Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 8


    వినోద్ చదువుతున్న పేపర్ పక్కనపడేసి వచ్చి వాడ్ని ఎత్తుకుని వూరడిస్తూ "పసివాడ్ని కొట్టడానికి బుద్దిలేదూ" అన్నాడు.
    
    "అంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఒలకబోస్తే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలా? ప్రియ మొన్న ఫారిన్ వెళ్ళినప్పుడు తెచ్చిన వాటిలోకెల్లా ఇదే ఖరీదైంది" కోపంగా అంది.
    
    ఆమెని అతను ఇంత ధైర్యంగా మాట అనడం నేను చూడడం ఇదే మొదటిసారి! వినోద్ ని ఎన్నన్నా పట్టించుకోడు. కానీ కొడుకు మీద చెయ్యి చేసుకుంటే, పిల్లిలాంటి వాడు కూడా ఎదురు తిరిగాడు. నాకెంతో ఉత్సాహంగా అనిపించింది. వినోద్ స్థానంలో బాబుని ఎత్తుకుని ఆనంద్ కనిపిస్తున్నాడు. హృదయం ఆనందంతో నిండిపోయినట్లుగా అనిపించింది.
    
    దమయంతి ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి అందించి "డాక్టర్ ఏవన్నారూ?" అంది.
    
    నేను అత్తయ్య చెప్తుందేమోనని ఎదురుచూసాను.
    
    ఆవిడ వెంటనే "నువ్వెళ్ళి పూరీలకి పిండి కలుపు జయంతీ వాళ్ళు టిఫిన్ చేసి ఎక్కడో వెళ్ళాలిట" అంది.
    
    నాకు చాలా ఆశాభంగంగా అనిపించింది. కోడలు నెల తప్పి వంశాన్ని ఉద్దరిస్తుంటే వూరందరికీ గర్వంగా, ఘనంగా చెప్పుకోవల్సిందిపోయి. ఈవిడ ఇలా చేస్తుందేమిటా అనిపించింది.
    
    జయంతికి తెలిసిందనుకుంటా నన్ను పరీక్షగా చూసి "నీకు ఈ విషయం ముందే తెలుసా?" అంది.
    
    "తెలీదు" అన్నాను.
    
    "వాంతులవీ అవలేదా?" అనడిగింది.
    
    "ఊహూ!" అన్నాను.
        
    అంతే! బాబుని తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోయింది. అదే అమ్మమ్మ వుంటే ఎంత బావుండేది....నాకు వెంటనే ఆవిడ పోయేముందు ఆనంద్ తో అన్నమాటలు గుర్తొచ్చాయి. నేను 'దాని కడుపునా పుట్టాలనుకుంటున్నాను' అంది. అంటే నా కడుపునా పడ్డది ఆవిడేనేమో! ఎంతో ఆప్యాయంగా కడుపుని తడుముకున్నాను. ప్రైవేట్లు చెప్పి, వంటలు చేసి ఆ డబ్బుతో నాకు ఏ కొరతా రాకుండా పెంచిన అమ్మమ్మ గుర్తొచ్చి హృదయం భారమైంది. చాలా రోజులకి దేవుడి మీదకి మనసుపోయింది. గుడికి వెళ్ళాలనిపించింది. ముదురు ఆకుపచ్చరంగు అంచున్న గంధం కలర్ పట్టుచీర కట్టుకున్నాను. అత్తయ్య నాకు ఇచ్చిన నగలు పెట్టుకున్నాను. చెవులకి జూకాలూ, మాటీలూ, మెడలో పెద్దగొలుసూ, దండ కడియాలూ, ముత్యాల గాజులూ అద్దంలో నా రూపం నాకే కొత్తగా అనిపించింది.
    
    దమయంతి మరువం కనకాంబరాలూ వేసి కట్టిన పూలదండ తెచ్చిజడలో పెట్టింది.
    
    "దమయంతీ....నీకో విషయం తెలుసా?" గొంతు తగ్గించి రహస్యంగా అడిగాను.
    
    "ఏమిటమ్మా?"
    
    "నేను....నేను తల్లిని కాబోతున్నాను. మా అమ్మమ్మ నా కడుపున పుట్టబోతోంది" మెరుస్తున్న కళ్ళతో చెప్పాను.
    
    "శుభవార్త చెప్పారు. ఏవైనా తినాలని వుంటే నాతో చెప్పండమ్మా" ఆమె గొంతులో మాత్రం నాకే ఎగ్జయిట్ మెంట్ వినపడలేదు.
    
    "రాత్రికి గోంగూరపచ్చడి చెయ్యి" అన్నాను.
    
    "అలాగేనమ్మా!" ఆమె వెళ్ళిపోయింది.
    
    నేను హాల్లోకి వెళ్ళేసరికే మావయ్యా, అత్తయ్యా సీరియస్ గా మాట్లాడుతూ కనిపించారు.
    
    "అత్తయ్యా! గుడికెళుతున్నాను" అన్నాను.
    
    "డ్రైవర్ కి కారు తీయమని చెప్పు" అన్నాడు మావయ్య.
    
    "ఒద్దు మావయ్యా....రోజూ కాసేపు నడవమని డాక్టర్ చెప్పింది. పైగా పెద్ద దూరం కూడా లేదు." అన్నాను.
    
    "అయినా చూసేవాళ్ళు ఏవనుకుంటారూ? నడవాలంటే ప్రొద్దుటే లేచి మన కారులో బ్రహ్మానందరెడ్డి పార్క్ కి వెళ్ళి కాసేపు నడిచిరా" అంది అత్తయ్య.
    
    ప్రతి పనీ లోకం కోసం తప్ప వీళ్ళకోసం కాదన్నమాట! ఛీ! చిన్నపాటి స్వతంత్రం కూడా లేదు. విసుగ్గా వెళ్ళి కారులో కూర్చున్నాను.
    
    అమ్మమ్మ పోయినప్పుడు వున్న ఒక్క బంధం పోయింది. ఇంక వీళ్ళతో ఏం పని అనుకున్నాను. ఈ పంజరం నుండి ఎగిరిపోయి ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బ్రతకాలని ఆలోచించాను, కానీ మళ్ళీ ఇంకో కొత్త బంధం వచ్చి చుట్టుకుంది. ఇవన్నీ మనిషిని బంధించే ఇనప సంకెళ్ళు!
    
    "ఏ గుడికమ్మా?" అడిగాడు డ్రైవర్.
    
    "వేణుగోపాలస్వామి గుడికి" అన్నాను.
    
    సాయంత్రం మూలాన ఫ్రెష్ పూలతో అలంకరించబడిన వేణుగోపాలస్వామి మనోహరంగా వున్నాడు. పూజారికి టెంకాయా, పూలూ, పండ్లూ ఇచ్చి అర్చన చేయమన్నాను.
    
    "పేరు?" అడిగాడు.
    
    ఆనంద్ పేరు చెప్పాలా? ఒక్క నిమిషం ఆలోచించాను. పునిస్త్రీ ఎప్పుడూ భర్త పేరుతోనే అర్చన చేయించాలి. అతని ఆరోగ్యం కోసం, ఆనందం కోసం! మరో స్త్రీ పొందుకోరి వెళ్ళేవాడికి వయసు మీదపడితే వయాగ్రా కూడా కొనివ్వడం పతివ్రతా లక్షణమేమో!
    
    "పేరు చెప్పండమ్మా?" పూజారి మళ్ళీ అడిగాడు.
    
    "ఆనంద్" అని గోత్రం కూడా చెప్పాను. ఇంక నేను నిశ్చింతగా వుండచ్చు మొత్తం పూజాఫలం పుణ్యం అంతా నాకొచ్చేస్తుంది. అతని పుణ్యం....అతని ఆనందం....అన్నీ నావేగా! అందుకే పురుషులు వాళ్ళమటుకు వాళ్ళు సుఖం చూసుకుంటారు.
    
    గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. పూజారి పెట్టిన ప్రసాదం తింటూ కూర్చున్నాను.
    
    "బావున్నావా సుమతీ?" అని వినపడింది.
    
    పెళ్ళయ్యాక ఎవరు నన్ను అలా పలకరించినవాళ్ళు తారసపడలేదు. నా పేరు వింటే నాకే వింతగా! తలెత్తి చూస్తే....విరించి!
    
    "మీరూ..." ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను.
    
    లాల్చీ పైజామాలో గెడ్డం పెంచి అచ్చు అలాగే వున్నాడు ఎటొచ్చీ కాస్త లావయ్యాడు. నా ఎదురుగుండా వచ్చి నేలమీద కూర్చుని "చాలా రోజులయింది కదూ కలిసి....చాలా మారిపోయావు" అన్నాడు.
    
    "మీరు కాస్త లావయ్యారు" అన్నాను. అతను చివరిసారి కలిసినప్పుడు అన్నమాటలూ, మాధవిని చెంపదెబ్బ కొట్టడం గుర్తొచ్చాయి. "పువ్వులోని మకరందం గ్రోలడం తుమ్మెదకెంత ముఖ్యమో పువ్వుకీ అంతే ముఖ్యం" అన్నాడు కాస్త మోతాదు మించిన భావుకత్వంతో చెప్పినా ఫాక్టే!
    
    "అప్పుడు సన్నజాజి మొగ్గలా వుండేదానివి.....ఇప్పుడు ముద్దబంతి పువ్వులా వున్నావు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS