తనను చూసి ఎవరుగానో పొరబడి వుంటాడనుకొని, "మీరెవరో అసలు నాకు తెలియదు నా పేరు సూర్యాదేవి" అంది.
మీపేరు అది కాదు. ఇంకా వుంది- సూర్యచంద్ర ప్రభాదేవి మీరు పంతొమ్మిది వందలా అరవై ఆరు ఫిబ్రవరి రెండో తేదీ పుట్టారు. ఎం.ఏ ఫిలాసఫి చదువుకున్నారు. మీ ఎత్తు అయిదూ ఎనిమిది, బరువు ఏభై కేజీలు, మీ చెస్ట్ కొలత.... అదిగో మీకు కోపం వచ్చేసింది అందువల్లే చెప్పనులెండి. ఇక మీ అభిరుచులు అంటారా! మీకు నచ్చిన రంగు తెలుపు. మీకు ఇష్టమైన వంటకం- వేరుశనగపప్పు పకోడి, మీకు ఇష్టమైన పూలు- సన్నజాజులు, మీ హాబీ పుస్తకాలు చదవడం- మీకు నచ్చిన హీరో- నాగార్జున. నచ్చిన హీరోయిన్- శ్రీదేవి. మీకు ఇష్టమైన ప్రదేశం ఊటీ, మీకు నచ్చే డ్రస్ చుడీదార్."
ఆమె ఆశ్చర్యపోయింది. ఇందులో జగదీష్ ఎన్ని చెప్పగలడా అన్న సందేహం వచ్చింది. రాత్రికి ఇంటికెళ్ళాక అడగాలనుకుంది.
"మీరు ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడటానికి బయల్దేరారు. మధ్యలో మీ కారు ట్రబులిచ్చింది. అందుకే మిమ్మల్నే పికప్ చేసుకోవటానికి ఓ ఫ్రెండ్ ని బ్రతిమిలాడి ఈ కారు తీసుకొచ్చాను, రండి వెళదాం"
అలా ముక్కూ ముఖం తెలియనివాడితో వెళ్ళటానికి ఇష్టంలేదు. కానీ ఇప్పుడు బయల్దేరకపోతే ఆర్ట్ ఎగ్జిబిషన్ ని మిస్ అయిపోతుందని తెలుసు. అందుకే ఎటూ నిర్ణయించుకోలేకపోయింది.
"మీరు సంశయిస్తున్నారు. అందుకే తటపటాయిస్తున్నారు. నా గురించి మీకు కొంత తెలిస్తే ఇంత ఇబ్బంది వుండదనుకుంటా అందుకే చెబుతున్నాను. ణ ఆపేరు వసంత్. పెళ్ళి కాలేదు. ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో మకాం. మీరు మరో నిముషంలో బయల్దేరనుకుంటే మీకూ నాకూ ఏమీ కాదు గాని డ్రైవింగ్ మీద నమ్మకంలేక కారు ఇవ్వడానికి ఒక పట్టాన అంగీకరించని నా మిత్రుడు ఫెయిర్ అయిపోయి గుండాగి చచ్చినా ఆశ్చర్యపడనక్కర లేదు"
ఆమె కాలు కదపలేదు. కొద్దిగా కోపాన్ని కూడా ప్రకటిస్తూ నిలబడి పోయింది.
"కోపంలో కూడా మీరెంత అందంగా వున్నారో, అందుకే నేననుకుంటా శ్రీకృష్ణుడంతటి వాడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. ఈ విషయం తెలిసే సత్యభామ "వామపాదంబునన్ తొలగన్ ద్రోసె" అంటూ ముక్కు తిమ్మన భయం భయంగా చెప్పి తనే కథ మధ్యలో దూరి "అట్లయగు నాధుల్ నేరముల్ సేయ, పేరలుకన్ చెందిన కాంతలు" అంటూ సత్యభామ తరపున సంజాయిషీ కూడా చెప్పుకున్నాడు."
అతనెవరో పోల్చుకోలేక పోతోంది. ఆమెకు ఇంతకు ముందెప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు. అంత నాన్ స్టాప్ గా మాట్లాడడం చూస్తుంటే ఓ ప్రక్క కొత్తగా, మరోపక్క కోపంగా వుంది.
రెండురకాల భావనలు కలిగినప్పుడు ఏంచేయాలో తోచదు. అలానేవుంది ఆమె పరిస్థితి.
అతనే మళ్ళీ అన్నాడు. "ఈ సాయంకాలం మిమ్మల్ని చూడడం గొప్ప అనుభవం. ఈ తెల్లటి చుడీదార్ లో మీరెలా వున్నారో తెలుసా? మీ ఒంటి రంగు ఎలా వచ్చిందో తెలియక ఓ చిత్రకారుడు కసికొద్దీ గుప్పెడు మల్లెపూలు మీమీద విసిరినట్లున్నాడు"
ఎవరీ పిచ్చోడు అన్నట్లు రెక్ లెస్ గా అతనివైపు చూసింది. తెల్లటి ఫ్యాంటుమీద తెల్లటి కాటన్ చొక్కా టక్ చేసుకున్నాడు. లేత ముఖం- ఎప్పుడూ నవ్వుతున్నట్లుండే కళ్ళు తనకంటే గుప్పెడు పొడుగున్న ఓ రెండేళ్ళు చిన్నవాడిలా వున్నాడనిపించింది.
ఠక్కున ఎగ్జిబిషన్ గుర్తొచ్చి ఆటోకోసం అటూ ఇటూ చూసింది గానీ ఏమీ రావడం లేదు.
"రండి" అతను అర్దిస్తున్నట్లు అడిగాడు. అలా ఎవరైనా బ్రతిమలాడడం ఆమెకి కొత్త అందుకే మౌనంగా నడిచి కారెక్కింది.
అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు.
కారు కదిలింది.
"ఏనుగునెక్కిన సంతోషం అని నా చిన్నప్పుడు మా అమ్మ అనేది అలాంటి సంతోషం ఇప్పుడు మీరు కారెక్కినప్పుడు కలిగింది కానీ ఆ మాట అనడానికి అమ్మ ఇప్పుడు లేదు."
"ఏమైంది?" ఆమె అనాలోచితంగా అడిగింది.
"నా పదిహేడో ఏట చనిపోయింది"
ఆమె మౌనంగా వుండిపోయింది.
"మూడేళ్ళ క్రితం వరకు నాన్న వుండేవారు. ఇప్పుడు ఆయనా లేరు"
"అక్కచెల్లెళ్ళుగానీ, అన్నదమ్ములుగానీ" ఆమె మధ్యలోనే ఆగిపోయింది.
"ఎవరూ లేరు, ఒక్కమాటలో చెప్పాలంటే అనాధను. మీ పెళ్ళికి నాదస్వరం వాయించింది మా నాన్నే" అన్నాడు. అతనే తిరిగి కొనసాగించాడు. నేను మొదటిసారి చూసింది కూడా అప్పుడే పక్క తాళం వేసేవాడికి జ్వరం రావడంతో తాళం వేయడానికి నన్ను రమ్మన్నాడు నాన్న. మీ పెళ్ళి మంగళ వాయిద్యాల ట్రూప్ లో నేనూ ఒకడినన్నమాట.
ఒకటి రెండు మూడు అని తాళం వేస్తున్న నేను పెళ్ళికూతురి అలంకరణతో వచ్చి పెళ్ళిపీటల మీద కూర్చున్న మిమ్మల్ని మొదటిసారి చూశాను. అంతవరకు కరెక్టుగా తాళం వేస్తున్న నాకు లెక్కతప్పింది. నాన్న కళ్ళతోనే ఉరిమాడు కానీ నాకు అవేమీ పట్టలేదు, మీ సౌందర్యం నా తల తిప్పింది.
అది ప్రేమో, మోహమో, ఆకర్షణో తెలియదుగానీ అంతవరకు ఎప్పుడూ కలగని ఫీలింగ్ నన్ను చుట్టుకుంది. పన్నీటి జలపాతం కింద నేనొక్కడ్నే నిలబడ్డట్టు ఉక్కిరిబిక్కిరయ్యాను మీ పెళ్ళి అయ్యేలోపు మొత్తం ఇరవై ఆరుసార్లు తప్పు తాళం వేశాను"
ఆమె అందం గురించి అంత డైరెక్టుగా ఎవరూ కామెంట్ చేయలేదు. అందుకే ఆమెకి కొత్తకొత్తగానూ భయంభయంగానూ వుంది. అతను ఆమెను చూడకుండా చెప్పుకుపోతున్నాడు.
"ఆ తరువాత నాన్న నెలరోజులకి చనిపోయారు. ఒక్కడ్నే మిగిలి పోయాను. మీరు తప్ప మరేదీ మనసుకు తాకడం లేదు. పెళ్ళికూతుర్ని చూసి మేళం వాయించడానికి వచ్చినవాడు ప్రేమలో పడడం ఎంత ఇడిక్యులస్ గా వుందో చూడండి.
కానీ నేనేం చేయగలను? మనసు నావశం తప్పింది. అందుకే ఏదో పెద్ద లక్ష్యం పెట్టుకుని మిమ్మల్ని మరచిపోదామనుకున్నాను. ఉన్న ఇల్లు అమ్మేశాను. అరవైవేల రూపాయలొచ్చాయి. ఐఏఎస్. కోచింగ్ సెంటర్ లో చేరాను. ప్రిలిమినరీ రాసి పాసయ్యాను. ఇక నావల్ల కాలేదు!
నన్ను నేను ఎంతకాలం మోసం చేసుకోగలను? అప్పటికీ మూడేళ్ళు ఎప్పటికప్పుడు నా ఊహల గొంతు నులిమేయడానికి ప్రయత్నించాను. కానీ ఈ పరీక్షలో మాత్రం ఫెయిలయ్యాను.
ఆమెకి తల తిరిగింది. ఏదో మైకంలాంటిది శరీరాన్ని ముద్దగా పిసికేస్తున్నట్లనిపించింది. అతను నిజం చెబుతున్నాడో అబద్దం చెబుతున్నాడో అంచనా వేయలేకపోయింది. రకరకాల ఫీలింగ్స్ ఒకదాని కొకటి ఢీ కొట్టుకుంటున్నట్లు మనిషంతా వణుకుతోంది.
"అందుకే పుస్తకాలనన్నిటినీ చించేశాను. మీరు తప్ప మరేదీ గుర్తుకు రాకుండా మీపేరు రామకోటిలో కోటిసార్లు రాశాను. రామకోటి రాస్తే మోక్షం వస్తుందంటారు గానీ అది తప్పు. రాముడి పేరు కోటిసార్లు రాశాక రాముడు తప్ప మరేదీ గుర్తుకు రాదు. మరో ధ్యాస వుండదు. మోక్షం గురించిన ఆలోచన కూడా రాదు. అలానే మీ పేరు కోటిసార్లు రాశాక మీరే నా ప్రపంచమంతా నిండిపోయారు."
