అతనూ కూల్ గా సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు.
"నేను అనాధను నేను పుడుతూనే అమ్మా నాన్న తమ పని అయిపోయినట్టు చనిపోయారు. మేనమామ దగ్గర పెరిగాను. గొడ్డుచాకిరీ చేయించుకుని గొడ్డుకారం, సంగటీ వేసేవాళ్ళు ఆ కారం తినేప్పుడంతా మనసు చల్లగా ఉంటుందని అమ్మను తలుచుకునే వాడ్ని బడికి సక్రమంగా పంపకపోయినా ఎలాగోలా పదవ తరగతి పాసయ్యాను. ఓరోజు మామయ్యకు, నాకూ ఘర్షణ జరిగింది"
"ఎందుకు?" అతను ఆపడంతో లిఖిత అడిగింది.
"అత్తయ్య గొలుసు పోయింది"
"బంగారందా?"
"ఆ...."
"నువ్వు ఎత్తుకున్నావా?"
"లేదు"
"మరి?"
"అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఉద్యోగంలో చేరడానికి లంచం ఇవ్వాల్సి వచ్చింది. అతని దగ్గర డబ్బులేదు! అత్తయ్యను అడిగాడు. కుదవపెట్టి డబ్బు తీసుకోమని అత్తయ్య తన గొలుసు ఇచ్చింది. అప్పుడు ఇదంతా చాటుగా ఉండి చూశాను..... మామయ్యకు ఓ రోజు అవసరం పడి ఆ గొలుసు అడిగాడు. అత్తయ్య నిజం చెబితే తన బండారం బయట పడుతుందని భయపడి గొలుసు పోయిందని అబద్దం చెప్పింది"
"తరువాత?"
"ఆ గొలుసు నేనే తీశానని మావయ్య కొట్టాడు. నన్ను దొంగ అన్నాడు. పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. కాని నేను ఎక్కన్నుంచి గొలుసు తెచ్చివ్వగలను? ఆ దెబ్బలకు తాళలేక నిజం చెప్పేద్దామనుకున్నాను. కానీ అన్ని రోజులు అన్నం పెట్టి నన్ను పెంచి పెద్ద చేసిన అత్తయ్యను దోషిగా నిలబెట్టడం ఇష్టం లేకపోయింది. ఇక అక్కడ ఉండి నిజం చెప్పడం ఇష్టంలేక ఆ రాత్రే పట్నానికి పారిపోయి వచ్చాను"
లిఖిత ఏమీ మాట్లాడలేకపోతోంది. ఓ స్త్రీ శీలం కాపాడడానికి తనకు తాను దొంగగా ముద్ర వేసుకున్న ఆ కుర్రాడు తన ముందరే పెరిగిపోతున్నట్లనిపిస్తోంది.
"పట్నంలో ఏం చేసేవాడివి?"
"రకరకాల పనులు చేశాను. బూట్ పాలిష్ దగ్గర్నుంచి రాత్రుళ్ళు లారీ డ్రయివర్లకు నిరోధ్ పెట్టెలందించే వరకు చేయని పనంటూ లేదు. ఏ బంగారు గొలుసువల్ల నేను దొంగ అని ముద్ర వేయించుకొన్నానో, అదే గొలుసులతో వ్యాపారం చేసి దొర అనిపించుకోవాలని అనుకునే వాడ్ని నాకు ప్రపంచంలో కెల్లా నచ్చే సుభాషితం ఏమిటో తెలుసా?"
"ఏమిటది?"
"ఎఫెర్ట్స్ నెవర్ ఫెయిల్' ప్రయత్నం ఫలించకుండా ఉండదు... బంగారు నగల వ్యాపారం చేయాలన్న లక్ష్యం తప్ప మరేదీ కంటికి కనిపించనంతగా కష్టపడ్డాను. కూడబెట్టిన డబ్బుతో టౌనుకు దూరంగా ఓ ఇంటిప్లాటు కొన్నాను. అది నాలుగేళ్ళకు నాలుగింతలు అయింది. మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయి. దాంతో రాజశ్రీ అపార్ట్ మెంట్స్ ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొన్నాను. అందులో జ్యూయలరీ షాపు తెరిచాను." దాని పేరు ఎప్పుడూ చూసే అంగడి తప్ప కొనే అంగడి కాదు గనుక తనూ దాన్ని చూసేది తప్ప ఎప్పుడూ అందులోకి వెళ్ళలేదు.
"మా అపార్ట్ మెంట్స్ ఎదురుగ్గా ఓ షాపుండేది గుర్తొచ్చింది"
"ఓ రోజు మీరు సిటవుట్ లో నిలబడి బట్టలు ఆరవేస్తుండగా మొదటిసారి మిమ్మల్ని చూశాను"
ఆ ఎఫెక్ట్ ఇప్పటికి తనని వదిలిపోనట్లు అతను చెప్పడం ఆపాడు.
"చూస్తే?" ఆమె విసుగ్గా అడిగింది.
అతను ఏమీ పట్టించుకోనట్టు చెప్పాడు. "ఇప్పటికీ ఆరోజు మీరు ఎలా ఉన్నారో గుర్తుంది. మెరూన్ రంగు బెంగాలీ కాటన్ చీరలో కనకాంబరాల తోటలా కనిపించారు. సౌందర్యానికి మీరే పుట్టిల్లులా అనిపించారు. అదిగో ఆ క్షణం ఏమయిందో నాకు తెలియదు. మీ ధ్యాస తప్ప మరేదీ ఈ చిన్న గుండె ఆహ్వానించేది కాదు. మీరు ఎప్పుడు సిటవుట్ లోకి వస్తారా అని కన్రెప్పలు సైతం ఆర్పకుండా చూసేవాడ్ని మీరు అప్పుడప్పుడు అలా తళుక్కున మెరిసి మాయమై పోయేవారు. ఆ క్షణాలనే నెమరువేసుకొంటూ కాలాన్ని లాగించేవాణ్ని. తమాషా ఏమిటో తెలుసా? మీరు ఇప్పటివరకు ఎన్నిరకాల చీరలు కట్టుకొన్నారో చెప్పగలను"
"ఎన్ని?" అడగకుండా ఉండలేకపోయింది.
"మొత్తం అరవయ్ రెండు"
ఆమె లెక్క వేయబోయి, అప్పుడు సాధ్యం కాదని మానేసింది...
"రంగులు కూడా గుర్తుండి పోయాయి" అన్నాడు.
అంత నిశితంగా పరిశీలించిన వాడు తన అందాల కొలతలను కూడా చెప్పగలడు. అందుకే యిక దాన్ని పొడిగించ కూడదనుకొంది.
"ఇవన్నీ ఏదో పెద్ద ఘనకార్యాలుగా చెబుతున్నావుగానీ ఇవి ఎంత చౌకబారు విషయాలో ఆలోచించు. ఒకటవ తరగతి కుర్రాడు లెక్కలు బట్టీలు వేయడం లేదా అలాగే ఇదీను. చీరలు ఎన్ని ఉన్నాయో చెప్పడం పెద్ద కష్టమేం కాదు" అతన్ని నిరుత్సాహపరిచి పంపించి వేయాలన్నది ఆమె ఉద్దేశ్యం.
"ఇదేదో గొప్ప అని మీకు చెప్పడం లేదు.... నేనెంతగా మీకోసం అలమటించానో చెప్పడం కోసమే వివరించాను"
"కానీ నేను వివాహితను"
"ఈ విషయం నాకు తెలిసిన క్షణం మిమ్మల్ని గురించి ఆలోచించడం, కలలు కనడం మానేద్దామని సిన్సియర్ గా ప్రయత్నించాను కానీ వీలయింది కాదు. ఏదయితే మనకు అసాధ్యమనిపిస్తుందో దానికి మనం లొంగిపోవడమే ఉత్తమమని తెలుసుకున్నాను. అందుకే బలవంతంగా గుండె గదులను మూసెయ్యలేకపోయాను. కళ్ళ రెటీనామీద నల్లరంగు పూయలేకపోయాను. మీకోసమే వున్న మనసు పీక నొక్కేయలేక పోయాను"
అంతే తనకు వివాహం అయిన విషయం ఇతనికి తెలుసన్న మాట. తెలిసీ వెంట పడడంలో ఇతని ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అని ఆలోచించింది. ఏమీ ఖచ్చితంగా తెలియడం లేదు.
"చూశావు కదా! ఇక వెళ్ళిపో" అంది.
"వెళ్ళడానికి రాలేదు. మిమ్మల్ని వదిలిపోవడమనేది జరగదు! మీరెక్కడ వుంటే అక్కడే" అతను స్పష్టంగా చెప్పాడు.
"మరి తిండీ తిప్పలు?"
"ఇప్పుడు జరుగుతున్నాయిగా అలానే"
"అంత కష్టం ఎప్పటికీ చేయగలవా అందులోనూ ఈ పల్లెటూర్లో నీకేం తోస్తుంది?"
