప్పుడు నువ్వు చెప్పినట్లే వింటాను. సరేనా?" అంది జయంతి.

    "ఓసి భడవా! నీకే అంత పోగరుంటే నా కొడుక్కి ఇంకెంత వుండాలే" అంది భ్రమరాంబ.

    "ఆడపిల్లకి ఆ మాత్రం పోగరుండాలే అమ్మా వుండనీ" అన్నాడు సురేంద్ర.

    "వదినమ్మా ఇక లాభం లేదు. జయంతి మెడలు వంచి మూడు ముళ్ళు వేయించాల్సిందే. బావగారితో రేపే నువ్వు మాట్లాడాలి" అంది దాక్షాయణి జయంతిని వెక్కిరిస్తూ.

    "మాట్లాడతానమ్మా నా కొడుక్కేం తక్కువని, దీని పొగరు అప్పుడు అణుస్తాను." అంది భ్రమరాంబ.

    "పిన్ని! నువ్వు కూడా వాళ్ళ పార్టీలో చేరిపోయావా?" అని జయంతి బుంగమూతి పెట్టి. ఆ మాటలకు అందరూ నవ్వారు.
                                                          *    *    *    *

    "పార్వతి! ముందు పిల్లలందరికీ భోజనాలు పెట్టేయండి. మ్యాట్ని సినిమాకి వెళదాం అంటే వినిపించుకోలేదు. ఎండ మండిపోతుంది ఎంచక్కా తోలి అటకు వెళదాం అన్నారు, ఇప్పుడు చూడండి చంటోళ్ళు అప్పుడే నిద్రపోయారు" అంది కస్తూరి.

    "అబ్బబ్బ! నీకు ప్రతి చిన్న విషయానికి కంగారే అక్కా! మేమున్నాం కదా! పిల్లలందరికీ తినిపించాకే మనం తిందాం, ముందు బావగారు వాళ్ళకి వడ్డించాక తర్వాత మన ఆడవాళ్ళం దరం కలిసి భోంచేద్దాం" అంది పార్వతి.

    ఆరుబయట మంచాల మీద పిల్లల్ని కూర్చోబెట్టి అందరికి ఒక్కో ముద్ద కలిపి తినిపిస్తోంది " శివపార్వతి.

    "ఏంటి అమ్మాయిగారు ఈ రోజు రెట్టింపు అందంతో కనిపిస్తున్నారు." అన్నాడు మాధవరావు భార్యని మురిపెంగా చూసుకుంటూ. ఆ చీరే....జడ నిండా మల్లెపూలతో నిజంగానే దాక్షాయణి అందంతో మెరిసిపోతుంది.

    "ష్....ఏంటా మాటలు? అందరూ మెలుకువతోనే వున్నారు. పెళ్ళయి పదేళ్ళు అవుతున్నా మీకు ఇంకా ఆ కొంటె మాటలేమిటి?" అంది దాక్షాయణి.

    "పెళ్ళయిన పదేళ్ళకే ముసలోళ్ళం అయిపోతామా? ఉన్నమాటే అన్నాను. ఇటురా కాస్త పులుసుపోయి. అంటూ జడపట్టుకుని లాగాడు మాధవరావు.

    "అయ్యో ఏంటిది? ఏమయింది రోజు మీకు?" అన్నంలో పులుసు పోసిబయటకు పరుగు తీసింది దాక్షాయణి. మాధవరావు నిశ్శబ్దంగా నవ్వుకుంటూ భోంచేయసాగాడు.

    "ఏంటి పిన్ని! బాబాయ్ కి అన్నం పెట్టి బయటకు పరుగు తీస్తూ వచ్చావ్!" అంది జయంతి కొంటెగా నవ్వుతూ.

    దాక్షాయణి ఆ మాటలకు మరింత కంగారుపడిపోయి....

    "ఎ...ఏం లేదులే....అయినా నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావ్?" భోంచేశావా?" అంది కంగారును బయటపడనియకుండా.

    "అరెరె....ఏంటి పిన్ని! ఎందుకంత కంగారు? జడపట్టుకునిలాగాడు అంతేగా? దీనికే ఇంత కంగారుపడిపోతే ఎలా?" అంది జయంతి.

    దాక్షాయణి ఆ మాటలకు చేష్టలుడిగిపోయిన దానిలా అలానే క్షణంసేపు జయంతిని చూస్తూ వుండిపోయి, వెంటనే తేరుకుని, "ఏయ్ రౌడి పిల్ల నిన్ను...." అంటూ వెంటపడింది. జయంతి పెద్దగా నవ్వుకుంటూ అందకుండా పరుగుతిసింది.

    "ఏయ్ ఏంటా పరుగు పడిపోతావ్" అంది గిరిజ, జయంతిని ఆపుతూ. జయంతి రొప్పుకుంటు...నవ్వుకుంటూ గిరిజ పక్కనే మంచం పైన కూలబడింది. అంతలో అక్కడికి దాక్షాయణి వచ్చింది.

    "ఎందుకే పిన్ని నీ వెంటపడింది?" అడిగింది గిరిజ.

    "అది...అది...." అంటూ దాక్షాయణి వేపు నవ్వుతూ చూస్తూ అంది జయంతి.

    దాక్షాయణి జయంతికి రెండు చేతుల్తో దండం పెడుతూ....

    జయంతి చెప్పొద్దు అన్నట్లు సైగ చేసింది.

    "ఏంటే జయంతి! చెప్పవే....ఏం జరిగింది?" అంది గిరిజ మళ్ళి కుతూహలంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS