"మా ఆయన వున్నారా?" అడిగాను.
"వున్నాడు లైన్ లో వుండు" అంది.
లేడు అని చెప్పి వుంటే నేను సంతోషించేదాన్నేమో ఆమె అంతధైర్యంగా 'నీ మొగుడు నా దగ్గరే వున్నాడు. ఏం చేస్తావైతే?' అని ప్రవర్తించడం నాకు బాధ కలిగించింది.
ఆనంద్ లైన్లోకి వచ్చాడు. "హలో....ఏమిటీ?" అన్నాడు.
"అమ్మమ్మకి సీరియస్ గా వుంది. మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది" అన్నాను.
"ఏ హాస్పిటల్?" అడిగాడు.
"ఇంద్రలోక్" చెప్పాను.
"వస్తున్నాను" అని పెట్టేసాడు.
నాకు ఆ మాత్రానికే చాలా సంతోషం వేసింది ఎందుకు ఫోన్ చేసావు అని అతను నన్ను తిట్టనందుకు!
ఆనంద్ నిజంగానే వచ్చాడు.
అమ్మమ్మ అతని చేతులు పట్టుకుని ఆయాసంతో ఆగి ఆగి మాట్లాడుతూనే-
"సు...మ...తి...అమా...య...కు...రాలు....దాన్ని బాగా చూసుకో దాని కడుపున పుట్టాలని.... ఆశగా వుంది." అంది.
అతను ఆవిడ వీపు నిమిరి- "అలాగే...అలాగే" అన్నాడు.
అతనలా హామీ ఇస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది.
ఎందుకో ఆశగా కూడా అన్పించింది.
ఆ మాత్రం ఊరడింపుకే మురిసిపోయి అమ్మమ్మ "సుమా....నా బంగారుతల్లీ...ఆనంద్ మారిపోయాడమ్మా!" అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి....ఆ సంతోషాన్ని పట్టలేక కన్నుమూసింది.
నా కోసం నిజంగా ఆలోచించే ఒక్కగానొక్క ఆత్మబంధువూ పోయింది. ఇంక నాకెవరూ లేరు! ఎవరికోసమూ నేను తలవంచి బ్రతకనక్కరలేదు. ఇంక ఈ యింటిలో నేను వుండనవసరం లేదు అనిపించింది.
అత్తయ్యా, మావయ్యా నన్ను కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వుండమన్నారు.
నేను వుండనని ఇంటికి వచ్చేసాను.
నా ఇల్లు నాకు ఫస్ట్ క్లాస్ జైలులాగా చాలా సౌకర్యంగా వుంటుంది.
నాకు అలవాటైపోయింది.
మాధవి వచ్చి నన్ను ఓదార్చి వెళ్ళింది. ఎవరెన్ని చెప్పినా నాకు నా ఒంటరితనం గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొస్తూనే వుంది.
అలాగే అమ్మమ్మ ఫోటో గుండెలకేసి హత్తుకుని ఆరోజు అలాగే ఏడుస్తూ పడుకున్నాను.
ఆనంద్ వచ్చాడు.
నేను లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను.
అతనూ నా వెనకే వచ్చాడు.
ఏదయినా ఓదార్పుగా అంటాడనుకున్నాను.
దగ్గరగా వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకున్నాడు.
"ఒద్దు...ఒద్దు" అన్నానే కానీ సరయిన భోజనం, నిద్రా లేని బలహీనమైన శరీరం ప్రతిఘటించలేకపోతోంది.
అతను నన్ను భార్యగా చూసినందుకు ఆనందించాలో ఏడవాలో తెలీని పరిస్థితి నాది! శరీరమంతా పచ్చిపుండులా మారింది!
మాధవికి జరిగినదంతా ఉత్తరంలో వ్రాసాను.
అది ఫోన్ లో - "నీకు ఆ సుఖం అంటే వెగటు పుట్టిస్తున్నాడే మొద్దూ" అంది.
నాకు నిజమే అన్పించింది. ప్రియంవదతో ఇలా ప్రతిరాత్రీ ప్రవర్తిస్తే భరిస్తుందా అనుకున్నాను.
ఆ రాత్రి మంచి నిద్రలో వుండగా అతను మళ్ళీ నా గదిలోకి వచ్చాడు. మనిషి మీద పడిన స్పర్శకి కళ్ళు తెరిచాను.
ఆనంద్ నన్ను బలవంతంగా తనవేపు తిప్పుకుంటున్నాడు.
నెప్పి ఏమాత్రం ఓర్చుకోడానికి సంసిద్ధంగా లేని శరీర ఒప్పుకోనంది. డేగ నోట చిక్కిన కోడిపిల్లలా నేను తన్నుకున్నాను. అతను బాగా తాగినట్లున్నాడు. నేను పుట్టాక ఎన్నడూ విననటువంటి బూతు మాటలు మాట్లాడసాగాడు.
ఆ మాటలకి సిగ్గుతో నా ప్రాణం పోయినట్లుగా అయింది. నన్ను బలవంతంగా అనుభవించి తన కోరిక తీర్చుకుని వెళ్ళిపోయాడు.
ఇలా నాలుగు రోజులు గడిచాయి. ఐదో రోజున నేను హాస్పిటల్లో ఎడ్మిట్ అయ్యాను.
* * *
"అమ్మాయి చాలా ఎనిమిక్ గా వుంది. కంప్లీట్ రెస్ట్ కావాలి" అంది డాక్టర్.
"డాక్టర్! బలానికీ, రక్తం పట్టడానికి మంచి ఖరీదయిన టానిక్స్ రాసివ్వండి. రోజూ పండ్లరసం ఇవ్వమంటారా?" అంటూ మావయ్య విపరీతమయిన కంగారు ప్రదర్శించాడు.
అత్తయ్య నా తలనిమిరి - "ఓ నెలరోజులు మా అబ్బాయి దేశంలో వుండడంలేదు. మా ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను" అంది.
"ఒద్దు మా ఇంటికి వెళ్ళిపోతాను" అన్నాను.
నా కళ్ళకి అత్తయ్యా, మావయ్యా శత్రువుల్లా కనిపించారు.
"నో...నో....మీకిప్పుడు కంప్లీట్ రెస్ట్ కావాలి. తల్లి కాబోతున్నారు కదా!" అంది డాక్టరు.
"ఏవన్నారూ?" అత్తయ్య ఆశ్చర్యంగా అడిగింది.
"రియల్లీ!" అన్నాడు మావయ్య..
నా కళ్ళు పత్తికాయల్లా పెద్దవి చేసి చూస్తుండిపోయాను. నా చెవులు నన్ను ఆ మాట నమ్మవద్దంటున్నాయి!
"అవును షి ఈజ్ ప్రెగ్నెంట్!" అంది డాక్టర్.
'ఔను! ఆనంద్ నన్ను మొదటిసారి కలిసి నెల దాటిపోయింది. నాకెందుకో ఆ డౌటే రాలేదు! ఇప్పుడేం చేస్తుంది ఆ ప్రియంవద?'
ఎంతో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ఒక విధంగా ఇది ప్రియంవద మీద గెలుపు! ఆమె ఎప్పటికీ ఆనంద్ తో పిల్లలని కనలేదుగా! కడుపు వైపు చూసుకుని చెయ్యి వేసి నిమురుకుంటే ఎంతో సంతోషంగా అనిపించింది.
అత్తయ్య ఏదేదో మాట్లాడిస్తోంది. కానీ నా మనసు మాత్రం ఆనంద్ ఈ వార్త వింటే ఎలా ప్రతిస్పందిస్తాడా అని ఆలోచిస్తోంది. ఏ మగవాడికైనా తన పురుషత్వాన్ని ప్రపంచానికి చాటుకోడానికి మార్గాలు సంతానం. అందుకే వాళ్ళ కోసం తపించిపోతాడు. తన రక్త్ర్హం తన అంశ.... అన్న ఫీలింగ్ ఏ సంపదా ఇవ్వలేనంత తృప్తినీ ఆనందాన్నీ ఇస్తుంది!
మావయ్య ఎందుకో మూడీగా అనిపించాడు. నేను వాళ్ళతో వాళ్ళ ఇంటికే వచ్చాను.
జయంతి నెయిల్ పాలిష్ ఒలకబోసాడని కొడుకుని చావగొట్టింది. ఇంకా మాటలైనా రాని ఆ పసివాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.
