"ఆఁ" అతను భయంతో బిగదీసుకుపోయి, అంతలో తేరుకుని, "ఏమిటీ!" అంటూనే ఎడమచేత్తో నుదురుపై భాగాన్ని తడుముకున్నాడు.
ఏదో వుబ్బుగా తగిలినట్లనిపించింది.
"నిజమండీ! మీ నెత్తిమీద కొమ్ములు మొలుస్తున్నాయి" అంది సూర్యాదేవి.
అతను అద్దంలో చూసుకోవడానికి డ్రస్సింగ్ మిర్రర్ వైపు పరుగెత్తాడు.
* * * * *
ఆరోజు ఆదివారం సాయంకాలం ఐదుగంటలకల్లా రెడీ అయి పోయింది సూర్యాదేవి.
ఆమెకు సుస్మిత అనే ఓ స్నేహితురాలుంది. మంచి ఆర్టిస్ట్ తను గీసిన చిత్రాలన్నిటినీ గెస్ట్ లైన్ డేస్ హోటల్ లో ప్రదర్సనకు పెడుతున్నాననీ, ఓసారి వచ్చి వెళ్ళమనీ ఉదయం ఫోన్ చేసి చెప్పింది. ఏవో పనుల వల్ల ఉదయం నుంచీ వెళ్ళడానికి కుదరలేదు. సాయంకాలం ఆరుగంటల కల్లా ప్రదర్శన అయిపోతుంది కాబట్టి త్వరత్వరగా తయారైంది.
"కమాన్ సూర్యా! ఇప్పటికే ఆలస్యమైంది" హడావుడిగా కిందకు దిగుతూ చెప్పాడు.
"మీవల్లే ఆలస్యం, స్నానం చేస్తానని బాత్రూమ్ లో దూరిన మీరు రావడం ఇంకో అరగంటకు ఆర్ట్ ఎగ్జిబిషన్ ని మూసేస్తారు"
"ఓహ్! నీ ప్రోగ్రామ్ అదికదూ! అయితే నిన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేసి, నేను మా ఇంజనీర్ ఇంటికి వెళతాను. వాడి కొడుకు బర్త్ డే అట ఈరోజు. గిఫ్ట్ ల కోసమే కొడుకు బర్త్ డే చేస్తున్నాడని నా అనుమానం. అయినా గిఫ్ట్ తీసుకెళ్ళి వాడి ముఖాన కొట్టాలి" అన్నాడు.
"ఇంజనీర్లూ, కాంట్రాక్టులూ ఎప్పుడూ వుండేవేగా అలా సరదాగా రాకూడదూ సుస్మిత బాగా వేస్తుంది బొమ్మలు మీకు ఒకసారి పరిచయం చేశాను కూడా."
"మరి కుదిరిచావదే. ఆ ఇంజనీర్ కొడుకు ఫంక్షన్ కూడా ఆరుగంటలకే. వెళ్ళకుంటే గిఫ్ట్ ఇవ్వాలనే ఎగ్గొట్టాననుకునే ప్రమాదం వుంది. కాబట్టి నువ్వెళ్ళిరా అయినా ఈ ఆర్ట్ ల గురించి నాకేమీ తెలియదు"
"అలా అనుకుంటే నాకు మాత్రం ఏం తెలుసు? ఆ చిత్రాలు యే భావాన్ని ప్రకటిస్తున్నాయో ఫీల్ కాగలిగితే చాలు" అంది సూర్య.
"ఆ ఫీలింగ్ కూడా నాకు తెలియదే. ఎనీ హౌ నువ్వెళ్ళి ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసిరా నేను ఇంజనీర్ ఇంటికెళ్ళి ఏడుగంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను."
ఇక రమ్మనమని భర్తను బలవంతం చేయలేదామె.
ఇద్దరూ పోర్టికోలోకి వచ్చి కారెక్కారు.
"గెస్ట్ లైన్ డేస్ హోటల్" జగదీష్ చెప్పాడు డ్రయివర్ తో కారు ముందుకు కదిలింది.
విండో మిర్రర్ని డౌన్ చేసి బయటకి చూస్తోంది ఆమె పడమటి కొండల్లో సూర్యుడు ఇంకిపోతున్నాడు. పగలంతా తిరిగి అలిసిపోయిన సూర్యుడు సేద తీర్చుకోవడానికి సంధ్యాదేవి కొంగును కింద పరుచుకుని నిద్ర కుపక్రమిస్తున్నట్లు పడమటి కొండలంతా ఎర్రగా కనిపిస్తున్నాయి.
రోడ్డు కాలువల్లో జనం పారుతున్నట్లు రద్దీగా వుంది. క్రయానికి తయారైపోయిన జాణల్లా షోకుషోకుగా వున్నాయి దుకాణాలు. అప్పుడే ప్రాణం వచ్చి పరుగెడుతున్నట్లు కార్లు దూసుకెళుతున్నాయి.
కారు స్లో అయింది.
"ఏమైంది?" పాకెట్ కాలిక్యులేటర్ లో ఏదో లెక్కలు వేసుకుంటున్న జగదీష్ తలపైకెత్తి అడిగాడు.
"రెడ్ సిగ్నల్" నవ్వుతూ చెప్పింది సూర్యాదేవి.
మరో రెండు నిముషాలకి క్లియరైంది. డ్రైవర్ గేరు మారుస్తుండగా ఇంజన్ ఆగిపోయింది. డ్రైవర్ ఇగ్నీషన్ కీ తిప్పుతున్నాడుగానీ స్టార్టు కావడం లేదు.
"ఏమైంది?" జగదీష్ అసహనంగా అడిగాడు.
"ట్రబులొచ్చినట్లుంది సార్" భయపడుతూ చెప్పాడు డ్రైవర్.
"అందుకే బయల్దేరేటప్పుడు చూసుకోండయ్యా అని చెప్పేది ఒక్కరూ వినరే."
డ్రైవర్ ఏమీ బదులు చెప్పక, స్టార్ట్ చేయడానికి ఏవో తిప్పలు పడుతున్నాడు.
"అయిదున్నర అయిపోయిందే, ఇప్పుడెలాగండీ? ఎగ్జిబిషన్ ఆరుగంటలకు క్లోజ్ చేస్తారే" సూర్యాదేవిలో కంగారు మొదలైంది.
"నా పరిస్థితి అదే ఆరుగంటలకల్లా అక్కడ వుంటానని చెప్పాను. చేసేదేమీలేదు. చెరో టాక్సీలో వెళ్ళిపోవడమే" అంటూ జగదీష్ కిందకు దిగాడు.
ముందు విండోవైపుకి వంగి "మెకానిక్ ని పిలిపించి ఏమైందో చూడు. మేజర్ నుకుంటే ఇంటికెళ్ళి మరో కారు తీసుకుని గెస్ట్ లైన్ డేస్ కి వెళ్ళి అమ్మగార్ని పికప్ చేసుకుని రా" అని డ్రైవర్ తో చెప్పాడు.
ఇద్దరూ రోడ్డుకి పక్కగా వచ్చి నిలబడ్డాడు.
అంతలో ఓ టాక్సీ కనపడితే చేయి వూపాడు.
అది వచ్చి ఆగింది.
"గెస్ట్ లైన్ డేస్"
"సారీసర్ యూనివర్శిటీ వైపెళుతున్నాను అటైతే డ్రాప్ చేస్తాను" అన్నాడు డ్రైవర్.
ఇంజనీర్ ఇల్లు ఆటే జవడంతో "మరి నేవెళ్ళిరానా సూర్యా ఏదైనా టాక్సీ వస్తే వెళ్ళు"
"అలాగే మీరెళ్ళండి"
జగదీష్ ఎక్కేశాడు టాక్సీ వెళ్ళిపోయింది.
సూర్యాదేవి ఒంటరిగా నిలబడిపోయింది. టైమ్ అయిదూ నలభై కావస్తోంది.
ఒక్క టాక్సీ కూడా రావడం లేదు. రెండు మూడు ఆటోలు వచ్చాయి గానీ ఒక్కటీ ఖాళీగా లేదు.
అసహనంతో అటూ ఇటూ చూస్తోంది.
అంతలో ఓ కారు వచ్చి తన ముందు ఆగడం గమనించింది. డ్రైవింగ్ చేస్తున్న ఓ యువకుడు ఆమె దగ్గరికి వచ్చాడు.
"ప్రపంచశాంతి" అంటూ రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు.
ఆమె ఏమీ అర్ధంకానట్లు ప్లాట్ గా చూసింది.
"హలో, నమస్కారం, గుడ్ మార్నింగ్ అని మీరంతా వాడుతుంటారే దానికి ఇది ప్రత్యామ్నాయ పదం. అందరూ గుడ్ మార్నింగ్ లూ, గుడ్ నైట్ లూ మానేసి నాలా ప్రపంచశాంతి అనుకుంటే ఎంత బావుంటుందో ఊహించండి. ఎప్పుడూ ఆ పధం వాడుతుండడం వల్ల మనిషికి యుద్ధం మీద, హింసమీద ఏవగింపు పుడుతుంది. అప్పుడు బోస్నియాలో బోసినవ్వు మాయమై వుండదు. మొగదీషులో నల్లటి రక్తం ఒలికుండదు జాఫ్నాలో పాంజాబిల్లికి నెత్తురు మారక అలంటి వుండదు. కాశ్మీర్ లో చావుకేక వినిపించదు. ఏమంటారు?" అన్నాడు అతను.
"ఎవరు మీరు?" ఆమె అయోమయంలోంచి తేరుకోకుండానే అడిగింది.
"అదంత అనవసరమంటారా? ఈ ప్రశ్నను మనం మామూలుగానే వేసేస్తుంటారుగానీ నిజంగా దీనికి సమాధానం చెప్పడం ఎంత కష్టం!
ఈ ప్రశ్న మొత్తం ప్రపంచాన్నే వూగించింది. ఒక్కసారి శ్రీరాముడు వశిష్టుడి ఆశ్రమానికి వెళతాడు. వచ్చిందో ఎవరో తెలియక, "ఎవరు నువ్వు?" అని అడుగుతాడు వసిష్ఠుడు "అది తెలుసుకోవడానికే వచ్చాను గురువర్యా" అనంటాడు రాముడు"
