Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 7


    సుజన కుర్చీలో సర్దుకొని కూర్చుంది. నిరుపమ ఆ జ్ఞాపకాలన్నిటినీ మనసు పొరల్లోంచి బయటికి లాగినట్లు అటూ ఇటూ కదిలి చెప్పటం ప్రారంభించింది.    

    "నాకు అప్పుడు ఇరవయ్ రెండేళ్ళు. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. పీజీ చెయ్యాలనిపించలేదు. చదువు బోర్ కొట్టేసింది. చదువు బోర్ కొట్టిందంటే మరేదో కావాలనిపిస్తూ వుందన్నమాట. ఏదో తెలియని ఆరాటం ప్రారంభమయింది. ఇదీ అని చెప్పలేను గానీ జీవితంలో ఏదో మార్పు కావాలని కోరుకుంటోంది మనసు. ఎవరితోనో గాఢంగా మాట్లాడాలని, అతని కోసం ఎదురుచూడాలనీ, పిండివంటలు తినిపించాలనీ, వెన్నెల్లో ఆరుబయట మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పాలనిపిస్తోంది.
    
    ఎంఏ చదవటానికి ఆర్ధికరీత్యా కూడా కష్టం కావడంతో మా నాన్న కూడా నన్ను బలవంతం చేయలేదు. అమ్మా, నాన్నలకు - నేను, మా అన్నయ్య సంతానం.
    
    మా పొలంకాక మరో అయిదు ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు వాడు. వ్యవసాయమే మాకు వృత్తి.
    
    మంచి సంబంధం వచ్చిందని మొదట మా అన్నయ్యకి పెళ్ళి చేసారు. మా వదిన కాపురానికి వచ్చింది. ఆమె నాకంటే రెండేళ్ళు చిన్నది. బాగా కలుపుగోలుగా వుండేది.
    
    మా ఇంట్లో ముందు వరండా కాక రెండే గదులు. మొదటి గది మా అన్నయ్యా వాళ్ళు వాడుకునే వాళ్ళు.
    
    వాళ్ళిద్దర్నీ చూస్తుంటే నా బాధ మరింత ఎక్కువైంది. చూడకూడదనుకున్నా వాళ్ళ సరసాలు కళ్ళబడేవి. వినకూడదనుకున్నా వాళ్ళ మాటలు వినపడేవి. అలాంటి సమయాల్లో శరీరమంతా తీయగా మూల్గేది. రాత్రిళ్ళు అయితే మరీ ఘోరం. బెడ్ రూమ్ లో వాళ్ళిద్దరూ పడుకునేవాళ్ళు.
    
    నేనూ, అమ్మా, నాన్నా వరండాలో పడకలు వేసుకునేవాళ్ళం అమ్మా, నాన్నా ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతున్నా నా చెవులు మాత్రం బెడ్ రూమ్ తలుపులకు వేలాడుతుండేవి. గుసగుసలూ, నవ్వులూ తరువాత లైట్ ఆరిపోయేది.
    
    ఇక నా అవస్థ వర్ణనాతీతం. కొబ్బరి ఆకుల మధ్య వేలాడుతూ కనిపించే చంద్రవంక నా యవ్వనాన్ని మేల్కొల్పే కొరడా కొసలా అనిపించేది. నా అవయవాల్లో దూరి అల్లరిపెట్టే గాలి ఎవరో పంపిన ప్రణయ రాయబారాన్ని నాకు వినిపిస్తున్నట్టే వుండేది. నేను పడుకున్న నులకమంచం కోర్కెల్ని రేపే మంత్రాల పల్లకిలా తోచేది.
    
    అంతలో గదిలో లైటు వెలిగేది. తలుపు కొద్దిగా తెరుచుకునేది. వదిణ తలమాత్రం బయటపెట్టి మేము నిద్రపోయామో లేదోనని పరికించి చూసేది. అప్పటి ఆమె ముఖంలో కనిపించే చెమట బిందువులు ఆ మసక వెన్నెల్లో పగడం రాయిమీద ఆరబెట్టిన ముత్యాల్లా కనిపించేవి.
    
    నాకంటే రెండేళ్ళు చిన్నదయిన ఆమె అంత సుఖపడిపోవడం చూస్తుంటే ఈర్ష్యలాంటిది తేలుకొండెలా లేచేది. ఇంట్లో మొదట ఆడపిల్లలకి పెళ్లి చేయాలని పెద్దలు ఎందుకంటారో నాకప్పుడు అర్ధమయింది.
    
    ఇదిగో ఇలాంటి సమయంలో నాకో పెళ్ళి సంబంధం వచ్చింది. పెళ్లికొడుకు పేరు ఆనంద్. మా పక్క వూరే. ఇందుకూరు పేటలో వి.డి.ఓ. ముందూ వెనకా ఎవరూ లేరు. శుక్రవారం రోజు పెళ్లిచూపుల కొస్తున్నట్లు అతని దగ్గర్నుంచి వర్తమానం అందింది.
    
    నాకు అప్పట్నుంచీ కాలు ఓ దగ్గర నిలువలేదు. ఏం చేస్తున్నా ఏదో అలజడి నన్ను వూపేయడం ప్రారంభించింది. కళ్ళు మూసుకుంటే చాలు ఏదో అస్పష్టమైన రూపం నామీద వాలిపోతున్నట్లే వుంది. సాయంకాలం కాలవగట్లంట నడుస్తుంటే ఎవరో నా పైట చెంగును వెనక నుంచి లాగుతున్న భ్రమ కలుగుతోంది. స్నానం చేయడానికి బట్టలన్నీ విప్పుతుంటే ఎవరో దొంగచాటుగా చూస్తున్న భావనే గుబులు పుట్టిస్తోంది. ఇరవై మూడేళ్ళ యవ్వనం ఇంద్రజాలం ఇదంతానని సరిపెట్టుకున్నాను.
    
    శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజే నాన్నా, అన్నయ్యా కోర్టు పనిమీద నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది.
    
    "మీరే ఎలానో మేనేజ్ చేసెయ్యండి. ఈ వాయిదా విషయం మరిచిపోయి శుక్రవారం వస్తానంటే సరేనన్నాను" అని నాన్న వెళ్ళిపోయాడు.
    
    ఇంట్లో నేనూ, అమ్మా, వదినా మిగిలాం.
    
    సాయంకాలం నాలుగుగంటల ప్రాంతాన పెళ్లికొడుకు ఒక్కడే వచ్చాడు. సాధారణంగా పెళ్లిచూపులకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ను తీసుకుని వస్తారు. ఇదేమిటి? ఈయన ఒక్కరే వచ్చారని అనుకున్నాను.
    
    ఈజీగా తయారయ్యే కేసరి చేసింది మా వదిన. కేసరితోపాటు వడలూ కాల్చింది. టిఫిన్లు అయ్యాక కాఫీ నేనే ఎత్తుకెళ్ళి ఇచ్చాను.
    
    కాఫీ గ్లాసును చేతిలోకి తీసుకుని 'మంచినీళ్ళు' అని అడిగాడు.
    
    మరొకసారి నన్ను నింపాదిగా చూసేందుకే నన్ను మంచినీళ్ళు తెమ్మని ఆయన పురమాయించాడని గ్రహించాను.
    
    మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చాను.
    
    అలా మా పెళ్లిచూపులు జరిగాయి. ప్రత్యేకించి చూసినట్లు కాకుండా ఏదో కాజువల్ గా చూసినట్లు జరిపించింది మా వదిన. ఇదంతా ఆమె ఐడియానే.
    
    టిఫిన్లు అయ్యాక "మీకు బోర్ కొడుతూ వుందనుకుంటా. అలా వెళ్ళి మా పొలాలు చూసిరండి. మా నిరుపమ మీకు తోడుగా వస్తుంది" అని అతనితో చెప్పింది వదిన.
    
    "అలానే"
    
    తలుపుచాటున నిలబడి ఇదంతా విన్న నాకు గుండె జల్లుమంది. అతనితో కలిసి వెళ్ళడం ఏదో బెరుకుగానూ, థ్రిల్లింగ్ గానూ వుంది.
    
    ఇద్దరం బయలుదేరాం దొడ్డిదారి గుండా పొలాల్లోకి ప్రవేశించాం.
    
    నేను ముందూ, అతను వెనకా.
    
    రోజూ చూసే సాయంకాలమే అయినా ఆరోజు కొత్తగా వున్నట్లుంది నాకు.
    
    పచ్చటి పొలాల మీదనుంచి పైకెగురుతున్న గువ్వలు భూదేవి కాలికి వున్న మ్వెంది మువ్వలు గాలికి వూగుతున్నట్లు కనిపించాయి. ఆకాశంలోని తెల్లటి మబ్బులు రెల్లుదుబ్బుల్లా వున్నాయి. సూర్యకిరణాలు వేలాడదీసిన కనకాంబరాల దండల్లా అనిపించాయి.
    
    ఇలాంటప్పుడు సంభాషణను నడిపించటం చాలా కష్టం గుండెల్లో రకరకాల భావనలు గొంతులో సప్తస్వరాలను పలికిస్తున్నాయి. అందుకే యిలాంటప్పుడు మాటకంటే పాటే వస్తుంది.
    
    కూలీలు పనంతా ముగించుకుని పొలాల గట్లంబడి నడుస్తూ పాటలు ఎందుకు పాడతారో నాకప్పుడు అర్ధమైంది.
    
    "మీ వూరు బావుంది" అన్నాడు అతను.
    
    "ఊఁ" అన్నాను. అంతకుమించి మాట్లాడలేకపోయాను.
    
    "మీరు అంతకంటే చాలా బావున్నారు"
    
    రక్తమంతా నా బుగ్గల్లోకి ఎగజిమ్మింది నా బుగ్గల్లోని ఎరుపు సంధ్యకాంతితో పోటీపడుతున్నట్లనిపించింది.
    
    "మీకు నేను నచ్చానా?" ప్రతి మగాడూ టెన్షన్ తో ఎదురుచూసే ప్రశ్న అది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS