నేను నవ్వాను.
"మాధవి చెప్పింది, మా సుమతి చాలా గొప్పింటి కోడలైంది. కార్లూ, మేడలూ, బోలెడు దర్జాగా వుంది. వాళ్ళాయన అచ్చు సినిమా హీరోలా వుంటాడు అంది" అని నవ్వాడు.
"అన్నీ నిజాలే!" అన్నాను.
"అబద్దాలని నేనూ అనుకోలేదు" అన్నాడు.
నాకెందుకో మనసులో ఏదో మెలిక పడినట్లయింది. మాధవి కాకుండా నాకు ఇదివరలో తెలిసిన మిత్రుడొకడు తారసపడడం ఆనందాన్నే ఇచ్చింది.
"ఇంకా కవిత్వం వ్రాస్తున్నారా?" అడిగాను.
"ఇంకా పైత్యం వాగుడు మానలేదా? అన్నట్లుగా అడుగుతున్నావు" అన్నాడు.
"అదేం కాదు" అన్నాను.
"అప్పట్లో తెలిసీ తెలియనితనం నిన్ను ప్రేమించానే కాని అది వ్యక్తం చేయడంలో తప్పు పద్దతి అనుసరించాను" అన్నాడు.
"ఇప్పుడేం చేస్తున్నారూ?" అడిగాను.
"పెద్ద టీవీ ఛానెల్ పేరు చెప్పి అందులో స్క్రిప్టు డిపార్ట్ మెంట్ కి హెడ్ గా వున్నానన్నాడు. అతని కార్డ్ కూడా ఇచ్చాడు. నా ఫోన్ నెంబర్ అడిగాడు. ఇవ్వడానికి ఒక్క క్షణం సందేహించి తర్వాత ఇచ్చేసాను.
"ఇంతసేపు మాట్లాడినా ఇంటికి పిలిచి ఒక కప్పు కాఫీ కూడా ఇస్తాననలేదు" అన్నాడు.
"రండి" ముక్తసరిగా అన్నాను.
"ఇంకోసారి వస్తాను. ఎడ్రెస్ చెప్పు" అన్నాడు.
నేను చెప్పి శెలవుతీసుకుని కార్లో ఎక్కి కూర్చున్నాను.
అతనూ చెయ్యి వూపి తన బైక్ మీద వెళ్ళిపోయాడు.
ఇంటికొచ్చి అత్తయ్యకీ మావయ్యకీ ప్రసాదం ఇచ్చి "నేను మా ఇంటికి వెళ్తాను మావయ్యా" అన్నాను.
"సరే" అన్నాడు మావయ్య.
నేను ఈ తీపి వార్త ఆనంద్ కి ఏకాంతంలో చెప్పాలనుకుంటున్నాను ఇలా వీళ్ళందరి మధ్యలో కాదు.
నా రూంలోకెళ్ళి సామాన్లు తీసుకుని బయటికి రాగానే దమయంతి ఓ స్టీల్ బాక్స్ ఇచ్చి "గోంగూర పచ్చడి" అంది.
ఆ నిమిషంలో నాకు దమయంతిని చూస్తే కన్నతల్లిని చూసినట్లు అనిపించింది. "థాంక్స్ దమయంతీ" అన్నాను.
ఆమె ఎందుకో కంట్లో ఏదో పడినట్లు కొంగుతో నులుపుకుంటూ "జాగ్రత్తమ్మా" అంది.
నేను కారు ఎక్కుతుంటే అత్తయ్య వచ్చి "ఇందాకా గుడిలో ఎదురుపడ్డ అతను ఎవరూ" అంది.
అప్పుడే ఈ విషయం డ్రైవర్ ద్వారా రాబట్టిందన్నమాట! బోలెడు నెట్ వర్క్ వుంది. నేను చాలా అమాయకురాల్ని నా మీద నాకే జాలేసింది.
"మాధవికి కజిన్" అన్నాను.
"ఓహో!" అంది.
నేను వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి ఎందుకో హాయిగా స్వేచ్చగా అనిపించింది. మొదటగా ఆనంద్ కి ఫోన్ చేద్దామనుకున్నాను. అంతలోనే మానుకుని ఇల్లంతా డెకరేట్ చెయ్యడంలో పడ్డాను. పడక గదిలో కర్టెన్స్, బెడ్ షీట్స్ మార్చి వాజ్ లో తాజా లిల్లీలు అమర్చాను. రూం స్ప్రేయర్ స్ప్రేచేసాను. ముందు గదిలో టీవీ మీద మా పెళ్ళి ఫోటో లామినేటెడ్ ది పెట్టాను. స్నానం చేసి తెల్లని నైటీ వేసుకుని వంట ప్రారంభించాను. పెళ్ళయి ఇన్నాళ్ళయినా నాకు ఆనంద్ ఇష్టాలేమిటో ఎప్పుడూ తెలీదు. ఫ్రైడ్ రైస్, బైగన్ బర్తా, పూరీ చేశాను. చాలా ఆకలిగా వుంది. అయినా వస్తాడని ఎదురుచూస్తూ అలాగే కూర్చుని వున్నాను.
కాస్త నిద్రపడుతుండగా బెల్ మ్రోగింది. అదాటుగా లేచి వెళ్ళి తలుపుతీశాను.
ఆనంద్ లోపలికొచ్చాడు.
"నాకు ఆకలిగా వుంది. రండి కలిసి తిందాం" అన్నాను.
"ముందు నీకు కడుపెట్లా వచ్చిందో ఆ సంగతి చెప్పు?" అన్నాడు అతని కళ్ళు ఎర్రగా నిప్పుల్లా వున్నాయి.
అనుకోని దెబ్బతిన్నట్లు వెర్రిదానిలా చూసాను.
"ఎట్లా వస్తేనేం కానీ తీసిపారెయ్!" అన్నాడు.
నేను షాక్ లో వున్నట్లుగా చూస్తుండిపోయాను.
"నేనిది వూహించలేదు" అంటూ జుట్టంతా చెరుపుకున్నాడు. టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ తీసి విరిసికొట్టాడు. "ఏం మాట్లాడవూ?" అని గద్దించాడు.
నేను మాట్లాడేలోపే "రేపు అమ్మతో నువ్వు వెళుతున్నావు. వెళ్ళి తీయించేస్తున్నావు....సరేనా?" అన్నాడు.
నేను అప్పటికీ మాట్లాడలేదు.
"సరే....అను" అంటూ మా పెళ్ళి ఫోటో తీసి గోడకేసి కొట్టాడు. అతని మొహం మీద అద్దం ముక్కలై వికృతంగా నవ్వుతూ కనిపిస్తోంది. ఆ నిమిషంలో నాకూ అతని మొహాన్ని అలాగే చితక్కొట్టాలనిపించింది.
"మాట్లాడవేం? ఎవరితో తిరిగి తెచ్చుకున్నావే కడుపూ? ఇప్పటికయినా మించిపోయింది లేదు. నేనేం నిన్ను వదిలిపెట్టేస్తాననడం లేదు. వెళ్ళి అబార్షన్ చేయించుకో" అన్నాడు.
మాట్లాడడానికి నాకు నోటమాట రాలేదు. ఏదో తాగిన నిషాలో చేసిన పని గుర్తుకు రాలేదనుకోవనికి కూడా లేదు. ఒకసారి కాదు, చాలాసార్లు మృగంలా నా మీదపడి ఎముకలన్నీ సున్నం అయిపోయేట్లుగా నలిపి నలిపి అనుభవించి ఇప్పుడిలా తనకేం తెలీదంటున్న మొగుడితో నేనేం మాట్లాడనూ?
"అమ్మ ప్రొద్దుట వస్తుంది. వెళ్ళు....వెళ్ళి ఎబార్షన్ చేయించుకో" అన్నాడు.
"వెళ్ళను నేను అబార్షన్ చేయించుకోను" అన్నాను. చాలా మొండిగా చెప్పేసాను.
అంతే! వూహించనంత వేగంగా వచ్చి అతని కాలు నా పొట్టకి తాకింది. 'అ....మ్మో' అంటూ క్రిందపడిపోయాను. కళ్ళు తిరిగిపోతున్నాయి. భయంకరమైన నెప్పి పుట్టాకా ఎప్పుడూ ఆప్యాయతకే కాదు దెబ్బలు కూడా ఈ శరీరం పొందలేదు. మొగుడు నెల తప్పానని చెప్పగానే ఇచ్చిన ఈ ప్రేమ కానుకకి నా తనువు నిలువెల్లా కంపించిపోయింది. లేవడానికి కుర్చీ కోడు పట్టుకుని ప్రయత్నించినా లేవలేక పోతున్నాను.
అతను కసిగా "ఒకవేళ రేపు అమ్మతో డాక్టర్ దగ్గరకి వెళ్ళకపోతే నేనే నా పద్దతిలో చేసేస్తాను అబార్షన్. రుచి చూసావుగా!" అనేసి వెళ్ళిపోతుంటే నేను ముందుకి జరిగి అతని కాలు పట్టుకున్నాను. "మీకు నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న మీ బిడ్డమీద ప్రేమ లేదా? మీ వంశం వృద్ది చెందక్కరలేదా?" అని అడిగాను.
