Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 8


    
    "మీకోసం ఎంత కష్టమైన పనయినా చిరునవ్వు చెరగకుండా చేయగలను. మీరు ఎక్కడ వుంటే అక్కడ నందనవనం. పూలతోటలో తిరుగాడే తుమ్మెదకి బోరు కొడుతుందా?"
    
    ఇక ఏ కారణం చెప్పి పంపించి వేయాలా అని ఆలోచించిందిగానీ సరైన ఐడియా ఏమీ తట్టింది కాదు. రంగనాయకే తనకు సరైన సలహా ఇవ్వగలదు.
    
    తనతో వుండడమే బోర్ అన్న తన భర్త సతీష్ గుర్తొచ్చాడు. మగవాళ్ళను అంత ఈజీగా నమ్మకూడదు. ఈ అబ్బాయిని వెళ్ళగొట్టడానికి ఏదో సరైన పథకమే వేయాలి. అప్పటి వరకు ఈ సుత్తి భరించక తప్పదనుకుంది.
    
    "నేను ఇక్కడ వున్నానని ఎలా తెలుసు?" ఆమెకి మొదటినుంచీ వున్న అనుమానం ఇది. ఆమె తెలుసుకోవాలనే ఆ ప్రశ్న అడిగింది.
    
    "మీరు ఇక్కడ వున్నారని తెలియడమేమిటి? నేను మీతో పాటే వచ్చాను"
    
    ఆమె నిర్ఘాంతపోయింది.
    
    "నాతో పాటు వచ్చావా?"
    
    "ఆరోజు ఉదయం నేను షాపులో వున్నాను. మా షాపులో పనిచేసే ఇద్దరు కుర్రాళ్ళు నగల పెట్టెలను శుభ్రం చేస్తున్నారు. సీట్లో కూర్చున్నది మొదలు మీ ఫ్లాట్ వైపే కదా నా చూపు. ఎంతకీ కనపడలేదు మీరు. ఏమైపోయారనే దిగులు మనసంతా కన్నీరై కళ్ళల్లో తేలుతోంది. ఆనీటి మసకలో మీరు ఓ సూట్కేసు చేతపట్టుకుని అపార్ట్ మెంటు నుంచి బయటికి రావడం కనిపించింది"
    
    తన భర్తతో విడిపోయి పుట్టింటికి ప్రయాణమైన ఆ సంఘటనంతా కళ్ళముందు కదులుతోంది ఆమెకి.
    
    "ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. మీ వాలకం చూస్తుంటే ఇక తిరిగి రారనిపించింది. అందుకే నేను మిమ్మల్ని వెంబడించాను. దుకాణంలోని అసిస్టెంట్లకు కూడా చెప్పలేదు. మీరు సరాసరి బస్టాండ్ కు వచ్చారు. ఓ ఎక్స్ ప్రెస్ బస్సెక్కారు. అది ఏవూరు వెళ్ళే బస్సో కూడా చూడలేదు. నేను ఎక్కికూర్చున్నాను"
    
    అతను ఓ క్షణం ఆగి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. "కండక్టర్ వచ్చి టిక్కెట్ అడిగితే మిమ్మల్ని చూపించి మీరు ఎక్కడికి తీసుకుంటే అక్కడికి అన్నాను. కండక్టర్ టిక్కెట్ కొట్టిచ్చాడు. అప్పుడు లెక్క వేసుకుంటే నా జేబులో ఇంకా ఎనిమిది వందల రూపాయల దాకా వున్నాయి. మీరు ఈ వూర్లో దిగగానే నేనూ దిగిపోయాను"
    
    "మరి అప్పట్నుంచీ నువు తిరిగి వెళ్ళలేదా?"
    
    లేదన్నట్లు అతను తల అడ్డంగా వూపాడు.
    
    "నీ నగల దుకాణం?" ఆమె ఆందోళనగా అడిగింది.
    
    "నాకు తెలియదు బహుశా నా అసిస్టెంట్లు రెండు మూడు రోజులు చూసి ఇక రానని నిర్దారించుకున్నాక ఒక్కొక్క నగనే పట్టుకుపోయి వుంటారు. నెలరోజులైంది కదా. ఇప్పటికీ ఏమీ మిగిలివుండదనుకుంటా" అని నవ్వుతున్నాడతను.
    
    ఓ అమ్మాయిని దూరం నుంచి చూసి, ప్రేమించి, ఆమె కోసం నగల దుకాణాన్ని సైతం వదులుకుని గుడ్డిగా ఆమెతోపాటు బస్సు ఎక్కి వచ్చేసిన అతన్ని ఏమనాలి?
    
    పిచ్చివాడా? ప్రేమికుడా? ఏ పేరుతో పిలవాలి?
    
    ఆమె అలా శూన్యంలోకి చూస్తూ వుండిపోయింది.
    
    రంగనాయకి వచ్చేటప్పటికి లిఖిత పాలు పితుకుతోంది.
    
    జితేంద్ర వచ్చినప్పట్నుంచి ఆమె పరధ్యానంగా వుంటుంది. ఏ పని చేస్తున్నా అతనే గుర్తుస్తున్నాడు. తనకోసం ముందూ వెనకా చూడకుండా నగల దుకాణాన్ని వదలి వచ్చేసిన అతని మీద ఎక్కడో ఓ విధమైన ఇంట్రెస్ట్ పుట్టింది. అలాగని అదేం ప్రేమ కాదు. ఓ కొత్త వస్తువును చూసి పిల్లల్లో కలిగే వుత్సుకత లాంటిది. సతీష్ ప్రవర్తనవల్ల అతని కొత్త ప్రపోజల్ వల్ల మగాళ్ళంటేనే అసహ్యించుకునే స్థితికి చేరుకుంది.
    
    కానీ జితేంద్ర వచ్చాక ఆమెలో కొంత మార్పు వచ్చింది. కొన్ని లక్షల రూపాయలు విలువచేసే నగల దుకాణాన్ని వదిలి తనకోసం వచ్చేసిన ఆ కుర్రాడ్ని ఎలా బుజ్జగించి తిరిగి పంపివేయాలో అర్ధం కావడం లేదు. అప్పటికే ఒకటి రెండుసార్లు అతన్ని కలుసుకోవాలనుంది గానీ ఏదో తెలియని బెరుకువల్ల పోలేకపోయింది.
    
    అతను చెబుతున్నదంతా నిజమని కూడా నమ్మలేం గదా. రంగనాయకకి చెప్పి ఎంక్వయిరీ చేయించాలనుకుంది. కానీ ఇదంతా రంగనాయకీకి చెప్పడం కూడా ఇష్టం లేకపోయింది.
    
    ఆమె ఇలాంటి సందిగ్ధంలో వున్నప్పుడు రంగనాయకి వచ్చింది. రంగనాయకి కుర్చీలో కూర్చుంటూ "నేనేమైనా సాయం చేయనా?" అని అడిగింది.
    
    "ఒద్దులే పాలు పితకటం అయిపోయింది...." అని లేచి లోపలి కెళ్ళింది లిఖిత.
    
    అప్పటికే వీధి అరుగుమీద పాల కుర్రాడు రెడీగా వున్నాడు. అతనికి పాలుపోసి, లెక్క చూసుకుని షెడ్డులోకి వచ్చింది.
    
    అప్పుడు సాయంకాలం ఆరే అయినా రాత్రి అయిపోయినట్టుంది. నల్లటి ఆకాశం మబ్బుల గొడుగులా వుంది. ఒకటీ అరా చినుకులు రాలుతున్నాయి గాలి చల్లగా తగుల్తోంది.
    
    లిఖిత రంగనాయకకి ఎదురుగ్గా ఈజీ చైర్ లో కూర్చుని "చాలా రోజులైందే ఇటొచ్చి- డిటెక్టివ్ పనులు ఎక్కువైపోయాయా?" అని అడిగింది నవ్వుతూ.
    
    "అలాంటిదేమీ లేదుగానీ ఇటు రావడానికి కుదరలేదంతే అప్పటికీ నిన్ను చూడాలని చాలాసార్లు మనసు పీకిందనుకో మొత్తానికి నువ్వు నాకు చాలా నచ్చావ్ భర్తతో తెగతెంపులు చేసుకున్న స్త్రీలలో చాలామంది జీవితం ఆఖరయి పోయిందన్న ఫీలింగ్ తో వుంటారు. నువు అలా కాకుండా నెల తిరక్కుండానే స్వంతంగా నీ కాళ్ళమీద నువు నిలబడ్డావ్"
    
    "మగాడి సంపాదన మీద ఆధారపడడం వల్లే మనం చీప్ అయిపోతున్నాం. అందుకే మగాడు వాడిష్ట ప్రకారం మనమీద అధికారం చెలాయిస్తున్నాడు. నా రెండేళ్ళ కాపురంలో నేను తెలుసుకున్న సత్యం ఇదే."
    
    "కరెక్టే అందుకే ఏదో ఒక వృత్తి చేపట్టాలనే నేనూ ఈ డిటెక్టివ్ పనులు చేస్తున్నాననుకో"
    
    "అవునూ ఈ రంగంలోకి ఎలా దిగావ్?"    

    "రంగస్వామి వల్ల నేను మొదట టేకప్ చేసిన కేసు అదే"
    
    "రంగస్వామా? అతనెవరు?"
    
    "మన పక్కవూరే- పెద్దపాలెం"
    
    "అతనేం చేశాడు?"
    
    "మొదట తన భార్యమీద నిఘా వేయబోయి దెబ్బతిన్నాడు. ఆ తరువాత తన భార్య గుట్టు బయట పెట్టమని నన్ను పురమాయించాడు"
    
    "ఎలా?"
    
    "అదంతా పెద్ద కథలే" అని ప్రారంభించింది రంగనాయకి.
    
    "రంగస్వామి చిన్నపాటి కాంట్రాక్టర్. ఆ ఫీల్డ్ లో వున్న వాళ్ళకి అన్ని అలవాట్లూ అలవడతాయి. కాంట్రాక్టు పనులు సాధించుకోవడానికి ఆఫీసర్లను కాకా పట్టాలి. వాళ్ళకి మందుపోసి, మంచి భోజనాలు పెట్టించి, వాళ్ళకి అవసరమైతే పిల్లల్ని తార్చి పబ్బం గడుపుకోవాలి. రంగస్వామి వీటిలో ఆరితేరిన మనిషి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS